Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Library and book reading: చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం...

Library and book reading: చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో

లైబ్రరీ సదుపాయంలో ముందున్న ఢిల్లీ, హర్యానా, పంజాబ్

1918 సంవత్సరంలో భారత జాతీయ వైజ్ఞానిక మంత్రిత్వ శాఖ వారు జాతీయ గ్రంథాలయ సదస్సును లాహోర్ నందు నిర్వహించారు. అప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రంథాలయ ఉద్యమం మహోదృతంగా జరుగుతున్నది. దాదాపు ఈ సమయానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో గ్రంథాలయాలు భాషా నిలయాల పేర ఏర్పాటు చేయబడినవి. ఈ తెలుగు రాష్ట్రాల నుండి గ్రంథ పాలకులు, గ్రంథాలయ ఉద్యమకారులు పాల్గొన దలిచారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం వారు అనుమతించ లేదు. ఆ మరుసటి సంవత్సరం 1919లో మద్రాస్ లోని గోకలే హాల్ నందు పద్మశ్రీ అయ్యంకి వెంకట రమణయ్య గారు రెండు రోజుల పాటు నవంబర్ 14 15 తేదీలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బరోడా సంస్థానం నుండి కుడాల్కర్ అనే గ్రంధాలయ అధికారి అధ్యక్షులుగా వ్యవహరించారు. గ్రంథాలయ నిర్వహణ అధికారులు, గ్రంథాలయ కార్యకర్తలు వందల సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు..1968లో భారత ప్రభుత్వం శ్రీ చక్రవర్తి గారి అభ్యర్థన మేరకు గ్రంథాలయాలకు జాతీయ వ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించి తెలుగువారు విజయవంతంగా నిర్వహించిన తొలి జాతీయ సదస్సు జరిగిన తేదీలనే జాతీయ గ్రంథాలయ వారోత్సవంగా ప్రకటించడం జరిగింది.

- Advertisement -

అసలు ఈ గ్రంథాలయ వారోత్సవాలు (వారం రోజులపాటు) నవంబర్ 14 నుండి 20వ తారీకు వరకు అన్ని పౌర, అకాడమిక్, స్పెషల్ గ్రంథాలయాలలో ఘనంగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తారు. అసలు ఈ వారం రోజులపాటు గ్రంథాలయలలో ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తారు అనే విషయాలను చర్చించినట్లైతే ముఖ్యంగా గ్రంథాలయాలలో ఉన్న నూతన పుస్తకాలను, ప్రాముఖ్యత గల పుస్తకాలు, ఎక్కువగా చదివే పుస్తకాలను ప్రదర్శనను నిర్వహించి ఆబాల గోపాలాన్ని, విద్యార్థులను, పెద్దలను, మహిళలను గ్రంథాలయాలకు ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ పోటీలు, కవితల పోటీలు, వక్తృత్వ పోటీలు, బుక్ రివ్యూ స్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి చదువరులను ఎక్కువగా ఈ వారోత్సవాల లో భాగం అయ్యే ప్రయత్నం చేస్తారు.

అవసరమైతే విద్యార్థులను, పెద్దలను ఆకర్షించే ప్రయత్నం చేసేందుకు వివిధ వినూత్న కార్యక్రమాలు (బుక్ హంట్, బుక్ రివ్యూస్, నూతన పుస్తక రచయితలచే సంభాషణ, కవిత్వం ఏ విధంగా రాయాలి, రచన ఏవిధంగా చేయాలి, నాయకుడిగా ఏ విధంగా ఎదగాలి, పోటీ పరీక్షలకు ఏవిధంగా చదవాలి మొదలగు) నిర్వహించి గ్రంథాలయం పై పుస్తకాలపై, పుస్తక పఠనంపై ఆసక్తి కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలి.

ఏ గ్రంథాలయమైన నాలుగు కాలాలపాటు వెలుగొందాలంటే ఆ గ్రంథాలయంలో సరియైన పుస్తక సంపద ఉన్నదా, ఉన్న పుస్తక సంపద ప్రస్తుత చదువురులకు ఉపయోగపడుతున్నదా, గ్రంథాలయానికి ఆర్థిక వనరులు సమతుల్యంగా ఉన్నవా, గ్రంథాలయలలో సేవలు అందించే గ్రంథ పాలకులు ఉన్నారా, గ్రంథాలయ భవనాలు సరిగా ఉన్నవా, మౌళిక వసతులు అన్ని సమపాళ్లల్లో ఉన్నప్పుడు మాత్రమే గ్రంథాలయాలు చదువరులకు సేవలందిస్తాయి.

పుస్తకాల గురించి చర్చకు వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న పౌర గ్రంథాలయాలలో ఆ ప్రాంత పరిసర జనాభా కనుగుణంగా గ్రంథాలయాలు ఏర్పాటు చేయబడలేవు అనేది వాస్తవం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, కేరళ ఈశాన్య రాష్ట్రాలలో మిజోరం ఉత్తరాది రాష్ట్రాలలో ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలలో ఉన్న పుస్తక సంపద ప్రస్తుత చదువరులకు కనుగుణంగా ఉన్నది. తమిళనాడు, కేరళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రంలో పుస్తక సంపద బాగా ఉన్నప్పటికిని అది ప్రస్తుత చదువరుల అవసరాలకు అనుగుణంగా లేదని ఒకటి రెండు రాష్ట్రాల్లో మాత్రమే బాగా ఉన్నాయని సర్వేలు చెప్తున్నాయి.
ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు పుస్తక సంపద పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకాలు చానా తక్కువగా అందుబాటులో ఉన్నాయి కానీ ఇక్కడ చదువరులు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలకు మాత్రమే ఆదరణ ఉన్నది..
పౌర గ్రంథాలయాలు అన్ని రకాల చదువరులు (పిల్లలు, మహిళలు ,పెద్దలు) ఉపయోగించుకోవాలి కానీ ప్రస్తుతం పౌర గ్రంథాలయాల్లో ఎక్కువ భాగం పోటీ పరీక్షలు సంబంధించిన చదువరులు మాత్రమే ఎక్కువగా ఉపయోగించు కుంటున్న సందర్భంగా దానికి అనేక కారణాలు కావచ్చు.. మహిళలకు, పిల్లలకు అన్నీ మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో ఉన్న గ్రంథాలయాలలో వారికి సంబంధించిన విభాగాలు లేకపోవడం, ఒకవేళ ఉన్న వారికి సంబంధించిన పుస్తక సంపద (మహిళలకు – అల్లికలు, కుటీర పరిశ్రమలకు, వంటలు, డిజైనింగ్ సంబంధించిన పుస్తకాలు, పిల్లలకు – చిన్నపిల్లలకు సంబంధించి బొమ్మల పుస్తకాలు, ఆటల పుస్తకాలు, డ్రాయింగ్ , ఆట వస్తువులు, చిన్న చిన్న కథల పుస్తకాలు) అందుబాటులో లేవు..

ప్రస్తుతం సమాజం సమాచార సాంకేతిక రంగం అన్ని రంగాలపై ప్రభావితం చూపిస్తున్నది. అదేవిధంగా ప్రస్తుతం విద్యార్థులు ఎక్కువగా పుస్తకాల కంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు (అది కాలయాపన కోసమా లేక చదువుల కోసమో గాని)… పుస్తకాలను విద్యార్థులకు చదివే అలవాటు, తల్లిదండ్రుల ద్వారా కానీ , విద్యార్థుల ద్వారా కానీ, పాఠశాల ఉపాధ్యాయుల ద్వారా, గ్రంథాలయాల ద్వారా అలవర్చుకొని జ్ఞానాన్ని సముపార్జించుకుని ఉన్నత విలువలు గల పౌరులుగా పుస్తకాలు తీర్చిదిద్దుతాయి…

విద్యార్థులను పుస్తక ప్రదర్శనలకు, నూతన పుస్తక పరిచయ కార్యక్రమాలకు, పుస్తక రివ్యూ కార్యక్రమాలకు, గ్రంథాలయాలకు తల్లితండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ తీసుకువెళ్లి పుస్తక పఠన రుచిని కలిగించాలి..

ఇక భవనాలు ఫర్నిచర్ విషయాలలో చర్చించినట్లయితే ఉత్తరాది రాష్ట్రాలతో (ఢిల్లీ పంజాబ్ తప్ప) పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు చక్కటి భవన సముదాయము ఫర్నిచర్ కలిగి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నూతన భవనాలు నిర్మించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన భవనాలు నిర్మించిన దాఖలాలు లేవు..

ఒకప్పుడు యువకుల చేతిలో గడియారం పుస్తకం ఉండేవి అవి గౌరవంగా గొప్పగా భావించేవారు నేడు మొబైల్ ఫోన్, పామ్ టాప్ లు గొప్పగా భావిస్తున్నారు…
పుస్తకాలు చదవడం అనేది సాహిత్య పరిచయానికి, ఆట పాటల కోసమో కాలక్షేపానికో, కాదు పఠన ప్రభావం వలన విద్యార్థుల మానసిక పరిధి విస్తరిస్తుంది అని రకరకాల పరిశోధనలు నిరూపించాయి. పుస్తకాలు చదివే విద్యార్థుల ఆలోచనలు, మానసిక ప్రవర్తన, విద్యార్థుల ఎదుగుదల పుస్తకాలు చదవని విద్యార్థులతో పోల్చుకుంటే మెరుగుగా ఉంటాయి. మార్గ సర్వే 2022-23 ప్రకారం అత్యధికంగా పుస్తక పఠనం చేసే దేశాలలో భారతదేశం ముందు ఉన్నప్పటికిని జనాభాతో పోలిస్తే ఇంక ను పుస్తక పఠనం విద్యార్థులలో యువకులలో పెరగవలసిన అవసరం ఉన్నది దానికనుగునంగా ప్రభుత్వ పాఠశాలల్లో, గ్రామాలలో, కళాశాలలో విద్యార్థులకు గ్రంథాలయాలు అందుబాటులో ఉంచాలి సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాలే కాకుండా సమాజ శాస్త్రాలకు సంబంధించిన, విలువలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. వాటిని ఉపయోగించుకునే విధంగా విద్యార్థులను ప్రేరేపించాలి.. అంతేకాకుండా గ్రంథాలయాలకు సంబంధించిన బడ్జెట్ లు కానీ, మౌలిక వసతులు గాని, పుస్తక సంపద కానీ, గ్రంథ పాలకులు కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు చేయాలి… పుస్తకాలు తరతరాల వారదులు జ్ఞానాన్ని పంచే నిధులు అక్షరాలను తనను లెక్కించుకొని అందంగా దాచుకున్న బంగారు గనులు పుస్తకాలు ఆ గనుల కేంద్రాలు గ్రంథాలయాలు…. సకల విద్యలు నేర్పేది గురువు, సమాజ జ్ఞానం నేర్పేది తల్లిదండ్రులు, స్నేహితులు కానీ కానీ ఈ చరాచర జగత్తులో ఆది నుండి అంతం వరకు అణువణువు తెలుసుకునే ఏకైక మార్గం ఆ పుస్తకాలు కొలువై ఉన్న గ్రంథాలయమే..

గ్రంథ పాలకుల విషయాలకు వచ్చినట్లయితే కేరళ, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలలో తప్పితే గ్రంథ పాలకుల నియామకం కానీ, ఉన్న గ్రంథ పాలకుల సామర్థ్యం కాని అథమ స్థానంలో ఉన్నాయని…. పుస్తకాలు ఉపయోగించుకునేటువంటి వారిలో అత్యధికంగా ఢిల్లీ,కేరళ, తమిళనాడు, కర్ణాటక ,ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా, మిజోరాం , తెలంగాణ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి.

వివిధ రాష్ట్రాలలో గ్రంథాలయ పన్ను ద్వారా పౌర గ్రంథాలయాలకు ఆర్థిక వనరులు లభ్యమవుతున్నాయి. రాజా రామ్ మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ గత ఐదు దశాబ్దాలుగా భారతదేశంలో ఉన్న పౌర గ్రంథాలయాలకు ఆర్థిక వనరులు, పుస్తకాల కొనుగోలు, భవన నిర్మాణాలకు, మౌలిక వసతులకు, గ్రంథ పాలకులకు సెమినార్లు, తర్ఫీదు కార్యక్రమాలు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నది.

ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్ వారు (IFLA), యునెస్కో లైబ్రరీ మేనిఫెస్టో 1949, 1994, 2021-22 ప్రకారం తొలుత 5000 జనాభాకు ఒక గ్రంథాలయం, రెండువేల జనాభాకు ఒక గ్రంథాలయం, వెయ్యి జనాభా కు గ్రంథాలయం ఏర్పాటు చేయాలి అనే నియమం ఉన్నప్పటికీ అనేక కారణాల వల్ల గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం జరిగలేదు. రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ వారి ప్రకారం దాదాపు 50 వేల పౌర గ్రంథాలయాలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయబడ్డవి. మార్గ్ సర్వే ప్రకారం 70 817 పౌర గ్రంథాలయాలు గ్రామీణ ప్రాంతాలలో, 45 80 పౌర గ్రంథాలయాలు పట్టణ ప్రాంతాలలో ఏర్పాటు చేయబడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 115 00 జనాభాకు ఒక గ్రంథాలయం, 80,000 పట్టణ జనాభాకు ఒక గ్రంథాలయం ప్రస్తుతం సేవలు అందిస్తున్నాయన్నమాట.

గ్రంథాలయాలలో మౌలిక వసతుల కల్పనలో ఉత్తరాది రాష్ట్రాలలో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, దక్షిణాది రాష్ట్రాలలో కేరళ, కర్ణాటక రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని మార్గ్ సర్వే చెబుతున్నది.

ఇప్పటికినీ రాజా రామ్మోహన్ లైబ్రరీ ఫౌండేషన్ వారు వివిధ రాష్ట్రాల పౌర గ్రంథాలయాలకు భవనాల కొరకు, మౌలిక వసతుల కొరకు, నూతన పుస్తకాల ఖరీదు కొరకు, సెమినార్ల కొరకు, గ్రంథ పాలకులు తర్ఫీదు కొరకు మ్యాచింగ్ గ్రాంట్ లను నాన్ మ్యాచింగ్ గ్రాంట్ లను ఇచ్చేందుకు అంగీకారం తెలిపినప్పటికిని అనేక రాష్ట్రాలు సహకారం కొరకు అప్లై చేయకపోవడం ఇబ్బందికరమైన విషయం.

ఇక గ్రంథపాలకుల సమస్యలు పరిశీలిస్తే అనేక రాష్ట్రాలలో గ్రంథ పాలకుల సంఖ్య చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు, ఉన్నవారు కూడా ఒక గ్రంథ పాలకుడు నాలుగైదు గ్రంథాలయాలను నిర్వహించవలసి వస్తుంది. ఒకవేళ గ్రంథపాలకుడు ఉన్న తాత్కాలిక ప్రాతిపదికనో, ఒప్పంద పద్ధతి ప్రకారమో, అర్హత లేని గ్రంథపాలకులు ద్వారా గ్రంథాలయ నిర్వహణ చేపడుతున్నారు. దీనివల్ల నాణ్యమైన సమాచారాన్ని సరైన పాఠకుడికి సరైన సమయంలో అందించడంలో పౌర గ్రంథాలయాలు విఫలమవుతున్నాయి. అలానే భారత జాతీయ ప్రభుత్వం రాష్ట్రాలలో ఉన్న అన్ని పౌర కేంద్ర గ్రంథాలయాలను డిజిటల్ చేసి జాతీయ గ్రంథాలయాలతో అనుసంధానం చేస్తాము ప్రభుత్వం ప్రకటించడం జరిగింది….
ఇలా గ్రంథాలయాల ఉన్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి అదేవిధంగా ఈ గ్రంథాలయాల ద్వారా నాణ్యమైన సమాచారాన్ని చదువరులకు అందించే ప్రయత్నం చేయాలని ఆశిద్దాం..

  • డాక్టర్. సుంకరి. రాజా రామ్
    సహాయ ఆచార్యులు
    ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్లగొండ
    సెల్ :7799910222
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News