Sunday, December 8, 2024
Homeఓపన్ పేజ్ఢిల్లీలో కేజ్రీవాల్ గేమ్ ప్లాన్ ప‌నిచేసేనా?

ఢిల్లీలో కేజ్రీవాల్ గేమ్ ప్లాన్ ప‌నిచేసేనా?

ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు కేజ్రీవాల్ వ్యూహం..

“దిల్లీకి ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన పేరు అరవింద్ కేజ్రీవాల్,” అని కొత్త ముఖ్యమంత్రి ఆతిషి మ‌ర్లీనా ఇటీవ‌ల ప్రకటించారు. కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన 48 గంటల త‌ర్వాత‌ ఈ గంభీరమైన మాటలు వినిపించాయి. దాదాపు ద‌శాబ్ద కాలం నుంచి ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా ఉన్న కేజ్రీవాల్‌.. జైలు నుంచి బెయిల్ మీద విడుద‌లై బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత త‌న రాజీనామాను ప్ర‌క‌టించారు. ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో ఇరుక్కున్న త‌ర్వాత తాను స‌చ్ఛీలుడిన‌ని ప్ర‌క‌టించుకోవ‌డానికి, ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి.. వారి విశ్వాసాన్ని పొంది, త‌న‌పై ఎలాంటి మ‌ర‌క‌లు లేవ‌ని చూపించుకుని మ‌రోసారి ముఖ్య‌మంత్రిగా ఎన్నిక‌వ్వాల‌న్న‌ది ఆయ‌న గేమ్ ప్లాన్‌లా క‌నిపిస్తోంది. అవినీతి ఆరోప‌ణ‌ల‌తో జైలుకు వెళ్లాల్సి రావ‌డంతో ఆయ‌న ఆతిషి మ‌ర్లీనాను త‌న వార‌సురాలిగా, ఢిల్లీ త‌దుప‌రి ముఖ్య‌మంత్రిగా ప్ర‌క‌టించారు. అయితే.. ఆతిషికి మాత్రం త‌న ప‌ద‌వి విష‌యంలో పూర్తి స్ప‌ష్ట‌త క‌నిపిస్తోంది. త‌న‌ను కేవ‌లం తాత్కాలికంగానే కుర్చీలో కూర్చోబెట్టారు త‌ప్ప‌, ఆమ్ ఆద్మీ పార్టీ మ‌ళ్లీ గెలిస్తే ఢిల్లీ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టేది క‌చ్చితంగా అర‌వింద్ కేజ్రీవాలేన‌ని ఆమెకు స్ప‌ష్టంగా తెలుసు.

- Advertisement -

ఢిల్లీలో ఉన్న 70 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎన్నిక‌లు 2025 ఫిబ్ర‌వ‌రిలోగా జ‌ర‌గాల్సి ఉంటుంది. అయితే, వీలైనంత వ‌ర‌కు ఒక‌టి లేదా రెండు నెల‌ల స‌మ‌యం తీసుకుని ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌న్న‌ది కేజ్రీవాల్ యోచ‌న‌లా క‌నిపిస్తోంది. కేజ్రీవాల్ ఇప్పుడు చేసిన రాజీనామా అనేది మాత్రం “రాజకీయ ఆయుధం” అనే చాలామంది చెబుతున్నారు. దీనిద్వారా త‌న నైతిక‌త‌ను నిరూపించుకోవాల‌న్న‌ది ఆయ‌న ప్ర‌య‌త్నంలా క‌నిపిస్తోంది. అయితే, అస‌లు కేజ్రీవాల్.. ఆయ‌న మిత్ర‌బృందం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా, మ‌ద్యం కుంభ‌క‌ణం, దానికి సంబంధించిన అవినీతి ఆరోప‌ణ‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం అంత సుల‌భం అయ్యేలా క‌నిపించ‌డంలేదు. ఇంత‌కుముందు కూడా ఒక‌సారి ఆయ‌న ఇలాగే రాజీనామా చేసి తిరిగి భారీ మెజారిటీతో గెలిచినా, అప్ప‌టి ప‌రిస్థితులు, ఇప్ప‌టి ప‌రిస్థితులు వేరు. న‌వంబ‌ర్‌లోనే ఉన్న మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల‌తో పాటే ఢిల్లీ ఎన్నిక‌లు కూడా నిర్వ‌హించాల‌ని కేజ్రీవాల్ కోరుతున్నారు. అయితే ఎన్నిక‌ల సంఘం మాత్రం ఆయ‌న డిమాండును అంగీక‌రించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

“ఇది చాలా బాధాక‌ర‌మైన ప‌రిస్థితి. బీజేపీ కుట్రల కారణంగా మ‌న ప్రియమైన ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ రోజు రాజీనామా చేయవలసి వచ్చింది” అని ఆప్ సమావేశం ముగిసిన త‌ర్వాత ఆతిషి అన్నారు. ఢిల్లీకి దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత మూడో మ‌హిళా ముఖ్య‌మంత్రి వ‌చ్చారు. కాంగ్రెస్‌ నాయ‌కురాలు షీలా దీక్షిత్‌ను కేజ్రీవాల్ ఓడించి ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా ద‌శాబ్ద కాలం పాటు అధికారాన్ని అనుభ‌వించారు. త‌న‌కు అంత‌గా ప్రాధాన్యం లేన‌ట్లుగానే ఆతిషి చెప్పుకొంటున్నా.. ప్ర‌స్తుతానికి మాత్రం ఆమె ముఖ్య‌మంత్రి కుర్చీలోనే ఉన్నారు. ప్ర‌స్తుతానికి ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు లేక‌పోవ‌డంతో హ‌రియాణా, ఢిల్లీ ఎన్నిక‌ల్లో పాల్గొనేందుకు, ప్ర‌చారం చేసుకునేందుకు త‌గినంత స‌మ‌యం ఆయ‌న‌కు ద‌క్కుతుంది. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చేట‌ప్పుడు సుప్రీంకోర్టు విధించిన ష‌ర‌తుల ప్ర‌కారం, ఆయ‌న ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి వెళ్ల‌కూడ‌దు, ముఖ్య‌మైన ఫైళ్ల మీద సంత‌కాలు కూడా చేయ‌కూడ‌దు. సెప్టెంబ‌ర్ 13న బెయిల్ మీద కేజ్రీవాల్ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు.. ఆయ‌న నామ‌మాత్ర ముఖ్య‌మంత్రిగానే ఉంటార‌ని బీజేపీ నాయ‌కులు వ్యాఖ్యానించారు. కానీ, రెండు రోజుల త‌ర్వాత‌.. కేజ్రీవాల్ త‌న అమ్ముల పొదిలోంచి రాజీనామా అస్త్రం బ‌య‌ట‌కు తీశారు. ఆయ‌న త‌న “అగ్నిపరిక్ష” గురించి మాట్లాడారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి త‌న నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాన‌ని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి కూడా ఎన్నిక‌ల్లో విజ‌యం ల‌భిస్తే.. అప్పుడు కేజ్రీవాల్‌తో స‌హా ఇత‌ర నాయ‌కులు అంద‌రూ కూడా మ‌ద్యం కేసులో సుద్ద‌పూస‌ల‌ని నిరూప‌ణ అయిన‌ట్ల‌వుతుంది. అప్పుడు కోర్టు కేసులేవీ కేజ్రీవాల్‌ను గానీ, ఆయ‌న‌తోపాటు మ‌ద్యం కేసులో ఉన్న ఇత‌ర మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌ను గానీ ఏమీ చేయ‌లేవు. అంటే, రాజ‌కీయంగా అవి పెద్ద ప్ర‌మాద‌క‌రంగా ప‌రిణ‌మించ‌వు.

“అరవింద్‌జీ పార్టీపై దృష్టి పెట్టి, హ‌రియాణా లాంటి రాష్ట్రాల‌కు వెళ్లి పార్టీని బలోపేతం చేస్తారు. ఆతిషీజీ ప్రభుత్వ సేవల విష‌యంలో ఎలాంటి అంతరాయం రాకుండా చూసుకుంటారు” అని ఆప్ నాయకుడు ఒకరు అన్నారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోని ఆప్ ప్ర‌భుత్వాలు ప్ర‌ధానంగా మొహ‌ల్లా క్లినిక్స్, ఆస్ప‌త్రులు, ఉచిత విద్యుత్‌, నీటి బిల్లుల లాంటి సేవ‌ల‌న్నింటినీ ఆతిషి అత్యంత జాగ్ర‌త్త‌గా కొన‌సాగిస్తారు. నిజానికి ఇంత‌కాలం ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌భుత్వం అంటే.. స్వచ్ఛమైన పాలన, పారదర్శకత, ప్రజలకు నేరుగా కనెక్ట్ అయిన విధానాలు చూపిస్తూ స‌గ‌ర్వంగా చెప్పుకొంటుంది. కానీ కేజ్రీవాల్, ఆయ‌న‌తోపాటు కొంద‌రు మంత్రులు కూడా ఎదుర్కొంటున్న మద్యం స్కాం ఆరోపణలు ఇన్నాళ్లుగా ఆప్ ప్ర‌భుత్వానికి ఉన్న మంచి పేరును దెబ్బ‌తీసేలా ఉన్నాయి. ఆప్ నాయకత్వంలో ప్రధానమైన వ్యక్తి మనీష్ సిసోదియా కూడా ఇదే “ప్రజల తీర్పు” గురించి మాట్లాడారు, కాని అవినీతి ఆరోపణలతో దాదాపు 17 నెల‌ల‌కు పైగా జైల్లోనే ఉన్న సిసోదియాను ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి ఇప్ప‌ట్లో ఎంపిక‌చేసే అవ‌కాశం లేదు.

అర‌వింద్ కేజ్రీవాల్, మ‌నీష్ సిసోదియాల‌తో పాటు.. సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్ లాంటి కొంద‌రు ఇతర సీనియర్ నాయకులు ఢిల్లీలో ప్ర‌ధానంగా పట్టణ పేదలను కేంద్రబిందువుగా చేసుకుని త‌మ పార్టీ బలాన్ని ఇన్నాళ్లుగా పెంచుకుంటూ వ‌చ్చారు. ఆతిషి మాత్రం ఈ విష‌యంలో కొంత‌ సమర్థతను ప్రదర్శించాల్సి ఉంటుంది. మహిళల కోసం నెలకు రూ.1000 అందించే ‘ముఖ్యమంత్రి మహిళా స‌మ్మాన్‌ యోజన’ వంటి పథకాల అమలుకు ఆమె ప్రాధాన్యం ఇచ్చే అవ‌కాశం ఉంది. దీనివ‌ల్ల దేశ రాజ‌ధాని ప్రాంతంలోని 67 ల‌క్ష‌ల మంది మ‌హిళా ఓట‌ర్లు ఆమెవైపు మొగ్గు చూపుతార‌ని భావిస్తున్నారు.

కొత్త సీఎం కేజ్రీవాల్‌కు సుదీర్ఘ‌కాలంగా విధేయురాలు. ఉన్న‌త విద్యావంతురాలు కూడా. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజిలో చ‌దివిన త‌ర్వాత‌.. ఆమె ఆక్స్‌ఫ‌ర్డ్‌లో రోడ్స్ స్కాల‌ర్ షిప్ కూడా పొందారు. రాజ‌కీయాల‌లో ప్ర‌వేశించాల‌ని భావించిన త‌ర్వాత ఆమె ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి.. ఢిల్లీ ప్ర‌భుత్వంలో అపారంగా ఎదిగిపోయారు. సిసోదియా, ఇత‌ర సీనియ‌ర్ నేత‌లు లేక‌పోవ‌డంతో.. 43 ఏళ్ల వ‌య‌సులో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆతిషికి అత్యంత ముఖ్య‌మైన ఆర్థిక‌, ప్ర‌జాప‌న‌పులు, విద్య లాంటి 13 శాఖ‌లు అప్ప‌గించారు. “నేను సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. నేను వేరే పార్టీలో ఉండి ఉంటే నాకు క‌నీసం ఎన్నికల టికెట్ కూడా వచ్చేది కాదు. కానీ కేజ్రీవాల్ జీ నన్ను నమ్మి, నన్ను ఎమ్మెల్యేని చేశారు, మంత్రిని చేశారు, ఈ రోజు నాకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారు” అని పార్టీ స‌మావేశంలో ఆమె అన్నారు.

ఢిల్లీలో 1.47 కోట్ల మంది ఓట‌ర్లు ఉండ‌గా, అందులో సుమారు 45 శాతం మంది మ‌హిళ‌లే. రెండు ప్ర‌ధాన కార‌ణాల వ‌ల్ల ఆతిషి ఎంపిక స‌రైన‌ద‌ని ఆప్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. మ‌ద్యం కుంభ‌కోణంలో ఎక్క‌డా ఆమె పేరు రాలేదు. మ‌హిళ‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఓట‌ర్ల‌ను ఆమె గ‌ణ‌నీయంగా ప్ర‌భావితం చేయ‌గ‌ల‌రు. ఈ రెండు వ‌ర్గాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ప్ర‌ధాన‌మైన ఓటుబ్యాంకుగా ఎప్ప‌టినుంచో ఉన్నాయి.

ఇటీవ‌ల జ‌రిగిన ఢిల్లీ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మాత్రం మొత్తం 12 మునిసిప‌ల్ జోన్ల‌కు గాను ఏడింటిని బీజేపీ గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ కేవ‌లం ఐదుచోట్ల మాత్ర‌మే విజ‌యం సాధించ‌గ‌లిగింది. బీజేపీ ఈ ఊపుతో త‌న దాడిని క్ర‌మంగా పెంచుకుంటూ పోతోంది. “ఢిల్లీ ప్ర‌జ‌ల‌ను అడ్డంగా దోచుకున్న అదే మంత్రివ‌ర్గంలోనే ఆతిషి కూడా ఉన్నారు. ఆమె కూడా ఆ తాను ముక్కే” అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు వీరేంద్ర స‌చ్‌దేవ వ్యాఖ్యానించారు. మ‌రోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ శాస‌న‌స‌భ్యుడు, బీజేపీ గూట్లో ఉన్న క‌పిల్ మిశ్రా ఇటీవ‌ల ఆతిషి త‌ల్లిదండ్రుల గురించి కూడా ఒక కొత్త వాద‌న తీసుకొచ్చారు. వాళ్లిద్ద‌రూ ఢిల్లీ యూనివ‌ర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెస‌ర్లు, వామ‌ప‌క్ష సానుభూతిప‌రులు. 2001లో పార్ల‌మెంటు మీద దాడికి పాల్ప‌డిన ఉగ్ర‌వాది అఫ్జ‌ల్ గురుకు క్ష‌మాభిక్ష పెట్టాల‌ని వాదించిన‌వారిలో వాళ్లిద్ద‌రూ కూడా ముఖ్యులన్న విష‌యాన్ని ఆయ‌న గుర్తుచేశారు. ఇవే ఆరోప‌ణ‌ల‌తో ఆప్‌కు దూరంగా ఉన్న ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యురాలు స్వాతి మ‌లివాల్ అయితే ఒక వీడియో కూడా విడుద‌ల చేశారు. ఇలాంటి కుటుంబం నుంచి వ‌చ్చిన వ్య‌క్తి ఢిల్లీకి ముఖ్య‌మంత్రి కావ‌డం రాజ‌ధాని ప్ర‌జ‌లు చేసుకున్న అతిపెద్ద దుర‌దృష్ట‌మ‌ని ఆమె వ్యాఖ్యానించారు. అయితే, స్వాతి మ‌లివాల్‌కు ఏమాత్రం సిగ్గు, శ‌రం ఉన్నా ఆమె వెంట‌నే ఆప్ ద్వారా ల‌భించిన రాజ్య‌స‌భ స‌భ్యత్వానికి రాజీనామా చేసి, బీజేపీ టికెట్ మీద గెలిచి చూపించి, అప్పుడు మాట్లాడాల‌ని పార్టీ ఎమ్మెల్యే దిలీప్ పాండే అన్నారు. మ‌రోవైపు బీజేపీ నేత‌లు మాత్రం సామాజిక మాధ్య‌మాల్లో ఆతిషి మీద విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. మ‌ర్లీనా అంటే మార్క్స్, లెనిన్ ఇద్ద‌రి పేర్ల జోడింపు అని వాళ్లు ఎద్దేవా చేస్తున్నారు.

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ, ముఖ్య‌మంత్రి మీద విమ‌ర్శ‌ల జోరు మ‌రింత పెరుగుతుంది. ప్ర‌స్తుతానికి ఢిల్లీలో ఆతిషి మాత్ర‌మే ఆప్ తురుపుముక్క‌. మిగిలిన ప్ర‌ధాన నాయ‌కులు అంద‌రిమీదా మ‌ద్యం కుంభ‌కోణంలో ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వాటిని బీజేపీ ఎటూ గ‌ట్టిగానే ఉప‌యోగించుకుంటుంది. ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చినా, లేక‌పోతే ఎప్ప‌టిలాగే స‌రైన స‌మ‌యానికి అంటే 2025 ఫిబ్ర‌వరిలోనే ఎన్నిక‌లు వ‌చ్చినా ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించుకోవ‌డానికి కేజ్రీవాల్ వేస్తున్న ఈ గేమ్ ప్లాన్ ఎంత‌వ‌ర‌కు విజ‌య‌వంతం అవుతుంద‌న్న‌ది వేచి చూడాల్సిందే.

స‌మ‌య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర శ‌ర్మ‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News