Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Banning movies: నిషేధం అర్థరహితం

Banning movies: నిషేధం అర్థరహితం

కొద్ది మంది యువతులు ఇస్లామిక్‌ స్టేట్‌లో చేరడం మీద నిర్మించిన ‘ది కేరళ స్టోరీ’ అనే సినిమాను నిషేధించాలనే డిమాండ్‌ అర్థరహితంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని నిషేధించాలనే డిమాండుకు తల వంచకపోనందుకు సుప్రీంకోర్టు, కేరళ, తమిళనాడు హైకోర్టులను నిజంగా అభినందించాల్సిందే. కేరళలో సుమారు 32,000 మంది గల్లంతయ్యారని, వారంతా బహుశా ఇస్లామిక్‌ స్టేట్‌ అనే ఉగ్రవాద బృందంలో చేరి ఉంటారనిఈ సినిమాలో వివరించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ ఒకటి విడుదల అయిన దగ్గర నుంచి సమస్య రాజుకోవడం మొదలైంది. నిజానికి ఈ టీజర్‌ను ఉపసంహరించుకుంటామని, ఈ కథంతా పూర్తిగా కల్పితమని కూడా ప్రకటిస్తామని నిర్మాతలు చెప్పినప్పటికీ సమస్య మాత్రం సర్దుమణగలేదు. ఇది ఒక విధమైన పబ్లిసిటీ వ్యవహారమంటూ కొన్ని వర్గాలు దీని మీద విరుచుకుపడ్డాయి. ఈ చిత్ర నిర్మాతలు మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని, ముస్లింలకు వ్యతిరేకంగా కట్టుకథలు వ్యాప్తి చేస్తున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు.
అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ఈ చిత్రాన్ని నిషేధించడం మాత్రం ప్రతికూల ఫలితాలనే ఇస్తుంది. చిత్రాన్ని నిషేధించాలన్న డిమాండును సాధారణంగా న్యాయస్థానాలు అంగీకరించవు. పైగా, ప్రజల్లో ఈ చిత్రం పట్ల కుతూహలం, ఆసక్తి పెంచడానికే ఈ నిషేధాలు ఉపయోగపడతాయి. ఈ డిమాండ్‌ ఊపందుకుంటున్న కొద్దీ అభిప్రాయాలు వ్యక్తం చేయడం మరీ ఎక్కువవుతుంది. నిర్మాతలకు నిజంగానే ఏవైనా దురుద్దేశాలు ఉంటే అవి సఫలం అవుతాయి. మొత్తం మీద ఈ చిత్రం మీద వచ్చిన వివాదానికి న్యాయస్థానం తెర దించింది. ఈ చిత్రానికి ఒకసారి సంబంధిత సెన్సార్‌ బోర్డు అనుమతి మంజూరు చేసిన తర్వాత దీన్ని నిషేధించే ప్రసక్తే లేదని న్యాయస్థానం చెప్పడం మంచి పరిణామంగానే కనిపిస్తుంది. పోలీసులు, సంబంధిత అధికారులకు సంబంధించినంత వరకూ శాంతిభద్రతలు చాలా ముఖ్యమైనవే. కానీ, ఏదో ఒక వర్గం డిమాండ్‌ చేసినప్పుడల్లా చిత్రాలను నిషేధిస్తూ పోవడం అనేది కూడా సమంజసం కాదు.
తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో మల్లీప్లెక్స్‌ థియేటర్లకు బెదరింపులు, హెచ్చరికలు వస్తున్నాయి. కొందరు థియేటర్‌యజమానులు తమకు తాముగా ఈ సినిమా ప్రదర్శనను నిషేధించడం కూడా జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సినిమా థియేటర్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత స్థానిక పోలీసుల మీద ఉంటుంది. అయితే, స్థానిక పరిస్థితులనుబట్టి కూడా వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఖండించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ది కేరళ స్టోరీ ద్వారా రాజకీయంగా లబ్ధి పొందడానికి కొన్ని పార్టీలు ప్రయత్నించడం. ఉగ్రవాదానికి మద్దతునిచ్చేవారే ఈ సినిమాను నిషేధించాలని కోరుతున్నారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం జరిగింది. ఒక వర్గం మీద దుమ్మెత్తిపోసే చిత్రాలను ఖండించడం అనేది ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం కిందకు రాదు. యువతులను మాయం చేయడంఅనేది నిజమైతే, ఈ వ్యవహారాన్ని ఇరు వర్గాలు సంయుక్తంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటువంటి ఉగ్రవాద ధోరణులను వేరే విధంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News