Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్మన పౌర-శౌర్య పురస్కారాలు

మన పౌర-శౌర్య పురస్కారాలు

సేవకు గుర్తింపు-గౌరవం దక్కినప్పుడే ఇతరులకు ప్రేరణ..

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే మన దేశంలో విభిన్న కులాలు, మతాలు, సంస్కృతుల ప్రజలు ఉన్నప్పటికీ “సేవా పరమో ధర్మః” అనేది భారతీయ సంస్కృతి మరియు జీవన విధానానికి పర్యాయపదంగా నిలుస్తుంది. ఇతరులకు సేవ చేయడమే సర్వోత్తమ ధర్మం అని భారతీయ సంస్కృతి ఉద్బోధిస్తుంది. సేవ చేయడం ఒక ఎత్తయితే చేసిన సేవకు గుర్తింపు పొందడం మరో ఎత్తు. సేవకు గుర్తింపు లభించి సముచిత గౌరవం దక్కినప్పుడే అది ఇతరులకు ప్రేరణగా నిలిచి మరింత మందిని ఆ దిశగా పయనించడానికి కార్యోన్ముఖులను చేస్తుంది. సమాజానికి తమ నిరుపమాన సేవలను అందించిన వ్యక్తులకు కృతజ్ఞతలు తెలియజేయడంలో జాతీయ పురస్కారాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. భారత ప్రభుత్వం ప్రధానంగా పౌరులకు వారి వయస్సు, వర్గం, మతం మొదలగు అంశాలతో సంబంధం లేకుండా వివిధ రంగాలలో వారు కనబరిచిన ప్రత్యేక సేవ లేదా అద్వితీయమైన పనితీరుకు గుర్తింపుగా నాలుగు విభాగాలలో అవార్డులను అందిస్తుంది. అవి వరుసగా పౌర పురస్కారాలు (Civilian Awards), శౌర్య పురస్కారాలు (Gallantry Awards), జాతీయ క్రీడా పురస్కారాలు (National Sports Awards) మరియు సాహిత్య పురస్కారాలు (Literary Awards). కాగా ఈ పురస్కారాలలో పౌర మరియు శౌర్య పురస్కారాలకు ప్రత్యేక స్థానముంది.

- Advertisement -

పౌర పురస్కారాలు:

పౌర పురస్కారాలు భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ అని నాలుగు రకాలుగా విభజించబడ్డాయి. 2 జనవరి 1954న స్థాపించబడిన “భారత రత్న” దేశంలోని అత్యున్నత, అత్యంత ప్రసిద్ధి మరియు ప్రజాదరణ పొందిన పౌర పురస్కారం. శాస్త్రసాంకేతిక, సాహిత్య, కళలు మరియు సామాజిక సేవా రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు గుర్తింపుగా జీవితకాలంలో లేదా మరణానంతరం ఇది ప్రదానం చేయబడుతుంది. 1964లో మొదటి సారి డాక్టర్ సివి రామన్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు చక్రవర్తి రాజగోపాలాచారి ఈ పురస్కారాన్ని అందుకోగా, 2013లో క్రీడారంగాన్ని కూడా చేర్చిన తరువాత 2014లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ పురస్కారం అందుకున్న అతి పిన్న క్రీడాకారుడు అయ్యాడు. విదేశీయులకు కూడా అందించే ఈ పురస్కారాన్ని 1980లో ప్రముఖ సమాజ సేవిక మదర్ థెరిసా, స్వాతంత్ర్య సమరయోధుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (ఫ్రాంటియర్ గాంధి) మరియు దక్షిణాప్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా అందుకున్నారు. సంవత్సరానికి గరిష్టంగా ముగ్గురికి ప్రదానం చేసే ఈ పురస్కారంలో భాగంగా పురస్కారగ్రహీతలకు ఎటువంటి నగదు బహుమతి లభించదు. కేవలం గుర్తింపు పత్రం మరియు పతకం మాత్రమే అందుకుంటారు. రావి ఆకు ఆకారంలో ఉండే ఈ పతకం ముఖభాగంలో సూర్యుని బొమ్మ, కింది భాగంలో వెండితో “భారత రత్న” అని దేవనాగరి లిపిలో ఉండి వెనుక వైపు మధ్య భాగంలో ప్లాటినం లోహంలో భారత చిహ్నం, కింది భాగంలో వెండితో భారత జాతీయ నినాదం “సత్యమేవ జయతే” రాసి ఉంటుంది. భారత రత్న మరియు ఇతర పౌర పురస్కారాలను మొదట జూలై 1977 నుండి జనవరి 1980 మరియు రెండవ సారి ఆగస్టు 1992 నుండి డిసెంబర్ 1995 వరకు ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పురస్కారం కోసం జాతి, పదవి, వృత్తి తదితర వివక్ష లేకుండా రాష్ట్రపతికి కేవలం ముగ్గురి పేర్లను మాత్రమే సిఫార్సు చేసే అధికారం ప్రధానికి ఉంటుంది. 2024 వరకు భారత ప్రభుత్వం 53 మందిని “భారత రత్న” పురస్కారంతో గౌరవించింది.

జనవరి 2, 1954న స్థాపించబడిన ‘పద్మ’ పురస్కారాలను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటిస్తారు. “పద్మ విభూషణ్” భారతదేశపు రెండవ-అత్యున్నత పౌర పురస్కారం. ఇది సాహిత్యం, కళలు, శాస్త్ర సాంకేతిక మరియు సామాజిక సేవా రంగాలలో నిష్కళంకమైన సేవలు చేసిన వ్యక్తులకు మంజూరు చేయబడుతుంది. 4.4 సెం.మీ వృత్తాకారంలో 0.6 మి.మీ. మందంతో ఒక రేఖాగణిత నమూనాలో కాంస్యంతో తయారైన ఈ పతకం ముందు భాగంలో పైన దేవనాగరి లిపిలో ‘పద్మ’ మరియు దిగువన ‘విభూషణ్’ అనే పదాలు మధ్యలో తామర పువ్వు, వెనుక వైపు, “సత్య మేవ జయతే” అని ముద్రించబడి ఉంటాయి. శాసనాలు, రేఖాగణిత నమూనా మరియు సరిహద్దులు రాగితో, కొన్ని ముఖ్యాంశాలు తెల్ల బంగారంతో చేయబడతాయి. మెడలో ధరించేందుకు అనుకూలంగా ఈ పతకానికి ముదురు నీలం రంగు రిబ్బన్ జోడించబడింది.

“పద్మ భూషణ్” భారతదేశపు మూడవ-అత్యున్నత పౌర పురస్కారం. ప్రభుత్వ రంగ సంస్థలను మినహాయించి వైద్యులు, శాస్త్రవేత్తలు వంటి ప్రభుత్వ సేవకులు లేదా ఏదైనా రంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఇది మంజూరు చేయబడుతుంది. 4.4 సెం.మీ వృత్తాకారంలో 0.6 మి.మీ. మందంతో ఒక రేఖాగణిత నమూనాలో కాంస్యంతో తయారైన ఈ పతకం ముందు భాగంలో పైన దేవనాగరి లిపిలో ‘పద్మ’ మరియు దిగువన ‘భూషణ్’ అనే పదాలు మధ్యలో తామర పువ్వు, వెనుక వైపు, “సత్య మేవ జయతే” అని ముద్రించబడి ఉంటాయి. మెడలో ధరించేందుకు అనుకూలంగా ఈ పతకానికి తెల్లటి చారల రిబ్బన్ జోడించబడింది. ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రభుత్వ సేవకులు, కళలు, విద్య, పరిశ్రమ, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, నటన, వైద్యం, సామాజిక సేవ మరియు ప్రజా వ్యవహారాలతో సహా వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వ్యక్తులకు ప్రదానం చేస్తారు. ఏ భారతీయ పౌరుడైనా పద్మ పురస్కారాల కోసం ఆన్‌లైన్‌లో తన పేరును నమోదు చేసుకునే లేదా ఇతరుల పేరును ప్రతిపాదించే పద్ధతిని 2015లో భారత ప్రభుత్వం తీసుకువచ్చింది. భారత ప్రభుత్వం 1287 మందిని “పద్మ భూషణ్” (2023 వరకు), 336 మందిని “పద్మ విభూషణ్” (2024 వరకు), 3225 మందిని “పద్మ శ్రీ” (2024 వరకు) పురస్కారాలతో సత్కరించింది.

శౌర్య పురస్కారాలు:

సైనికుల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టబడిన శౌర్య పతాకాలలో పరమ వీర చక్ర, మహా వీర చక్ర, వీర చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర మరియు శౌర్య చక్ర అని ఆరు విభాగాలున్నాయి. వీటిలో మొదటి మూడు పురస్కారాలను 26 జనవరి 1950న మరియు మిగతా మూడు పురస్కారాలను 4 జనవరి 1952న ప్రారంభించారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అత్యున్నత సైనిక పురస్కారమైన “పరమ వీర చక్ర” సహా ఇతర శౌర్య చక్ర పతకాల రూపకల్పన జన్మతః స్విట్జర్ల్యాండ్ మహిళ అయిన సావిత్రీ బాయి ఖనోల్కర్ చేసారు. ‘చెడు’పై ‘మంచి’ విజయం సాధించే క్రమంలో భాగంగా దేవతలు వృతాసురుడిని వధించడానికి దధీచి మహర్షిని ఆశ్రయించగా, ఆయన ప్రాణాన్ని త్యజించి తన వెన్నెముకను ‘వజ్రాయుధం’ తయారీకి ఇంద్రుడికి కానుకగా సమర్పించిన విషయం “పరమ వీర్ చక్ర” రూపకల్పనలో ‘వజ్ర’ చిహ్నాన్ని పొందుపర్చేలా సావిత్రీ బాయికి ప్రేరణ కలిగించింది. అత్యున్నత సైనిక పురస్కారమైన “పరమ వీర చక్ర” యుద్ధ సమయంలో ప్రదర్శించిన శౌర్యప్రతాపాలు, అద్భుతమైన యుద్ధ పాటవం ప్రాతిపదికగా జీవితకాలంలో లేదా వీర మరణం పొందిన సైనికులకు ఇవ్వబడుతుంది. ఇది బ్రిటిష్ ప్రభుత్వపు “విక్టోరియా క్రాస్”, అమెరికా “మెడల్ ఆఫ్ ఆనర్”, ప్రెంచ్ “లీజన్ ఆఫ్ ఆనర్” లేదా రష్యా “క్రాస్ ఆఫ్ సెయింట్ జార్జ్” పురస్కారంతో సమానమైనది. రెండవ అత్యున్నత సైనిక పురస్కారమైన “మహా వీర చక్ర”ను యుద్ధక్షేత్రంలో శత్రుసేనలను ఎదుర్కోవడంలో అసాధారణమైన శౌర్యం మరియు ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఇవ్వబడుతుంది. మూడవ అత్యున్నత సైనిక పురస్కారమైన “వీర చక్ర”ను శత్రుసేనలతో పోరాడుతున్న సందర్భంలో ప్రదర్శించే ధైర్యసాహసాల ప్రాతిపదికగా సైనికులు మరియు సైన్యాధికారులకు ఇవ్వబడుతుంది. శౌర్య పురస్కారాలను గణతంత్ర దినోత్సవం మరియు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రదానం చేస్తారు. ఆశోక చక్ర, కీర్తి చక్ర మరియు శౌర్య చక్ర పురస్కారాలు శాంతికాల సైనిక అలంకరణలు. ఈ పురస్కారాలు యుద్ధక్షేత్రానికి అవతల సాధారణ సమయాలలో సందర్భానుసారంగా అత్యంత ప్రస్ఫుటమైన ధైర్యసాహసాలు లేదా కొంత సాహసోపేతమైన లేదా అసమాన శౌర్యం లేదా స్వీయ త్యాగం చేసే సైనిక లేదా పౌర సిబ్బందికి ఇవ్వబడుతుంది. “అశోక చక్ర” యుద్ధక్షేత్రంలో అనన్యసామాన్యమైన శౌర్యప్రతాపాలతో వీరమరణం పొందిన సైనికులకు అందించే “పరమవీర చక్ర”తో సమానమైనది. “కీర్తి చక్ర” యుద్ధరంగానికి దూరంగా సందర్భానుసారంగా ప్రదర్శించే శౌర్యం లేదా స్వీయ త్యాగం చేసే సైనిక లేదా పౌర సిబ్బందికి ఇవ్వబడుతుంది. ఇది యుద్ధక్షేత్రంలో అనన్యసామాన్యమైన శౌర్యప్రతాపాలతో వీరమరణం పొందిన సైనికులకు అందించే “మహా వీర చక్ర”తో సమానమైనది. ఇవి రెండు కూడా మరణానంతర పురస్కారాలే. ఈ శ్రేణిలో మూడవదైన సైనిక పురస్కారం “శౌర్య చక్ర” సైనిక సిబ్బందికి మరియు సాధారణ పౌరులకు శత్రుసేనలతో ఎటువంటి ప్రత్యక్ష చర్యలలో పాల్గొనకుండా సందర్భానుసారంగా ప్రదర్శించే ధైర్యం లేదా త్యాగం చేసినందుకు ప్రదానం చేస్తారు. ఈ పురస్కారం పలు సందర్భాలలో మరణానంతరం కూడా ఇవ్వబడుతుంది.

జాతీయ పురస్కారాలు:

పౌర మరియు శౌర్య పురస్కారాలతో పాటు క్రీడలు, సినిమా మరియు సాహిత్యరంగాలలో విశేష కృషి చేసి అద్వితీయ ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు భారత ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే, ఇందిరా గాంధీ శాంతి మరియు అభివృద్ధి బహుమతి, గాంధీ శాంతి బహుమతి, భారతీయ జ్ఞానపీఠ్ అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు లాంటి జాతీయ పురస్కారాలను కూడా ప్రదానం చేసి సత్కరిస్తుంది.

ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బహుమతి:

“నోబెల్ బహుమతి” ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతిగా పరిగణించబడుతుంది. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం, సాహిత్యం, శాంతి మరియు అర్థ శాస్త్రం లాంటి రంగాలలో విశేష కృషి చేసిన వ్యక్తులకు ఇది అందచేస్తారు. ఇప్పటి వరకు పన్నెండు మంది భారతీయులు (ఏడుగురు భారతీయ సంతతి లేదా నివాసానికి చెందినవారు) నోబెల్ బహుమతి పొందగా, ఆసియా ఖండం నుండి 1913లో ఈ పురస్కారం అందుకున్న రవీంద్రనాథ్ ఠాగూర్ తొలి భారత పౌరుడు.

యేచన్ చంద్ర శేఖర్

మాజీ రాష్ట్ర కార్యదర్శి

ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ

హైదరాబాద్

✆ 8885050822

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News