ప్రాథమిక విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాలలో కీలక పాత్ర నిర్వహిస్తున్న అంగన్వాడీ, ఆశా వర్కర్లకు తీరని అన్యాయం జరుగుతోంది. దాదాపు ప్రతి ప్రభుత్వమూ వారిని నిర్లక్ష్యం చేయడం జరుగుతోంది. ఈ రెండు వర్గాలు గ్రామీణ ప్రాంతాలలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న వర్గాలని చెప్పవచ్చు. సుమారు లక్షన్నర మంది అంగన్వాడి, 50 వేల మంది ఆశా వర్కర్లు ఆంధ్రప్రదేశ్‌లో చాలా నెలలుగా జీతాలు పొందకపోవడమో, సరైన జీతాలు ఇవ్వకపోవడమో జరుగుతోంది.నిజానికి ఆశా వర్కర్లకు వారి పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాల్సి ఉంది. అవి కూడా అందజేయకపోవడంతో వారి అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ రెండు వర్గాల సమస్యలు జిల్లాలవారీగా మారవచ్చు. కానీ, ప్రాథమికంగా వారికి సేవలకు తగ్గట్టుగా ప్రతిఫలం మాత్రం దక్కడం లేదన్నది వాస్తవం. ప్రభుత్వాలు వారికి ఏదో విధంగా సమస్యలు సృష్టించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక పర్యాయాలు వారికి జీతాలు చెల్లించకపోవడం జరుగుతూనే ఉంది.
ప్రతిసారీ ప్రభుత్వం ఆర్థిక సమస్యలను నెపంగా చూపిస్తూ వస్తోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలున్నప్పటికీ ఏ అధికారికీ జీతభత్యాలు ఆపకపోవడం గమనార్హం. మధ్యలో కేంద్ర ప్రభుత్వం మీద కూడానిందలు వేయడం జరుగుతుంటుంది. ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని చక్కదిద్దుతున్నామంటూ కేంద్రం చెబుతూ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు విమర్శలు సాగిస్తుంటారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లు చేసే సేవల మూల్యం కంటే వారికి చెల్లించేది అత్యల్పం. విచిత్రమేమిటంటే, ఎక్కువ మంది అంగన్వాడీ టీచర్లు విద్యార్థుల కోసం సొంత డబ్బుతో గుడ్లు కొంటూ ఉంటారని, ఒక్కోసారి అంగన్వాడీ భవనాల అద్దెను కూడా వారే చెల్లిస్తూ ఉంటారని కూడా ఫిర్యాదులున్నాయి. కుళ్లిన కోడి గుడ్లు సరఫరా చేసినప్పుడు పిల్లల కోసం మంచి గుడ్లను వారే కొనాల్సి ఉంటుంది. సకాలంలో నిధులు రానప్పుడు వారే తాము పనిచేస్తున్న అంగన్వాడీ భవనాలకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి వారు ప్రభుత్వ ఉద్యోగులేమీ కారు. వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలేమీ చెల్లించడం లేదు. అయినప్పటికీ ఉన్నత స్థాయిలో చోటు చేసుకునే వైఫల్యాలకు వారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మొత్తం మీద అంగన్వాడీ, ఆశావర్కర్ల పట్ల ఉన్న నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి ప్రభుత్వ వర్గాలలో ఏదో విధంగా వ్యక్తం అవుతూ ఉంటుంది. వీరి ప్రాధాన్యాన్ని ప్రభుత్వ అధికారులు కూడా గుర్తించకపోవడం శోచనీయం.
వీరికి చెల్లిస్తున్న జీతభత్యాల మొత్తం సగటున పదివేల రూపాయలు కూడాఉండకపోవచ్చు. ఇదికుటుంబ పోషణకు, కుటుంబ నిర్వహణకు ఏమాత్రం సరిపోదన్న విషయం తెలిసిందే. ఆశా వర్కర్ల పనితీరు కోవిడ్ మహమ్మారి సమయంలో స్పష్టంగా విదితమైంది. అనేక సందర్భాలలో వీరు రాత్రనక, పగలనక ప్రజలకు చేసే సేవలు విలువ కట్టలేనివి. అటువంటి ఆశా సేవకులకు కనీస గుర్తింపునకు కూడా నోచుకోకపోవడమే కాకుండా, తరచూ అవమానాలకు గురవుతుండడం, వారి సేవలకు సరైన ప్రతిఫలం ఉండకపోవడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కర్ణాటక శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తూ, కాంగ్రెస్ గనుక అధికారంలోకి వస్తే అంగన్వాడీ, ఆశా వర్కర్ల జీతభత్యాలను పెంచడం జరుగుతుందని, వారికి పింఛన్ కూడా చెల్లించడం జరుగుతుందని వాగ్దానం చేశారు. ఈవిధంగా వీరిని ఎన్నికలకు కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంటుంది. ఒక్క కాంగ్రెస్ మాత్రమే కాదు, ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ప్రతి రాజకీయ పార్టీ ఈ విధంగా వాగ్దానాలు చేస్తూనే ఉంది. పార్టీలు, ప్రభుత్వాలు ఇప్పటికైనా వీరి సేవలను సరైన విధంగా గుర్తించి, వీరికి చేసిన, చేస్తున్న వాగ్దానాలను నెరవేర్చాల్సి ఉంది. ఎన్నికలు సమీపిస్తున్నందు వల్ల అందుకు ఇది సరైన సమయం అనడంలో సందేహం లేదు.
Asha Workers: ఆశా వర్కర్లకు తీరని అన్యాయం
ప్రాథమికంగా వారికి సేవలకు తగ్గట్టుగా ప్రతిఫలం మాత్రం దక్కడం లేదన్నది వాస్తవం