Homeఎడిటోరియల్ / బహుళAmbedkarism: గద్దర్‌ ఆఖరి మజిలీ అంబేద్కరిజమే!

Ambedkarism: గద్దర్‌ ఆఖరి మజిలీ అంబేద్కరిజమే!

Ambedkarism was Gaddar’s final destination: ప్రజా యుద్ధభేరి గద్దర్‌ని, ఆనాటి ఉద్య మాలను, ఆయన సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆయన ప్రస్థానాన్ని అధ్యయనం చేయాలి. ఆగస్టు 6 గద్దర్‌ వర్ధంతి సందర్బంగా ఆయన గురించి తెలుసుకుందాం. గుమ్మడి విఠల్‌రావుగా అంబేడ్కర్‌ వాదం నుంచి బయలుదేరి పల్లె నుంచి ఢిల్లీ వరకు, ధూలపల్లి అడవుల నుంచి దండకారణ్యం వరకు తిరిగీ తిరిగి మళ్ళీ గద్దర్‌గా అంబేడ్కర్‌ దగ్గరే వచ్చి ఆగిండు. విఠల్‌ రావు నుంచి గద్దర్‌ వరకు సాగిన ప్రయాణం, రచన, ఆచరణ, ప్రచారం అంతా అడుగు వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సాగింది. ఆర్థి కంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా విభజితమైన నిచ్చెనమెట్ల కుల సమాజంలో బలహీనుల వైపు, బాధితుల వైపు నిలబడి గద్దర్‌ సాంస్కృతికాయుధాలను సిద్ధం చేసిండు. ఇట్లా నిలబడడమే నిస్వార్థా నికి, త్యాగానికి నిదర్శనం. రాజకీయ ధిక్కారం. అజ్ఞాతంలోకి వెళ్లి దేశమంతా తిరిగిండు. ప్రపంచీకరణ సందర్భంలో, కాన్షీరామ్‌ తెలు గునాట అడుగుపెట్టిన కాలంలో అంటే 1990 ఫిబ్రవరి 19న అజ్ఞాతం వీడి గద్దర్‌ ప్రజా జీవితంలోకి వచ్చిండు. అయితే సమాజంలో రాపిడ్‌గా చోటు చేసుకుంటున్న మార్పులను అంచనా వేయడంలో, దానికి అనుగుణంగా పంథాను మార్చుకోక పోవడంతో బహుజనులు ఆశించిన మేలు జరగలేదు.

- Advertisement -

మావోయిస్టులైన కింది కులాల వారి లెర్నింగ్‌.. అన్‌ లెర్నింగ్‌.. రీ లెర్నింగ్‌ ప్రక్రియ వల్ల బహుజన వర్గాలకు మేలు కలగాల్సింది. కానీ కలగలేదు. అయితే తెలంగాణ విషయంలో కలిగిన మేలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ఆ ఉద్యమం కులాలకి అతీతంగా జరగడంతో అక్కడ ఐక్యత సాధ్యమయింది. అయితే గద్దర్‌ విషయంలో ఈ ప్రక్రియ చాలా లేట్‌గా ప్రారంభం కావడంతో బహుజనులకు పెద్దగా ఫాయిదా కాలేదు. అంబేడ్కర్‌ వాదిగా మొద లైన గద్దర్‌ తొలిదశ ప్రత్యేక తెలంగాణ (1969-70) ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లిండు. జైలు నుంచి వచ్చిన తర్వాత నక్సల్బరీ ప్రభావంతో మావోయిస్టు ఉద్యమంతో మమేకమయిండు. అందువల్ల అంబేడ్కర్‌ భావజాలం నుంచి పక్కకు జరిగిండు. మావోయిస్టు ఉద్యమం ఎన్నడూ అంబేడ్కర్‌ వాదాన్ని సాను కూలంగా చూడకపోవడంతో మొత్తం తెలుగు బహుజన సమాజానికి తీవ్ర నష్టం జరిగింది. మలి దశ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత తెలంగాణ జనసభ, మహాసభ కూడా ఉద్యమంతో మమేకమైన తర్వాత మాత్రమే గద్దర్‌ తెలంగాణ వైపు నిలబడ్డాడు. అమ్మా తెలంగాణమా అని నినదించిండు. తెలంగాణ ఉద్యమం ఏ మేరకు ఊపందుకుంటూ వచ్చిందో ఆ మేరకు మావోయిస్టు ఉద్యమాలు ఈ ప్రాం తంలో వెనకతట్టు పట్టడం ప్రారంభమయింది. ఈ దశలో తాను మావోయిస్టుగా నేర్చుకున్నది ‘అన్‌ లెర్న్‍’ కావడానికి లేదా మరిచిపోవడానికి చాలా జాప్యం జరిగింది. ఆ పనిని శివసాగర్‌ లాంటి వారు 1990ల్లోనే చేస్తే గద్దర్‌ 2009 వరకు ఊగిసలాటలోనే ఉన్నాడు. ఆ తర్వాత గుడులు, గడీలు అన్నీ ఎక్కిండు, మొక్కిండు, తొక్కిండు. అయితే ఈ దశలో రీలెర్నింగ్‌ కూడా ఆలస్యమయింది. ప్రజాస్వామిక తెలంగాణ అనే నినాదానికి కట్టుబడి ఉన్నాడు కానీ, బహుజన తెలంగాణ నినాదం రాలేదు. బహుజన తెలంగాణనే అసలైన ప్రజస్వామిక తెలంగాణ అనే సంవాదాన్ని ప్రచారంలో పెట్ట లేక పోయిండు. నిజానికి ‘బహుజన తెలం గాణ’ నినాదం 2009లో గద్దర్‌ ఇచ్చి ఉంటే ఇవ్వాళ తెలంగాణ రాజకీయాలు మరోతీరుగా ఉండేవి. అయితే 2020ల వరకు ఆలోచనగా ఉన్నటువంటి అంబేడ్కరిజం మళ్లీ ఆచరణ రూపంలోకి తీసుకురావడానికి గద్దర్‌ ప్రయ త్నించారు. ఇది అసలైన రీ లెర్నింగ్‌. అంటే అంబేడ్కరిజమే అంతిమ లక్ష్యం, రాజ్యాంగమే సర్వజన రక్ష అనే తిరుగులేని నిర్ణయానికి వచ్చాడు. అందుకే-
“రాజ్యాంగం
భారత రాజ్యాంగం ఒక పుస్తకం కాదు
ఏడు తరాల త్యాగాల జ్ఞాన యుద్ధం
మానవ జాతి విముక్తి గీతం..
భారత రాజ్యాంగం
అభాగ్యుల ఆయుధం” అని పాడిండు. రాజ్యాంగపు ప్రాధాన్యతను 2009లోనే గుర్తించి ఉంటే ఇవ్వాళ గద్దర్‌ ప్రభ వేరే తీరుగా ఉండేది. అయితే అంతిమ కాలంలో రాజ్యాం గమే సర్వజన రక్ష అనే అభిప్రాయానికి వచ్చాడు. రీ లెర్నింగ్‌ ద్వారా పూర్తిగా జ్ఞానోదయమైన వ్యక్తిగా గద్దర్‌ ఇట్లా పిలుపు నిచ్చాడు. “నా ప్రియమైన ప్రజా కళాకారులారా, కవులారా, శిల్పులార, అక్షర జ్యోతులారా! భారత రాజ్యాంగాన్ని ప్రజల పాటలుగా, ప్రజా కళారూపాలుగా, ప్రజల వద్దకు చేర్చండి. ఈ కార్యక్రమమే మన తక్షణ కర్తవ్యం” అని గద్దర్‌ పిలుపు నిచ్చాడు. ఈ పిలుపు ఇవ్వాళ కాక్రోచ్‌ జనతాపార్టీ రాజకీయాల్లో అమలు పరుస్తు న్నది. రాజ్యాంగాన్ని ఎదలకు అత్తుకొని ఢిల్లీ సింహాసనాలను కదిలించింది. ఎవరికీ తగ్గేదే లే అనే విధంగా అహంభావంతో ఏడాదికి పైగా రైతుల ఉసురు బోసుకున్న, మణిపూర్‌తో పాటు, మహిళా పహిల్వాన్ల గోస బుచ్చుకున్న భార తీయ జనతాపార్టీ దిగిరాక తప్పింది కాదు. నీట్‌ పేపర్‌ లీక్‌కు బాధ్యత వహిస్తూ ఎట్టకేలకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీ నామా చేయక తప్పింది కాదు. ఇదంతా ఆయుధం కాదు, అక్షరం, రాజ్యాంగం, ప్రజా ఉద్యమం సాధించిన బృహత్తర విజయం. సోషల్‌ మీడియా యుగంలో రాజ్యాంగవాదు లకు దక్కిన గౌరవమిది. నిజానికి రాజ్యాంగం ఔన్నత్యాన్ని, శక్తిని, స్ఫూర్తిని తెలుసుకున్న వాడు కావడంతో గద్దర్‌ దాన్ని ప్రచారం చేయాలని, కాపాడుకోవాలని పిలుపునిచ్చాడు. (ఈ) లెర్నింగ్‌.. అన్‌ లెర్నింగ్‌.. రీ లెర్నింగ్‌ ప్రాసెస్ ఇంకొంచెం ముందుగా ప్రారంభమై ఉంటే తెలంగాణ బహుజనోద్యమాలకు బహు మతిగా ‘రాజకీయాధికారం దక్కేది’. ఇప్పటి కైనా గద్దర్‌ స్ఫూర్తితో అంబేడ్కర్‌ బాటలో, రాజ్యాంగమే సర్వజన రక్షణ అనే నినాదంతో బహుజనులు ఐక్యంగా ముందుకు నడవాలి. ఇది ఇవ్వాళటి అవసరం. అత్యంత అవసర మైన కాలంలో గద్దర్‌ లేని లోటు పూడ్చలేనిది. కాని ఆయన వేసిన దారి అనుసరణీయమైనది. గద్దర్‌ స్ఫూర్తిని పంచే విషయంలో తెలం గాణ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నది. గద్దర్‌ ఫౌండేషన్‌కు కేటాయిస్తామన్న స్థలం ఇంకా ముందడుగు పడలేదు. అంతెందుకు గద్దర్‌ పేరిట అవార్డు ఇస్తున్నారు గానీ ఆ అవార్డుతో ఎక్కడా గద్దర్‌ బొమ్మ లేదు. ఇవన్నీ నోటితో పొగడుతూ నొసటితో వెక్కిరిస్తున్నారు అనడానికి నిదర్శనాలు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ పంథాను మార్చుకొని గద్దర్‌ ఘనతను నలుదిశలా వ్యాప్తి కావడానికి కృషి చేయాలి.

డా.సంగిశెట్టి శ్రీనివాస్
సామాజిక, రాజకీయ విశ్లేషకులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News