Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్BJP's new gift to RSS: ఆరెస్సెస్‌కు బీజేపీ సరికొత్త వరం

BJP’s new gift to RSS: ఆరెస్సెస్‌కు బీజేపీ సరికొత్త వరం

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌.ఎస్‌.ఎస్‌) కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై ఉన్న నిషేధాన్ని బీజేపీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఏ ప్రభుత్వం తొలగించడం దేశంలో ఒక సంచలన విషయంగా మారింది. ఈ మధ్య కాలంలో బీజేపీకి, ఆర్‌.ఎస్‌.ఎస్‌ కు పెరిగిన అగాధాన్ని పూడ్చడానికే బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ, ఆర్‌.ఎస్‌.ఎస్‌ నాయకులు ఎన్నికల ముందు నుంచి ఒకరి మీద ఒకరు విమర్శలు సంధించుకోవడం జరుగుతోంది. ఫలితంగా ఈ రెండు సంస్థల మధ్య దూరం క్రమంగా ఎక్కువవుతోంది. బీజేపీకి ఆరెస్సెస్‌ సైద్ధాంతికంగా మాతృ సంస్థ అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పని తీరు మీద తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా ఆరెస్సెస్‌ మీద దుర్భాషలాడిన సంగతి తెలిసిందే. బీజేపీ ఒక స్వతంత్రమైన పార్టీ అని, దాని వ్యవహారాలను అది నిర్వహించుకోగలదని నడ్డా వ్యాఖ్యానించడం జరిగింది.
వీటన్నిటి ఫలితంగా బీజేపీ, ఆరెస్సెస్‌ ల మధ్య దూరం పెరగడం, పార్టీకి, ప్రభుత్వానికి ఒక విధమైన అసౌకర్యం ఏర్పడడం జరిగింది. ఈ రెండింటి మధ్య సంబంధాలను మెరుగుపరచడానికే బీజేపీ ప్రభుత్వం ఆర్‌.ఎస్‌.ఎస్‌ కార్యకలాపాల్లో పాల్గొనే విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై నిషేధం ఎత్తివేసినట్టు కనిపిస్తోంది. ఈ నిషేధం గత యాభై ఏళ్లుగా అమలులో ఉన్నప్పటికీ, గత పదేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఎత్తివేసే విషయం ఆలోచించకపోవడం, ఇప్పుడు హడావిడిగా ఈ నిషేధాన్ని ఎత్తేయడం బీజేపీ ఉద్దేశాలకు అద్దం పడుతోంది. ఆరెస్సెస్‌, జమాతే ఇస్లామీ వంటి సంస్థల కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా నిషేధం విధిస్తూ 1966, 1970, 1980 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆల్‌ ఇండియా సర్వీస్‌ నిబంధనల ప్రకారం కూడా ఈ రెండు సంస్థల కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదు. ఈ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల్లో గానీ, రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న సంస్థల కార్యకలాపాల్లో గానీ పాల్గొనకూడదు. గత జూలై 9న కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలనన్నిటికీ రద్దు చేస్తూ, ఆరెస్సెస్‌ కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడంపై ఉన్న నిషేధాన్ని తొలగించింది.
కొన్ని రాష్ట్రాల్లో దీనిపై న్యాయస్థానాల్లో కేసులు విచారణలో ఉన్నాయి. ప్రభుత్వ వ్యవహారాలకు రాజకీయ వ్యవహారాలను దూరంగా ఉంచాలన్న సదుద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగు లను పార్టీలు, పార్టీల అనుబంధ సంస్థల కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధించడం జరిగింది. ఈ రెండింటికి మధ్య ఉన్న గీతను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి పరిస్థితుల్లోనూ దాటకూడదన్నది ప్రభుత్వ ఉద్దేశం. పాలనా వ్యవస్థ అనేది శాశ్వతంగా ఉంటుంది. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. అందువల్ల ఉద్యోగులు పార్టీ వ్యవహారాలతో సంబంధం పెట్టుకోకూడదనే నిబంధన రూపుదిద్దుకుంది. రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ప్రభుత్వాలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నిబంధనలను రూపొందించడం జరిగింది. అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇతర పార్టీలు, ఆ పార్టీల అనుబంధ సంస్థల కార్యకలాపాల్లో పాల్గొనడం అనేది జరుగుతూనే ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక్క ఆరెస్సెస్‌, జమాతే ఇస్లామీలకు మాత్రమే పరిమితం కాలేదు. అంతేకాక, ఆరెస్సెస్‌, జమాతే ఇస్లామీ సంస్థల కార్యకలాపాల్లో ఉద్యోగులు పాల్గొనడం కూడా మొదటి నుంచి జరుగుతూనే ఉందని కూడా రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆరెస్సెస్‌ సంస్థ బీజేపీకి సైద్ధాంతిక మాతృ సంస్థ అనీ, ఆరెస్సెస్‌ కు రాజకీయాలతో సంబంధం లేదనో, అదొక సాంస్కృతిక సంస్థ అనో వాదించడం వల్ల ఉపయోగం లేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఉద్యోగులను ఆరెస్సెస్‌ కార్యకలాపాల్లో పాల్గొననివ్వడం వల్ల పాలనా యంత్రాంగం తటస్థంగా ఉండడమనేది అదృశ్యమైపోతుందని ఇతర పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది పాలనా యంత్రాంగాన్ని రాజకీయమయం చేస్తుంది. వేరే పార్టీలు అధికారంలోకి వచ్చే పక్షంలో పాలనా యంత్రాంగం పక్షపాత ధోరణితో వ్యవహరించడం ప్రారంభిస్తుంది. పాలనా యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికే బీజేపీ ప్రభుత్వం ఇటువంటి చర్యకు ఒడిగట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, అనేక రాష్ట్రాల్లో ఈ నిషేధం కొనసాగుతుండడం గమనార్హం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News