Thursday, November 21, 2024
Homeఓపన్ పేజ్కనీసం పాతికసార్లు చదివించిన మధుర గ్రంథం..

కనీసం పాతికసార్లు చదివించిన మధుర గ్రంథం..

సాహితీ వనంలో
మరుపురాని మధుర గ్రంథం

- Advertisement -

సుమారు ఏడున్నర దశాబ్దాల క్రితం ప్రముఖ కథా రచయిత, వ్యాసకర్త, విమర్శకుడు, పరిశోధకుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రాసిన ‘అనుభవాలు-జ్ఞాపకాలునూ’ అనే గ్రంథం ప్రతి సాహిత్యాభిలాషి, పుస్తక పఠనాభిలాషితో కనీసం పాతిక సార్లు చదివించి ఉంటుంది. దీన్ని పాతికకంటే ఎక్కువసార్లు చదివినవారూ లేకపోలేదు. నా మటుకు నేను ఓ డజనుసార్లు చదివి ఉంటాను. అంత మధురమైన పుస్తకం ఇది. దీన్ని 1999జనవరిలో మొదటిసారిగా విశాలాంధ్ర బుక్ హౌస్ వారు ప్రచురించింది లగాయితు వందలు, వేల సంఖ్యలో ప్రతులు అమ్ముడుపోయాయని చెబుతుంటారు. తెలుగు ప్రాంతంలో పలువురు అతిరథ మహారథ రచయితల గ్రంథాలన్నింటితో పోలిస్తే ఈ గ్రంథం ఓ రికార్డు నెలకొల్పిందనే భావించాలి. పుస్తకం పట్టుకుంటే విడిచిపెట్టరనే మాట అక్షర సత్యం. ఈ భాషను చూసిన తర్వాత, చదివిన తర్వాత సహజంగానే ఎవరికైనా అనిపిస్తుంది తేనెలూరు భాష తెలుగు భాష అని. “భారతీయ భాషల్లో నేనెరిగినంత వరకూ ఈ రకం గ్రంథం లేదు” అని పురపండ అప్పలస్వామి అన్నారంటే ఇది ఏవిధంగా చూసినా ఎంత ఉత్తమ సాహిత్యమో ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్షరాలా ఆధునిక కథా చక్రవర్తి ఆ మహానుభావుడు.

దాదాపు 1921 నుంచి 1952 వరకు ఆయన వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాల సంకలనం ఇది. దీన్ని మూడు సంపుటాలుగా వెలువరించారు. అయితే రచయిత (1891-1961) అకాల మరణం వల్ల మరికొన్ని అనుభవాలు-జ్ఞాపకాలను ఇందులో చేర్చలేకపోయారు. ప్రముఖ పత్రికా సంపాదకుడు నీలంరాజు వెంకట శేషయ్య సారథ్యంలో వచ్చిన ‘నవోదయ’ అనే పత్రికలో ఈ వ్యాసాలు ప్రచురితమయ్యేవి. ఆయన వాల్మీకి రామాయణం అంతటినీ తెలుగు వచనంలోకి అనువదించారు. అలాగే ‘వరి గింజలు’ ‘అరికాలి కింద మంటలు’, ‘పుల్లంపేట జరీ చీర’, ‘వీరాంగనలు’, ‘వీర పూజ’ వంటి రచనలు కూడా చేశారు. కానీ ఇందులో ఎక్కువగా మనసులో నిలిచేది మనసుకు హత్తుకుపోయేది మాత్రం ‘అనుభవాలు-జ్ఞాపకాలూనూ’ అనిపిస్తుంది. ఆధునిక వచనా సాహిత్యానికి ఆధునిక కథా రచనకు ఆయన అడుగు జాడలు కూడా ఇతోధికంగా తోడయ్యాయి.

అప్పటి ఆచార వ్యవహారాలు, ఆనాటి సంప్రదాయాలు, వివిధ కులాల తీరుతెన్నులు, సంస్థానాధీశుల వ్యవహార శైలి, రాజకీయాలు, పంచాయతీలు, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల యాసలు తదితరాలన్నీ నవ్విస్తాయి, ఆలోచింపజేస్తాయి, ఆనందపరుస్తాయి. అప్పటి సన్నివేశాలను కళ్లకు కట్టిస్తాయి. పైగా అన్నీ జరిగిన ఉదంతాలే. ఏవీ కల్పితాలు కావు. ఉదాహరణకు ఒక పెద్ద మనిషి ఓ చిరు పుస్తకాన్ని రాసి అచ్చేసుకోవడానికి చేత చిల్లి గవ్వ లేక ఒక సంస్థానాధీశుడిని ఆశ్రయించడానికి వచ్చాడు. ఆ సంస్థానాధీశుడు అప్పుడే తన కుమార్తె పెళ్లి చూపులకు బయలుదేరాడు. ఆయన తన వంధిమాగధులతో గడప దాటాడో లేదో ఈ చిరు గ్రంథ రచయిత ఎదురుగా వచ్చాడు. పరిచయస్థుడే కావటం వల్ల ఆ సంస్థానాధీశుడి ఇతన్ని “ఏవోయ్ బాగున్నావా” అని పలకరించి కుశల ప్రశ్నలు వేశాడు. అన్నీ అయ్యాక అతను వచ్చిన పని గురించి అడిగాడు. ఓ గ్రంథం రాశాననీ, రాజావారు దయతలిస్తే అచ్చు వేయించుకుంటాననీ అతను వినయంగా విన్నవించుకున్నాడు. “దానికేముంది అలాగేలే” అని అభయమమిచ్చిన రాజావారు “పుస్తకానికి ఏం పేరు పెట్టావు”? అని కుతూహలం కొద్దీ అడిగాడు. “మన స్మశానం అని పేరు పెట్టానండీ” అని అతను సెలవిచ్చాడు. అంతే రాజావారి (సంస్థానాధీశుడు) రంగులు మారాయి. “సరిపోయింది శకునం బాగాలేదు. ఈ పెళ్లి చూపులు జరిగినట్టే. పదండి వెనక్కి వెళదాం” అని ఆయన తాను వెడుతున్న పనిని విరమించుకుని ఇంట్లోకి వెళ్లిపోయాడు.

ఒక టీచర్ గా కూడా ఆయన తన అనుభవాలను రసవత్తరంగా తెలియజేశారు. మూడు సంపుటాలతో 570 పేజీలతో ఉన్నప్పటికీ ఈ పుస్తకం చకచకా అవిచ్ఛిన్నంగా అవిశ్రాంతంగా సాగిపోతుంది. పూర్తయ్యేవరకూ దీన్ని ఒక పట్టాన పక్కన పెట్టలేం. నిజంగా చాలా గొప్ప సాహిత్యం. ఎంతో మధురమైన అనుభవాల సంపుటి.

జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News