Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్BJP strength: ప్రతిపక్షాల బలహీనతే బీజేపీ బలమా?

BJP strength: ప్రతిపక్షాల బలహీనతే బీజేపీ బలమా?

గత వారాంతంలో వెలువడిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలను నిరాశా నిస్పృహలకు గురిచేసి ఉండవచ్చు. నరేంద్ర మోదీ సారథ్యంలో భార తీయ జనతా పార్టీ ఉత్తర భారతదేశంలోని మూడు రాష్ట్రాలలోనూ విజయకేతనం ఎగరేయడం ప్రతిపక్షాలకు అశనిపాతంగా పరిణమించిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. దక్షిణ భారత రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఏమంత పెద్ద మెజారిటీతో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించలేకపోవడం కూడా ప్రతిపక్షాలకు ఇబ్బందికరంగానే ఉంది. కాంగ్రెస్‌ తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశపడ్డ చత్తీస్‌ గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలలో ఆ పార్టీ ఘోర పరాజయంపాలు కావడం మాత్రం కాంగ్రెస్‌ పార్టీకే కాక, ఇతర ప్రతిపక్షాలకు కూడా మింగుడు పడడం లేదు. నిజానికి ఈ మూడు రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్‌ చాలా కాలంగా తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది. ఈ హిందీ భాషా రాష్ట్రాలలో జనాభా ఎక్కువ. సీట్ల సంఖ్య కూడా ఎక్కువే. ఈ రాష్ట్రాలు బీజేపీకే కాకుండా అన్ని పార్టీలకూ కీలకమైనవి. ఇక్కడ విజయం సాధించడమన్నది లోక్‌ సభ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత ప్రధానం. ఈ రాష్ట్రాలలో బీజేపీ ఘన విజయాలు సాధించ డమంటే 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీ గెలవడం ఖాయం అని అర్థం.
ఇప్పటికే ఉత్తర భారతంలోనూ, పశ్చిమ రాష్ట్రాల్లోనూ ఘన విజయాలు సాధించిన బీజేపీకి ఈ తాజా విజయాలు తప్పకుండా లోక్‌ సభ ఎన్నికల్లో కూడా విజయాన్ని ఖాయం చేశాయి. ఇది ప్రతిపక్షాల్లో తీవ్ర ఆందోళన కలగజేస్తోంది. తెలంగాణలో విజయం సాధించడం కూడా కాంగ్రెస్‌కు అవసరమైనంత తృప్తినివ్వకపోవడం, తెలంగాణ విజయంపై అది ఒక్క ప్రకటన కూడా చేయక పోవడం ఇదే కారణం. లోక్‌ సభ ఎన్నికల్లో తాము విజ యం సాధించే అవకాశాలు చాలా తక్కువని కాంగ్రెస్‌ పార్టీకి నిర్ధారణ అయిపోయింది. పైగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలను సెమీ ఫైనల్స్‌ గా అభివర్ణించడం కూడా జరిగింది. అయితే, ప్రతిపక్షాల ఆలోచనలు, ఆందోళనలు ఎలా ఉన్నప్పటికీ, ఈ ఎన్నికల ఫలితాల గురించి మరీ ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాల అభిప్రాయాలన్నీ నిజం అవుతాయని అనుకోవడానికీ వీల్లేదు. నిజానికి, బీజేపీ దెబ్బతినడానికి గల అవకాశాలు పెరిగాయి.
మోదీ దూరదృష్టి ప్రభావం
శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాలు సాధించడానికి ప్రధాన కారణం మోదీకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడమే. మోదీ బొమ్మను, మోదీ సాఫల్యాలను, విజయాలను చూపించి బీజేపీ రాష్ట్ర ఎన్నికల్లో విజయాలు సాధిస్తోంది. సాధారణంగా భారతదేశంలో స్థానిక సమస్యలు, ముఖ్యమంత్రి పాలన తీరు వగైరాలు రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ప్రాధాన్యం సంతరించుకుంటాయి. గతంలో బీజేపీ కూడా శాసనసభ ఎన్నికల్లో స్థానిక సమస్యలనే ప్రస్తావించేది. పార్టీలు గెలిచినా, ఓడినా స్థానిక సమస్యల కారణంగానే జరిగేది. స్థానిక నాయకత్వం సత్తాను బట్టే ఎన్నికల ఫలితాలు నిర్ధారణ అయ్యేవి. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. ముఖ్యంగా మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కారణంగానే ఎన్నికల్లో జయాపజాలు నిర్ధారణ అవుతున్నాయి. ప్రస్తుతం మోదీ తమ పార్టీ కంటే ఎక్కువగా ప్రాధాన్యం సంతరించుకున్నారు. బీజేపీ కూడా మోదీనే ప్రచారానికి ఉపయోగించుకుంటోంది.
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించడమనేది బీజేపీ విషయంలో జరగడం లేదు. మోదీ గ్యారంటీల చుట్టూనే ప్రచారమంతా తిరుగుతోంది. పార్టీ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం జరుగుతోంది. ఆ ముఖ్యమంత్రి కూడా మోదీ చేతిలో కీలుబొమ్మగా మారడం జరుగుతోంది. అంటే ప్రధాని మోదీయే ముఖ్యమంత్రిగా అవతారమెత్తడం జరుగుతోంది. సాధారణంగా పాలక పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య ఓట్ల శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇది చాలా ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారమే. ఈసారి కూడా ఉత్తరాదిలోని మూడు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఈ ఓట్ల శాతం ఈ పాలక, ప్రతిపక్షాల మధ్య చాలా తక్కువగానే ఉన్నప్ప టికీ, సీట్ల వ్యత్యాసం మాత్రం ఎక్కువగా ఉంటోంది.
రాజస్థాన్‌లో బీజేపీకి 115 సీట్లు, కాంగ్రెస్‌ కు 69 సీట్లు వచ్చినప్పటికీ ఓట్ల శాతం రెండు శాతానికి మించి లేకపోవడం గమనించాల్సిన విషయం. విచిత్రమేమిటంటే, ఈ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ ఓట్ల శాతం ఏమాత్రం తగ్గలేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్‌ పట్ల ఓటర్లు కొద్దిగా కూడా అభిమానం కోల్పోలేదనడానికి ఇదే నిదర్శనం.
పెరుగుతున్న పట్టు
మోదీ ప్రపంచంలోనే ఒక అగ్రస్థాయి నాయకుడుగా ఎదుగుతున్నాడనడంలో సందేహం లేదు. ప్రపంచంలో అనేక దేశాలకు ఆయన మార్గదర్శిగా కూడా మారడం జరిగింది. అయితే ఆయన, ఆయన పార్టీ ఈ గుర్తింపును స్థానిక ఎన్నికలకు కూడా ఉపయోగించుకోవడం జరుగుతోంది. నిజానికి ఇటువంటి తీరు ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ప్రపంచ దేశాల మీద పెరుగుతున్న ఆధిపత్యంతో దేశం మీద కూడా, చివరికి రాష్ట్రాల మీద కూడా ఆధిపత్యం సంపాదించడానికి ప్రయత్నం జరుగుతోంది. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల మీదే కాదు, తాము అధికారంలో లేని రాష్ట్రాల మీద కూడా పట్టు సాధించడానికి మోదీ నాయకత్వంలోని బీజేపే ప్రయత్నాలు సాగిస్తోంది. విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, మతాలు, కులాలు కలిగిన భారతదేశంలో ఇటువంటి ప్రయత్నాలు చేయడం నిజంగా ఓ సాహసమే. అయినప్పటికీ మోదీ ఈ ప్రయత్నంలో చాలావరకు విజయం సాధిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, కాంగ్రెస్‌ కూడా మోదీ లాగానే రాష్ట్రా లపై పట్టు సాధించడానికి ప్రయత్నించినట్టు అర్థమవుతుంది. ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ హయాంలలో కాంగ్రెస్‌ పార్టీ ప్రపంచ దేశాలను మోదీ మాదిరికగా ప్రభావితం చేయకుండానే రాష్ట్రాలన్నిటిపై పెత్తనం సాగించడానికి విశ్వ ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం విఫలం అయినందువల్లే తెలుగు రాష్ట్రాలలో కూడా పదేళ్లుగా అధికారానికి దూరమైంది.
ఏ రాష్ట్రంలోనైనా రెండు పర్యాయాలు అధికారానికి దూరమైతే మూడో పర్యాయం విజయం సాధించడం అంత తేలికైన విషయం కాదు. అయితే, తెలంగాణలో ఇందుకు భిన్నంగా జరిగింది. దేశానికి రాష్ట్రాల సమాఖ్య అనేది అవసరమనీ, దేశంలో మరింతగా అధికార వికేంద్రీకరణ జరగాలనీ భావించే కాంగ్రెస్‌ పార్టీ కొన్ని ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి, దక్షిణాదిలో బీజేపీ అడుగుపెట్టకుండా చేయగలిగింది. స్థానిక సంస్కృతీ సంప్రదాయాలను అడ్డుపెట్టుకుని బీజేపీని దక్షిణాదికి దూరంగా ఉంచగలిగింది. అదే విధానాన్ని ఉత్తరాదికి కూడా విస్తరించడానికి కాంగ్రెస్‌ కృషి చేయాల్సి ఉంటుంది. ఒక్క కాంగ్రెస్‌ పార్టీయే కాదు, ప్రతిపక్షాలన్నీ కలిసి, ఇటువంటి విధానాన్ని, వ్యూహాన్ని దేశమంతా అమలు చేయగలుగుతాయా? నిజానికి ఇది కష్టసాధ్యమైన విషయమేమీ కాదు. ఈ విధానం విజయం సాధిస్తుందనే విషయం తెలంగాణ విజయంతో రుజువు అయింది కదా. 2014లో జాతీయ రాజకీయ తెర మీదకు మోదీ రాక ముందు కాంగ్రెస్‌ తదితర ప్రతిపక్షాలు స్థానిక సమస్యలను, స్థానిక నాయకత్వాన్ని చూపించి ఎంత దూకుడుగా ప్రచారం సాగించాయో, అదే స్థాయిలో జాతీయ స్థాయి ఎన్నికల్లో కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అదే జరిగితే, బీజేపీ సంఖ్యాబలం గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
ఐక్యతకు అగ్ర ప్రాధాన్యం
ఇది జరగాలన్న పక్షంలో ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్‌ నాయకత్వంలో ఒకే తాటి మీద నడవాల్సి ఉంటుంది. అనేక అంశాల మీద తాము మోదీ విధానాల కంటే విభిన్న విధానాలను అనుసరించ గలమనే విషయాన్ని ఓటర్ల మనసుల్లోకి తీసుకు వెళ్లగలగాలి. ముఖ్యంగా తటస్థ ఓటర్ల మనసులను మార్చగలగాలి. దాదాపు రెండు దశాబ్దాలుగా మోదీ వెనుక వరుస కట్టిన ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలు ఎక్కువగా మోదీ గ్యారంటీలకు తగ్గట్టుగా సంక్షేమ పథకాలను ప్రచారంలోకి తీసుకు రావాల్సిన అవసరం కూడా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిపక్షాలు తమ అంతఃకలహాల కంటే ఎన్నికల్లో విజయం సాధించడాన్నే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పని చేయాల్సి ఉంటుంది. వచ్చే వారం జరగనున్న ఇండియా కూటమి సమావేశాల్లో కాంగ్రెస్‌ పరాజయాల గురించి ఎక్కువగా చర్చించకుండా బీజేపీ మీద విజయం సాధించడం ఎలా అన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించడం మంచిది. ప్రతి విషయంలోనూ ప్రతిపక్షాల కంటే బీజేపీ ఒక అడుగు ముందున్న విషయాన్ని విస్మరించకూడదు. బీజేపీ తాను బలోపేతం అవుతూనే ప్రతిపక్షాలను బలహీనపరచడం జరుగుతోంది. ప్రతిపక్షాల బలహీనతలను సాధ్యమైనంతగా సద్వినియోగం చేసుకుంటోంది. మూడు ప్రధాన హిందీ రాష్ట్రాలలో అది ఘన విజయాలు సాధించడానికి అదే చాలావరకు కారణం అయింది.

  • జి. రాజశుక
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News