కొప్పరపు సోదర కవుల ధార, ధారణ తెలుగు సాహిత్యంలోనే కాదు, ప్రపంచ సాహిత్యంలోనే ఎన్నదగినవి. కొప్పరవు కవుల పద్యధాటి నిరుపమానం. మహా శుకవులుగా వారు ప్రసిద్ధి చెందారు. మహావధానులుగా ప్రఖ్యాతమయ్యారు. అతి వేగంగా వందలాది పద్యాలను వేగంగా చెప్పుకుపోయేవారు. ఆ కాలంలో వారి సభలకు బండ్లు కట్టుకుని జనం విరగబడేవారు. ఈ జంట కవులు 1905 నుంచి 1927 వరకు 22 ఏళ్లపాటు ఆశుకవితలను, అవధానాలను దిగ్విజయంగా నడిపిం చారు. రాజధాని నగరంతో మొదలుపెట్టి, పల్లెటూళ్ల వరకూ కవితా జైత్రయాత్రను నిర్వహించారు. వారి కవితా ప్రదర్శనలలో దిగ్గజాల వంటి పండితులు పాల్గొనేవారు. కావ్యకంఠ గణపతి ముని, వావికొలను సుబ్బారావు, వేదం వెంకట రాయశాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, జయంతి రామయ్య పంతులు వంటివారు ఇందులో కొందరు.
గంట వ్యవధలో కనీసం అయిదు వందల పద్యాలను అలవోకగా వల్లించిన అసమాన ప్రతిభా సంపన్నులు కొప్పరపు కవులు. ఆంధ్ర భాష ఉన్నతిని స్పష్టం చేసేలా, తెలుగు పద సౌరభాలను నలుదిశలా వెదజల్లేలా వారు పద్య విద్యను ప్రదర్శించేవారు. ‘కవితల పుట్టిల్లు-సోదర కవుల ఇల్లు’ అని అప్పట్లో ఈ కవుల గురించి అనుకునేవారు. పలికిన పలుకులన్నీ పద్యములే అని కూడా ఈ కవి ద్వయాన్ని ప్రశంసించేవారు. గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని కొప్పరం వీరి స్వగ్రామం. కొప్పరపు వెంకటరాయ, సుబ్బమాంబ దంపతులకు కొప్పరపు వెంకట సుబ్బరాయ కవి 1885 నవంబర్ 12న జన్మించారు. ఆయన సోదరుడు వెంకట రమణ కవి 1887 డిసెంబర్ 30న జన్మిం చారు. కళ్లు తెరిచిన నాటి నుంచే వీరు తమ పెద్దల కవితాలను వింటూ, కవితలను గ్రహిస్తూ పెరిగారు.
అందుకేనేమో వీరి సప్తధాతువుల్లోనూ కవిత్వం, సాహిత్యం నిండిపోయాయి. వీరిద్దరూ ఎనిమిదేళ్లకే శతకం చెప్పారు. పన్నెండేళ్ల వయసులో అష్టావధానం చేశారు. అందరూ దిగ్భ్రాంతి చెందేలా 16 ఏళ్లకే శతావధానం కూడా నిర్వహించారు. ఇక ఇరవయ్యేళ్ల వయసులో కావ్యాలను రచించారు. అవధానాలు, ఆశు కవిత్వాలతో జైత్రయాత్ర కూడా మొదలుపెట్టారు. ‘అనుజా వెంకట రమణా ఘన కవితాభరణా’ అని తమ్ముడిని సుబ్బరాయ కవి ఉదయాన్నే నిద్ర లేపేవారట. వెంటనే వెంకట రమణ కవి, ‘సుబ్బరాయ కవిరాయా వేగ పద్యాశ్రయా’ అంటూ అన్న కాళ్లకు నమస్కరించే వారట. వారి మధ్య మాటలన్నీ కవితల రూపంలోనే పొంగిపొరలేవి.
గద్వాల, పిఠాపురం, బొబ్బిలి, చెన్నపట్టణం వంటి ప్రాంతాలలో వారికి ఎంతో విలువైన సత్కారాలు జరిగాయి. కొన్నిచోట్ల గజారోహణాలూ, గండపెండేర గౌర వాలూ దక్కాయి. బొబ్బిలి ఆస్థానంలో అయితే రెండు చేతులూ చాచి ఆశుకవిత్వం ప్రారంభించారట. తమ కవిత్వం ఆగినప్పుడు చేతులు నరకమని కోరారట. దండ నాయకుడు ఎత్తిన కత్తి అలానే పట్టుకుని ఉన్నాడట. వీరి ఆశుధార మాత్రం ఆగనే లేదు. దాంతో వీరికి అక్కడ కనీ వినీ ఎరుగని స్థాయిలో సన్మానాలు జరిగాయట. కొప్పరపు వెంకట కవులు ఎంతటి విద్యత్ సంపన్నులో అంతటి సచ్చీలురు కూడా. రుజువర్తన, క్రమశిక్షణ వీరికి ఆరో ప్రాణం. సంస్కారవంతమైన జీవితం, ఆధ్యాత్మిక వర్తన వీరి జీవితం. వీరు రచించిన దైవ సంకల్పం, సాధ్వీ మహత్యం, శ్రీకృష్ణ కరుణా ప్రభావం, సుబ్బరాయ శతకం వంటి గ్రంథాలు తెలుగు భాషను పరిపుష్టం చేశాయి. దురదృష్టవశాత్తూ, ఈ కొప్పరపు కవుల్లో పెద్దవాడైన సుబ్బరాయ కవి 46 ఏళ్లకే ఇహలోక యాత్ర చాలించారు. ఆయన పోయాక తమ్ముడు వెంకటరమణ కవి జీవచ్ఛవంలా కొన్నేళ్లు బతికారు.
Avadhana Diggajalu: ‘అవధాన దిగ్గజాలు’ కొప్పరపు కవులు
వారి సభలకు బండ్లు కట్టుకుని జనం విరగబడేవారు