ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్ర బాబు నాయుడు కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆయన పాలన మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు. అనేక విధానపరమైన నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని ఆర్థికా భివృద్ధి బాట పట్టి స్తారని, ఆయన హయాంలో తప్పకుండా ఉద్యోగాల సృష్టి, సంపద సృష్టి జరుగుతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎన్.డి.ఏ భాగస్వామ్య పక్షాల నాయకులు హాజరు కావడాన్ని బట్టి చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహ కారాలు కూడా మెండుగా ఉంటాయనే అభిప్రాయం కలుగుతోంది. విజయవాడ, గుంటూరు నగరాల మధ్య, కృష్ణానది ఒడ్డున ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణం జరగడా నికి మార్గం సుగమం అయింది. అమరావతిని అద్భుతమైన రాజధానిగా నిర్మించాలన్న చంద్రబాబు ఆశయం. ఆ ఆశయం నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి.
గత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్ధంతరంగా ఆపేసిన అమరావతి నగర నిర్మాణాన్ని తమ ప్రభుత్వం తిరిగి చేపట్టబోతున్నట్టు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. రాజధానికి సంబంధించిన సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలన్న పక్షంలో ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ ఒక చట్టాన్ని తీసుకు రావాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వంటి అతి పెద్ద రాష్ట్రానికి రాజధాని ఏమిటన్నది తేలకపోవడం పాలన వ్యవహారాల్లో తప్పకుండా సమస్యలు సృష్టిస్తుంది. ఇది ఆర్థిక పరిస్థితిని, వ్యాపారాలను కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో తమకు రాజధానిగా ఉండే అవకాశం లేకపోవడంతో నిరాశా నిస్పృహలతో, మానసిక ఆందోళనతో ఉన్న రాష్ట్ర ప్రజలకు ఇది అనేక విధాలుగా ఊరట కలిగిస్తుంది. రాజధాని నిర్మాణ వ్యవహారంలో భాగంగా ఇక్కడ భారీ ఎత్తున పట్టణీ కరణ చోటు చేసుకునే అవకాశం ఉన్నందువల్ల పర్యావరణ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది.
కార్పొరేట్ సంస్థ అనుకూల నాయకుడుగా చంద్రబాబు నాయుడుకు పేరుంది. పరిశ్రమలను, వాణిజ్య సంస్థలను రాష్ట్రానికి తీసుకు రావడం మీద ఆయనకు తిరుగులేని ఆసక్తి ఉందనే విషయం అందరికీ తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐ.టి రంగాన్ని అంచనాలకు మించి అభివృద్ధి చేసిన చంద్రబాబు ప్రధానంగా వ్యవసాయ రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌ను వ్యవసాయపరంగా బాగా అభివృద్ధి చేసి, రైతులను పేదరికం నుంచి గట్టెక్కించాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రతి రైతుకూ రూ.20,000 ఖాతాలో వేస్తామన్న ఎన్.డి.ఎ మేనిఫెస్టోలోని హామీని తప్పకుండా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అయితే, రాష్ట్రంలోని రైతులకు బ్యాంకు ఖాతాలో ఈ మొత్తాన్ని వేయడంతో సరి పోదు. అయితే, ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలను చేపడితే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం పురోగమించే అవకాశం లేదు. రైతుల జీవితాలను మెరుగుపరచడానికి మరింతగా సంక్షేమ పథకాలను రూపొందించాలి. ఆహార ధాన్యాలను నిల్వ చేసుకోవడానికి సౌకర్యాలను వృద్ధి చేయాలి. లాభదాయకమైన పంటలను మాత్రమే వేసేలా చర్యలు తీసుకోవాలి.
ఒక విజన్ ఉన్న సీనియర్ నాయకుడు అయినందువల్ల చంద్రబాబు నుంచి రాష్ట్రంలోని రైతులే కాకుండా, యువత కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంది. ఒక పక్క నిరుద్యోగ భృతిని కొనసాగి స్తూనే, మరొక పక్క ఉద్యోగాల సృష్టికి ఆయన ఎన్నో చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. రాష్ట్రంలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాల కల్పనను పూర్తిగా నిర్లక్ష్యం చేసినందువల్ల, చంద్రబాబు ప్రభుత్వం ఈ అంశానికి తప్పనిసరిగా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. రాజధాని నిర్మాణం, ఉద్యోగాల కల్పన, రైతు సమస్యలు, ప్రాథమిక సదుపాయాలు వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడమంటే ముందుగా ఆర్థిక వనరులు పెరగాలి. రాష్ట్రం అప్పుల ఊబి నుంచి, ముఖ్యంగా తాకట్టుల సంక్షోభం నుంచి బయటపడి, అభివృద్ది పథం వైపు పరుగులు తీయాలన్న పక్షంలో కేంద్ర ప్రభుత్వ చేయూత తప్పదు. ఇటీవలి కాలంలో మోదీ ప్రభుత్వం పెరిగిన సాన్నిహిత్యాన్ని ఆధారం చేసుకుని చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉంటుంది.