Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Ayodhya Ram Mandir: పీఠాధిపతుల అభ్యంతరాలెందుకు?

Ayodhya Ram Mandir: పీఠాధిపతుల అభ్యంతరాలెందుకు?

రాజకీయ, కుల కారణాలు సాకుగా చూపటమా!

అయోధ్యలో రామమందిర ప్రారంభంపై ఒకపక్క పార్టీలు, నాయకులు, మంత్రులు, వ్యాఖ్యాతలతో రాజకీయ దుమారం మిన్నుముట్టుతుండగా, దీనికి సమాంతరంగా మరో చిన్నపాటి మతపరమైన దుమారం కూడా చెలరేగుతోంది. ఈ నెల 22న జరగబోయే రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రామమందిర ట్రస్టు పంపిన ఆహ్వానాలపై నలుగురు పీఠాధిపతుల స్పందన దేశంలో సంచలనం సృష్టిస్తోంది. ఉత్తరాఖండ్ లోని జ్యోతిష పీఠం, గుజరాత్ లోని ద్వారకా పీఠం, ఒడిశాలోని పూరీ పీఠం, కర్ణాటకలోని శృంగేరీ పీఠానికి చెందిన పీఠాధిపతులు తాము రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావడం లేదంటూ తమ కారణాలను తాము వెల్లడించారు. ఆధ్యాత్మిక వ్యాప్తి కోసం ఈ నాలుగు పీఠాలను ఆది శంకరాచార్యులు దేశానికి నాలుగు వైపులా నెలకొల్పడం జరిగింది. వారిని ఒప్పించడానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కానీ, వారు మనసు మార్చుకునే ఉద్దేశంలో లేనట్టు కనిపిస్తోంది.

- Advertisement -

రామ మందిర నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణ ప్రతిష్ట చేయడం అపచారమని, ఇందుకు ధర్మ శాస్త్రం గానీ, ఆగమ శాస్త్రం గానీ అంగీకరించదని జ్యోతిష మఠం శంకరాచార్య తాను రాలేకపోవడానికి కారణం చెప్పారు. సాధారణంగా దేశంలో ఎక్కడైనా ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాతే ప్రతిష్ఠాపన కార్యక్రమం
జరుగుతుంది. అయితే, ఆలయ నిర్మాణం సంపూర్ణంగా పూర్తి కావడానికి మరి కొన్నినెలలు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కేవలం శాస్త్రాల ఆధారంగానే ఇప్పుడు ప్రతిష్ఠాపన కార్యక్రమం జరపకూడదనేది తమ ఉద్దేశమని ఈ నలుగురు పీఠాధిపతుల్లో ఇద్దరు కారణం చెప్పారు. శాస్త్రాలను నిర్లక్ష్యం చేయకూడదని, ప్రతిష్ఠాపనకు తొందరపడాల్సిన అవసరం లేదని జ్యోతిష పీఠం శంకరాచార్య స్పష్టం చేశారు. కాగా, శృంగేరీ పీఠాధిపతి మాత్రం తమకు వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల తాము రాలేకపోతున్నట్టు తెలిపారు. ఈ నెలలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టడం సమంజసం కాదని, ఇది శుభప్రదమైన నెల కాదని ద్వారకా పీఠాధిపతి పేర్కొన్నారు.

పూరీ శంకరాచార్య చెప్పిన కారణం మాత్రం వీటన్నిటికీ భిన్నంగా ఉంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తప్పకుండా శాస్త్రాల ప్రకారం జరగాలని నొక్కి చెబుతూ ఆయన, ‘‘ఈ విగ్రహాన్ని నరేంద్ర మోదీ తాకడాన్ని, దాన్ని అందరూ మెచ్చుకోవడాన్ని చూడడం ఇష్టం లేకే నేను ఈ కార్యక్రమానికి రావడం లేదు’’ అని వ్యాఖ్యానించడం జరిగింది. ఆయన వ్యాఖ్యల్లో కొద్దిగా కుల వివక్ష కనిపించి, పలువురు నాయకులు, వర్గాలు తీవ్రంగా అభ్యంతరం తెలియజేయడం జరిగింది. ఆయన నిజంగా అదే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే ఈ వ్యాఖ్యలు ఖండించదగ్గవి. విగ్రహాన్ని తాకే అధికారం ఎవరికైనా ఉంటుందనడంలో సందేహం లేదు. దీనికీ, కులానికీ సంబంధం లేదు. శంకరాచార్యలకు మాత్రమే అధికారం ఉంటుందనడంలో అర్థం
లేదు. కేరళకు చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త, ఆధ్యాత్మికవేత్త నారాయణ గురు 1888లో అరువిప్పురంలో ఒక నది ఒడ్డున విగ్రహ ప్రతిష్ఠాపన చేయడం జరిగింది. ఒక దళితుడు విగ్రహ ప్రతిష్ఠాపన చేయడంపై అగ్రవర్ణాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఆయన పట్టించుకోలేదు.

కొందరు ఆధ్యాత్మికవేత్తలు, ఆధ్యాత్మిక సంస్థలు ఇటువంటి కుల సంబంధమైన వ్యాఖ్యానాలు చేయడం, వక్ర వ్యాఖ్యలు చేయడం అనేక పర్యాయాలు జరిగింది. అయితే, ఇటువంటి భాష్యాలను ఖండించడం అనివార్యంగా జరుగుతూ వస్తోంది. జ్యోతిష పీఠం శంకరాచార్య శాస్త్రాలకు తగ్గట్టుగా ప్రాణ ప్రతిష్ఠ జరగడం
లేదనడం, ప్రధానమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొనడం వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయనడం మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అయితే, శంకరాచార్యులు, దేశంలోని రాజకీయ పార్టీల కుహానా లౌకికవాద ధోరణులలో పాలుపంచుకోకపోవడం చాలా మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News