తానో హక్కుల పాలపుంత
ఎన్నెన్నో హక్కుల చుక్కలను ఒక్క కాడ పోగేసి
కడగొట్టు ప్రజల జీవితాలు స్వయం ప్రకాశం చేసినోడు
ఈ లోకమంతా ఆధిపత్యపు గుహలో చిక్కుకున్నపుడు
హక్కుల దివిటీ పట్టి బయటకి తెచ్చిన మార్గదర్శకుడు
ఈ లోకమిప్పుడు అతడు గీసిన గీత మీదనే నడుస్తుంది
తెల్లారితే అతడి నామంతోనే ఈ దేశానికి పొద్దుపొడుస్తుంది
తాను తాకితేనే ముట్టుడైతదన్న మతానికి కూడా
మానవత్వపు పాఠాలు నేర్పించినవాడు
ఏ దేవుడి పేర ఈ రాజ్యాన మనుషులను రాచిరంపాన పెట్టిండ్రో
ఆ బండరాళ్ల దేవుడికి కూడా రాజ్యంగపు రక్షణ ఇచ్చినవాడు
ఏ జాతుల పేరు పలికితేనే పాపమనుకున్న పాలకులను
ఒక్క ఓటుతో ఆ జాతుల పాదాలకాడకు ఈడ్చుకొచ్చిన వీరుడు
ఇప్పుడు ఒర్రంగా.. ముట్టుడనుకున్నవాడు రాసిన దానినే
వాళ్ల నెత్తుల మీద పెట్టుకుని ఊరేగకుంటే
వారికి బతుకులేదన్నది.. కళ్ళముందు నడుస్తున్న చరిత్ర
మనువాదం మళ్ళీ
అధికారం ముసుగేసుగుని దాడి కొస్తున్నపుడల్లా
అతడిచ్చిన నీలి ఖడ్గమే
వారి ఆలోచనల కుత్తుకలు తెంపుతున్నది
రాజ్యం మత విల్లంబులు ఎక్కుపెట్టినపుడల్లా
అతడి నీలిగొడుగే బహుజనుల రక్షణ కవచమై కాపాడుతున్నది
పాలకుడెవ్వడైనా పక్కదారిలో
పక్కల పొడుద్దామనుకున్నపుడల్లా
అతడి అక్షరాల వెలుగు
ప్రజల కళ్ళకు కుట్రలను కనిపెట్టిస్తున్నది
అతడి చూపే ఈ దేశాన్ని నడిపించే కాంతి రేఖ
అతడు నడిచిన బాటే ఈ దేశపు అభివృద్ధి పతాక
అతడు నిగనిగలాడే నీలి ఆకాశం
అనంతంగా పరుచుకున్న మానవత్వపు సంద్రం
నిటారుగా నిలుచున్న హక్కుల పర్వతం
అలుపు లేకుండా పారే ఆలోచనల జీవనది
అంబేద్కర్… ఇప్పుడిదొక పేరు మాత్రమే కాదు
జవసత్వాలు కోల్పోయిన బతుకులకు జీవంపోసి నడిపిస్తున్న శక్తి
దిలీప్.వి
మానవ హక్కుల వేదిక.

