Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Bangladesh still boiling: బంగ్లాదేశ్‌ లో ఇంకా అరాచకానిదే రాజ్యం

Bangladesh still boiling: బంగ్లాదేశ్‌ లో ఇంకా అరాచకానిదే రాజ్యం

గత గురువారం ప్యారిస్‌ నుంచి ఢాకా వచ్చి బంగ్లాదేశ్‌ మధ్యంతర ప్రభుత్వానికి సారథిగా బాధ్యతలు తీసుకున్న నోబెల్‌ బహుమతి గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ దేశాన్ని సంక్షోభం నుంచి హింసా విధ్వంసకాండల నుంచి కాపాడడానికి పిలుపునిచ్చారు. దేశం అతి దారుణమైన అరాచక పరిస్థితుల్లో చిక్కుకున్న స్థితిలో ఈ ఎనభయ్యేళ్ల సూక్ష్మ అర్థశాస్త్ర నిపుణుడు ఇటువంటి కీలక బాధ్యతలు చేపట్టడం జరుగుతోంది. మాజీ ప్రధానమంత్రి, అవామీ లీగ్‌ పార్టీ అధినేత అయిన షేక్‌ హసీనా వాజేద్‌ తన పదవికి రాజీనామా చేసి, దేశాన్ని సైన్యానికి అప్పగించి, భారతదేశానికి పారిపోయినప్పటికీ, బంగ్లాదేశ్‌ లో మాత్రం ఇంకా ప్రశాంత పరిస్థితులు ఏర్పడలేదు. ఈ 17 కోట్ల జనాభా కలిగిన దేశం మరింత సంక్షోభంలో కూరుకుపోవడంతో పాటు, అత్యంత ప్రమాదకర స్థాయిలో హింసా విధ్వంసకాండలతో అట్టుడికిపోతోంది. చట్టాలను అమలు చేయవలసిన న్యాయ, పోలీస్‌ అధికారులు అదృశ్యమైపోయారు. శాంతిభద్రతల యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిపో యింది. దేశంలో ప్రభుత్వమే లేకపోవడంతో పాలనా యంత్రాంగం స్తంభించిపోయింది.
ఇదే సమయంలో బంగ్లాదేశ్‌ లోని కొన్ని తీవ్రవాద వర్గాలు ఈ అరాచక పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకున్నాయి. హిందువులను, ముస్లింలలోని నిమ్నవర్గాలైన అహ్మదీయాలను, క్రైస్తవులను లక్ష్యాలుగా చేసుకుని తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. హిందువుల దేవాలయాలను నేలమట్టంచేయడంతో పాటు హిందువుల ఇళ్లను దోచుకోవడం, కొల్లగొట్టడం, హిందూ మహిళలపై అత్యాచారాలు చేయడం. దారుణంగా హత్యలు చేయడం వంటి ఘాతుకాలకు ఒడిగట్టడం జరుగుతోంది. ఈ తీవ్రవాదులు, అరాచక శక్తులు అవామీ లీగ్‌ పార్టీ కార్యకర్తలను కూడా వెంటాడి, వేటాడి చంపడం జరుగుతోంది. బంగ్లాదేశ్‌ హిందూ, బౌద్ధ, క్రైస్తవ ఐక్యతా మండలి చెప్పిందాని ప్రకారం, దేశంలోని అత్యధిక సంఖ్యాక ప్రాంతాల్లో, జిల్లాల్లో ఇదే విధమైన అరాచక కాండ కొనసాగుతోంది. దేశంలో ఎక్కడ అవామీ లీగ్‌ పార్టీ కార్యాలయం ఉన్నా దాని మీద దాడులు జరుగుతున్నాయి. వాటిని పూర్తిగా నేలమట్టం చేయడం జరుగుతోంది. గత 8వ తేదీన మధ్యంతర ప్రభుత్వ అధిపతిగా ప్రమాణ స్వీకారం చేసిన మహమ్మద్‌ యూనస్‌ ఈ హింసా విధ్వంసకాండలను ఖండిస్తూ, ప్రశాంతత కోసం విజ్ఞప్తి చేశారు కానీ, దానివల్ల ఇంతవరకూ ఫలితం కనిపించలేదు. పాలనా యంత్రాంగాన్ని తన చేతుల్లోకి తీసుకున్న ఈ గ్రామీణ బ్యాంక్‌ నిపుణుడికి బంగ్లాదేశ్‌ లో శాంతిభద్రతలను స్థాపించడం, హింసా విధ్వంసకాండలను ఆపించడం నిజంగా ఒక పెద్ద సవాలు కాబోతోంది.
అటు ఆందోళనకారులకు, ఇటు వివిధ పార్టీలకు అనుకూలమైన వ్యక్తి, అభ్యంతరం లేని వ్యక్తి అయిన మహమ్మద్‌ యూనస్‌ ను దేశాధిపతిగా నియమించడం ద్వారా సైన్యాధ్యక్షుడు, దేశా ధ్యక్షుడు అయిన మహమ్మద్‌ షహబుద్దీన్‌ దేశంలో సామరస్యానికి కొంత తోడ్పడడం జరిగింది. దేశంలో వివిధ రాజకీయ పార్టీల మధ్య వైషమ్యాలు పేట్రేగిపోతున్న స్థితిలో ఒక టెక్నోక్రాట్‌ ను దేశాధిపతిని చేయడం వివేకవంతమైన చర్యే. అయితే, ఆయనకు రాజకీయ మద్దతు లేకపోవడం ఒక పెద్ద వెలితి కాబోతోంది. ఇప్పుడు ఆయన ఏదో ఒక రాజకీయ పార్టీ సహకారాన్ని లేదా ఆందోళనకారుల నాయకులను విశ్వాసంలోకి తీసుకోవలసిన అగత్యం ఏర్పడుతుంది. అంతేకాదు, ఇప్పుడు ఆయన మూడు అంశాలను సీరియస్‌ గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మొదటగా సైన్యం దాని స్థానంలో అది ఉండేలా చేయాలి. 1990లలో సైన్యం దేశాన్ని తన చేతు ల్లోకి తీసుకుంది. దాన్ని సైన్యం చేతుల్లోంచి తప్పించడానికి అవామీ లీగ్‌, బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీలు నానా అగచాట్లూ పడడం జరిగింది. ఇక రెండవది, యూనస్‌ దేశంలో శాంతిభద్రతలను పునరుద్ధరించాలి.
అవామీ లీగ్‌ కకావికలు కావడంతో ఖలీదా జియా నాయకత్వంలోని బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ, జమాతే ఇస్లామీ పార్టీలు బాగా బలం పుంజుకున్నాయి. ఇందులో జమాతే ఇస్లామీ పూర్తిగా తీవ్రవాదులతో నిండిన పార్టీ. ఈ రెండు పార్టీల కారణంగానే దేశంలో తరచూ రక్తపాతం జరుగుతుంటుంది. ఇక చివరగా, దేశంలో ఎంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తే అంత మంచిది. ఇటువంటి అరాచక పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడగలిగేది, స్వేచ్ఛగా, సజావుగా జరిగే ప్రజాప్రాతినిధ్య ఎన్నికలు మాత్రమే. దేశానికి ఎదురవుతున్న కొత్త సవాళ్లను ఎదుర్కోవడం మీదే కొత్త నాయకుల శక్తి సామర్థ్యాలు ఆధారపడి ఉంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News