ఆరుద్ర అనే పేరు గుర్తుకు వస్తే వెంటనే స్ఫురించేది ఆయన సాహిత్య సృష్టి, రచన, పరిశోధన, విమర్శ, సునిశిత పరిశీలన వంటి లక్షణాలన్నీ కలబోస్తే ఒక మహోన్నత సాహితీవేత్త అవుతారు. ఆరుద్ర అటువంటి సాహితీవేత్త. 1925లో పుట్టి 1998లో కాలధర్మం చెందిన భాగవతుల సదాశివ శంకర శాస్త్రి తన స్వస్థలమైన యలమంచిలిలో జీవితాన్ని ప్రారంభించి, స్వయంకృషి, అపార గ్రంథ పఠనాసక్తితో ఓ పరిశోధక సాహితీవేత్తగా ఎదిగి తెలుగు సాహితీ వనంలో చెరగని ముద్ర వేశారు. కథలు, నవలలు, వ్యాసాలు, విమర్శలు, సినిమా పాటలు, సినిమా సంభాషణలు, పరిశోధనలలో ఆయన అంచుల వరకూ వెళ్లారు. ఆంధ్ర సాహిత్య చరిత్ర, రజాకార్ల ఆగడాలు, దుండగాలపై రాసిన త్వమేవాహం, రాముడికి సీత ఏమవుతుంది వంటి పరిశోధనాత్మక రచనలు సాహితీ రంగంలో కొన్ని దశాబ్దాల పాటు సంచలనాలు సృష్టించడమే కాకుండా, చర్చోపచర్చలయ్యాయి. దాదాపు ప్రతి పరిశోధకుడి మీదా, ప్రతి సాహిత్యాభిలాషి మీదా ఆయన ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ఆయన శిష్యులు, విద్యార్థులు, అనుయాయులు వేల సంఖ్యలో ఉంటారంటే ఆశ్చర్యపోనక్కర లేదు.
కమ్యూనిస్టు భావజాలాన్ని మనసు నిండి నింపుకున్న ఆరుద్ర ఆజన్మాంతం హేతువాది. ఏ అంశాన్నయినా తార్కిక దృష్టితో పరిశీలించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎవరు తన దగ్గరకు వచ్చినా చిన్నా పెద్దా, బీదా, సంపన్న, ఆడా, మగా తేడా లేకుండా అందరితోనూ ఒకే విధంగా వ్యవహరించేవారు, సంభాషించేవారు. అందరికీ తన విజ్ఞానాన్ని పంచేవారు. ఇతరుల నుంచి వీలైనంతగా విద్యను, జ్ఞానాన్ని రాబట్టే వారు. నిజానికి ఆయనతో మాట్లాడడమే చదువు, విజ్ఞానం. ఆయన సతీమణి కె. రామలక్ష్మి కూడా ఆయనతో సమానమైన సాహితీవేత్త, భావ సారూప్యత గల దంపతులు. కథలు రాసినా, నాటికలు రాసినా, విమర్శలు రాసినా, వ్యాసాలు రాసినా రామలక్ష్మి ముద్ర ప్రత్యేకంగా ఉండేది. ఇద్దరికీ భేషజాలు ఉండేవి కాదు. ఆప్యాయత తప్పితే మరో లక్షణం వారిలో అరుదుగా కూడా కనిపించేది కాదు. ఆతిథ్యం ఇవ్వడంలో ఆమెకు ఆమే సాటి. చెన్నైలోని వారి పాండీబజార్ నివాసంలో పోచీకోలు కబుర్లకు, అనవసర ముచ్చట్లకు తావు లేదు. తెలిసో తెలియకో ఎవరైనా అటువంటి కబుర్లు మొదలుపెట్టినా సున్నితంగా మాట తప్పించేవారు.
వాస్తవానికి పామరులే కాదు, ఉద్దండులైన పండితులు వెళ్లినా ఆరుద్ర చెప్పేవి వింటూ పోవడమే తప్ప ఇతరులు మాట్లాడడానికి ఏమీ ఉండేది కాదు. మనకు తెలిసినదాని కంటే అనేక వందల రెట్లు ఆయనకు తెలుసనే సంగతి క్షణాల్లో అర్థమైపోతుంది. ఒక జర్నలిస్టుగా నేను ఆయనను అనేక పర్యాయాలు కలిసే అదృష్టం కలిగింది. ఆయన ముందు మనం మరుగుజ్జులం అనే నగ్నసత్యాన్ని నేనేనాడు మరచిపోలేదు. అయినప్పటికీ వృత్తిలో గానీ, చిన్న చితకా గ్రంథ పఠనంలో గానీ నాకు కలిగిన ధర్మ సందేహాలను ఆయన ద్వారా నివృత్తి చేసుకునే వాడిని. సానుకూల (పాజిటివ్) దృక్పథానికి ఆయన నిలువెత్తు ప్రతి రూపం. ప్రతిదీ ఆయనకు పాజిటివ్ గానే కనిపిస్తుంది. వెధవ, చవట వంటి మాటలు కూడా ఆయన నోటి నుంచి వచ్చేవి కావు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు. నవ్వుతూనే తన అభిప్రాయాన్ని తెలియజేసేవారు. నవ్వుతూనే మనకు వివరంగా అసలు విషయం తెలియజేసేవారు. ఎన్ని అంశాల మీద, ఎన్ని దురభిప్రాయాల మీద, ఎన్ని అపభ్రంశాల మీద ఆయన నాకు కనువిప్పు కలిగించారో, జ్ఞానోదయం కలిగించారో మాటల్లో చెప్పలేం. మనలో ఎటువంటి విచారం ఉన్నా ఆయన దగ్గరికి వెడితే మటుమాయం అయిపోవాల్సిందే. ఆయన శ్రీమతిది కూడా అదే ధోరణి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదేనేమో!
సాధారణంగా పల్లెటూళ్లల్లో బామ్మలు, అమ్మమ్మలు తమ పిల్లలను ‘కుంకా’ అని ముద్దు ముద్దుగా తిడుతుండడం మనమందరమూ విన్న విషయమే. ఒకసారి ఆరుద్రని అడిగాను ‘కుంకా’ అంటే ఏమిటని. ‘బాల వితంతువు’ అని ఆయన సమాధానం ఇచ్చేసరికి నేను నిజంగా నిర్ఘాంతపోయాను. అప్పట్లో చిన్న పిల్లలకే పెళ్లిళ్లు చేసేవారు కదా. చిన్నప్పుడే భర్త పోయేసరికి, మళ్లీ పెళ్లి చేయకుండా ఆడపిల్లల్ని ఇంట్లోనే ఉంచేసేవాళ్లు. అటువంటి బాల వితంతులను ‘కుంకా’ అని అనేవాళ్లు. ఆ మాట విని నాకు చాలా బాధేసింది. అలాగే, ఒకసారి నేను ఆయనను ‘తస్సదియ్యా’ అనే మాటకు అర్థమేమిటని అడిగాను. ‘తోలుతియ్య’ అని అర్థం అని ఆయన చెప్పారు. ‘తస్సా’ అంటే ‘తోలు’ అని అర్థంట. ‘దుంప తెగ’ అంటే ‘నీ పసుపు కొమ్ము (తాళి) తెగ’ అని ఆయన అర్థం చెప్పారు. ఇలా అనేక తిట్లకు ఆయన అర్థం చెప్పేవారు. కమ్యూనిస్టు భావజాలం, హేతువాదం వంటివి ఆయన ప్రధాన లక్షణాలయినప్పటికీ, ఆయన పురాణాలు, ఇతిహాసాలన్నీ చదివి, వాటి అసలు అర్థం విడమరచి చెప్పేవారు.
రామలక్ష్మి కూడా కల్మషం లేని వ్యక్తి. భోళా మనిషి. సమాజం పట్ల, ప్రజల మనస్తత్వాలు, తీరు తెన్నుల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. సామాజిక స్పృహ కలిగిన రచయిత్రి. స్త్రీవాది. ఆమె రాసిన కథలు అటు సమాజానికి, ఇటు మహిళలకు ఏదో ఒక సందేశాన్ని చెప్పకనే చెప్పేవి. ఆప్యాయతకు ఆమె మారు పేరు. భార్యా భర్తలిద్దరూ ఒకరికొకరు సరిపోయారనిపిస్తుంది. ప్రతి మార్పునూ, ప్రతి సంస్కరణనూ తన కుటుంబం నుంచే, తన ఇంటి నుంచే ప్రారంభించి, తన ముగ్గురు కుమార్తెలకూ అదే విధంగా వివాహాలు జరిపించిన ఘనత ఆమెకే దక్కుతుంది. అరుదైన అన్యోన్య దంపతులు.