బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, పూలె విగ్రహం, సర్దార్ పటేల్ విగ్రహం, శివాజీ మహారాజ్ విగ్రహం, వివేకానందుని విగ్రహం చెప్పుకుంటూపోతే పదుల సంఖ్య దాటిపోతుంది. నిస్సంకోచంగా అందరూ మహనీయులే, వారి త్యాగాలు, పోరాటాల ఫలితమే ఈనాడు మనమను భవిస్తున్న ఈ స్వేచ్చ, స్వాతంత్రం, సౌబ్రాత్రుత్వం, సామాజిక భద్రత. అటు వంటి మహనీయులు నిస్సంకోచంగా ప్రాతఃస్మరనీయులే, పాఠ్యాంశాలుగా చదువుకోవలసిన ఆత్మీయులే. వారి ఆలోచన, వారి ఆశయం, వారి అడు గులమీదుగా ఏర్పడిన నూతన రహదారులు నేటి తరానికే కాదు రాబోయే తరాలకు కూడా స్పూర్తిదాయకం. అయితే ఈ మధ్యకాలంలో ఆ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడంలో, వారిపేరుతో ఉత్సవాలు చేయడంలో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ఎవరికీ వారు ఆ మహనీయుల విగ్రహాల నీడలో తమ తలరాతలు మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మనం పోటీపడాల్సింది వారి ఆశయాల సాధన కోసం, మనం ఆరాటపడాల్సింది ఆ మహనీయుల ఆలోచనలకు రూపం ఇవ్వడం కోసం, మనం నడవాల్సింది వారేసిన నూతన రహదారుల్లో, శ్రమించాల్సింది వారి కలల భారతావనిని సాకారం చేయడం కోసం, మన స్వార్థం కోసం ఎంతమాత్రం కాదు.
దురదృష్టవశాత్తు ఆనాటి ఆ మహనీయులు నేడు నిజంగా ఉత్సవవిగ్రహాలే అయ్యారు. వందల అడుగుల విగ్రహం కోసం కొందరు, అడుగడుగునా విగ్రహాల కోసం కొందరు, ఓట్లకోసం మరికొందరు, పదవీకాంక్షతో మరెందరో ఆడుతున్న రాజకీయ చదరంగంలో మహానీయులందరూ పాత్రలుగా మారిపోయారు. సమస్త భారతావనికి ప్రాతినిధ్యం వహించాల్సిన మహనీయులను కులాల పేరుతో, ప్రాంతాలపేరుతో, మతాలపేరుతో మనమే విభజిస్తున్నాం. 140 కోట్ల జనాలకు ఆరాధ్యులైన మహనీయులను కొన్ని వర్గాలకే ఫరిమితం చేస్తున్నాం. నిజంగా ఆ మహనీయులే బ్రతికొస్తే వారి విగ్రహాలను చూసి అంతగా సంతోషిస్తారా? ఎంతమాత్రం కానేకాదు. సమసమాజ స్థాపనకోసం, విద్యా కుసుమాలు వికసించడం కోసం, కట్టుబాట్ల కంచెలు కూల్చడం కోసం, బానిస బతుకులను మార్చడం కోసం, సమున్నత భారతావని కోసం వారు పడిన తపన, చేసిన త్యాగాలను మరిచిపోయి స్వార్థ రాజకీయాలకోసం, వారి విగ్రహాలను అభిషేకాలతో ముంచెత్తుతున్న రాజకీయ రాబందులను తరిమికొట్టడానికి మళ్ళీ పోరాటం మొదలు పెడతారేమో కదా. దళిత కుటుంబాలలో చదువుల వెలుగులు నింపాలని తపన పడిన పూలె, సావిత్రీభాయిల ఆశయాలను గౌరవించని వాళ్ళు, వారి విగ్రహాల ఏర్పాట్లలో పోటీపడుతున్నారు, ఉక్కు నరాలు, వజ్ర కఠోరమైన మనసు కలిగిన యువతకోసం పరితపిం చిన వేవేకానందుని ఆశయాలను తుంగలో తొక్కి విగ్రహ రాజకీయాలు చేస్తున్నారు, బానిస బతుకులమీద తిరుగు బాటు చేసి జాతి ఐక్యతకు, సమున్నతికి కృషిచేసిన శివాజీ మహారాజ్ ఆలోచనలకు మసిబూసి మతం ముసుగులో వారిని ఒక వర్గానికే పరిమితం చేస్తున్నారు. బానిస మనస్తత్వాన్ని ఎదిరిస్తూ దళిత కుటుంబాలు సగర్వంగా తలెత్తుకుని సమాన హక్కులను అనుభవించాలని, అంటరానితనాన్ని అందనంత దూరం తరిమికొట్టాలని బ్రతు కంతా పోరాడిన బాబాసాహెబ్ ఆశయాల మీద కనీసం అవగాహన లేనివాళ్ళు ఆయన విగ్రహాల ఏర్పాటులో మాత్రం అందరికన్నా ముందుంటున్నారు! అవినీతికి ఆమడదూరంలో బ్రతికిన మహనీయుల విగ్రహాలను అవినీతి సొమ్ముతో అంగరంగ వైభవంగా నిర్మిస్తున్నారు. అహింసను యజ్ఞంలా ఆచరించి, భారత ఖ్యాతిని ఖండాంతరాలలో నిలిపిన మహనీయుని విగ్రహాన్ని రక్తపు మరకలు అంటిన చేతులతో సృశిస్తున్నారు. నిరుపేదల బతుకులు కండ్లముందే అంగలారుస్తున్నా పట్టించుకోని నేతలు, మహనీయుల విగ్రహాలపేరుతో, అభిషేకాల పేరుతో లక్షల రూపాయలు దారబోస్తున్నారు.
బానిసత్వాన్ని దిక్కరిస్తూ తిరగబడ్డ మరాఠా బెబ్బులి ఛత్రపతి శివాజీ స్పూర్తిని నిరంతరం కొనసాగిస్తూ యువతలో శారీరక, మానసిక దారుడ్యాన్ని పెంపొందించే శివాజీ స్పూర్తి కేంద్రాలు, క్రీడా ప్రాంగణాలు నిర్మించే ఆలోచనే లేదెవ్వరికి, కాని ఊరి మద్యలో ఆయన విగ్రహాన్ని పెట్టి వీర తిలకాలు మాత్రం ఘనంగా దిద్దుతారు. నిరంతరం వివేకానందుని స్ఫూర్తిని రగిలించే యువకేంద్రాలను నెలకొల్పడానికి ముందుకు వచ్చేవారు లేరు, కానీ రహదారికి అడ్డంగా ఆయన విగ్రహాలను పెట్టి ప్రతియేడు ఘనంగా ఉత్సవాలు మాత్రం జరుపుతారు. మహాత్మా పూలే, సావిత్రీభాయిల ఆశయాలను స్పురించే మహిళా విద్యాలయాలు, స్వశక్తి కేంద్రాలను ప్రారంభించే విశాల హృదయులు లేరిక్కడ, కానీ ఆ మహనీయుల విగ్రహాల సాక్షిగా దళిత బహుజనుల గురించి గంటల తరబడి మాట్లాడే నాయకులకు కొదువలేదు. రాజ్యంగా స్పూర్తిని దిక్కరించే వాళ్ళు ఉక్కుమనిషి సర్దార్ పటేల్ విగ్రహాలకు నిస్సిగ్గుగా అభిషేకాలు చేస్తున్నారు, రక్తచరిత్రకు అంకురార్పణ చేసిన వాళ్ళు రక్తాక్షరాలతో చరిత్రను తిరిగి రాయడానికి ప్రయత్నిస్తున్నారు. అధికారాన్ని తృణప్రాయంగా వదులుకున్న మహనీయుల విగ్రహాలకు అధికారంకోసం అంగలారుస్తున్న గోముఖ వ్యాగ్రాలు నిత్యపూజలు చేస్తున్నాయి. నిద్రాణమైన జాతిలో దేశభక్తిని రగిలించడం కోసం, రాజీపడకుండా ఉరికొయ్యను చిరునవ్వుతో ముద్దా డిన భగత్ సింగ్, రాజ్ గురూ లాంటి మహాత్ముల విగ్రహాలను అధికారంకోసం అడుగడుగునా రాజీపడుతూ, పూటకో పార్టీ మారుస్తూ అవినీతి బురదలో నిత్యం పొర్లాడే రాజకీయ రాబందులు ఉత్సవాలపేరుతో మలినం చేస్తున్నాయి. అందరికీ సమన్యాయం, సమాన అవకాశాలు, సమతావాదం పేరుతో అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకందించిన బాబాసాహెబ్ ఆశయాలకు తూట్లుపొడుస్తూ, అధికారాన్ని, అధికారులను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్న నాయకులు ఆయన జన్మదినాన్ని మాత్రం ఘనంగా జరుపుతూ షామియానాలు, భోజనాల పేరుతో నిరుపేదల ఆత్మగౌరవాన్ని వెక్కిరిస్తూ సుదీర్ఘ ప్రసంగాలు చేయడం చూస్తుంటే దయ్యా లు వేదాలు వల్లిస్తున్నట్టు ఉన్నది.
మహనీయుల ఆశయాలను సమాధిచేసి, వారి విగ్రహాలకు సంస్కారాలు చేయడం ఆ మహనీయులను అవమానించడమే అవుతుంది. నిర్భంధంలో చదువుకున్న అంబేద్కర్, నిర్భందంలో చదువులు చెప్పిన ఫూలే, నిర్భందంలో తిరగబడ్డ శివాజీ, నిర్భందాన్ని ఎదిరించిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌లు కోరుకున్నది, పరితపించింది వారి విగ్రహాల కోసం కానేకాదు, వారి ఆశయాలకు ప్రాణ ప్రతిష్ట చేయడం కోసమే. మనం పోటీ పడాల్సింది ఆ మహనీయుల విగ్రహాల సంఖ్యలో కాదు, వారి ఆశయ సాధనలో మన పాత్రేమిటన్న విషయం మీద. కార్పోరేట్ చదువులకు దీటుగా నిరుపేదల పిల్లలకు చదువులు అందించడంలో పోటీపడ్డ రోజు, కార్పోరేట్ వైద్యానికి దీటుగా నిరుపేదలకు వైద్యం అందించడంలో పోటీపడ్డ రోజు, సామాజిక అంతరాలు, బలహీనతల మీద, సాముహిక పోరాటాలు నిర్వహించడంలో పోటీ పడ్డరోజు, నిరాశ నిస్పృహల నుండి యువజనాన్ని మేల్కొపడంలో పోటీపడిన రోజు, నిజంగా ఆ మహనీయుల ఆత్మలు శాంతిస్తాయి, సంతోషిస్తాయి. విగ్రహాలు, ఉత్సవాలు, అభిషేకాలు మీ రాజకీయాలకు పనికొస్తాయేమో గాని, అంత మాత్రనే అవి మహనీయులను స్మరించుకోవడం ఎంత మాత్రం కాదు. ఇది సత్యం, రాజకీయ దళారులకు కొరుకుడు పడని చేదు నిజం.
- చందుపట్ల రమణ కుమార్ రెడ్డి
న్యాయవాది, 9440449392