ఇజ్రాయల్-హమాస్ యుద్ధంలో పెరుతుగున్న మరణాలు “ఓ విషాదకరమైన , సిగ్గు చేటైన మైలురాయి” అని ఐక్యరాజ్య సమితి ముఖ్యులు ఒకరు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య ప్రపంచ రాజకీయాలన్నిటికీ సమంగా వర్తిస్తుంది. పాలనాపరంగా ప్రజల సేవలో నిమగ్నమై జీవనావసరాలు తీర్చి, శాంతియుత జీవితాలని రూపొందించడమే కదా రాజాకీయాల ప్రధమ ధ్యేయం. ఈ రకంగా చూసినప్పుడు దేశ దేశాల రాజకీయాలన్నీ, జెండాలతో నిమిత్తం లేకుండా , ఒకే దారిలో నడుస్తున్నాయని చెప్పవచ్చు. మనిషి పుట్టుకని మహా వేడుకగా, ప్రాణప్రదంగా, అత్యంత విలువైనదిగా పరిగణిస్తున్న వేళలో, అత్యంత దారుణంగా యుద్ధాల నెపంతో మానవ హననం జరుగుతున్నప్పుడు, ఈ రాజకీయాలన్నీ పరమ హేయమైనవిగా అనిపిస్తూ, సాధించిన ఉన్నత నాగరికత ని వినాశనం గావిస్తున్నాయని కూడా అనిపిస్తుంది.
పైన చెప్పుకున్న యుద్ధ వాతావరణము సృష్టించడమే గాకుండా , ఈ రాజకీయాలు , పౌరులందరిని సమదృష్టి తో చూడడం లేదు. ఈ విధమైన వివక్షత మూలంగానే పై యుద్ధవాతావరణం కూడా. ఈ సందర్భం లో , ఈ మధ్యే , మన దేశ రిజర్వ్ బ్యాంక్ పూర్వ గవర్నర్ రఘురాం రాజన్ గారు ఎక్కడా రెండో తరగతి పౌరుడు అన్న దానికి చోటివ్వకూడదు అని అభిప్రాయపడ్డారు ఓ ఇంటర్వ్యూలో.
ఇక ఈ రాజకీయాలలో ఎన్నికల పాత్ర ని ఓ విధంగా నిర్వచించలేము. ఎన్ని పోకడలు పోవాలో అన్ని పోకడలని చూస్తూ ఉంటాము ఈ ఎన్నికలలో. ధనం, నేరం, మోసం, హత్య, గట్రా ఇన్ని పాత్రలని చెప్పనలవి కాకుండా వీక్షిస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా సమకాలీన రాజకీయాలలో ధనం, ఆర్ధిక స్వార్ధం, అధిక ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. కాల పరిణామం లో సద్భావనలు, సద్భుద్దులు సహజంగా పుట్టుకొచ్చినట్టు, ఆదర్శాలకి అనుగుణంగా నడుచుకోవాలని కొన్ని ఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఘటనలలో కొత్త కొత్త రాజకీయ పార్టీల పుట్టుకలు కొన్ని. అలాంటిదే తెలుగు నాట జనసేన పార్టీ. జీవితాల ఉచ్చ్వాస నిశ్వాసాలుగా పరిగణించబడిన సినీ కళారంగం నుండి ఓ ఆదర్శావేశం తో నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీ ఆ జనసేన పార్టీ. నీళ్ళు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో, తమ ప్రాంతము వివక్షకు గురి అయ్యిందన్న భావనతో , ఉద్యమం చేపట్టి తెలంగాణా రాష్ట్రం సాధించుకోవడం తో ,తెలుగు వాళ్ళకి రెండు రాష్ట్రాలు ఏర్పడిన నేపధ్యం. సహజంగానే అభిమాన జనం ఎదురు చూశారు కొత్తపార్టీ కోసం. పవన్ కళ్యాణ్ నడిపించే జనసేన పార్టీ తమ ఆశలు, ఆకాంక్షలని తీర్చగలదని భావించారు. అయితే ఇక్కడే జనసేన పార్టీ ప్రామాణిక రాజకీయ పార్టీ గా రూపొందలేకపోయింది. అందుకు కారణం ఆ పార్టీ అధినేత వ్యవహార శైలే ప్రధానమన్న అభిప్రాయం సర్వే సర్వత్రా వినిపిస్తుంది. ఆంధ్రా , తెలంగాణా గా రెండు రాష్ట్రాలు ఏర్పడిన తరువాత ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది. అయితే విభజన సమయం లోని అంశాలు వంట పట్టించుకోకుండా, పైన చెప్పుకున్న విధంగా, ఆర్ధిక స్వార్ధం దిశగా , ఆదరా బాదరా గా అమరావతి రాజధాని కార్యక్రమం చేపట్టింది పదేళ్ళు సమయం వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ. అలాగే శివరామకృష్ణన్ రిపోర్ట్ ప్రకారం వికేంద్రీకరణ దిశగా మూడు రాజధానులని నిర్మించడానికి వ్యతిరేకించింది. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజి ఊసే ఎత్తలేదు. రైల్వే జోన్ విషయం లోనూ ఎలాంటి శ్రధ్హ చూపించలేదు. తరువాత అధికారంలోకి వచ్చిన పార్టీ కూడా పప్పు బెల్లాల పధకాలతో మరో మారు అధికార పీఠం కోసం పునాదులు వేసుకుంటుంది. అలాగే ఆర్ధిక కక్షలతో సంస్కృతికి కన్నాలు పెడుతుంది. తెలుగు భాషని నిండా ముంచుతుంది తెలుగు జాతి అస్తిత్వానికే ఎసరు పెడుతూ. నిజానికి ఇదే అదనుగా జనసేన పార్టీ ముందుకి సాగాల్సి ఉంది. ఆ పార్టీ అధినేత ఆదర్శ భావాల సాధనకు కృషి చేయాల్సి ఉంది. ప్రజా వ్యతిరేక పథకాలని గాని, కార్యక్రమాలను కానీ నిరసించడం లేదు. కానీ దానికి తిరోగమన దిశలో సాగుతున్నారు. పొత్తుల కోసం ఆరాట పడుతున్నారు. మరో ఆర్ధిక స్వార్ధానికి తోడుగా నిలబడుతున్నారు. దేశమంతా ఇపుడు రాజకీయాల్లో పొత్తులు ఆగ్ర తాంబూలం అందుకుంటున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయి ఈ పొత్తుల ద్వారా. నూటికి తొంభై శాతం ప్రజలతో పొత్తు లేని రాజకీయాలే నడుస్తున్నాయి. సరళీకృత ఆర్ధిక విధానాలు ప్రారంభమయిన తరువాత , అన్ని రాజకీయ పార్టీలది ఒకటే దారి. ప్రైవేట్ సంపదకే జట్టు గడుతున్నారు. ప్రజా సంపదకి విడాకులిస్తున్నారు. ఆకలి, నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారు ,ప్రపంచంలో గొప్ప ఆర్ధిక శక్తిగా దేశం ఏడుగుతుందని చెబుతూ. ఈ పొత్తులు, ప్రైవేట్ కంపనీల లాగా మారిన రాజకీయపార్టీల ఆర్ధిక స్వార్ధాలకే ఉపయోగపడుతున్నాయి. నిజానికి ఈ పొత్తులు ఆత్మ గౌరవాలని తాకట్టు పెట్టడం లాంటివే. ప్రామాణిక జీవితాలకి బాట వేయడం లో ఎంత మాత్రం దోహదం చేయవు ఈ పొత్తులు. రెండు కంపనీలు వ్యాపార పోటీల్లాగా మారుతున్నాయి ఈ పొత్తులు. భిన్నత్వం లో ఏకత్వం దిశగా ఈ పొత్తులు నిర్మాణం అవడం లేదు. అవకాశ వాదపు పథకాలు అన్నీ పార్టీలు మొదలు పెడుతున్నాయి. విదేశీ విద్యా దీవెన అంటూ చేకూర్చే ఆర్ధిక లాభం ఈ నేల మీంచి ఈ దేశ పౌరుడిని తరిమేయడం కిందే వస్తుంది కదా. అలాగే ఒక సామాజిక వర్గానికే రాజకీయ, విద్యా రిజర్వేషన్స్ తో బాటు ఆర్ధిక బంధు పథకాలు ఎంత అశాస్త్రీయమో కదా ! గమ్మత్తు ఏమిటంటే “అధిస్థానం ఆదేశించినట్లు కార్యకర్తలు నడుచుకోవాలి, విధానాలు అనుసరించాలి “- “వ్యతిరేక ఓటు చీలకూడదు “ అన్న ప్రకటనలు ఇస్తుంటారు ఈ పార్టీ అధినేతలు. ఇక్కడే తెలిసిపోతుంది ఈ పార్టీలకి ప్రజలతో ఎంత పొత్తు ఉందో ! అంతా ఆర్ధిక స్వార్ధం తప్ప మరొకటి కాదు. “He who follows another, whether it be the greatest saint or the teacher round the corner, is essentially irreligious………Religion is the feeling of sacredness, of compassion, of love.”- Jiddu Krishnamurthi. పవిత్రత, ప్రేమ , దయ లాంటి గుణాలు లేని , జీవిత సమస్యలకు సమయం కేటాయించని , పొత్తులు గట్టే రాజకీయ పార్టీ ల తో బహు పరాక్ !
-ఒబ్బిని 9849558842
All political parties lost connections with public: ప్రజలతో పొత్తు లేని పార్టీలు
అంతా ఆర్ధిక స్వార్ధం తప్ప మరొకటి కాదు