అమెరికా, చైనాల మధ్య ఈ వారం చోటు చేసుకున్న శిఖరాగ్ర సమావేశం ఆశించిన ఫలితాలనిచ్చే అవకాశం లేదని విదేశీ వ్యవహారాల నిపుణులు ఇప్పటికే తేల్చి చెప్పేశారు. ప్రపంచంలోనే అత్యంత ఉన్నత స్థానాల్లో ఉన్న రెండు అగ్ర రాజ్యాల మధ్య సమకస్యల పరిష్కారానికి చర్చలు జరుగుతున్నప్పుడు సహజంగానే ఆ దేశాల సమస్యలతో పాటు అనేక ప్రపంచ సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుందని
ఆశిస్తాం. అయితే, ఈ రెండు దేశాల మధ్య ఎక్కడా పట్టు విడుపులకు ఆస్కారం కనిపించడం లేదని నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు క్సి జిన్ పింగ్ ల మధ్య శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగే శిఖరాగ్ర సమావేశం ఒక్క విషయంలో మాత్రం ముందడుగు
వేసింది. ఇటీవలి కాలంలో మతమ మధ్య క్షీణించిపోయిన సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఈ రెండు దేశాల నాయకులు సుముఖత వ్యక్తం చేయడం మాత్రమే ఇక్కడ శుభ పరిణామంగా కనిపిస్తోంది.
వీరిద్దరి మధ్యా చర్చలు రెండు దఫాలుగా జరిగాయి. ఇందులో మొదటి సమావేశం కేవలం ఒప్పందాలు కుదర్చుకోవడానికి మాత్రమే పరిమితం అయింది. సైనిక వ్యవస్థల మధ్య ప్రత్యక్షంగా, ముఖాముఖీగా చర్చలు జరగాలని, కృత్రిమ మేధతో సంబంధం ఉన్న అంశాలు, భద్రతపై తరచూ సమీక్షలు జరపాలని నిర్ణయించి, ఆ మేరకు ఒప్పందాలు కుదర్చుకోవడం జరిగింది. ఉభయ దేశాలు తమ మధ్య సంబంధాలను మెరుగుపరచుకోవడానికి తరచూ చర్చలు జరపాలనే నిర్ణ యంతో మరొక ఒప్పందం
కుదిరింది. నిజానికి 2022లో బాలీలో ఈ రెండు దేశాల అగ్ర నాయకుల మధ్య సమావేశం జరిగినప్పుడు కూడా ఇదే పంథాలో చర్చలు జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. అయితే, ‘గూఢచారి బలూన్’ సంఘటనతో ఈ ప్రయత్నమంతా నీరుగారిపోయింది. ఈ సారి అప్రమత్తంగానూ, ఆశాభావంతోనూ వ్యవహరించడానికి వీలుగా భావి చర్చలకు మార్గం సుగమమైంది. అయితే, ఈ రెండు దేశాల మధ్యా అపరిష్కృత సమస్యలే ఎక్కువగా ఉన్న స్థితిలో, ఈ రెండు దేశాల వైఖరి కొరకరాని కొయ్యగా ఉన్న
నేపథ్యంలో ఈ రెండు దేశాల ప్రయత్నాలు ఎంత వరకు సఫలం అవుతాయన్నది ప్రశ్న.
ముఖ్యంగా, వచ్చే ఏడాది తైవాన్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల మీద ఇప్పటికే ఎవరి అభిప్రాయాలు వారు, ఎవరి వైఖరి వారు ప్రకటించడం జరిగింది. యథాతథ పరిస్థితి కొనసాగాలని, ఇందులో మార్పేమీ ఉండకూడదని అమెరికా స్పష్టం చేయగా, తైవాన్ ఎన్నికల వ్యవహారంలో ఏ దేశమూ తలదూర్చకూడదని చైనా గట్టిగా హెచ్చరించింది. ఇక 2024 నవంబర్ నెలలో అమెరికాలో కూడా ఎన్నికలు జరగబోతున్న సమయంలో చైనా వ్యవహారమనేది ఒక ప్రధాన ప్రచారాంశంగా మారబోతోంది. అయితే, భవిష్యత్తులో తమ సంబంధాలను మెరుగుపరచు కోవడానికి ఈ దేశాలు కృషి చేసే
అవకాశం ఉందా అన్నది ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం. జిన్ పింగ్ చెప్పినట్టు, ఈ రెండు దేశాలు శత్రు దేశాలా లేక భాగస్వామ్య దేశాలా అన్నది ముందుగా తేలాల్సి ఉంది. కేవలం తమతో పోటీపడడానికే అమెరికా పరిమతం అవుతోందని, దాని విధానాలన్నీ ఆ దిశగానే కొనసాగుతున్నాయని చైనా అనేక పర్యాయాలు ఆరోపించింది. దీనివల్ల అర్థం పర్థం లేని విధానాలను రూపొందించుకోవడం, తప్పుడు చర్యలు చేపట్టడం, అవాంఛనీయ ఫలితాల కోసం ఎదురు చూడడం వంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నా యని కూడా చైనా నాయకత్వం విమర్శించింది. దాటవేసే పద్ధతి, తైవాన్ తో సహా చైనా వ్యవహారాల్లో తలదూర్చడం వంటివి అమెరికా విరమించుకోవాలని చైనా సలహా ఇచ్చింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా, చైనా దేశాల మధ్య అనేక విషయాల్లో పోటీ ఉన్న విషయాన్ని కాదనలేమని స్పష్టం చేశారు. అందువల్ల తాము చైనాకు సంబంధించిన ప్రతి అంశాన్నీ పోటీ దృక్పథంతోనే చూడడం జరుగుతోందని కూడా ఆయన నొక్కి చెప్పారు. అయితే, ఎక్కువగా పోటీ గురించే ఆలోచిస్తున్నప్పటికీ, దీనిని బాధ్యతాయుతంగా చేయడమన్నది తమ ముందున్న పెద్ద సవాలని బైడెన్
వ్యాఖ్యానించారు. ఈ పోటీ అనేది సంఘర్షణగానో, ఘర్షణగానో మారకుండా ఉండడానికి తమ మధ్య చర్చలకు, సంప్రదింపులకు అవకాశం ఉండాలని, అందుకు సంబంధించిన ఒప్పందం కుదరాలని ఉభయ దేశాలు కోరుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవాధీన రేఖకు సంబంధించిన వివాదాలు కొద్ది కాలంగా భీకరంగా ఉన్న స్థితిలో భారత, చైనాల మధ్య కూడా ఇటువంటి ఒప్పందం ఏదో కుదరాల్సిన అవసరం కనిపిస్తోంది. ఉభయ దేశాల మధ్య చర్చలు, సంప్రదింపులకు మార్గం లేదా అవకాశం ఏర్పడాల్సిన అవసరాన్ని అమెరికా, చైనాల చర్చలు సూచిస్తున్నాయి.