ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ పార్టీల మధ్య సమాలోచనలు, సంప్రదింపులు జోరుగా సాగుతున్నాయి. ప్రజలకు కూడా రాష్ట్ర రాజకీయంలో ఏదో జరగబోతోందనే అభిప్రాయంతో పాటు అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో హోం మంత్రి అమిత్ షా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్య సమాలోచనలు జరిగినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయ రంగ దృశ్యం ఒక్కసారిగా మారిపోయినట్టనిపించింది. ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా రాష్ట్ర పర్యటనకు రావడం ఈ పరిణామాలకు మరింతగా జీవం పోసింది. వీటన్నిటికీ తోడు, బీజేపీకి మిత్రపక్షం అయిన జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ ‘వారాహి’ యాత్ర చేపట్టడంతో రాజకీయ రంగం వేడెక్కడం ప్రారంభించింది. అమిత్ షా, నడ్డా, పవన్ కల్యాణ్‌లు తమ తమ పర్యటనలు, యాత్రల్లో వై.ఎస్.ఆర్.సి పార్టీని, దాని నాయకుడు, ముఖ్యమంత్రి అయిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించడాన్ని బట్టి రాష్ట్రంలో బీజేపీ, టీడీపీలు మరొకసారి చేతులు కలిపే అవకాశం ఉందనే అభిప్రాయం కలుగుతోంది.
ఈ అనుమానాలకు, వదంతులకు బలం చేకూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా తన బాణీని మార్చారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి తనకు బీజేపీ అవసరమేమీ లేదంటూ ఆయన ఇటీవల ఒక సంచలనాత్మక ప్రకటన చేశారు. ఈ మార్పులు, చేర్పులు సహజంగానే టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రాబోయే శాసనసభ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీని పరాజయంపాలుజేసి, టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలని గట్టిగా కోరుకుంటున్న పార్టీ శ్రేణులకు ఆశాకిరణాలు కనిపిస్తున్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీలు చేతులు కలపడానికి మార్గం సుగమం అవుతోందని, ఈమూడు పార్టీలు కలిసి పోటీ చేస్తేజగన్మోహన్ రెడ్డి పార్టీ అపజయం పొందడం ఖాయమని వారు గట్టిగా నమ్ముతున్నారు. జీవన్మరణ సమస్యగా పోరాడుతున్న జనసేన పార్టీలో కూడా ఇప్పుడు ఉత్సాహం పొంగిపొరలుతోంది. ఈసారి ఎన్నికల్లో తమ పార్టీ బాగా బలం పుంజుకోవడం ఖాయమని వారు భావిస్తున్నారు. 2019 నాటి శాసనసభ ఎన్నికల్లో ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న జనసేనకు ఈసారి ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. టీడీపీ మద్దతు లభించిన పక్షంలో ఈ పార్టీ ఘన విజయం సాధించినా, సాధించకపోయినా, బాగా నిలదొక్కుకోవడానికి మాత్రం అవకాశం కలుగుతుంది.
దీనివల్ల బీజేపీకి ఒరిగేదేమిటి? బీజేపీకి ఇక్కడ ఘన విజయాలు సాధించే అవకాశం లేనే లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ స్థితిలో ఉందో బీజేపీ కూడా దాదాపు అదే స్థితిలో ఉందని చెప్పవచ్చు. విచిత్రమేమిటంటే, ఆ పార్టీ ఎటువైపూ మొగ్గకుండానే పార్లమెంట్‌లో అటు వైసీపీ నుంచి, ఇటు టీడీపీ నుంచి మద్దతు సంపాదించే అవకాశం ఉంది. అయితే, టీడీపీతో చేతులు కలిపే పక్షంలో తమలో కొందరు పార్లమెంట్‌కు, శాసనసభకు గెలిచే అవకాశం ఉందని కొందరు బీజేపీ రాష్ట్ర నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అటువంటిది వైసీపీతో సాధ్యపడే సూచనలు కనిపించడం లేదు. సైద్ధాంతిక విభేదాలు, బీజేపీకి అత్యల్ప ఓట్ల శాతం వంటి కారణాల వల్ల బీజేపీతో వైసీపీ చేతులు కలిపే అవకాశమే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ, ముఖ్యంగా నరేంద్రమోదీ కొన్ని శాసనసభ స్థానాల కోసం వైసీపీని దూరం చేసుకుంటారా అన్నది ఇక్కడ ప్రశ్న. జగన్మోహన్ రెడ్డితో నరేంద్ర మోదీకి సత్సంబంధాలున్నాయి. పైగా, కాంగ్రెస్ పార్టీకి వైసీపీ బద్ధ వైరి. ఒకవేళ 2024 ఎన్నికల్లో టీడీపీకి కొన్ని సీట్లు తగ్గితే ఆ పార్టీకి బీజేపీ మద్దతు ఇస్తుందా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. బీజేపీ ముందు రెండు మూడు అవకాశాలున్నాయి. ఆ పార్టీ తటస్థంగా ఉండే పక్షంలో టీడీపీ నుంచి, వైసీపీ నుంచి కూడా మద్దతు కూడగట్టుకోగలుగుతుంది. ఒకవేళ టీడీపీతో చేతులు కలిపినప్పటికీ వైసీపీ మద్దతు సంపాదించడానికి వీలుంది. ఏం జరిగినా ఆశ్చర్యపోవనవసరం లేదు.
AP politics changing rapidly: ఏపీలో సరికొత్త రాజకీయ మార్పులు
ఏం జరిగినా ఆశ్చర్యపోవనవసరం లేదు