Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్barrister parvateesam: నవ్వుల పువ్వుల బారిష్టర్‌ పార్వతీశం

barrister parvateesam: నవ్వుల పువ్వుల బారిష్టర్‌ పార్వతీశం

మొక్కపాటి నరసింహ శాస్త్రి కలం నుంచి వెలువడిన హాస్యరస ప్రధాన నవల ‘బారిష్టర్‌ పార్వతీశం’. ఈ నవల గురించి తెలియనివారు గానీ, ఈ పేరు విననివారు గానీ, ఇందులోని పాత్రల గురించి గానీ తెలుగునాట తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మూడు భాగాలుగా వెలువడిన ఈ నవలలో ముఖ్య పాత్రధారి అయిన పార్వతీశం ఒక పల్లెటూరి నుంచి ఇంగ్లండ్‌ వెళ్లి అక్కడ న్యాయశాస్త్రం చదివి, స్వదేశానికి తిరిగి వచ్చి ఇక్కడ ప్రాక్టీసు చేస్తాడు. ఒకపక్క హాస్యాన్ని పండిస్తూనే, సామాజిక స్పృహను రేకెత్తించే ఒక విశిష్టమైన నవల ఇది. ఈ నవల చివరి భాగంలో పార్వతీశం స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొంటాడు. ఈ నవలను చదువుతున్నంత సేపూ ఇదొక గ్రంథంగా కనిపించదు. ఇదొక హాస్య భరిత సినిమాగా తోస్తుంది. ఈ నవలా రచయిత మొక్కపాటి నరసింహ శాస్త్రి అత్తగారి ఊరు నర్సాపు రం తాలూకా గుమ్మలూరు గ్రామం. ఆయన అక్కడికి వెళ్లినప్పుడు తన బంధువులతో కూర్చుని ఒక పడవ ప్రయాణంలో తాను పడ్డ కష్టాలను తమాషాగా, సరదాగా చెప్పడం చూసి, ఈ కథను పుస్తకంగా రాయాలని వారు సూచించారు. నిజా నికి అప్పటికి ఆయన ఒక రచయితగా సుప్రసిద్ధుడేమీ కాదు. ఆ యన మూడే మూడు కథలు రాయగా వాటిని భారతి, సాహితి పత్రికలు ప్రచురించాయి.
ఆయన దీన్ని ఒక కథగా రాయాలనుకున్నారే తప్ప దీన్ని నవలగా రాయాలని ఏ కోశానా సంకల్పించ లేదు. అయితే, ఆయన ద్వారా ఆయన అనుభవాలను విన్న బంధుమిత్రులు ఆయనను గ్రంథ రచనకు పురిగొల్పారు. ఆయనలో కూడా క్రమ క్రమంగా సంకల్పం దృఢం కావడం మొదలైంది. ఆ తర్వాత ఈ నవల కోసం ఆయన ఒక చిన్న ప్రయోగం కూడా చేశారు. ఒక అమాయక కుర్రాడిని నర్సాపురం నుంచి నిడదవోలుకు, అక్కడి నుంచి మద్రాసుకు పంపినట్టు రాసి, ఆ కుర్రాడు పడిన కష్టా లను సరదా గా కొంతమంది యువతీ యువకులకు చదివి వినిపించారు. ఆయన రాసిన తీరుకు వారు కడుపుబ్బ నవ్వడమే కాకుండా మళ్లీ మళ్లీ చదివి వినిపించు కోవడంతో ఆయనలో ఎక్కడ లేని ఉత్సాహం పెల్లుబికింది. అప్పుడు ఆయనకు పార్వ తీశం కథ తట్టింది. తన కథానాయకుడు తమ గ్రామం నుంచి బారిస్టర్‌ చదువుల కోసం ఇంగ్లండ్‌ వెళ్లడాన్ని ఆయన తన ఇతివృత్తంగా ఎంచుకుని, దీన్ని హాస్యరసంతో రక్తి కట్టించారు. ఆ 3 రోజుల్లో ఇంగ్ల్‌ండ వెళ్లి చదువుకోవడం ఒక గొప్ప విశేషం. అప్పటి దాకా పేరు పెట్టని పాత్రకు పార్వతీశం అని ఆయన పేరు పెట్టారు. పార్వ తీశం పాత్ర ద్వారానే అతని ప్రయాణ, విద్యాభ్యాస అనుభ వాలను చెప్పిస్తారు.
ఈ నవల మొదటి భాగంలో పార్వతీశం మొగల్తూరు నుంచి నిడదవోలు మీదుగా మద్రాసు చేరి, అ క్కడి నుంచి ఇంగ్లండు ఓడ ద్వారా ప్రయాణిస్తాడు. ఈ ప్రయాణాన్ని ఎంతో హాస్యరసంతో మేళవించ డం జరిగింది. మద్రాసు నుంచి ఇంగ్లండ్‌ వెళ్లడానికి కావాల్సిన సరంజామాను అతను కొనే సన్నివేశాలు ఎటువంటి రాతి గుండెనైనా కడుపుబ్బ నవ్వించడం ఖాయం. రెండవ భాగం కూడా హాస్యరసాన్ని పండి స్తుంది. ఓడలో ఇంగ్లండ్‌ చేరుకున్న పార్వతీశం ఓడలో పరిచయమైన ఒక స్నేహితుడి సహా యంతో ఇంగ్లండ్‌ని ఎడిన్బర్గ్‌ ఒక ఇంట్లో పేయింగ్‌ గెస్ట్‌గా చేరతాడు. అక్కడే ఒక లా కాలేజీలో చేరతాడు. ఏకసంతాగ్రాహి అయిన పార్వతీశం అక్కడ ఇంగ్లీషును వంట బట్టించుకోవడం, ఒక యువతిని స్నేహితు రాలిగా చేసుకోవడం రసవత్తరంగా ఉండి మనసును హత్తుకునేలా చేస్తాయి. ఈ రెండవ భాగంలో హ్యాస పాలు కొద్దిగా తగ్గిన ప్పటికీ ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో ఆసాంతం చదివిస్తుంది. రెండవ భా గం చివరి లో అతను న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణుడై స్వదేశానికి తిరిగి వచ్చి ప్రాక్టీసు మొదలుపెడ తాడు. తన స్నేహితురాలిని వదలి వచ్చే సన్నివేశాన్ని మొక్కపాటి అద్భుతంగా చిత్రీకరించారు. ఇక మూడవ భాగంలో అతను స్వస్థలానికి తిరిగి రావడం, గ్రామంలోని వారు అతన్ని నానా రకాలు ప్రశ్నలు వేయడం, కొంత కాలం విదేశాల్లో ఉండి వచ్చినందుకు ఊరి జనం చిత్రవిచిత్రంగా స్పందించ డం వంటి సంఘటనలున్నాయి. అతను చివరికి ప్రాక్టీసు ప్రారంభించి, పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొ నడం, టంగుటూరి ప్రకాశం పంతులును కలుసుకోవడం, పలుమార్లు జైలు కు వెళ్లడం వంటి సంఘటనల్లో హాస్యం పాలు తగ్గి మనసులో ఆరాటం, ఆత్రుత పెరగడంబ మొదలవు తుంది. పార్వతీశం చివరికి తన ఆస్తిపాస్తులన్నిటినీ స్వాతంత్య్రోద్యమానికే త్యాగం చేస్తాడు. ఈ భాగం లో ఎక్కువగా సామాజిక స్పృహ, ప్రజా సమస్యలు, అప్పటి రాజకీయ పరిస్థితులు కళ్లకు కడతాయి. ఇందులో పెద్దగా హాస్యం కనిపిం చదు. ఈ నవల చదివిన వారెవరికైనా భాషా జ్ఞానం పెరుగుతుంది. భాష పట్ల అభి మానం ఇనుమడిస్తుంది. భాష పదనెక్కుతుంది. అద్భుతమైన హాస్య నవల ఇది అనడంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News