మన రాష్ట్రంలో ఈ నెల నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలను ప్రకటించారు. ఒక్కొక్క పార్టీ మేనిఫెస్టో ఒక్కోరకంగా ఉంది. ఎన్నికల గెలుపోవటంలో కూడా ఈ మేనిఫెస్టోలు కూడా కీలకపాత్ర వహిస్తాయి. కానీ మేనిఫెస్టోలు అనేవి కేవలం ప్రకటనలకే కాకుండా అమలు అయ్యే విధంగా ఉంటే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి, కానీ నేటి పార్టీలు మేనిఫెస్టోలను ఇష్టానుసారంగా అమలుకు సాధ్యం అవుతుందా? కాదా? అనే విషయాలు ఆలోచించకుండా ప్రకటించడం బాధాకరం. కానీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి మేనిఫెస్టో అంశాలు కొంతవరకు అన్ని రకాల ప్రజలను ఆమోదయోగ్యంగా అదే విధంగా అమలుకు సాధ్యమయ్యేలా ఉన్నాయని అర్ధం అవుతుంది.
బి.సి ముఖ్యమంత్రి, ఎక్కువ సీట్ల కేటాయింపు
బిజెపి నేడు కేంద్ర ప్రభుత్వంలో ఎక్కువ సంఖ్యలో మంత్రులుగా ఓబీసీలను నియమించారు. అదే విధంగా జాతీయ ఓబీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించి కేంద్ర ప్రభుత్వం బీసీలపై తమ శుద్ధిని చాటుతుందని, రాష్ట్రంలో కూడా ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని కూడా స్వయంగా ప్రధాని మోడీ ప్రకటించడం ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి తెలంగాణ వరకు ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీసీ లేకపోవడం కూడా కొంతవరకు బీసీలను విస్మరించినట్టే!. కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ పార్టీలకు బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఇప్పుడు లేదు, ఎందుకంటే అవి కేవలం బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారనేటువంటి ఒక విమర్శ నేడు ఉంది. అదే విధంగా ఇప్పుడు బిసి లకు అతి తక్కువ సీట్లు ఇచ్చిన పార్టీలుగా మిగిలిపోయాయి, కానీ బిజెపి అన్ని పార్టీల కంటే ఎక్కువగా బీసీలకు సీట్లను కేటాయించి బీసీలపై ఉన్నటువంటి నిబద్ధతను కూడా మరొకసారి తెలియజేసింది. బిజెపి ప్రకటించినటువంటి బీసీ ముఖ్యమంత్రి అంశం, అదే విధంగా ఎక్కువ సీట్లు ఇచ్చిన పార్టీగా ఇప్పటికే జనాల్లో వెళ్ళింది కానీ కొంత ముందే ఈ అంశాలను ప్రకటిస్తే బాగుండు అనే చర్చ కూడా జనాల్లో నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా బీసీలపై ప్రకటించినటువంటి ఈ అంశాలు మరే పార్టీ సాహసం చేయలేదు. పార్టీలు బీసీ ఓటు బ్యాంకు ను మాత్రమే ఆకర్షించే విధంగా కొన్ని పార్టీలు మేనిఫెస్టోలను, డిక్లరేషన్ ప్రకటిస్తుంటే బిజెపి ఓటు బ్యాంకు గా కాకుండా వారిని గౌరవంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి లాంటి ప్రకటన చేయడం ఒక గొప్ప విషయం గానే భావించాలి.
విద్య, వైద్యం అతి ముఖ్యమైన అంశాలు
సాధారణంగా మేనిఫెస్టో అంటే పలు రంగాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలలో ఎక్కువగా ఉచితం అనేటువంటి అంశాలను నేటి పార్టీలు అవలంబిస్తున్నాయి, కానీ బిజెపి నేడు సమాజంలోకి అతి ముఖ్యమైనటువంటి విద్య, వైద్యాలు ఉచితంగా ఇవ్వాలని ప్రతిపాదించడం కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే విద్య ద్వారా సమాజంలో అనేక రకమైనటువంటి మార్పులు తీసుకురావచ్చు, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ అంశం అదే విధంగా సగటు పేద మనిషికి మెరుగైన వైద్యం అందించడం కూడా ఒక సవాల్ గా చెప్పుకోవచ్చు, ఈ రెండు అంశాలు కూడా సగటు మనిషి యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి కూడా దోహదపడతాయి.
అమలుకు సాధ్యమయ్యే అంశాలు ఉండటం
విద్యారంగంలో డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు ఉచిత లాప్టాప్స్ మరియు నిరుద్యోగుల కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి టీఎస్పీఎస్సీ పరీక్షలు, పంటలకు మద్దతు ధర మరియు ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు పెట్టుబడి మద్దతు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పంట పంట బీమా అనేది రైతులకు కావలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పంట బీమా అంశం, అదే విధంగా ఏడాదికి నాలుగు ఉచిత గ్యాస్ సిలిండర్లు, నవజాత బాలికలపై రెండు లక్షల లబ్ధి చేకూర్చేలా ఫిక్స్ డిపాజిట్, పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు గ్రామీణ పేదలకు పట్టాలు, పెట్రోల్-డీజిల్ పై 15 రూపాయల వ్యాట్ తగ్గింపు, 10 లక్షల మంది మహిళలకు ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు మరియు స్వయం సహాయ సంఘాల మహిళలకు ఒక శాతం వడ్డీకే రుణాలు ఇవ్వడం, చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఎస్సీ ఉప వర్గీకరణ వేగవంత చేయడం లాంటి సకల జనులకు సంబంధించినటువంటి అన్ని రకాల వర్గాలకు ఆమోదయోగ్యమైనటువంటి అంశాలను బిజెపి తన మేనిఫెస్టోలో చేర్చడం కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆచరణ అమలుకు సాధ్యమయ్యే అంశాలే ఇతర పార్టీల మాదిరిగా కలగూరగంపలాగా తన మేనిఫెస్టోను ప్రకటించకుండా ప్రధానమైనటువంటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అంశాలు కూడా ప్రకటించడం కూడా ఒక ప్రత్యేకత అంశంగా పేర్కొనవచ్చు.
చారిత్రక, సంస్కృతి, వారసత్వ అంశాలకు కూడా ప్రాధాన్యత
మన రాష్ట్ర వారసత్వం సంస్కృతి చరిత్రను గౌరవిస్తూ వాటిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. ఏ పార్టీ కూడా ఇలా వారసత్వ సంస్కృతిక చారిత్రక అంశాలను పరిరక్షణపై మేనిఫెస్టోలో ప్రకటించలేదు. కానీ బిజెపి మాత్రం ప్రకటించింది ప్రధానంగా ఇదే అతి ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే నేడు విదేశీ సంస్కృత మోజులో భారతీయ చారిత్రక సాంస్కృతిక వారసత్వ అంశాలు బలహీన పడకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై, పార్టీలపై కూడా ఉంది అదే విషయాన్ని బిజెపి ఇప్పుడు మేనిఫెస్టో అంశంగా చేర్చడం ఆహ్వానించదగ్గ విషయమే.
భారతీయ జనతా పార్టీ ప్రకటించినటువంటి ఈ అంశాలు, అదేవిధంగా కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వ సంబంధించినటువంటి విధానాలు, పథకాలు, మోడీ చరిష్మా, రాష్ట్రంలో ఈమధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు, ప్రకటించినటువంటి హామీలు, బిజెపి ప్రకటించినటువంటి నిరాడంబరత మేనిఫెస్టో కూడా ఈసారి ఎన్నికల్లో బిజెపి ఎక్కువ స్థానాల్లో త్రిముఖ పోటీలో ప్రభుత్వ ఏర్పాటలో కీలక పాత్ర పోషిస్తుందని జనాల్లో చర్చ నడుస్తుంది. ఒకవైపు వైపు బీసీ ముఖ్యమంత్రి ప్రకటన, ఎక్కువ సీట్లు కేటాయింపు, బీసీ ఓటర్లను మరియు యువ ఓటర్లను కూడా ప్రభావితం చేసి ఎక్కువ సీట్లు రావడానికి ఉపయోగపడతాయని అర్థమవుతుంది. మేనిఫెస్టో లో ప్రకటించిన అన్ని అంశాలు కూడా అమలు అయ్యే విధంగానే ఉన్నాయి, అన్ని పార్టీల మాదిరిగా ఓట్ల కోసమే మాత్రమే కాకుండా బిజెపి మేనిఫెస్టో సకల జనుల గ్యారంటీ మేనిఫెస్టోగా నిరాడంబరంగా ఉండటం ఆ పార్టీకి అనుకులించే విషయాలు. నేడు కేంద్ర ప్రభుత్వంలో ప్రభుతాన్ని నడుపుతున్న బిజెపి తెలంగాణలో కూడా అధికారంలో వస్తే మోడీ గ్యారంటీలతో అభివృద్ధి చేస్తారని రాష్ట్ర నాయకులు ధీమాగా మేనిఫెస్టోని జనాల్లో తీసుకేల్లగలిగితే ఎక్కువ సీట్లని గెలవవచ్చు.
- డాక్టర్ కందగట్ల శ్రవణ్ కుమార్
[email protected]