Saturday, September 21, 2024
Homeఓపన్ పేజ్BJP eyeing South: దక్షిణ భారతంపై బీజేపీ కన్ను

BJP eyeing South: దక్షిణ భారతంపై బీజేపీ కన్ను

కేవలం మోడీ జనాకర్షణతో దక్షిణాదిలో పాగా వేయలేరు

వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో తమిళనాడులోని రామనాథపురం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేయాలన్న ప్రతిపాదనను బట్టి దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ దృష్టి కేంద్రీకరిస్తోందన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. దక్షిణాది రాష్ట్రాలలో ఏదో విధంగా పాగా వేయాలని బీజేపీ మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. ప్రస్తుతం రామనాథపురం నుంచి ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ పార్టీకి చెందిన వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాలక డి.ఎం.కెతో ఈ పార్టీకి పొత్తు ఉంది. దక్షిణ తమిళనాడులోని రామనాథపురంలో బీజేపీ కార్యకర్తలు చాలా కాలం నుంచి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇక్కడ బీజేపీ మిత్రపక్షమైన అన్నా డి.ఎం.కెకు కూడా కాస్తో కూస్తో పట్టు ఉంది. ఇంతకు ముందు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 32 శాతం ఓట్లు పడ్డాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, ఈ స్థానం నుంచి మోదీ తేలికగా విజయం సాధించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ విజయంతో తమిళనాడులో బీజేపీ సుస్థిర స్థానం సంపాదించుకోకపోవచ్చు కానీ, పార్టీ కార్యకర్తలలో మాత్రం ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది.
పార్టీకి చెందిన ఎన్నికల వ్యూహకర్తలు ఏనాడూ దక్షిణాది రాష్ట్రాలను ఉపేక్షించలేదు. అయితే, ఈ రాష్ట్రాలలో అడుగుపెట్టడం అన్నది పార్టీకి దుర్భేద్యంగానే ఉంటూ వస్తోంది. ఇటీవల కర్ణాటకలో పరాజయం పాలు కావడాన్ని పార్టీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అంతర్గత విభేదాలు ఇటీవలే కొద్దిగా సర్దుమణిగాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక కేరళలో అల్పసంఖ్యాక వర్గాల మనసులను ఆకట్టుకోవడానికి పార్టీ నాయకులు ఈ మధ్య కాలంలో తీవ్రంగా ప్రయత్నాలు సాగించారు. ముఖ్యంగా క్రైస్తవులను కూడగట్టుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే, మణిపూర్‌లో క్రైస్తవులపై దాడులు జరుగుతుండడం, యూనిఫామ్‌ సివిల్‌ కో్‌డ కు సంబంధించిన చర్చ ప్రారంభం కావడం వల్ల ఈ ప్రయత్నాలకు గండి పడింది.
ఇతర దక్షిణాది రాష్ట్రాలలో కూడా ఈ పార్టీకి అవకాశాలు పెద్దగా మెరుగుపడలేదు. రామనాథపురంలో ముస్లింల సంఖ్య కాస్తంత ఎక్కువ. అందువల్ల మోదీ విజయం కూడా అంత తేలికగా జరిగే వ్యవహారం కాదు. ఇక తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నర్లను ఎంపిక చేసిన తీరు కూడా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. తమిళనాడులో గవర్నర్‌ రవి రాజకీయ ప్రకటనలు చేయడం ప్రారంభించారు. ఆయన వ్యాఖ్యల మీద తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అణ్ణామలై సైతం విమర్శలు చేయడం జరిగింది. ఆయన హద్దులు మీరుతున్నారంటూ అణ్ణామలై వ్యాఖ్యానించాల్సి వచ్చింది. కేరళ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొని ఉంది. వీరు బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం అనేది బీజేపీకి నష్టదాయకమే కానీ లాభదాయకం కాదు. ప్రతిపక్ష ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టడానికి బీజేపీ తమ గవర్నర్ల ద్వారా సమస్యలు సృష్టిస్తోందనే అభిప్రాయం వ్యాపిస్తోంది. బీజేపీ గనుక దక్షిణాది రాష్ట్రాలలో అడుగుపెట్టాలన్న పక్షంలో ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కేవలం మోదీ జనాకర్షణ మీద ఆధారపడితే సరిపోదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News