Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్BJP:బీజేపీ పార్టీ కాదు సామాజిక ఉద్యమం..గవర్నెన్స్ ఆఫ్ సాచురేషన్ కొత్త నినాదం

BJP:బీజేపీ పార్టీ కాదు సామాజిక ఉద్యమం..గవర్నెన్స్ ఆఫ్ సాచురేషన్ కొత్త నినాదం

ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి సరికొత్త హుషారు జోడించేందుకు ఇప్పటి నుంచే సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. రాజధాని ఢిల్లీలో రోడ్ షో ద్వారా పార్టీ కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహం తెచ్చిన మోడీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో ఉపదేశం చేశారు.

- Advertisement -

మరో 400 రోజుల్లో లోక్ సభ ఎన్నికలున్నాయని.. వీటిని ఎదుర్కొని.. ఘన విజయం సాధించేందుకు ఓటర్లంది వద్దకూ పార్టీని తీసుకెళ్లాలంటూ మోడీ దిశా నిర్దేశం చేశారు. మనం చరిత్రను సృష్టించాలన్న మోడీ.. ప్రజలందరికీ అవసరమైన అన్ని రకాల సేవలు చేసి తీరాల్సిందేనన్నారు. ఓటర్లందరినీ చేరుకోవాల్సిందేనని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యుటివ్ భేటీలో మోడీ చెప్పిన మాటలు బీజేపీలోని కసి స్థాయిని చెప్పకనే చెబుతున్నాయి.

18-25 ఏళ్ల మధ్య ఉన్న ప్రజలందరినీ పార్టీ రీచ్ అవ్వాలి.. యువతను పార్టీ చేరుకోగలిగితే విజయం చాలా తేలిక అవుతుందని మోడీ ప్రభోదించటం వెనుక భారీ స్కెచ్ ఉంది. దేశంలో యువ జనాభా, యువ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. వీరిలో అత్యధికులు ఫస్ట్ టైం ఓటర్లే..కాబట్టి యువతను ఆకట్టుకుంటే ఆ కుటుంబాన్నంతా గంపగుత్తగా ఆకట్టుకున్నట్టేనన్నది మోడీ ఉవాచ. యువతకు రాజకీయాలంటే ఆసక్తి ఉన్న పెద్దగా పట్టుండదని పైగా చరిత్ర, సమకాలీన పరిస్థితులపై సరైన విచక్షణ ఉండదు కాబట్టి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఇందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలన్నారు మోడీ.

ప్రపంచంలో 5వ అతిపెద్ద ఎకానమీగా భారత్ ను తీర్చిదిద్దిన ఘనత తమదేనంటూ ప్రజల్లో ఊదరగొట్టడాన్ని బీజేపీ తన అజెండాలో పెట్టుకున్నట్టు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. రామ మందిర నిర్మాణాన్ని విజయవంతంగా చేపట్టడం మొదలు..జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 360ని ఉపసంహరించటం వరకూ గత రెండు దఫాలుగా మోడీ సర్కారు చేపట్టిన పలు విప్లవాత్మక నిర్ణయాలను ప్రచారంలోకి తేవాలని డిసైడ్ అయినట్టు పార్టీ లైన్ స్పష్టమవుతోంది. ‘గవర్నెన్స్ ఆఫ్ సాచురేషన్ ‘ అంటే సంతృప్తికరమైన పాలన అన్ననినాదంతో 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ సిద్ధమైంది.

బీజేపీ ఇప్పుడు కేవలం ఓ రాజకీయ పార్టీగా మాత్రమే కాదు ఇప్పుడు ఇది ఒక సామాజిక ఉద్యమంగా మారిందని ప్రధాని పేర్కొనటం విశేషం. అంటే ప్రత్యర్థుల ఎత్తులను ఆదిలోనే చిత్తులు చేసేలా బ్రహ్మాస్త్రాలను బీజేపీ ఎన్నికలకు ఏడాది ముందునుంచే ప్రారంభించిందని చెప్పచ్చు. భారతదేశ భవిష్యత్తు మరింత గొప్పగా, ఉజ్వలంగా ఉంటుందని భరోసా ఇచ్చేలా పార్టీ ప్రజల్లో ప్రచారాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాలని భావిస్తోంది. ప్రతిపక్షాలను ఎప్పుడూ బలహీనమైనవిగా టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోరాదని మోడీ చేసిన ఉపదేశం చూస్తుంటే కమలనాథుల దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. బూత్ లెవెల్ నుంచే పార్టీని సమర్థవంతంగా పనిచేసేలా ఉత్సాహపరిచేలా చర్యల్లో దూకుడు కనిపించాలనేది మోడీ మాటల సారాంశం.

బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాలు అన్నీ తెలంగాణ బీజేపీని ఆదర్శంగా తీసుకోవాలన్న మోడీ మాటలు తెలంగాణ బీజేపీకి పెద్ద టానిక్ లా పనిచేయటం ఖాయం. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ చేపట్టిన యాత్ర బాగుందని.. దీన్ని మిగతా రాష్ట్రాలు రోల్ మోడల్ గా తీసుకోవాలని మోడీ చెప్పటం మిగతా రాష్ట్రాలపై గట్టి ప్రభావం చూపటం ఖాయం. ఇంత భారీ యాత్రను బండి ఎలా చేపట్టారో అధ్యయనం చేసేందుకు ఐదుగురు సభ్యుల బృందాన్ని పంపాలన్న మోడీ నిర్ణయం దక్షిణాదిలో బీజేపీని వెన్నుతట్టి ప్రోత్సహించేలా ఉంది.

మోడీ హయాంలో జరిగిన ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ను సమర్థవంతంగా ప్రచారం చేసుకోవటంలో బీజేపీ వైఫల్యం చెందిందనేది నేషనల్ ఎగ్జిక్యుటివ్ గట్టి అభిప్రాయం. అందుకే అన్నిరకాల ప్రచార, ప్రసార సాధనాలను గరిష్ఠంగా ఉపయోగించుకునేలా పార్టీ సన్నద్ధం కానుంది.

కర్నాటక, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరం, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో జరుగనున్న ప్రతి అసెంబ్లీ ఎన్నికనూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటే 2024లోక్సభ ఎన్నికల్లో గెలుపు కేక్ వాక్ అవుతుందని పదేపదే మోడీ ఉపదేశిస్తున్నారు.

2023 ఏడాది పార్టీ దృష్ట్యా అత్యంత ముఖ్యమైన సంవత్సరమని పదేపదే నద్దా, మోడీ-షాలు పేర్కొంటున్నారు. అంతేకాదు కొరకరాని కొయ్యలుగా మారిన 160 లోక్ సభ స్థానాలపై ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్న బీజేపీ ఈమేరకు కార్యచరణను అమలు చేయటం స్టార్ట్ చేసింది కూడా. సబ్కా సాథ్ సబ్కా వికాస్ తోపాటు సబ్కా ప్రయాస్ కూడా అవసరం అంటూ కొత్త నినాదాన్ని స్టార్ట్ చేసింది బీజేపీ.

దేశంలో బీజేపీకి అత్యంత బలహీనంగా ఉన్న 72,000 పోలింగ్ బూతులను బలోపేతం చేయటం కూడా అతి పెద్ద అజెండాగా బీజేపీ పెట్టుకుంది. ఒక లక్ష బూతులపై పెత్తనం తమదైతే కఠినమైన 160 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ జెండా ఎగరటం 2024లో సాధ్యమని పార్టీ భావిస్తోంది.

ఓబీసీలను మరింత మచ్చిక చేసుకుని, ఎస్సీ, ఎస్టీలను తమ పార్టీవైపుకు పెద్ద ఎత్తున మళ్లించేలా కమలనాథులు చేస్తున్న కృషి సరిపోదని.. అన్ని రాష్ట్ర శాఖలు మరింత కృషి చేయాలంటూ ఎండ్ టు ఎండ్ ఎన్నికల సిద్ధాంతాన్ని వల్లెవేస్తూ బీజేపీ లీడర్లందరికీ టార్గెట్లు ఇచ్చేసింది.

దేశమంతా ఎలక్షన్ మోడ్ లోకి వచ్చేసింది. ఎలక్షన్ ఇయర్ కావటంతో ఈ ఏడాది ఏకంగా 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ నూరు ఆరైనా..ఆరు నూరైనా విజయం సాధించి తీరాల్సిందే అంటూ భారతీయ జనతా పార్టీ తనకు తాను టార్గెట్ పెట్టుకుంది. ఈమేరకు జాతీయ ఎగ్జిక్యుటివ్ సమావేశంలోని పార్టీ ప్రతినిధులందరికీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా హితబోధ చేశారు కూడా. ఈ ఏడాది జరిగే 9 అసెంబ్లీ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేస్తే తప్పా వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడం సాధ్యం కాదని నద్దా చెప్పటాన్ని బీజేపీ నేతలంతా సీరియస్ గా తీసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News