Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Cyber threats: సైబర్‌ మోసాలపై ఇక ఉక్కుపాదం

Cyber threats: సైబర్‌ మోసాలపై ఇక ఉక్కుపాదం

బ్యాంకులపై నమ్మకం సడలిపోతుందని..

దేశంలో సైబర్‌ మోసాలకు అంతూ పొంతూ ఉండడం లేదు. వీటికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు, పోలీసులు, బ్యాంకులు తీసుకుంటున్న చర్యలన్నీ నీరు కారిపోతున్నాయి. సైబర్‌ మోసాల విలువ ఆరు నెలల కాలంలో ఏకంగా 60 శాతానికి పైగా పెరిగి పోవడం బ్యాంకుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. మొత్తంమీద, గతంలో ఎన్నడూ లేనంతగా సైబర్‌ మోసాలు బ్యాంకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పటిష్టమైన వ్యవస్థలతో, మోస నిరోధక బృందాలతో తాము ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షిస్తున్నామంటూ బ్యాంకులు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, సైబర్‌ మోసాలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. అవి రోజు రోజుకూ పెరగడమే తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు. క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డులకు సంబంధించిన మోసాలతో పాటు, ఇంటర్నెట్‌కు సంబంధించిన ఆన్‌ లైన్‌ మోసాలు కూడా విజృంభిస్తున్నాయని, ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇటువంటి మోసాల సంఖ్య 12 వేలకు పైగా చోటు చేసుకున్నాయని రిజర్వు బ్యాంకు తన తాజా నివేదికలో తెలియజేసింది. ఏడాది మొత్తం మీద 14,500 మోసాలు జరగడాన్ని బట్టి, ద్వితీయార్థంలో ఒక్కసారిగా 12 వేలకు పైగా కేసులు నమోదు అవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతేకాకుండా, గత ఏడాది ప్రథమార్థంలో రూ. 87 కోట్ల విలువైన కార్డు, ఆన్‌ లైన్‌ మోసాలు జరుగగా, ఈ ఏడాది మొత్తం మీద రూ. 680 కోట్ల విలువైన మోసాలు జరిగినట్టు కూడా రిజర్వు బ్యాంకు తెలియజేసింది.
దేశంలో నగదు చెల్లింపులను క్రమబద్ధీకరించడానికి రిజర్వు బ్యాంకు 2008లో ‘నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌’ను ఏర్పాటు చేసిన తర్వాత నుంచి ప్రత్యక్ష నగదు చెల్లింపుల కార్యకలాపాలు, లావా దేవీలన్నీ డిజిటలీకరణకు మారిపోవడం, ఆన్‌ లైన్‌ చెల్లింపులు ఎక్కువ కావడం మొదలైంది. నిజానికి డిజిటలీకరణలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా అవతరించింది. స్మార్ట్‌ ఫోన్లు పెరగడం, ఇంటర్నెట్‌ ఖర్చు తక్కువ కావడం, వినియోగదారులకు అనుకూలమైన యాప్స్‌ ప్రారంభం కావడం, తక్కువ ఖర్చుతో చెల్లింపులు జరపడం వంటివి ఊపందుకున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులే మారిపోవడం జరిగింది. బ్యాంకు ఖాతాల మధ్య క్షణాల్లో నగదు బదిలీకి అవకాశం కల్పిస్తున్న యునైటెడ్ పేమెంట్స్‌ ఇంటర్‌ ఫేస్‌ (యు.పి.ఐ) కారణంగా ఫోన్‌ చెల్లింపులు పెరిగి, దేశంలో డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ కొత్త పుంతలు తొక్కడం ప్రారంభం అయింది. ప్రపంచం మొత్తం మీద డిజిటల్‌ చెల్లింపులను పరిశీలిస్తే అందులో 40 శాతం వరకూ భారతదేశం నుంచే జరుగుతున్నట్టు అర్థమవుతుంది. అమెరికా, ఇంగ్లండ్‌, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాలన్నిటి చెల్లింపులు కలిపినా నలభై శాతం ఉండకపోవచ్చు.
దేశ ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా పురోగతి చెందుతున్న సమయంలో తప్పకుండా సైబర్‌ మోసగాళ్ల మీదా, సైబర్‌ మోసాల మీదా ఒక కన్ను వేసి ఉండాల్సిన అవసరం ఏర్పడుతోంది. విచిత్రమేమిటంటే, రిజర్వు బ్యాంకు ఎన్ని విధాలుగా జాగ్రత్తలు సూచిస్తున్నప్పటికీ, బ్యాంకులు కొన్ని జాగ్రత్తల విషయంలో విఫలం చెందుతూ ఉండడం, సైబర్‌ మోసాలపై వెంటనే చర్యలు తీసుకోకపోవడం, బ్యాంకు ప్రధాన కార్యాలయాలకు సమాచారం అందించకపోవడం జరుగుతూనే ఉంది. ఇ.సి.ఐ.సి.ఐ, కోటక్‌, ఎస్‌.బి.ఐ వంటి బ్యాంకుల మీద రిజర్వు బ్యాంకు ఇప్పటికే అనేక పర్యాయాలు జరిమానాలు కూడా విధించడం జరిగింది. ఈ బ్యాంకుల మీద రిజర్వు బ్యాంకు ఇంతవరకూ రూ. 12.2 కోట్లు జరిమానా విధించింది. బ్యాంకు ఖాతాదార్లను మోసం చేయడానికి ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీ పద్ధతులతో ముందుకు వస్తున్న సైబర్‌ మోసగాళ్లను పట్టుకోవడంలో అడ్డదోవలేమీ లేవని బ్యాంకులు అర్థం చేసుకోవాలి. ఇటువంటి మోసగాళ్ల విషయంలో బ్యాంకులు ప్రతిక్షణం అప్రమత్తంగానే ఉండాల్సిన అవసరం ఉంది.
బ్యాంకు లావాదేవీలను, చెల్లింపుల వ్యవహారాలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాల్సిన అవసరాన్ని రిజర్వు బ్యాంకు ఎప్పటికప్పుడు బ్యాంకులకు తెలియజేస్తూనే ఉంది. తగిన జాగ్రత్తలు సూచించడంతో పాటు, తాను కూడా అహర్నిశలూ పర్యవేక్షణ సాగించడం జరుగుతోంది. దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, బ్యాంకులలో ఇందుకు సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నాయని, బ్యాంకు సిబ్బంది కూడా ఇందుకు ఎంతో కొంత సహకరించడం జరుగుతోందని రిజర్వు బ్యాంకు భావిస్తోంది. బ్యాంకుల్లో కూడా సైబర్‌ మోసాలు జరగడం ప్రారంభం అయితే, ఖాతాదార్లకు బ్యాంకులపై నమ్మకం సడలిపోతుందని, ఫలితంగా కొత్త రకం సమస్యలు ప్రారంభం అవుతాయని రిజర్వు బ్యాంకు ఆందోళన చెందుతోంది. ఇటువంటివి కొనసాగే పక్షంలో బ్యాంకుల ఆర్థిక స్థిరత్వానికి భంగం కలుగుతుందని, బ్యాంకులపై నమ్మకం సడలడం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదం అవుతుందని కూడా అది ఆందోళన చెందుతోంది. బ్యాంకింగ్‌ వ్యవస్థలను పటిష్టం చేయడంతో పాటు, బ్యాంకులు వినియోగదారుల సేవలను మరింతగా పెంచడం, ముఖ్యంగా మోసాలకు గురైన బాధితులను సముచిత రీతిలో ఆదుకోవడం వంటివి వృద్ధి చెందాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News