వచ్చే శాసనసభ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడతామంటూ ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ రెడ్డి రెండు రోజుల క్రితం ప్రకటించడం అమరావతి సమస్య మరోసారి చర్చనీయాంశం అయింది. నిజానికి రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగాలా, వద్దా, మూడు రాజధానుల వ్యవహారం న్యాయబద్ధమా, కాదా అన్న అంశంపై సుప్రీంకోర్టు జనవరి ఆఖరు వారంతో ఏ విషయమూ తేల్చనున్న నేపథ్యంలో అమర్నాథ్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు, డిసెంబర్ 17, 18 తేదీలలో ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలని అమరావతి రైతులు తలపెట్టడం అసలే వేడెక్కిన అమరావతి రాజకీయాలకు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా తయారయింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది నిజంగా గడ్డు సమస్యే. వెనక్కు వెళ్లడమూ కష్టమే. ముందుకు వెళ్లడమూ కష్టమే. అమరావతి రైతుల నిరసన కార్యక్రమాలు అనేక నెలలుగా సాగుతున్నప్పుడు, ఈ సమస్యను మొదట్లోనే పరిష్కరించడానికి కృషి చేయాల్సి వచ్చింది. ప్రభుత్వ కొలువులో డజన్లకొద్దీ సలహాదార్లు ఉన్నా, న్యాయవాదులకు, న్యాయ నిపుణులకు లోటు లేకపోయినా రాష్ట్రంలో దాదాపు ప్రతి సమస్యా, ముఖ్యంగా అమరావతి సమస్య అపరిష్కృతంగా ఉండిపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది.
ప్రభుత్వ కొలువులో లేని న్యాయ నిపుణులు, రాజకీయ, మీడియా విశ్లేషకులు మాత్రం ప్రభుత్వానికి కొన్ని విలువైన సూచనలు చేస్తున్నారు. సలహాలు ఇస్తున్నారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధతే లేదని గుర్తుచేస్తున్నారు. న్యాయపరంగా, చట్టపరంగా, సాంకేతికంగా ఆంధ్రప్రదేశ్ ఇంకా హైదరాబాదే రాజధానిగా కొనసాగుతోందని, 2024 వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాక, అమరావతిని రాజధానిగా పరిగణించే విషయంలో కొన్ని చట్టబద్ధమైన అంశాలు కూడా ప్రధాన అడ్డంకులు కాబోతున్నాయని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. వారు అటు ప్రభుత్వ దృష్టికి, ఇటు ప్రజల దృష్టికి తీసుకు వస్తున్న ప్రధానాంశాలు ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సి.ఆర్.డి.ఏ) పరిధిలో భూముల సేకరణే పూర్తి కాలేదు. అంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత పరిధిలో రాజధానిని నిర్మించడానికి అవసరమైన భూముల సేకరణ పూర్తి కాలేదు. ఇంకా 40 శాతం భూముల సేకరణ మిగిలే ఉందనేది వారు స్పష్టం చేస్తున్న అంశం.
రాజధాని నిర్మాణానికి రైతులు అమరావతి ప్రాంతంలో ప్రభుత్వానికి స్వాధీనం చేసిన భూములకు పరిహారంగా ప్రభుత్వం ప్లాట్లు ఇవ్వడం కూడా పూర్తి కాలేదు. రైతులకు ప్రత్యామ్నాయ, పరిహార ప్లాట్లు ఇచ్చి వాటిని రిజస్టర్ చేసే వరకూ రాజధాని నిర్మాణానికి మార్గం సుగమం కాదు. అంటే, రైతులకు పరిహారంగా స్థలాలు ఇచ్చి వాటి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాతే భూ సేకరణ వ్యవహారం పూర్తయినట్టు భావించాల్సి ఉంటుంది. నిజానికి రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లను మూడేళ్లలోగా అప్పగిస్తామని వెనుకటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ఇంతవరకూ నెరవేర లేదు. విచిత్రమేమిటంటే, రైతుల్లో కూడా చాలామంది తమకు ప్రభుత్వం ఇచ్చిన భూములను ఇంతవరకూ రిజిస్టర్ చేయించుకోలేదు. పైగా, కొందరు రైతులు ఈ భూముల్లో వ్యవసాయాన్ని కొనసాగించుకుంటున్నారు కూడా. అంటే, అటు ప్రభుత్వం, ఇటు రైతులు సి.ఆర్.డి.ఏకు కట్టుబడి ఉండకపోగా, తెలిసో తెలియకో ఆ చట్టాన్ని ఉల్లంఘించడం జరుగుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే గత ప్రభుత్వం కూడా చట్టబద్ధంగా అమరావతినే రాజధానిగా ప్రకటించలేక పోయిందనే అభిప్రాయం కూడా వినవస్తోంది. సుప్రీంకోర్టు తుది నిర్ణయం ప్రకటించే ముందు ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
ఒక రాజధానిగా అమరావతికి ఇంకా హద్దులు నిర్ణయించలేదు, విస్తీర్ణమూ నిర్ధారించలేదు. అమరావతే తమ రాజధాని అనీ, అందువల్ల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరంపై తమకున్న హద్దులు వదులుకుంటున్నామని గత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయలేదు. అంతేకాదు, ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయాల్సి ఉంది. ఆ పని కూడా జరగలేదు. హైదరాబాద్ నగరాన్ని తమ రాజధాని కాదని ప్రకటించకుండానే అమరావతిని రాజధఆనిగా ప్రకటిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు రాజధానులు ఏర్పాటు చేసినట్టు అవుతుంది. ఇది ఇలా ఉండగా, రాష్ట్ర రాజధానిపై నిర్ణయాధికారం కేంద్రానిదేనంటూ ఇటీవల న్యాయ నిపుణుడు సోలీ సొరాబ్జీ సుప్రీంకోర్టులో వాదించటం కూడా గమనించాల్సిన విషయమే. మరో విచిత్రమైన విషయమేమిటంటే, రాజధానిగా అమరావతికి చట్టబద్ధతే లేని పరిస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానులని ప్రకటించడం హాస్యాస్పదమే అవుతుతంది. ఇక రాషఅ్టరానికి మూడు రాజధానులు ఉండాలా, ఒకే రాజధానిగా ఉండాలా అన్న పాలనాపరమైన నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని, ఈ విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ నగరం మరో ఏడాదిన్నర పాటు కొనసాగాలా, వద్దా, అమరావతికి రాజధానిగా చట్టబద్ధత ఉందా అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన తర్వాతే ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయానికి సరైన న్యాయం జరుగుతుంది.