Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్AP leaders: నేతల మాటలకు హద్దులు అవసరం

AP leaders: నేతల మాటలకు హద్దులు అవసరం

ఓర్పు, సహనాలతో, సంయమనంతో లీడర్లు వ్యవహరించాల్సిందే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పాలక వై.ఎస్‌.ఆర్‌.సి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య తరచూ ఘర్షణలు తలెత్తడం చూస్తుంటే తీవ్ర ఆందోళన కలుగుతూ ఉంటుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఇటీవల ఈ రెండు పార్టీల మధ్యా ఘర్షణలు తలెత్తి సుమారు 50 మంది పోలీసులు గాయపడడం, అందులో ఒకరికి కన్ను పోవడం జరిగింది. ఈ విధంగా ఈ రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగుతాయిని పోలీసులు ఏమాత్రం ఊహించలేకపోయారు. పోలీసుల కథనం ప్రకారం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ముందుగా రాళ్లు రప్పలు విసరడం ప్రారంభించడం, దాంతో గందరగోళ పరిస్థితి ఏర్పడడం జరిగింది.
రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించడానికి పది రోజుల పర్యటన తలపెట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పుంగనూరు నియోజక వర్గంలోని అంగళ్లు గ్రామానికి వచ్చిన సందర్భంగా ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు రాకను వై.ఎస్‌.ఆర్‌.సి.పి కార్యకర్తలు ప్రశ్నించడం ప్రారంభించడం, నిరసనకు దిగడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాదోపవాదాలు ప్రారంభమై చివరికి ముష్టాముష్టీ బాహాబాహీకి దిగింది. ఆ తర్వాత పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌ లో రాజకీయ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్పింది.
సాధారణంగా ఆచితూచి మాట్లాడడమే కాకుండా ఎంతో హుందాగా వ్యవహరించే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒక్కసారిగా హద్దులు దాటారు. తన హోదాకు, స్థాయికి ఏమాత్రం సరిపోని విధంగా దుర్భాషలాడడం ప్రారంభించారు. కొద్ది గంటల తర్వాత ఆయన యాత్ర అనుమతించిన మార్గంలో కాకుండా వేరే మార్గాన్నిఅనుసరించడం ప్రారంభించింది. ఈ కారణంగానే పోలీసులు పార్టీల కార్య కర్తల మనోభావాలను గ్రహించలేకపోయారు. ఈ కారణంగానే పోలీసులు ఆ తర్వాత చంద్రబాబు పైనా, మరో 20 మంది కార్యకర్తలపైనా హత్యాయత్నం కేసుల్ని నమోదు చేయడం జరిగింది. చంద్రబాబు తదితర నాయకులే జనాన్ని రెచ్చగొట్టినట్టు పోలీసులు ఆరోపించారు.
కాగా, వై.ఎస్‌.ఆర్‌.సి.పి నాయకులే ఒక కుట్రలో భాగంగా తనపై దాడి చేశారని, దీనిపై సి.బి.ఐతో దర్యాప్తు చేయించాలని డిమా్‌ండ చేయడం మొదలుపెట్టారు. తాను మాట్లాడుతున్న సమావేశం మీద రాళ్లు విసిరింది పాలక పక్ష కార్యకర్తలేనంటూ చంద్రబాబు నాయుడు ఆరోపణల్లో నిజం ఎంతో క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే గానీ నిగ్గుతేలదు. పాలక పక్షం మాత్రం తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే శాంతిభద్రతల సమస్యను సృష్టించారని ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని బట్టి తేలుతున్నదేమిటంటే, పాలక, ప్రతిపక్షాలు తరచూ దుర్భాషలాడుతూ, హద్దులు మీరి వ్యాఖ్యలు చేస్తూ ఘర్షణ వాతావరణం సృష్టించడం జరుగుతోంది. బీజేపీ మద్దతు ఉన్న జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ, పాలక పక్ష కార్యకర్తలు ఏదో ఒక సందర్భంలో మాటలు తూలడం జరుగుతూనే ఉంది.
ఈ పార్టీలు తమ సమావేశాల్లో, తమ ప్రదర్శనల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, వ్యక్తిగత దూషణలు చేయడం అనేది పరిపాటి అయిపోయింది. పార్టీ నాయకుల ఉద్దేశంలో అది పార్టీశ్రేణులలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం, ధైర్యం నూరిపోయడం కావచ్చు. తాము కూడా పటిష్టమైన పార్టీయేనని నిరూపించడం కూడా కావచ్చు. అయితే, ఇటువంటి వ్యూహం మొదట్లో బాగానే కనిపించినప్పటికీ, ఆ తర్వాత ఏ పార్టీకీ మేలు చేసే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. నాయకుల రెచ్చగొట్టే ప్రసంగాలకు కార్యకర్తలు బలయ్యే అవకాశం ఉంటుంది. నాయకుల అడుగుజాడల్లో నడిచే కార్యకర్తలు వీధి పోరాటాలకు, హింసా విధ్వంసకాండలకు దిగే ప్రమాదం ఉంది. ఏ పార్టీకి చెందినవారైనప్పటికీ నాయకులు కొద్దిగా ఓర్పు, సహనాలతో, సంయమనంతో వ్యవహరించడం మంచిది. ఇతర నాయకుల విషయం ఏమో గానీ, రాజకీయంగా అనుభవం పండిన చంద్రబాబు మరింత సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News