Thursday, September 12, 2024
Homeఓపన్ పేజ్Bail rules must be changed: బెయిల్‌ నిబంధనల్లో మార్పులు అనివార్యం

Bail rules must be changed: బెయిల్‌ నిబంధనల్లో మార్పులు అనివార్యం

ఢిల్లీ ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడం ఒక విధంగా శుభ సూచకం. బెయిల్‌ నిరాకరించడం అనేది శిక్ష కాదని న్యాయమూర్తులకు సుప్రీం కోర్టు ద్వారా అవగాహన కలిగి ఉంటుంది. పైగా, బెయిల్‌ చట్టాలకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలను వారు పూర్తిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బెయిల్‌ చట్టాల ఉద్దేశం తేలికగానే అర్థమవుతుంటుంది. ఒక కేసుపై కేవలం అధికార పత్రాల ఆధారంగా విచారణ జరుగుతున్నప్పుడు బెయిల్‌ మంజూరు చేయడానికి ఎటువంటి అభ్యంతరమూ ఉండాల్సిన అవసరం లేదు. నిందితుడు పారిపోవడానికి అవకాశం ఉన్నప్పుడో, నిందితుడు విచారణకు హాజరు కాని పరిస్థితి ఉన్నప్పుడో, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నప్పుడో, సాక్ష్యాధారాలను తారుమారు చేయగలిగి ఉన్నప్పుడో మాత్రమే బెయిల్‌ ను నిరాకరించాల్సి ఉంటుంది. అంతేకాదు, విచారణ ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం పట్టడానికి అవకాశం ఉన్నప్పుడు, విచారణ ఎక్కువ కాలం జరిగే అవకాశం ఉన్నప్పుడు కూడా బెయిల్‌ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది.
అయితే, అవినీతి ఆరోపణల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులను ఇంకా విచారణ ప్రారంభం కాకపోయినా, దర్యాప్తు కొనసాగుతున్నా చెరసాలల్లోనే ఉంచడం అనేది అసాధారణ విషయంగా కనిపిస్తోంది. మనీశ్‌ సిసోడియాను 2023 ప్రారంభంలో మొదట సి.బి.ఐ, ఆ తర్వాత ఇ.డి అరెస్టు చేయడం జరిగింది. మద్యం విధానం కేసులో, నిధుల అక్రమ తరలింపు కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈ ఏడాది ప్రారంభంలో అరెస్టు చేశారు. ఆయనను ఈ.డి అరెస్టు చేసిన కేసులో బెయిల్‌ లభించింది కానీ, సి.బి.ఐ కేసులో మాత్రం ఆయనకు బెయిల్‌ లభించలేదు. సి.బి.ఐ ఆయన మీద అవినీతి కేసు పెట్టి దర్యాప్తు సాగిస్తోంది. కాగా, సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడం దాదాపు ఒకటిన్నర సంవత్సరాల జైలు జీవితానికి స్వస్తి పలకడంతో పాటు, ఒక కొత్త సంప్రదాయానికి నాంది పలికింది. న్యాయ మూర్తులు బి.ఆర్‌. గవాయ్‌, కె.వి. విశ్వనాథన్‌లు సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ మీద రూలింగ్‌ ఇస్తూ, దర్యాప్తునకు మరికొంత కాలం పట్టే అవకాశం ఉన్నప్పుడు, దీనిపై విచారణ ఇంకా విచారణ ప్రారంభమే కానప్పుడు ఆయనను జైలులో కొనసాగించడంలో అర్థం లేదని, అటువంటి వ్యక్తికి బెయిల్‌ మంజూరు చేయడంలో తప్పేమీ లేదని స్పష్టం చేశారు. ఆయనను షరతులతో కూడిన బెయిల్‌ పై విడుదల చేయవచ్చని తేల్చి చెప్పారు.
నిజానికి కొందరు న్యాయమూర్తులు బెయిల్‌ మంజూరు విషయానికి వచ్చే సరికి ‘మనకెందుకులే’ అన్న తీరులో వ్యవహరించడం జరుగుతోంది. బెయిల్‌ అనేది ఒక నిబంధనే తప్ప మినహాయింపు కాదనే ప్రాథమిక సూత్రాన్ని న్యాయమూర్తులు విస్మరిస్తున్నట్టు కనిపిస్తోంది. సిసోడియా కేసును ఆరు నుంచి ఎనిమిది నెలల లోపల పూర్తి చేస్తామని ఇ.డి హామీ ఇవ్వడంతో సుప్రీంకోర్టు ఆయనకు మళ్లీ బెయిల్‌ కు అపీలు చేసుకోవాల్సిందిగా సూచించింది. మద్యం కేసు, నిధుల అక్రమ తరలింపు కేసు, ఇతర అవినీతి కేసుల దర్యాప్తు నత్తనడకగా కొనసాగుతున్నందువల్ల సిసోడియాకు వెంటనే బెయిల్‌ లభించింది. వాస్తవానికి సుప్రీం కోర్టు 2023 అక్టోబర్‌ లోనే ఈ మేరకు రూలింగ్‌ ఇవ్వడం జరిగింది. అయితే, దిగువ న్యాయస్థానం, ఢిల్లీ హైకోర్టు ఈ రూలింగ్‌ ను పట్టించుకోలేదు. సిసోడియా వేసిన ఇతర అనేక పిటిషన్ల వల్ల దర్యాప్తులు, విచారణలు ఆలస్యంగా జరుగుతున్నాయే తప్ప, సి.బి.ఐ, ఇ.డి దర్యాప్తుల వల్ల ఆలస్యం జరగడం లేదని అవి పేర్కొన్నాయి. ఈ కారణంగానే తాము సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ ను తిరస్కరించినట్టు కూడా అవి పేర్కొన్నాయి. ఏది ఏమైనా, దీర్ఘకాలం విచారణలు జరగడం వల్ల న్యాయవ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకుని న్యాయస్థానాలు తమ విచారణలను వేగవంతం చేయవలసిన అవసరం ఉంది. అదే క్రమంలో పౌర హక్కులను దృష్టిలో పెట్టుకుని శీఘ్రంగా బెయిల్‌ మంజూరు చేయవలసిన అవసరం కూడా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News