తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాలు అట్టడుగు వర్గాల ఆకాంక్షలకు, పాలకుల ప్రాధాన్యతలకు మధ్య ఉన్న అగాధాన్ని స్పష్టం చేస్తు న్నాయి. బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో అధికారాన్ని కైవసం చేసుకున్న వెనువెంటనే వచ్చే ఎన్నికలలో తెలం గాణలో కూడా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అభిలాషిస్తున్న ప్రధానమంత్రి మోదీ హైదరాబాదులో పర్యటించారు. హైదరాబాద్ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ కేంద్రంగా తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనలు, రోడ్లు, రైల్వే వంటి రంగాలకు సంబంధించి 9,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు చేపట్టారు. ఈ పర్యటన సందర్భంగా రాష్ట్రంలోని బీసీ సంఘాలు, ముఖ్యంగా మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు నేతృత్వంలోని బీసీ మేధావుల ఫోరం పలు ప్రధాన డిమాండ్లతో గళమెత్తాయి. దేశవ్యాప్తంగా చేపట్టబోతున్న జనగణనలో బీసీ కుల గణన చేపట్టి వారి వాస్తవ జనాభాను తేల్చి, వారికి విద్య, ఉద్యోగ, రాజ కీయ రంగాలలో 50 శాతం రిజర్వేషన్లను కల్పించాలని, కేంద్ర ప్రభుత్వంలో బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్-కోటా కల్పిస్తూ చట్టసభల్లో 33% రిజర్వే షన్లు అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాదించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజ ర్వేషన్లను 42 శాతానికి పెంచి, దాన్ని రాజ్యాం గంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కోరారు. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్ల ద్వారా ప్రాతినిధ్యం కల్పించాలని, ప్రైవేట్ రంగంలో నూ రిజర్వేషన్లను వర్తింపజేయాలని ప్రతిపా దించారు. విద్యా, ఉద్యోగాల్లో ఆటంకంగా ఉన్న క్రీమీలేయర్ పరిమితిని ఎత్తివేయడం లేదా గణనీయంగా పెంచడం, బీసీ కార్పొరేషన్లకు నిధుల కేటాయింపును పెంచి కులవృత్తులకు ఆర్థిక చేయూతనివ్వడం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పునః సమీక్షించాలని కోరారు. నిజానికి, కొట్లాడి సాధిం చుకున్న తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మతమైనారిటీ ప్రజలకు వివిధ రంగాలలో రావలసినటువంటి అవ కాశాలు, హోదాలు రావడం లేదని గత సంవత్సర కాలంగా డా. విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కులాలకు న్యాయంగా, చట్టబద్ధంగా భూమి, విద్య, ఉద్యోగ, రాజ కీయ రంగాలలో వారి జనాభా దామాషా ప్రకారం రావలసినటువంటి 85-90% హక్కుల వాటా కోసం, రాజ్యాధికారం సాధన కోసం భావజాల వ్యాప్తి ఉద్య మాలు, ప్రతిఘటన పోరాటాలు కొనసాగుతున్నాయి.
దళిత క్రిస్టియన్ సంఘాలు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతున్నారు. అటవీ భూములపై గిరిజనులకు పూర్తి హక్కులు కల్పించేలా రాజ్యాంగ బద్ధమైన రక్షణ కల్పించాలని ఆదివాసీ సంఘాలు డిమాం డ్ చేస్తున్నాయి. సహజ వనరులను భవిష్యత్ తరాలకు కూడా మిగిల్చాలని పర్యావరణవేత్తలు ఘోషిస్తున్నారు. పేద ప్రజలు కనీస అవసరాలైన కూడు, గుడ్డ, నీడల కోసం ఎదురుచూస్తున్నారు. విద్యావంతులైన యువత భద్రతతో కూడిన ఉద్యోగ కల్పనల కోసం పరితపి స్తున్నారు. ఇట్లాంటి మెజారిటీ కులాల డిమాండ్లు నెరవేరి నప్పుడే తెలంగాణలోని అణగారిన వర్గాలకు నిజమైన సామాజిక న్యాయం, అభివృద్ధిలో సమాన వాటా దక్కు తుందని చాలా కాలంగా అణగారిన కులాల ఉద్యమ నాయకులు, మేధావులు చర్చిస్తున్నారు. ఆశ్చర్యంగా మోడీ పర్యటనలో పైన ప్రస్తావించిన అంశాల ప్రస్తావనే ఏమాత్రం లేకుండా అంతర్జాతీయ ఆర్థిక అంశాలైన డీజిల్, పెట్రోల్, బంగారం వంటి విదేశీ వస్తువుల బహి ష్కరణ అనే స్థూల అంశాలకే పరిమితమైనారు. పశ్చిమ బెంగాల్లో ప్రజలు బిజెపిని ఆదరించినట్లు భవిష్యత్తులో తెలంగాణలో ఆదరించే అవకాశం ఉందని మాట్లాడడం గమనార్హం. తన పర్యటనలో ప్రత్యేక పనిగా ఎన్డీఏ కూట మి మిత్రులైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను కలిసి యోగక్షేమాల పలకరింపు ముసుగులో భవిష్యత్తు రాజకీయాలను చర్చించి ఉంటారు. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలోని అణగారిన కులాలన్నీ సామాజిక న్యాయం జెండాతో బహు విధాలుగా పోరాటాలు చేస్తుంటే మరో వైపు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం కోల్పోయిన ప్పటినుండి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఎప్పుడూ మాట్లాడినా కేవలం కాలేశ్వరం, రంగారెడ్డి- పాలమూరు ఎత్తిపోతల పథకం, సాగునీరు, రైతుల సమస్యలను ప్రస్తా విస్తూ, కాంగ్రెస్ వ్యతిరేకతకే పరిమితమవ్వడం గమనిం చవచ్చు. కేసీఆర్‌లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బుద్ధి జీవులు ప్రస్తావిస్తున్న సామాజిక న్యాయ అభివృద్ధి, పాలనా విధానాలపై ఈ రకమైన ఉదాసీన ధోరణి ఉండడం అంటే తాను ఆ కులాల సామాజిక న్యాయానికి సైద్ధాంతి కంగానే బద్ధ శత్రువునని పదేపదే ప్రజలకు వివరిస్తున్నట్లు భావించవలసి వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా సమూ హాలకు సామాజిక న్యాయం కేంద్రంగా ఎన్నికల సమ యంలో 420 హామీలను ఇచ్చి, అధికారం లోకి వచ్చాక ఫోర్త్ సిటీ, ఐటీ రంగం, రియల్ ఎస్టేట్ వంటి కార్పొరేట్ అనుకూల ఎజెండాలకే ప్రాధాన్యత నివ్వడం చూస్తుంటే, ఈ ముగ్గురు నేతలు, మూడు పార్టీలు ఒక రహస్య ఒప్పందంతో అణగారిన వర్గాల మౌలిక సమస్యలను విస్మరిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది.
అణగారిన వర్గాల పట్ల పాలకుల మౌన కుట్ర
తెలంగాణ సాధించుకున్న పుష్కర కాలానికి కూడా జనాభాలో సింహభాగంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఆకాంక్షలు పక్కకు నెట్టబడుతున్నాయి. గ్రామస్థాయి నుండి పార్లమెంటు వరకు చట్టసభల్లో 50% బీసీ రిజర్వేషన్ల అమలు, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా, దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా, కుల గణన ఆధారంగా భూమి వంటి సహజ వనరులు, విద్య, ఉద్యోగ, రాజకీయ సమస్త రంగాలను అర్హులైన పేదలం దరికీ న్యాయవాటాను అడగడం వంటి అంశాలు సామా జిక న్యాయానికి కొలమానాలు. అయితే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాలను చర్చకు రాకుండా పాపులిజం (ప్రజాకర్షక పథకాలు) వెనుక దాక్కుం టున్నాయి. ఇది కేవలం రాజకీయ వ్యూహం మాత్రమే కాదు, బహుజన వర్గాల రాజకీయ ఎదుగుదలను అడ్డుకు నే ఒక వ్యవస్థీకృత కుట్రగా కనిపిస్తోంది. అభివృద్ధి అంటే కేవలం ఆకాశహర్మ్యాలు, తార్ రోడ్లు, రైల్వే లైన్లు, కార్పొ రేటీకరణకు చెందిన విమానాశ్రయాలు, ఐటీ కంపెనీలు మాత్రమే కాదు. సమాజంలోని చివరి వ్యక్తికి సమస్త రంగాలలో దక్కాల్సిన న్యాయమైన వాటా అని ఈ నేతలు ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారు.
ఫూలే-అంబేద్కర్-కాన్షీరాంల సైద్ధాంతిక వెలుగులో ఉద్యమ నిర్మాణం
ఈ నేపథ్యంలో, తెలంగాణలో అణగారిన వర్గాలు, ముఖ్యంగా 60 శాతంగా ఉన్న (20 నుండి 45 సంవత్స రాల వయసు కలిగిన) యువత తమ రాజకీయ భవిష్య త్తును తామే ఆత్మగౌరవ పునాదిగా నిర్మించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. మహాత్మా జ్యోతిరావు ఫూలే అందించిన విద్య, ఆత్మగౌరవం సత్యశోధన అనే ఆయు ధంతో, అణచివేతకు వ్యతిరేకంగా చైతన్యం పొందాలి. డా. బి.ఆర్. అంబేద్కర్ బోధించిన ‘బోధించు, సమీ కరించు, పోరాడు’ అనే సూత్రాన్ని నేటికీ అసలైన రాజకీయ దిక్సూచిగా భావిం చి పనిచేయాలి. రాజ్యాధికారం ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని అంబేద్కర్ నమ్మారు. అందుకే, ఈ కులాలు కనీసం భవిష్యత్తు ఎన్నికల్లోనైనా కేవలం ఓటు బ్యాంకుగా మిగిలిపోకుండా, పాలక వర్గాల్లో భాగస్వామ్యం కోరే దిశగా ఉద్యమించాలి. మాన్యువర్ కాన్షీరాం చెప్పినట్టు, ‘ఎవరి జనాభా ఎంత ఉందో, వారికి అంత వాటా దక్కాలి’ అనే నినాదం తెలంగాణ గడ్డపై నేడు మారు మోగాల్సిన అంశం.
రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒక క్రియాశీల విముక్తి రాజకీయ ఉద్యమం రూపుదాల్చాలి. ఇది కేవలం ఒక పార్టీకి వ్యతిరేకంగా కాకుండా, అన్ని అగ్రకుల ఆధిపత్య ధోరణులకు వ్యతి రేకంగా సాగాలి. సబ్బండ కులాల నిజమైన జనాభా లెక్కలు తేల్చడం ద్వారానే నిధులు, విధుల్లో సమన్యాయ వాటా సాధ్య మవుతుంది.
పోడు భూములపై ఎస్టీల హక్కులు, బీసీ, ఎస్సీ, ముస్లిం మైనారిటీలకు భూమి పంపిణీ వంటి అంశాలపై రాజీలేని పోరాటం జరగాలి. ఐటీ, ఫోర్త్ సిటీ వంటి ఆధు నిక రంగాల్లోనూ బహుజన బిడ్డలకు రిజర్వేషన్లు, అవ కాశాలు దక్కేలా ఒత్తిడి తీసుకురావాలి.
పాలకుల ప్రాధాన్యతలు మారాలంటే, అణగారిన వర్గాల చైతన్యం మరింత గుణాత్మకంగా పెరగాలి. రాజకీయ నాయకులు చూపించే మానవీయత లేని వికసిత్ భారత్, గ్లోబల్ ఎకానమీ మూడు ట్రిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థ, ఫార్మర్ సెంటిమెంట్ ముసుగులను తొలగించి, సామాజిక న్యాయం ప్రాతిపదికన కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించడమే ఫూలే, అంబేద్కర్, కాన్షీరాంలకు ఈ సమూహాలు ఇచ్చే నిజమైన వారసత్వ కృతజ్ఞత.
తెలంగాణలో సమగ్ర అభివృద్ధి జరగాలంటే అది అట్టడుగు వర్గాల నుండే ప్రారంభం కావాలి. అందుకు అన్ని కులాలు, వర్గాలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో సహకరించాలి.
డా.నాగం కుమారస్వామి
అసిస్టెంట్ ప్రొఫెసర్
పాలమూరు యూనివర్సిటీ

