Saturday, September 21, 2024
Homeఓపన్ పేజ్Asha Raju: కవితా వర్ణాల ఏరువాక

Asha Raju: కవితా వర్ణాల ఏరువాక

'హైదరాబాద్‌ గాలిబ్‌' కు కవిత్వం రాయడం తప్ప ఇంకోటి తెలీదు

నా మాతృభాష ఒక ఆయుధం/అది నేను గెల వడానికి గొప్ప ధైర్యం /నేను నడవడానికి ఒక అధ్బుతదీపం, నా మాతృభాష ఒక ఊపిరి/అది సమస్త కళలకు రంగులేస్తుంది/అన్నీ కళలకు రూపమిస్తుంది అని తల్లీ దీవించు అన్న తన కవితా ద్వారా ఆశారాజు రంగు వెలిసిపోతున్న సమాజపు వికృత దృశ్యానికి కళ తెచ్చే కవితా వాక్యాలు అందిస్తున్నాడు. తెలుగు జాతి అస్తిత్వానికే ముప్పు ఎదురయ్యే సన్నివేశాలు మన కళ్ల ముందే తారాడుతున్న సందర్భంలో అదే ప్రపంచీకరణ దాడి నేపథ్యంలో మాతృ వందనం లాంటి ఓ కవితా స్పందన ఇది.
ఇంతకీ ఈ ఆశారాజు ఎవరు. ఇరవై ఒక్క కవితా సంపుటాలు వెలువరించిన కవి అని గాని, రెండు పదుల దాక పురస్కారాలు అందుకున్న కవి అని గాని, ముఖ్యంగా హైదరాబాదీ అని, ‘హైదరాబాద్‌ గాలిబ్‌’ అని అందరిచే ప్రచారం గావించబడ్డ కవి అని గాని నేనిక్కడ చెప్పడం లేదు. ఆయన కవి హృదయపు రూప చిత్రాన్ని అందిస్తున్నాను. నమ్మినా నమ్మకపోయినా/ మనిషి బొమ్మున్న గుర్తు /ఒక పుస్తకం చూపిస్తాను, వాళ్లు బొమ్మనూ గుర్తు పట్టరు/ఇంకా ఆశారాజును / ఏమి గుర్తుపడతారు- ఇదిగో ఇదీ ఆశారాజు రూప చిత్రం. ఓ ధ్వని రూపం, ఓ రూప ధ్వనితో చెక్కిన కవితా శిల్పం. మనుషులంటే ఎంత ప్రేమో, ఎంతగానో ప్రేమిస్తాడో, మామూలుగా చెప్పలేని, మళ్ళీ కవిత ద్వారానే చెప్పగలిగే వ్యక్తిత్వం అది. అలాగే కవిత్వానికి పదునూ, లక్ష్యం, సౌందర్యం, మనిషి లాంటి హృదయం సంతరించు కునేలా నలిగిపోయిన’ కవి రూప చిత్రాన్ని కూడా అందిస్తున్నాను.
మన సమాజంలో కవిత్వం రాయడం, వాటిని పుస్తకాలుగా స్వంతంగా అచ్చువేయడం అన్నవి, అదే కాకుండా కవిగా నిలదొక్కుకోవడం అన్నవి అన్నీ ఓ తపోవనానికి సంబంధించిన వ్యవహారాలే. ఆ వనం ఆ కవి గృహంలోని కుటుంబ సభ్యుల తోడ్పాటు ఎంతైనా పరిగణించబడినది మరియూ ఎన్నదగినదీ కూడా వాళ్ళ సహకారం కూడా కవి తపస్సుతో సమానమైనదే.
సూర్యుని ముఖం మీద /చెదిరిపోయిన జుట్టు పడుతున్నట్టు /చెట్టు అడ్డమొచ్చింది. రన్నింగ్‌ బస్‌ ఎక్కబోయి /టిఫిన్‌ బాక్స్‌ పారేసుకొన్న/ ఉద్యోగి పచ్చడి మెతుకుల్లా/కిరణాల రంగు మెరిసి/మెట్ల మీద వొలికింది ఇలా ఈయన కవితా వర్ణాల ఏరువాక సాగిస్తున్నాడు. కవి లేక కవిత చుట్టూ దీప్తి చక్రం వెలుగుతూ ఉంటుంది. ద్వీపం లాంటి వాళ్ళు కవులు కళాకారులు. తాము తచ్చాడిన చోటు ముచ్చట్లే ఎక్కువగా చోటు చేసుకుంటాయి కవితల్లో. అవే గుణవిశేషంగా విశ్వజనీనమవుతాయి.
ఈ కవితా సంపుటి 107 కవితల సమాహారం. కవిత్వం రాయడం తప్ప ఇంకోటి తెలీదు అని చెప్పుకుంటున్నారు ఈ కవి. నిజానికి కవితా కళ జీవితాలకి ముడి ఖనిజం లాంటిది. కానీ ఖనిజాలతో తయారైన ఉత్పత్తులు ఈ మార్కెట్‌ సమాజంలో చలామణి అవుతున్నాయి గాని కవిత్వం, కవులూ ఒంటరి వాళ్లైపోతున్నారు. గతుకులు తేలిన కాలంలో బాట తప్పిన జీవితం గురించి కొన్ని కవితా పంక్తులు అందించబడ్డాయి. ఎదుటివాళ్లను / పలకరించాలనుకుంటే పలకరించు!/వాళ్ళు బదులు పలుకుతారని ఆశించకు, నీకు ఫోన్‌ చేయాలనిపిస్తే ఫోన్‌ చేయు /వాళ్ళ కాల్‌ కోసం ఎదురు చూడకు!- ఇలా సరళ సరళ వ్యక్తీరణలతో ఓ కొత్త తాత్వికతా కోణాన్ని అనువదించుకోవాలని, ఆవిష్కరించుకోవాలని అవగతమవుతుంది ఇక్కడ. కాళ్ళు విరిగిన చినుకులను చూశాను ఎవరన్నా పలకరిస్తే /నదులు అక్కర్లేదు, కత్తిమీద యెండిపోయిన నెత్తురు చుక్కలు /వాడిపోయిన పూల వాసన వేస్తున్నాయి ఇలా విస్మయం, ఆశ్చర్యం , విషాదం మొదలైన కవితా మంత్రజాలం మానసిక స్వస్థతని చేకూరిస్తూ ఉంటుంది. గుండె రెక్కలు విహరిస్తూ ఉంటాయి.
కవిత్వ రంగపు ఉనికి వెనక పీటీలో ఉన్నా, కవితా సాధనలో ఉన్నవాళ్ళు కోకల్లలు. అయితే నిఖ్సాన కవిత్వం ఎదురయ్యేది ఏ మూలనో, ఏ చోటునో. కవితా సాధకుల ఉబలాటం తమ కవితలు ఎదుటి వాళ్ళు చదవాలని, వినాలని. అది కవికి స్వాభావికం. ఇలాంటి సందర్భాల్లో ఈ కవితా సాధకులెవరైనా, ఆశారాజు గారిని కలిసి సంభాషిస్తే వాళ్ళ దాహం తీరుతుంది. ఎందుకంటే ఆశా రాజు గారిని వ్యక్తిగతంగా ముఖాముఖీ కలిసినపుడు పరస్పర కవితాంతరంగం వినగల్గుతాము. దేవాలయ దరిదాపుల ధూప దీపా పరిమళం లాంటిది కవిత్వం అని, ఆ పరిమళానికి ముగ్ధుడైనాడని ఆయన చెబుతుంటారు.
కళ్ళు తయారు చేయడం/కాళ్ళూ చేతులు అతికించడం /గుండెను గట్టిపరచడం/గిటారు వాయించడం /సితారు తీగలు సరిచేయడం /దగ్గరుండి నేర్పింది- వింటున్నారా ఈ కవితా కళ తనకి ఏమి నేర్పిందో. ఎన్నెన్నో పోకడలు కవితా రంగంలో నాట్యం చేశాయి. అలాగే ఎన్నెన్నో పోకడలు బయలుదేరుతాయి ప్రతీ రంగంలో. శ్రేష్టమూ, సాఫల్యమూ అయినది ఏదైతే అది స్వీకరించదగ్గది. సంవేదనల సమాహారమైన కవిత్వం, సాధనలో, సాలోచనతో సాగి సిసలైన ముక్తి ద్వారాన్ని చూపించాలి, శాంతి వనాలని నాటాలి.
-ఒబ్బిని
9849558842

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News