Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Bangla government may fall: బంగ్లాదేశ్‌ పీఎం పదవికి గండం

Bangla government may fall: బంగ్లాదేశ్‌ పీఎం పదవికి గండం

బంగ్లాలో రిజర్వేషన్ల సంక్షోభం

వరుసగా నాలుగవ పర్యాయం ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన షేక్‌ హసీనా ప్రస్తుతం సమస్యల వలయంలో చిక్కుకున్నారు. మొత్తం అయిదు సార్లు ఈ పదవిని నిర్వహించిన హసీనాకు పాలనా వ్యవహారాల్లోనే కాక, రాజకీయాల్లో కూడా విశేషమైన అనుభవం ఉన్నప్పటికీ, దేశ ప్రజల ఉద్యమాలు, ఆందోళనల ముందు ఇవేవీ పనికి రాకుండా పోతున్నాయి. 1971 లో బంగ్లాదేశ్‌ విమోచన ఉద్యమంలో పాల్గొన్న పోరాట యోధుల వారసులకు ఉద్దేశించిన 30 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం తిరిగి అమలు చేయబోతోందనే కారణంపై అక్కడ విద్యార్థులు, విద్యాధిక యువతీ యువకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అక్కడి కోర్టు ఒకటి ఈ రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం స్వాతంత్య్య యోధుల కుటుంబాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కొనసాగించాలనుకుంటోంది. ఈ 30 శాతం రిజర్వేషన్లు కాకుండా, ఇతర కేటగిరీల్లో మరో 26 శాతం రిజర్వేషన్లు ఇప్పటికే దేశంలో అమలులో ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ అత్యంత క్షీణ దశలో ఉండడం, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు సన్నగిలుతుండడం తదితర కారణాల వల్ల విద్యార్థుల్లో అశాంతి, అసహనాలు పెచ్చరిల్లుతున్నాయి. ఈ రిజర్వేషన్ల కారణంగా తమకు ఉద్యోగావకాశాలు రావడం లేదని విద్యార్థులు భావించడం జరుగుతోంది.
దీనికి తోడు, ఆందోళనకారులంతా రజాకార్లని, దేశ ద్రోహులని హసీనా అభివర్ణించడం, 1971లో వీరంతా పాకిస్థాన్‌ సైన్యానికి సహకరించారని వ్యాఖ్యానించడం పుండు మీద కారం రాసినట్టుగా ఉంది. విద్యార్థులు, యువతీ యువకుల నిరసనలు, పోలీసుల కాల్పుల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తదితర పరిణామాలను గమనించినవారికి ప్రధాని తీరు పట్ల వ్యతిరేకత పెరగడం ఖాయమనే భావన కలుగుతోంది. ఈ ఆందోళనలు మరి కొంత కాలం కొనసాగే పక్షంలో ఇది ఆమె పదవికి కూడా ముప్పుగా మారుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, హసీనా ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తన తాజా రూలింగుతో ఆదుకుంది. రిజర్వే షన్లను ఎకాయెకిన ఏడు శాతానికి తగ్గించింది. దీనివల్ల స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలకు ఇచ్చే రిజర్వేషన్లు కూడా అయిదు శాతానికి తగ్గిపోవడం జరిగింది. ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొద్దిగా సర్దుమణిగినట్టు కనిపిస్తోంది. కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాత, ఇంటర్నెట్‌పై నిషేధాన్ని తొలగించిన తర్వాత కానీ ప్రశాంత పరిస్థితులు ఏర్పడ్డాయా, లేదా అన్నది తెలియదు.
ఈ ఆందోళనలు, నిరసనలు బంగ్లాదేశ్‌ కు కొత్తేమీ కాదు. అనేక సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్న షేక్‌ హసీనా, ఆమె నాయకత్వంలోని అవామీ లీగ్‌ పార్టీకి వ్యతిరేకంగా తరచూ దేశంలో నిరసన ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నిరసన ప్రదర్శనల వెనుక ఇస్లామిక్‌ తీవ్ర వాదులున్నారనో, ప్రతిపక్ష బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ ఉందనో ప్రభుత్వం ఈ నిరసనలను కఠినంగా అణచివేస్తూ వస్తోంది. అనేక హత్యా ప్రయత్నాల నుంచి ఆమె బయట పడినందువల్ల ఆమెలోని అభద్రతాభావం అర్థం చేసుకోదగిందే. అయితే, ఆమె నిరంకుశ ధోరణి, అసమ్మతిని సహించలేక పోవడం, రాజకీయ ప్రత్యర్థులను భరించలేక పోవడం వంటివి ఆమె విజయాలను, సాఫల్యాలను మరుగునపెడుతున్నాయి. నిజానికి, ఆమె హయాంలో బంగ్లాదేశ్‌ ఆర్థికంగా, సామాజికంగా అనూహ్యమైన పురోగతి సాధించింది. కాగా, దేశ ఆర్థిక సమస్యలకన్నిటికీ హసీనాయే జవాబుదారీ వహించాల్సి ఉంటుందని, ఆమె దేశ ప్రయోజనాల కోసం కాకుండా స్వప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోందని ప్రత్యర్థులు ఘాటైన విమర్శలు చేస్తున్నారు.
భారత ప్రభుత్వం చాలా ఏళ్లుగా హసీనా ప్రభుత్వానికి, బంగ్లాదేశ్‌ అభివృద్ధికి వీలైనంత ఆర్థిక సహాయం అందజేస్తూ వస్తోంది. ఆమె పాలన ఏ విధంగా, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, భారతీయ ప్రయోజనాలను కాపాడుకోవడమే ధ్యేయంగా భారత ప్రభుత్వం సహాయం అందజేస్తోంది. ఇస్లామిక్‌ తీవ్రవాద వర్గాలపై హసీనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం భారతదేశానికి అనుకూలంగా మారింది. దేశంలోని అల్పసంఖ్యాక హిందువుల మీద దాడులు జరగకుండా కూడా హసీనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భారత ప్రభుత్వం తన స్వప్రయోజనాల కోసం బంగ్లాదేశ్‌ ను ఆదుకుంటున్నప్పటికీ టీస్టా నదీ జలాల పంపకానికి సంబంధించిన ఒప్పందం మాత్రం ముందుకు కొనసాగడం లేదు. పైగా ప్రస్తుత బంగ్లాదేశ్‌ ప్రభుత్వం మీద వ్యక్తమవుతున్నంత వ్యతిరేకత భారత ప్రభుత్వం మీద కూడా వ్యక్తమవుతోంది. భారత ప్రభుత్వం తలచుకుని ఉంటే హసీనా తీరుతెన్నులు మొదట్లోనే మారి ఉండేవని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News