Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Big lesson to governments: ప్రభుత్వాలకు ఇదొక పెద్ద గుణపాఠం

Big lesson to governments: ప్రభుత్వాలకు ఇదొక పెద్ద గుణపాఠం

మరి నేతలు ఈ విషయాన్ని ఇప్పుడైనా అర్థం చేసుకుంటారా?

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల తీరుతెన్నులను బట్టి చూస్తే తెలుగు ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 150 స్థానాలకు పైగా గెలుచుకోవడాన్ని బట్టి తెలుగు ఓటర్లు సంక్షేమానికి చివరి స్థానం, అభివృద్ధికి మొదటి స్థానం ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా బి.ఆర్‌.ఎస్‌ తీరుతెన్నుల పట్ల విసుగెత్తిపోయిన ఓటర్లు శాసనసభ ఎన్నికల్లోనే కాక, లోక్‌ సభ ఎన్నికల్లో సైతం ఆ పార్టీని పూర్తిగా పక్కన పెట్టేయడం జరిగింది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ మీద ప్రజలకు పూర్తిగా నమ్మకం కలిగినట్టు కనిపించడం లేదు. శాసనసభ ఎన్నికల్లోనే అత్తెసరు 64 సీట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఈ లోక్‌ సభ ఎన్నికల్లో సుస్థిరత్వం సంపాదించుకోలేకపోయింది. పూర్తిగా నరేంద్ర మోదీ మీద నమ్మకంతో బీజేపీకి ఎనిమిది స్థానాలను కట్టబెట్టడాన్ని బట్టి తెలంగాణ ప్రజలు కూడా మార్పు కోసం తహతహ లాడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
అభివృద్ధికి అవకాశం లేకుండా పూర్తిగా ఉచితాలు, సంక్షేమం మీదే ఆధారపడడం వల్ల ఏం జరు గుతుందో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు చెప్పకనే చెప్పాయి. ఇది పాలక వై.ఎస్‌.ఆర్‌.సి.పికే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా గుణపాఠమని చెప్పాలి. ఉచితాలు, సంక్షేమాలతో డబ్బును పంపిణీ చేయడమంటే ప్రజలకు లంచం పెట్టి తమ వైపునకు తిప్పుకోవడానికి ప్రయత్నించడమే అవుతుంది. అభివృద్ధిని పట్టించుకోకపోయేసరికి రాష్ట్రంలోని విద్యాధిక యువతీ యువకుల్లో ప్రభుత్వం పట్ల విరక్తి కలిగింది. అభివృద్ధిని, సంపద సృష్టిని విస్మరించడం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి ఘోర తప్పిదం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు మాదిరిగా ఆయన మొదటి నుంచి ప్రజలకు అందుబాటులో లేకపోవడం మరో తప్పిదం. ప్రజలకే కాదు, పార్టీ నాయకులు, శాసనసభ్యులకు సైతం ఆయన ఏనాడూ అందుబాటులో లేరు. ఫలితంగా ప్రజలకు దూరం కావడం జరిగింది. రాజశేఖర్‌ రెడ్డి, చంద్రబాబు మొదటి నుంచి ప్రజలను కలుసుకోవడం, ప్రజల మధ్యే ఉండడం ఎక్కువగా కనిపించేది.
ఆంధ్రప్రదేశ్‌ లో పాలక వై.ఎస్‌.ఆర్‌.సి.పి ప్రభుత్వం మొదటి నుంచి తప్పటడుగులు వేస్తూ పోయింది. సంపద సృష్టించకుండా రుణాలు మాత్రమే సృష్టిస్తూ ఉచితాలకు, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల, ప్రాథమిక సదుపాయాల కల్పనను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల, అభివృద్ధిని పూర్తిగా విస్మరించడం వల్ల ఆ పార్టీ దారుణంగా దెబ్బతిన్నదనడంలో సందేహం లేదు. సంక్షేమమనేది మోతాదును మించి పోయింది. జగన్మోహన్‌ రెడ్డి అటు 50కి పైగా ఉన్న సలహాదారుల సలహాలనూ తీసుకోలేదు, ఇటు ప్రజాస్పందననూ లెక్క చేయలేదన్నది సుస్పష్టం. ప్రజాస్వామ్యంలో ఒంటి చేత్తో ప్రభుత్వాన్ని నిర్వహించడమన్నది సాధ్యమయ్యే పని కాదు. జగన్మోహన్‌ రెడ్డి ఒంటెద్దు పోకడ ఆ పార్టీకి శరాఘాతమైంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు మీద ఆయనే కాకుండా, ఆయన మంత్రులు, శాసనసభ్యులు సైతం సందర్భం ఉన్నా లేకపోయినా విమర్శలతో విరుచుకుపడడం, అగౌరవంగా వ్యాఖ్యలు చేయడం మొదట్లో బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత నుంచి వెగటు పుట్టడం ప్రారంభం అయిందనడంలో సందేహం లేదు. ప్రజలు ప్రభుత్వ పనితీరును బేరీజు వేయడం జరుగుతుంది కానీ, ప్రతిపక్ష నాయకుల మీద చేసే విమర్శలను పరిగణనలోకి తీసుకుంటారనుకోకూడదు.
చంద్రబాబు నాయుడు సత్తాను, శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసిన జగన్మోహన్‌ రెడ్డి ప్రత్యక్షంగా తెలుగుదేశం కూటమి బలపడడానికి కారణమయ్యారు. పరోక్షంగా ఆంధ్రప్రదేశ్‌ లో బీజేపీ బలపడడానికి కూడా కారణం కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. చంద్రబాబు పాలనకు సంబంధించిన రికార్డును దృష్టిలో పెట్టుకుని, మరింత సమర్థవంతమైన పాలన అందించాల్సిన జగన్మోహన్‌ రెడ్డి ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా చంద్రబాబును పదేపదే విమర్శించ డమే పనిగా పెట్టుకున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కె. చంద్రశేఖర్‌ రావు ప్రభుత్వం ఓడిపోవడానికి దారితీసిన కారణాలను గానీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ చేతులు కలుపు తున్న సందర్భాన్ని గానీ జగన్మోహన్‌ రెడ్డి పట్టించుకుని ఉంటే ఆయన పరిస్థితి మరో విధంగా ఉండేది. ఆయన ఈ రెండు పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకున్న దాఖలాలు లేవు. ఆయన ఏనాడూ రాష్ట్రాభివృద్ధి విషయంలో తన విజన్‌ ఏమిటన్నది వెల్లడించలేదు. ప్రజల మనోభావాలు తనకు వ్యతిరేకంగా మారుతున్నా పట్టించుకోలేదు. తన మంత్రులు ప్రతిపక్షంపై దాడిలో హద్దులు మీరుతున్నా నియంత్రించే ప్రయత్నం చేయలేదు. ఇవన్నీ ఆయన ప్రభుత్వ వైఫల్యాలకు, చివరగా తమ పార్టీ పరాజయానికి దారి తీశాయి.
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తాను ప్రకటించిన ఆరు గ్యారంటీల విషయంలో మరికొంత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అధికారంలోకి రాదలచుకుని భారీ పథకాలను ప్రకటించే పార్టీ తప్పకుండా పాలిటిక్స్‌ తో పాటు ఎకనామిక్స్‌ ను కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రాజకీయ వ్యవహారాలనే తప్ప ఆర్థిక వ్యవహారాలను పట్టించుకోనప్పుడు ఆ పార్టీ తప్పకుండా విఫలం అవుతుందనడంలో సందేహం లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా గ్యారంటీలు, సంక్షేమాల పేరుతో డబ్బుల పంపిణీ కార్యక్రమాలను చేపట్టడం వల్ల అభివృద్ది కుంటుపడడమే కాకుండా ప్రభుత్వం అప్రతిష్ఠపాలు కావడం, బలహీనపడడం జరుగుతుంది. అభివృద్ధిని పూర్తిగా విస్మరించి పూర్తిగా ఉచితాలు, సంక్షేమాల మీద ఆధారపడడం, సంపదను సృష్టించకపోవడం వల్ల రాష్ట్రం దెబ్బతినడం, తిరోగమనం చెందడంతో పాటుప్రభుత్వాలు ఎంతగా బలహీనపడతాయో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమే ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ శాసనసభ ఎన్నికల్లో దేశంలో మరికొన్ని రాష్ట్రాలు దీనిని అనుసరించి బలహీనపడేవి. సంక్షేమ పథకాలతో ఖాళీ అయిన ఖజానాను భర్తీ చేయడం చంద్రబాబు ప్రభుత్వానికి కత్తి మీద సామే అవుతుంది. ఈ రాష్ట్రం ఎప్పటికి కోలుకుంటుందనేది ఊహించలేని విషయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News