ఇరాన్‌పై అమెరికా దాడి మొదలైన తరువాత చాలా మంది దృష్టి పశ్చిమాసియా వైపు మళ్ళింది. పశ్చిమాసియాలో మత ప్రభుత్వాలే ఉంటాయి, ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎందుకు ఉండ వని ఒక డిగ్రీ కాలేజీ అధ్యాపకుడు కొద్ది రోజుల కిందట అడిగారు. అంటే ముస్లిం దేశాల వారు మత ఛాందసులు, ఆధునిక భావ జాలం వారిలో ఉండదు అనే అభిప్రాయం ఆయనది. డిగ్రీ కళా శాల అధ్యాపకులకే ఇటువంటి అభిప్రాయాలు ఉంటే సాధారణ పత్రికా పాఠకుల సంగతి చెప్పనక్కర లేదు. వాస్తవానికి వారు మత ఛాందసులు కాదు. అక్కడి రాచరికాలు వారు కోరి తెచ్చుకున్నవి కాదు. వారి స్వాతంత్య్ర ఆకాంక్షలను అణచివేస్తున్న సామ్రాజ్య వాద శక్తులే, వారిని ఇతర ప్రపంచానికి మత ఛాందసులుగా చూపిస్తున్నయి. మతాల పేర, తెగల పేర ఉన్మాదాన్ని పెంచి పోషిస్తూ విభజించి పాలిస్తున్నయి.
ప్రపంచం ఆధునిక యుగంలోకి అడుగు పెడుతున్నప్పుడు, అరబ్బు సమాజాలు కూడా ప్రజాస్వామిక ప్రయోగాలు ప్రారం భించినయి. కానీ వనరులను కబళించే ప్రపంచ శాసకులు, అడుగడుగునా వీరిని పడదోస్తూనే ఉన్నరు. ఆటమన్ సామ్రాజ్యంపై తిరగబడితే స్వాతంత్య్ర కాంక్షకు మద్దతు ఇస్తామని అరబ్బులతో నమ్మబలికిన బ్రిటన్ ఆ తరువాత మొండి చెయ్యి చూపింది. యూదులకు, ఇటు అరబ్బు లకు పరస్పర విరుద్ధమమైన హామీలు ఇచ్చి, ఇజ్రా యెల్‌ను ఏర్పాటు చేసి పశ్చిమాసియాను నిత్యం రగిలే అగ్ని గుండంగా మార్చింది బ్రిటన్ అయితే ఇవాళ ఆ కుట్రల వారసత్వాన్ని కొనసాగిస్తున్నది అమెరికా. 1916లో బ్రిటన్, ఫ్రాన్స్ కుదుర్చుకున్న సయిక్స్ – పీకా రహస్య ఒప్పందం ఇందుకు ఉదాహరణ. ఈ ఒప్పందం ప్రకారం కొన్ని ప్రాంతాలు బ్రిటన్ జోన్ లోకి పోతే, ఇతర ప్రాంతాలు ఫ్రాన్స్ జోన్‌లోకి పోయాయి. అరబ్బు ప్రాంతమంతా ఈ రెండు పెద్ద దేశాలు కృత్రిమ సరిహద్దు లను గీసి పెట్టాయి. ఈ సమాజాలలో ప్రజాస్వామ్య ప్రయోగాలను మొగ్గ దశలోనే తుంచివేశాయి. 1920లోనే సిరియాలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏర్ప డింది. సిరియన్ అరబ్బు కాంగ్రెస్ దేశాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థగా ప్రకటించింది. ముస్లిమేతరులు, అల్ప సంఖ్యాక వర్గాలతో సహా రాజ్యాంగం అందరికి సమాన హక్కులను హామీ ఇచ్చింది. అరబ్బు ప్రపంచంలో ఈ పరిణామం కొత్త శకానికి నాంది పలికేదే. కానీ సామ్రాజ్యవాద దేశాలు సహించలేక పోయాయి. ఫ్రాన్స్ సిరియాపై దండయాత్ర చేసింది. మయ్ సలూన్ యుద్ధంలో ఫ్రాన్స్ సిరియా సేనను ఓడించడంతో ఈ ప్రజాస్వామ్య ప్రయోగం విఫలమైంది.
1920లోనే బ్రిటిష్ పాలనపై వచ్చిన ఇరాకీ తిరుగుబాటు అరబ్బుల స్వాతంత్య్ర కాంక్షకు మరో ఉదాహరణ. సున్నీలు, షియాలు, బాగ్దాద్ నగరంలోని ఉన్నత కుటుంబీకులు, యూఫ్రేట్స్ గిరిజన తెగలు మొదలుకొని అన్ని వర్గాల వారు కలసికట్టుగా చేసిన తిరుగుబాటు ఇది. బ్రిటన్ ఈ తిరుగుబాటును అణచి వేసింది. బ్రిటన్, ఫ్రాన్స్ లౌకిక, ప్రజాస్వామిక భావనలు గల వారిని అణచివేస్తూ, మత ఛాందస శక్తులను ప్రోత్సహించాయి. మత ఛాందసత్వం, పరస్పర విద్వేషాలు ఉంటే ప్రజలను విభజించి పాలించడం సులభమనేది వలసవాదులకు తెలిసిందే. ఇప్పటికీ పాశ్చాత్య సామ్రాజ్యవాద శక్తులు పశ్చిమాసియాలో రాచరికా లను, సైనిక నియంతృత్వాలను, మతవాద శక్తులను పెంచి పోషిస్తున్నయి.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పలు మూడవ ప్రపంచ దేశాలు స్వాతంత్య్రం పొందాయి. ఇవి సహజంగానే పెట్టుబడిదారీ వ్యవస్థ పట్ల మొగ్గు చూపలేదు. ఏక పార్టీ విధానం, స్టాలిన్ విధానాల వల్ల కమ్యూనిస్టు వ్యవస్థ పట్ల కూడా భయ సందేహాలు కలిగాయి. దీంతో స్థానిక పరిస్థితులు, చారిత్రక, సామాజిక నేపథ్యాలను బట్టి వివిధ పాలనా వ్యవస్థలు ఏర్పడ్డయి. సామ్య వాదం, లౌకికవాదం దాదాపుగా అన్నింటిలోనూ కనిపిస్తుంది. నెహ్రూ నాయకత్వంలో ఏర్పడిన భారత ప్రజాస్వామ్యమైనా, నాసర్ నాయకత్వంలోని ఈజిప్టు అయినా, గడాఫీ నేతృత్వంలోని లిబియా అయినా, ఇరాక్, సిరియా దేశాలలోని బాతిస్టు ప్రభు త్వాలైనా ఈ కోవలోనివే. తమ వనరులు తమకే చెందాలనే సామ్రా జ్యవాద వ్యతిరేకత ఈ పాలనా వ్యవస్థల ఉమ్మడి స్వభావం. బాతిస్టు ప్రభుత్వాలు కూడా ఏక పార్టీ వ్యవస్థలే. అయితే బయటి ప్రమాదం లేనప్పుడు, ఆయా దేశాల ప్రజలు స్వేచ్ఛగా ప్రజా స్వామ్య వ్యవస్థలోకి ప్రవేశిస్తారు. విపత్కర పరిస్థితులలో ఏక పార్టీ లేదా కేంద్రీయ పాలనను వ్యతిరేకించలేరు. ఏ వ్యవస్థ అయినా అక్కడి పరిస్థితులు, ప్రజల ఇష్టాన్ని బట్టి ఏర్పడాల్సిందే. అన్ని దేశాలలో ప్రజాస్వామ్య పరిణామం ఒకేలా ఉండాలని చెప్పలేం. బ్రిటన్ చేతిలో కీలుబొమ్మగా ఉన్న రాజు ఫారూక్ ను 1952లో కూలదోసి నాసర్ బృందం ఈజిప్టులో అధికారానికి వచ్చింది. నాసర్ బ్రిటిష్- ఫ్రాన్స్ యాజమాన్యంలోని సూయెజ్ కాలువను జాతీయం చేయడం సాహస చర్య. ఆయన భూ సంస్కరణలు చేపట్టారు.
ప్రభుత్వ రంగ పరిశ్రమలను నెలకొల్పారు. ఉచిత విద్య, మహిళలకు రాజకీయ హక్కులు కల్పించారు. నాసర్ తరువాత ఈజిప్టు పాశ్చాత్య అనుకూల శక్తుల చేతిలో చిక్కి పోయింది. లిబియాలో గడాఫీ కూడా నాసర్‌ను స్ఫూర్తిగా తీసు కొని చమురు గనులను జాతీయం చేశారు. పాశ్చాత్య దేశాల సైనిక స్థావరాలను ఎత్తివేయించారు. కానీ ఆ తరువాత నాటో దాడులలో లిబియా కకావికలమైపోయింది. అరబ్బు ప్రాంతంలో వచ్చిన బాతిస్టు ఉద్యమం సమగ్ర సైద్ధాంతిక ప్రాతిపదిక కలిగినది. అరబ్బు జాతీయత, స్థానిక పరిస్థి తులకు అనుగుణమైన సామ్యవాదం, లౌకికత్వం, సామ్రాజ్యవాద వ్యతిరేకత బాతిజం ప్రధాన లక్షణాలు. భూ సంస్కరణలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ఆర్థిక స్వావలంబన ఈ సామ్యవాదం ప్రధాన అంశాలు. కానీ నాటో సైన్యాలు దాడి చేసి సద్దాం ప్రభుత్వాన్ని కూలదోసినయి. సిరియాను అస్థిరత్వం పాలు చేసి కూలదోసి నయి. పైకి ఏ కారణాలు చెప్పినప్పటికీ చమురు గనుల కోసమే అమెరికా, యూరప్ దేశాలు ఈ ప్రభుత్వాలను కూలదోసినయనేది స్పష్టం. సౌదీ అరేబియా, కువైట్ మొదలైన దేశాలలో సామ్రాజ్య వాద శక్తులు రాచరికాలను పెట్టి చమురు గనులను తమ పిడి కిటిలో పెట్టుకున్నయి. అక్కడి ప్రజలను ఘోరంగా అణచివేస్తు న్నయి. సౌదీ రాకుమారుడు మహమ్మద్ బిన్ సల్మాన్ ఇతర దేశాలలో ఉన్న తమ వ్యతిరేకులను ముక్కలుగా నరికి సూట్ కేసులలో తెప్పించుకున్న క్రూరుడు. అయినా అమెరికా మద్దతు అతడికే. అరబ్బు దేశాలలో కాని, ఇటు ఇరాన్‌లో, ఇంకా ఇవతల ఆఫ్ఘనిస్థాన్‌లో కానీ ఎక్కడా మతో న్మాద వ్యవస్థలు అక్కడి ప్రజలు ఏర్పరచుకున్నవి కావు. పాశ్చాత్య దేశాలు అక్కడి వనరులను దోచు కోవడానికి వారిపై రుద్దిన వ్యవస్థలు. బాతిస్టు ప్రభుత్వాలున్న ఇరాక్, సిరియాలలో కానీ, సోవి యెట్ యూనియన్ తమ బలగాలను ఉపసంహరిం చుకున్న తరువాత ఏర్పడిన నజీబుల్లా ప్రభుత్వంలో కానీ మహిళలకు స్వేచ్ఛా సమానత్వాలు కనిపిస్తయి. కానీ సామ్రాజ్యవాద దేశాలు వాటిని కూలదోసి, మతోన్మాద శక్తులను ప్రోత్సహించాయి. ఇరాన్‌లో కూడా అమెరికా అనుకూల షా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు వచ్చినప్పుడు, అమెరికా, ఖొమేనీ నాయకత్వంలోని మతవాదులకు అనుకూలంగా వ్యవహరించి, ప్రజాస్వామిక శక్తులను అణచివేసింది. కానీ ఖొమేనీ కూడా చమురు గనులను పాశ్చాత్య కంపెనీలకు అప్పగించలేదు. అరబ్బు ప్రజలు స్వాతంత్య్ర ప్రియులు, ప్రగతిశీల స్వభావం కలవారు. కానీ వారి అభీష్టంతో నిమిత్తం లేకుండా నిరంకుశ పాలనలో మగ్గుతున్న దీనులు. ఒక్క అరబ్బు దేశాల్లోనే కాదు, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో కూడా ఇదే విషాద పరిస్థితి. లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య వ్యవస్థలను కూలదోసి మతో న్మాద శక్తులను, రాచరికాలను, సైనిక ప్రభుత్వాలను నెలకొల్పడం ఆంగ్లో- అమెరికన్ సామ్రాజ్య శక్తుల కుట్ర. పశ్చిమాసియాలోనూ ఇదే కుట్ర సాగుతున్నది.
పరాంకుశం వేణుగోపాలస్వామి
సీనియర్ జర్నలిస్ట్

