Saturday, September 21, 2024
Homeఓపన్ పేజ్AP Politics: టీడీపీకి కొత్త వ్యూహం అవసరం

AP Politics: టీడీపీకి కొత్త వ్యూహం అవసరం

ప్రజల సానుభూతి లభిస్తే భువనేశ్వరి లక్కీ

చలికాలం కూడా ఆంధ్రప్రదేశ్‌ వాతావరణం వేడెక్కుతోంది. ఎన్నికలు జరగబోతున్న తెలంగాణలో రాజకీయ వేడి, ఎన్నికల వేడి పెరగడం సహజమే కానీ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా పెరగడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు, మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నతెలంగాణలోకంటే ఆరు నెలల తర్వాత ఎన్నికలు జరగబోతున్న ఆంధ్రప్రదేశ్‌ లోనే ఎన్నికల వేడి ఎక్కువగా ఉందనిపిస్తోంది. రాష్ట్రంలో పాలక, ప్రతిపక్షాలు పోటీపోటీగా ప్రచారం సాగిస్తూ ధూషణలు, విమర్శలు, ఆరోపణలతో రాష్ట్రాన్ని మారుమోగించేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియా ద్వారా ఈ పార్టీలు సాగిస్తున్న అవసర, అనవసర, ఉపయోగకర, వ్యర్థ ప్రచారాలు నిశ్శబ్ద కాలుష్యాన్ని ఎడతెరిపి లేకుండా సృష్టిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయిన ఎన్‌. చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో యాత్ర ప్రారంభించిన రోజునే పాలక వై.ఎస్‌.ఆర్‌.సి.పి కూడా తమ ‘సామాజిక సాధికార’ యాత్రకు పచ్చ జెండా ఊపింది. ఈ యాత్రల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుందన్నది ఎన్నికల్లోనే తేలాలి.
ఇటీవల తన పాదయాత్రను అర్ధంతరంగా ముగించిన చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ మరోసారి పాదయాత్రను ప్రారంభించే ఉద్దేశంలో ఉన్నారు. తన తండ్రి చంద్రబాబు అరెస్టు కారణంగా మధ్యలోనే తన యాత్రను విరమించిన లోకేశ్‌ త్వరలో ఈ యాత్రను ప్రారంభించే అవకాశం ఉంది. ఆ యాత్ర ద్వారా ఆయన ప్రజా సమస్యల గురించి ప్రత్యక్షంగా తెలుసు కుంటూ, ప్రజాభిమానాన్ని కూడగట్టుకుంటూ, తండ్రి తర్వాత తానే పార్టీ అధినేతకాగల సత్తా సంపాదించుకోవడం జరిగింది. ఈ ప్రజాభిమానాన్ని దృష్టిలో పెట్టుకునే అతని తండ్రిని అరెస్టు చేయడం జరిగిందనే అభిప్రాయం కూడా ఆయన పార్టీ వారి నుంచి వ్యక్తమవుతోంది. వై.ఎస్‌.ఆర్‌.సి.పి, తెలుగుదేశం పార్టీల తర్వాత జనసేనతో పొత్తుతో మూడవ ప్రబల శక్తిగా ఎదుగుతున్న బీజేపీకి ఎన్టీఆర్‌ కుమార్తె పురంధేశ్వరి అధ్యక్షురాలు కాగా, ఎన్టీఆర్‌ మరో కుమార్తె భువనేశ్వరి ప్రస్తుతం చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి దాదాపు అధినేతగా సారథ్యం వహిస్తుండడం ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఆసక్తికర పరిణామంగా మారింది. రెండు ప్రధాన పార్టీలకు అక్క చెల్లెళ్లు సారథులుగా వ్యవహరించడం రాష్ట్ర ప్రజలను బాగానే ఆకట్టుకుంటోంది. నిజానికి, తెలుగుదేశం, బీజేపీల మధ్య పొత్తు జరిగే అవకాశాలు గురించి రాష్ట్రంలో ఆసక్తికర చర్చ సాగుతోంది.
చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత దిగ్భ్రాంతితో మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి భువనేశ్వరి తన యాత్ర ప్రారంభించారు. తన తండ్రి డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి ప్రమాదవశాత్తూ మరణించినప్పుడు, దిగ్భ్రాంతితో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను పరామర్శించడానికి కొద్ది సంవత్సరాల క్రితం ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి కూడా ఇటువంటి ఓదార్పు యాత్రనే చేపట్టడం జరిగింది. ఈ రెండు పార్టీల అంతిమ లక్ష్యం సంగతి పక్కనపెట్టి ఆలోచిస్తే, ఎన్టీఆర్‌ కుమార్తె అయిన భువనేశ్వరి తన భర్త అరెస్టుకు సానుభూతి సంపాదించగలరా, భర్త అరెస్టుతో చతికిలబడిపోయిన తెలుగుదేశం పార్టీలో జవజీవాలు నింప గలరా అన్నది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. నిజానికి ఆమె చేపట్టిన ఓదార్పు యాత్ర లేదా సానుభూతి యాత్ర గతుకుల మార్గంలో సాగుతున్న యాత్ర లాంటిది. మొదటి నుంచి ఇంటి వ్యవహారాలకే పరిమితం అయి ఉన్న భువనేశ్వరి ప్రజా సంబంధాలకు పాతే అయినప్పటికీ, రాజకీయాల్లో ముందు వరుసలో నిలబడడానికి మాత్రం కొత్తే. తన భర్త చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటికి వచ్చే వరకూ, పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి, వారిని ఉత్తేజితులను చేయడానికి తన యాత్ర తోడ్పడాలన్నది ఆమె ఉద్దేశం. నిజంగా ప్రజల నుంచి సానుభూతి లభిస్తే ఆమె అదృష్టవంతురాలే.
భువనేశ్వరి ప్రయత్నాలను తిప్పికొట్టడానికి, ఆమె ఆశించిన ప్రయోజనం సిద్ధించకుండా ఉండడానికి వై.ఎస్‌.ఆర్‌.సి.పి తన యాత్రకు శ్రీకారం చుట్టింది. చిన్న, సన్నకారు ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి, పేదలను, మధ్యతరగతి ప్రజానీకాన్ని ఆకట్టుకోవడానికి తమ యాత్రను ఉద్దేశించినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆ పార్టీ అసలు ఉద్దేశం అందరికీ అర్థమైపోతూనే ఉంది. ఇది పేదలకు, పెత్తందార్లకు మధ్య పోరాటం అని జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఇందులో తెలుగు దేశం పార్టీ పెత్తందార్ల పార్టీ అని జగన్మోహన్‌ రెడ్డి ఉద్దేశం. తెలుగుదేశం పార్టీలో ఎక్కువ మంది కమ్మ కులస్థులనేది ఆయన అభిప్రాయం. ఇది కులాల పోరాటం కాదని జగన్మోహన్‌ రెడ్డి చెబితే చెప్పవచ్చు. కానీ, రాష్ట్ర ప్రజలందరికీ ఇది ఏ పోరాటమో, ఎటువంటి పోరాటమో ఎప్పుడో అర్థమై పోయిందన్నది వాస్తవం. ఇంతకూ భువనేశ్వరికి ఈ యాత్ర నల్లేరుకాయ మీది బండిలా సాగిపోయే అవకాశం ఉండకపోవచ్చు. తమ కంపెనీలో రెండు శాతం వాటా అమ్మినా తనకు రూ. 400 కోట్లు వస్తాయంటూ భువనేశ్వరి ఇప్పటికే నోరు జారారు. ఈ మాట వై.ఎస్‌.ఆర్‌.సి.పి వాదనకు సరిగ్గా సరిపోయింది. తెలుగుదేశం పార్టీ మళ్లీ బలం పుంజుకోవాలన్నా, ఎన్నికల్లో విజయం సాధించాలన్నా ఇంతకంటే భిన్నమైన మార్గాన్ని ఎంచుకోవాలి. తన వ్యూహాన్ని మార్చుకోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News