Thursday, September 12, 2024
Homeఓపన్ పేజ్Bangladesh boiling: అరాచక శక్తులకు నిలయంగా బంగ్లాదేశ్‌

Bangladesh boiling: అరాచక శక్తులకు నిలయంగా బంగ్లాదేశ్‌

బంగ్లాదేశ్‌ లోని విధ్వంసకారులు, అరాచక శక్తులు ప్రధాని షేక్‌ హసీనా వాజేద్‌ను దేశం నుంచి పారిపోయే టట్టు చేయగలిగారు కానీ, అక్కడ ప్రశాంత పరిస్థితులను మాత్రం సృష్టించలేకపో యారు. శాంతిభద్రతలు కుప్పకూలిపోయాయి. కొత్త ప్రభుత్వం ఇంత వరకూ ఏర్పడలేదు. పైగా ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్టు హిందూ అల్పసంఖ్యాక వర్గాల మీద దాడులు ప్రారంభ మయ్యాయి. వారి ఇళ్లను, వ్యాపారాలను దోచుకోవడం, కొల్లగొట్టడం మొదలైంది. అత్యాచారాలకు, హత్యలకు అంతులేకుండాపోతోంది. రిజర్వేషన్‌ సమస్య కూడా పక్కదారి పట్టినట్టు కనిపిస్తోంది. మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ బంగ్లాదేశ్‌ సైనిక వ్యవస్థ ప్రకటనైతే చేసింది కానీ, ఎవరు మప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న దానిపై ఇంత వరకూ ఒక అంగీకారానికి మాత్రం రాలేదు. మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవానికి ఆందోళనకారులు ఆమోదిస్తారా, ఈ ఆందోళనలను తెర వెనుక నుంచి నడిపిస్తున్న వారు ఒప్పుకుంటారా అన్న విషయంలో ఇంతవరకూ స్పష్టత లభించలేదు.
గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు దేశాన్ని సంక్షోభ పరిస్థి తుల్లోకి నెట్టేశాయి. ఈ మొత్తం ప్రాంతం ఒక అనిశ్చిత పరిస్థితిలోకి వెళ్లిపోయింది. ఈ విషయంలో మాత్రం స్పష్టత కనిపిస్తోంది. మయన్మార్‌ ఇప్పటికే సైన్యం చేతుల్లోకి వెళ్లిపోవడం, ఇప్పుడు బంగ్లాదేశ్‌ కూడా అదే పరిస్థితుల్లో ఉండడం వల్ల భారతదేశానికి తూర్పు వైపంతా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. భారతదేశానికి ఇప్పటికే పశ్చిమం వైపున పాకిస్థాన్‌తో సమస్యలున్నాయి. ఉత్తరం వైపున కూడా చైనా కారణంగా లడఖ్‌, జమ్మూ ప్రాంతాలు ప్రతి క్షణం ఉద్రిక్తంగా ఉంటూ వస్తున్నాయి. ఉగ్రవాదంతో ఎదురవుతున్న సమస్యలు చాలవన్నట్టు ఖలిస్థాన్‌ ప్రమాదం ఒకటి పొంచి ఉంది. ఇక అంతర్గతంగా మణిపూర్‌ సమస్య ఉండనే ఉంది. మొత్తం ఉపఖండాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే భారతదేశంలో మాత్రమే సుస్థిర పరిస్థితులు ఏర్పడి ఉన్నప్పటికీ, చుట్టుపక్కల దేశాలన్నిటిలో సంక్షోభాలు నెలకొని ఉన్నాయి. ఇరుగు పొరుగు దేశాల్లో సుస్థిరత లేకపోవడమంటే దాని ప్రభావం భారతదేశం మీద కూడా తప్పకుండా పడే అవకాశం ఉంది. గత పది పన్నెండేళ్ల కాలంలో మయన్మార్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, మాల్దీవులు, అఫ్ఘానిస్థాన్‌ తదితర దేశాలు రాను రానూ సంక్షోభాల్లో కూరుకుపోతూ అతలాకుతలం అవుతున్నాయి.
బయటపడ్డ అసలు స్వరూపం
ఈ దేశాల ఆర్థిక పరిస్థితి చక్కబడడానికి, రాజకీయ పరిస్థితులను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం మొదటి నుంచి చేయగలిగినదంతా చేస్తోంది. అంతకు మించి భారతదేశం చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఈ దేశాల ప్రభుత్వాల వద్ద ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలేవీ లేవు. పొరుగు దేశాల సమస్యల పరిష్కారానికి భారతదేశంలో పార్లమెంటులో చర్చలు జరిపినా, వాదోపవాదాలు జరిపినా, పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు రాసినా, టీవీ చానల్స్‌లో చర్చా గోష్టులు పెట్టినా పొరుగు దేశాల సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం లేదు. పైగా, భారతదేశం ఏ మాత్రం కల్పించుకున్నా అది వైషమ్యాలకు దారితీసే ప్రమాదం ఏర్పడుతోంది. అంతేకాదు, పొరుగు దేశాల్లో తలెత్తబోతున్న సమస్యలను భారత ప్రభుత్వం సకాలంలో గుర్తించలేకపోయిందంటూ ప్రతిపక్షాలు ఇప్పటికే గగ్గోలు పెట్టడం ప్రారంభించాయి. ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో భారతదేశంలోని ఏ ప్రభుత్వమైనా ఒక పరిమితి వరకే కల్పించుకోగలుగుతుంది. అఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌, మయన్మార్‌ తదితర దేశాలు ఇతర దేశాల జోక్యాన్ని మొదట్లోనే అడ్డుకోవడం జరిగింది.
ఆ దేశాల మాదిరిగా కాకుండా బంగ్లాదేశ్‌ లో సైన్యం మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవ కాశం ఉందని భారత ప్రభుత్వం కూడా నమ్మవలసి వస్తోంది. దేశంలో ఆందోళలు, ఆ పేరుతో చెలరేగుతున్న హింసా విధ్వంసకాండలు ఆగిపోతాయని ఉపఖండమంతా నమ్ముతోంది. అయితే, ఆందోళనకారులు సైనిక పాలనకు గానీ, సైన్యం ఏర్పాటు చేయదలచుకున్న ప్రభుత్వాన్ని గానీ నమ్మడం, ఆమోదించడం వంటివి జరిగే అవకాశం లేదు. అక్కడి రాజకీయ విశ్లేషకులు అదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరుగుతోంది. కొందరు విద్యార్థి నాయకులు డాక్టర్‌ మహ్మద్‌ యూనస్‌ పేరుకు ఆమోదం తెలిపినట్టుగా వార్తలు వచ్చాయి కానీ, వాటికి కూడా ధృవీకరణ లభించలేదు. ఆ విద్యార్థి నాయకులెవరన్నది తెలియడం లేదు. సైన్యం ఏర్పాటు చేయబోయే మధ్యంతర ప్రభుత్వం విషయంలో ప్రతిపక్ష బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ, జమాతే ఇస్తామీ, ఇతర ప్రతిపక్షాల అభిప్రాయం ఏమిటన్నది కూడా బయటికి రావడం లేదు.
భారీగా విధ్వంసకాండలు
బంగ్లాదేశ్‌ భవిష్యత్తే అంతుబట్టడం లేదు. సైన్యం ఏర్పాటు చేయదలచుకున్న ప్రభుత్వం ఎంత కాలం ఉంటుంది? రెండు నెలలు ఉంటుందా, మూడు నెలలు ఉంటుందా? ఆ తర్వాత ఎన్నికలు జరిగి ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వం ఏర్పడుతుందా? ఈ మధ్యంతర ప్రభుత్వమే రిజర్వేషన్ల వివాదాన్ని పరిష్కరిస్తుందా? ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేపడుతుందా? బంగ్లాదేశ్‌ కూడా ఇస్లామిస్ట్‌ జిహాదీ వర్గాల హస్తాల్లోకి వెళ్లిపోతుందా? ప్రస్తుత సైనిక పాలన ఎంత కాలం ప్రజలను అణచి ఉంచగలుగుతుంది? ఇవన్నీ ప్రస్తుతం అంతుబట్టని ప్రశ్నలే. భారత ప్రభుత్వం ప్రస్తుతం వేచి చూసే విధానాన్ని అనుసరిస్తోంది. ఎన్ని రోజుల్లో, ఎన్ని వారాల్లో, ఎన్ని నెలల్లో బంగ్లాదేశ్‌ లో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయన్నది ఎవరూ చెప్పలేని విషయం. అయితే, బంగ్లాదేశ్‌ లో ఎక్కువ కాలం అస్థిర పరిస్థితులు కొనసాగడమన్నది భారతదేశ భద్రతకు మంచిది కాదు. మున్ముందు ఇక్కడ భారత వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడే పక్షంలో అది మరింతగా ముప్పు తెచ్చిపెడుతుంది. మాల్దీవుల భారత్‌ బహిష్కరణ పిలుపు తర్వాత బంగ్లాదేశ్‌ లో కూడా ప్రధాన ప్రతిపక్షాలు ఇటువంటి పిలుపునే చేపట్టడం జరిగింది. తమపై జరుగుతున్న దాడులను తట్టుకోలేక హిందువులు పెద్ద సంఖ్యలో భారతదేశానికి పారిపోయి వచ్చేసే అవకాశం ఉంది. రాజకీయ దాడులను తట్టుకోలేక ముస్లింలు కూడా పారిపోయి భారతదేశానికి వలస వచ్చే సూచనలున్నాయి. దీనివల్ల దేశ ఆర్థిక వనరుల మీద పెనుభారం పడుతుంది. బంగ్లాదేశ్‌ నుంచి మరింత ఎక్కువ సంఖ్యలో రోహింగ్యాల పారిపోయి రావడం వల్ల ఇక్కడ సామాజికంగా ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం కూడా ఉంది.
బంగ్లాదేశ్‌ లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పడే పక్షంలో ఆ పార్టీ జమాతే ఇస్లామీ పార్టీతో చేతులు కలిపే అవకాశం ఉంది. జిహాదీ వర్గాలన్నీ ఈ ప్రభుత్వం చేరడానికి మార్గం సుగమం అవుతుంది. చైనా, పాకిస్థాన్‌ దేశాల సైన్యాలు, గూఢచారులకు బంగ్లాదేశ్‌ లో స్థావరాలు ఏర్పడతాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్‌ మీద చైనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు, ప్రాజెక్టులు, పరిశ్రమల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన భారతదేశం అనేక విధాలుగా నష్టపోవడంతో పాటు, భద్రతా సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. బంగ్లాదేశ్‌ తో కుదర్చుకున్న అనేక ఒప్పందాలు ఏమయిపోతాయి? బి.బి.ఐ.ఎన్‌, బి.ఐ.ఎం.ఎస్‌.టి.ఇ.సి వంటి గ్రూపుల్లో ఉన్న భారత్‌, బంగ్లాదేశ్‌ లు ఇక ఒక్కటిగా ఈ గ్రూపుల్లో కొనసాగగలవా? కొన్ని తెలిసిన విషయాలు, కొన్ని తెలియని విషయాలు ఈ రెండు దేశాల సంబంధాలను దారి మళ్లించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. భారతదేశానికి రానున్న నెలల్లో భద్రతకు, విదేశాంగ విధానాలకు ఎదురవబోతున్న సమస్యలు, సవాళ్లను ఎదుర్కోవడం మీదే దేశ భద్రత, రాజకీయ సుస్థిరత ఆధారపడి ఉన్నాయి.

  • ఎస్‌. శంకరరావు,
    విశ్లేషకుడు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News