Sunday, December 8, 2024
Homeఓపన్ పేజ్Athishi the new CM: కేజ్రీవాల్‌ వినూత్న ఎన్నికల పాచిక

Athishi the new CM: కేజ్రీవాల్‌ వినూత్న ఎన్నికల పాచిక

రాజకీయ విజయంగా మార్చుకునే ప్రయత్నంలో..

మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కు బెయిల్‌ లభించే అవకాశం ఉందని అందరూ ఊహించిన విషయమే. అయితే, ఆయన రాజీనామాకు సిద్ధపడడం మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మనీ లాండరింగ్‌ కేసులో ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, ఎమ్మెల్వీ కల్వకుంట్ల కవిత తదితరులకు సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ కు కూడా రేపో మాపో బెయిల్‌ రావడం ఖాయమని చాలామందికి అర్థమైపోయింది. బెయిల్‌ మీద బయటికి వచ్చిన వెంటనే కేజ్రీవాల్‌ తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించి పార్టీ నాయకులను సైతం దిగ్భ్రాంతికి గురి చేశారు. కొంచెం ముందుగా నవంబర్‌ లోనే ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలని ఆయన ప్రధాన ఎన్నికల కమిషన్‌ ను అభ్యర్థించారు. ప్రజలు మళ్లీ తనను ఎన్నుకుంటేనే తాను గద్దెనెక్కుతానని ఆయన ప్రకటించారు.
ఇదంతా ఆయనకు చాలవరకు రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. తనపై సి.బి.ఐ దాఖలు చేసిన మద్యం కేసును ఆయన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయ స్థానం తనపై విధించిన కఠిన నిబంధనలకు కూడా ఇది సరైన సమాధానమని ఆయన భావిస్తున్నట్టు కనిపిస్తోంది. సుప్రీంకోర్టు విధించిన బెయిల్‌ నిబంధనల ప్రకారం ఆయన తన ముఖ్యమంత్రి కార్యాలయంలో అడుగుపెట్టడానికి వీల్లేదు. కొన్ని ఫైళ్ల మీద మాత్రమే సంతకాలు చేయాలి. ఏతావతా ఆయన పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా వ్యవహరించడానికి అవకాశం లేదు. ముఖ్యమంత్రిగా తన విధులు తాను నిర్వర్తించడానికి ఈ నిబంధనలు, షరతులు అడ్డు వస్తున్నాయి. బెయిల్‌ నే కాక, ఈ నిబంధనలను కూడా ఆయన ప్రజల ముందు పెట్టదలచుకున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించినంత మాత్రాన ఆయన ఈ కేసులో గెలిచినట్టవుతుందా? న్యాయస్థానం ఇచ్చే తుది తీర్పు మీదే అంతా ఆధారపడి ఉంటుందా? ఈ ప్రశ్నలకు రాజకీయ పార్టీలు సమాధానాలు వెతికే పనిలో ఉన్నాయి.
నిజానికి, ఆయనకు బెయిల్‌ ఇవ్వడమనేది ఆయనకు సంబంధించిన వ్యవహారం కాదు. సుప్రీం కోర్టు ఈ బెయిల్‌ నెపంతో సి.బి.ఐ పనితీరును శంకించడం జరిగింది. సి.బి.ఐ సమర్థతకు సుప్రీం కోర్టు ఈ రూపేణా చురకలు వేసింది. ఒకపక్క దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో దీర్ఘకాలం ఒక వ్యక్తిని జైల్లో ఉంచడం అనేది అతని ప్రాథమిక హక్కులను హరించడమే అవుతుందని సుప్రీంకోర్టు ఇదివరకే స్పష్టం చేసింది. దర్యాప్తు పూర్తి కావడానికి ఇంకా చాలా కాలం పట్టే అవకాశం ఉందని అర్థమైపోయినప్పుడు సదరు వ్యక్తిని బెయిల్‌ మీద విడుదల చేయడమే న్యాయం అవుతుందని కూడా సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. దర్యాప్తును సాగదీస్తూ, బెయిల్‌ వచ్చే వరకూ జైలులోనే కొనసాగిస్తూ ఉండడమనేది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21కు విరుద్ధమని, బెయిల్‌ ఇవ్వకుండా జైలులోనే ఉంచడాన్ని శిక్షగా పరిగణించరాదని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. బెయిల్‌ విషయంలో ఈ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు సి.బి.ఐ పనితీరును నిలదీసింది. కేజ్రీవాల్‌ను విడుదల చేసే విషయమై సి.బి.ఐని గట్టిగా ప్రశ్నించింది.
ఆయన అరెస్టును జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రశ్నించలేదు కానీ, జస్టిస్‌ భూయాన్‌ మాత్రం 2013లో సుప్రీం కోర్టు సి.బి.ఐ మీద చేసిన వ్యాఖ్యలనే మళ్లీ ఉటంకించారు. సి.బి.ఐ పంజరంలో చిలుక మాదిరి వ్యవహరించకూడదని, దాని దర్యాప్తులో ఎక్కడా పక్షపాత ధోరణి కనిపించకూడదని వ్యాఖ్యానించారు. మనీ లాండరింగ్‌ కేసులో విడుదల కాబోతున్న కేజ్రీవాల్‌ను సి.బి.ఐ మరో కారణంపై వెంటనే అరెస్టు చేయడం సందేహాస్పదంగా, ఆయన విడుదలను అడ్డుకోవడమే పరమావధిగా కనిపించిందని భూయాన్‌ తప్పుబట్టారు. మొత్తం మీద కేజ్రీవాల్‌ కు న్యాయపరంగా కొద్దిపాటి విజయం లభించినట్టయింది. దీన్ని ఆయన రాజకీయ విజయంగా కూడా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News