Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Biodiversity-sustainable development: జీవవైవిద్యం

Biodiversity-sustainable development: జీవవైవిద్యం

పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన హరితహారం మరియు ప్రతిష్టాత్మక బహుళార్ధక కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం వెల్లివిరిసి జీవ వైవిధ్య పరిరక్షణకు దోహదం చేస్తోంది. ‘సుస్థిర అభివృద్ధి కోసం జీవవైవిధ్యం’- 2015-2030 మధ్యకాలంలో సాధించాల్సిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను వివరిస్తున్న ఐరాస, అదే సమయంలో జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం ప్రపంచ మానవాళి ముందున్న అతిపెద్ద సవాలు అని హెచ్చరిస్తోంది. పెరుగుతున్న జనాభాకు తోడు, వనరులను మితిమీరి వినియోగించడంవల్ల జీవవైవిధ్య పరిరక్షణ ఇప్పుడు క్లిష్టమైన సమస్యగా మారుతోంది. ఫలితంగా భూభాగంపై ఉన్న కోట్లాది జీవరాశుల్లో మూడింట రెండొంతుల మేర అంతరించిపోయే ప్రమాదం ముంచుకొస్తోందని అంతర్జాతీయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అందుకే ‘సమితి’ 2010-2020ను జీవవైవిధ్య దశాబ్దంగా ప్రకటించింది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంతోపాటు- పేదరిక నిర్మూలన, సుస్థిర జీవనోపాధి, అభివృద్ధిలో సమానత వంటి అంశాలతోనూ జీవవైవిధ్యం ముడివడి ఉంది. ఐరాస అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది శాతం జనాభా అంటే 54కోట్లమంది మత్స్య, ‘ఆక్వా’ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. తీరప్రాంతాల్లో జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడంవల్ల పర్యావరణ వ్యవస్థలకు, మానవాళికి కలిగే ప్రయోజనాలు అపారం. విపత్తులను ఎదుర్కొనే పగడపు దిబ్బలు అందించే సేవలకు ఒకవేళ వెలకట్టాల్సి వస్తే ఏడాదికి ఒక చదరపు కిలోమీటరుకు 18కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. తీరప్రాంతంలో జీవవైవిధ్యంవల్ల పర్యాటక, జన్యు, ఔషధ, మత్స్యరంగాలకు అపార లబ్ధి కలుగుతోంది. ఆ విలువ ఏడాదికి 65వేలకోట్ల డాలర్లు ఉంటుందని చెబుతున్నారు.
మానవాళికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలుచేస్తున్న జీవవైవిధ్య వనరుల పరిరక్షణలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. అడవుల్లో వన్యప్రాణులను, సముద్రలోతుల్లో జలచరాలను నిర్దాక్షిణ్యంగా వేటాడుతున్నారు. నివాస సముదాయాలు, అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట చిత్తడి నేలలు, మడ అడవులను కబళిస్తున్నారు. దీనివల్ల అరుదైన జీవవైవిధ్య వనరుల ఉనికి ప్రమాదంలో పడిపోతోంది. ఇప్పటివరకూ భూభాగం మీద 14.36లక్షల జాతులకు చెందిన జీవరాశులు శాస్త్రీయంగా ఉన్నట్టు గుర్తించారు. ఏటా 1.6కోట్ల హెక్టార్లలో అడవులు కనుమరుగవుతున్నాయి. వాటితోపాటూ అందులోని జీవవైవిధ్యమూ అంతరించిపోతోంది. గడచిన వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఏటా 20వేల జాతులు కనుమరుగవుతున్నాయన్నది పర్యావరణ నిపుణుల ఆవేదన. జన్యు వైవిధ్య పంటలూ 75శాతం మేర అంతర్ధానమయ్యాయి. 24శాతం క్షీరదాలు, 12శాతం పక్షుల జాతులూ అంతరించిపోయే దశలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అడవుల విధ్వంసంవల్ల భూతాపం విపరీతంగా పెరిగి వాతావరణంలో ప్రతికూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.జీవ వైవిధ్యం వివిధరకాల మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవుల సమ్మేళనంతో ఏర్పడిన పర్యవరణ వ్యవస్థ.ప్రకృతిలోని అన్ని సమతుల్యతలు పాటించాలి లేదా తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ప్రపంచ భూభాగంలో భారత భూభాగం 2.4శాతం మాత్రమే ఉన్నా జీవవైవిధ్యం వాటా 8.1శాతం. దీన్ని కాపాడుకొనే విషయంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతుండటం బాధాకరం. పేద దేశాల్లోని విలువైన జీవవైవిధ్య సంపదపై ‘పేటెంట్’ హక్కులు పొంది సంపన్న దేశాలు లాభార్జనకు దారులు వేసుకోవడం ఆందోళనకరం. భారత సమాజంలో వేప, పసుపు వంటి విశిష్ట జాతులను ఔషధాలు, ఆహార పదార్థాల్లో వినియోగించడం పరిపాటి. వాటిలో ఔషధ లక్షణాలను తామే కనుగొన్నామని ప్రకటించి, సంపన్న దేశాలకు చెందిన సంస్థలు ‘పేటెంట్’ హక్కులు పొందడం గతంలో వివాదాస్పదమైంది. ఎద్దు సంతతిలో అరుదైన ఒంగోలు గిత్త జాతి క్రమంగా తగ్గిపోతున్న విషయం తెలిసిందే. బ్రెజిల్‌లో వీటినుంచి రెండోతరం ఎద్దులను తయారుచేసి- ఇతర దేశాలకు విక్రయిస్తున్నారు. ఎక్కువ పరిమాణంలో వీటి వీర్యాన్ని దిగుమతి చేసుకునేందుకు అనుమతి కోరుతూ జాతీయ జీవవైవిధ్య సంస్థకు బ్రెజిల్ ఇటీవల దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. సమృద్ధిగా పోషకాహార, ఔషధ విలువలు ఉన్న సంప్రదాయ పంటలకు మేధోసంపత్తి హక్కులు లేకపోవడంతో బడా సంస్థలు వాటిని ‘సొంతం’ చేసేసుకుంటున్నాయి. కొద్దిపాటి మార్పులతో వాటిని అధిక దిగుబడులనిచ్చే విత్తనాలుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నాయి. మరోవంక అధిక దిగుబడికోసం విచ్చలవిడిగా రసాయన ఎరువులు, క్రిమి సంహారకాల వాడకం పెరిగింది. వాటివల్ల తాత్కాలిక ప్రయోజనాలు ఒనగూడుతున్నా- దీర్ఘకాలంలో భూమిసారంపై పడే దుష్ప్రభావం, తద్వారా అత్యంత విలువైన జీవవైవిధ్య వనరులకు వాటిల్లుతున్న నష్టం అపారం.
1971నాటి అంతర్జాతీయ రామ్సార్‌నుంచి 1992నాటి రియో వరకు అనేక ప్రపంచస్థాయి జీవవైవిధ్య పరిరక్షణ సదస్సుల తీర్మానాలపైనా భారత్ సంతకాలు చేసింది. రియో సదస్సు తీర్మానం ప్రకారం జీవవైవిధ్య వనరులను సుస్థిర పద్ధతుల్లో వినియోగించాలని; అన్ని దేశాల ప్రజలూ ఆ ప్రయోజనాలను న్యాయబద్ధంగా అనుభవించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. దాని అమలులో భాగంగా దేశంలో 2002లో జీవవైవిధ్య పరిరక్షణ చట్టం తీసుకొచ్చారు. చట్ట నిబంధనల ప్రకారం పంచాయతీ స్థాయిలో జీవవైవిధ్య యాజమాన్య కమిటీలు ఏర్పాటు చేసి, స్థానికుల సహకారంతో ప్రజా జీవవైవిధ్య రిజిస్టర్లు రూపొందించాలి. వనరులుగల ప్రదేశాలను పరిరక్షించడం జీవజాతులు, పంటల కారకాలు, పశువులు, పురాతన సంప్రదాయ పంటలకు సంబంధించిన వివరాలను ‘రిజిస్టరు’లో పొందుపరచి- వాటి రక్షణకు కృషిచేయడం ఆ కమిటీల కర్తవ్యం. క్షేత్రస్థాయిలో ఈ నిబంధనలు కచ్చితంగా అమలైతే, విచ్చలవిడి విధ్వంసాన్ని అరికట్టి జీవవైవిధ్య వనరుల సమతుల్యతను కాపాడుకోవచ్చు. కానీ, ఆచరణలో జరుగుతోంది వేరు. జాతీయ జీవవైవిధ్య సంస్థ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఆగస్టు 2014నాటికి 1863 రిజిస్టర్లు మాత్రమే రూపొందించారు. జీవవైవిధ్య వనరులను వాడుకునే ఔషధ కంపెనీలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, వ్యక్తులు విధిగా జీవవైవిధ్య బోర్డుల అనుమతి తీసుకోవాలన్నది మరో ముఖ్యమైన నిబంధన. తద్వారా వచ్చే లాభాల వాటాను స్థానికుల కోసమూ, వనరుల పరిరక్షణకూ వినియోగించాలి. ఈ అనుమతులకోసం దరఖాస్తుల ఆమోద ప్రక్రియ సంక్లిష్టంగా ఉంది. దానికితోడు నిఘా, పర్యవేక్షణ, లాభాల పంపకంపై కంపెనీలు ఆసక్తి కనబరచకపోవడం, శాఖలమధ్య సమన్వయలోపం తదితర కారణాలవల్ల వనరుల అక్రమ వినియోగం జోరుగా సాగిపోతోంది.
జీవవైవిధ్య చట్టంలోని కొన్ని లోపాలు క్షేత్రస్థాయిలో దాని అమలుకు ప్రతిబంధకంగా మారుతున్నాయి. గ్రామస్థాయిలో ఇప్పటికే అటవీ, వనసంరక్షణ, ఉమ్మడి అటవీ యాజమాన్యం, వణ్యప్రాణి సంరక్షణ, ‘పాని పంచాయిత్’ వంటి సంఘాలను వివిధ పథకాల కింద ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేసింది. అయితే వీటిని సమన్వయీకరించే ఏర్పాటేదీ జీవవైవిధ్య చట్టంలో లేదు. ఈ కమిటీలను గ్రామసభ/పంచాయతీ కమిటీల నేతృత్వంలో పనిచేసేందుకు అనువుగా చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో చట్టంలో చెప్పుకొన్న లక్ష్యాలు బొత్తిగా దారితప్పుతాయి. మరోపక్క ప్రభుత్వం తరఫున క్షేత్రస్థాయి పరిశీలన లేకపోవడంతో కంపెనీలు తప్పుడు నివేదికలతో పర్యావరణపరంగా సున్నితమైన ప్రదేశాలనూ ఎందుకూ పనికిరానివిగా చూపిస్తున్నాయి. పర్యావరణ, అటవీ అనుమతుల జీవవైవిధ్య బోర్డులను అసలు సంప్రతించడమేలేదు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం ఆదివాసులు, మత్స్యకారుల సంస్కృతిలో అంతర్భాగం. జీవవైవిధ్య సంరక్షణ చట్టం కింద యాజమాన్య కమిటీల్లో వీరి భాగస్వామ్యం పెంచేందుకు ప్రభుత్వాలు విస్తృతంగా కృషి చేయాలి. జీవవైవిధ్య పరిరక్షణ వివిధ శాఖలు, రంగాల సమన్వయంతో సాగాల్సిన బృహత్తర కార్యక్రమం. కోస్టారికా వంటి చిన్నదేశాలు వనరుల పరిరక్షణలో సాధిస్తున్న అనుభవాలను భారత్ ఆకళింపు చేసుకోవాలి. జీవవైవిధ్య వనరుల పరిరక్షణలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములుగా మార్చాలి. అప్పుడే మానవాళికి భవిత భద్రత.

  • ఆలేటి రమేశ్
    ప్రజా సంబంధాల అధికారి
    9948798982.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News