స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్ నగరంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సు ముగిసింది. జనవరి 20 నుంచి 24వ తేదీ వరకు.. అంటే ఐదు రోజుల పాటు నిర్వహించిన ఈ సదస్సులో పలు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సు ముగిసే సమయానికి తుది ఫలితాలు చూసుకుంటే.. ఈసారి ఛాంపియన్ మాత్రం కచ్చితంగా తెలంగాణనే అని చెప్పక తప్పదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం దుమ్ము రేపింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత నుంచి ఇప్పటివరకూ ఎన్నడూ లేని విధంగా ఈసారి సుమారు రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులకు వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి వల్ల రాష్ట్రంలో కొత్తగా దాదాపు 50 వేల ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. ముఖ్యమంత్రిగా ఇప్పటివరకు ఎలాంటి అనుభవం లేని రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొందరు అధికారులు కలిసి ముందునుంచి అత్యంత పకడ్బందీగా లాబీయింగ్ చేశారో తెలియదు గానీ… దావోస్‌ను దడదడలాడించారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు ‘తెలంగాణ రైజింగ్’ పేరుతో వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ బృందం అత్యంత భారీ స్థాయిలో పెట్టుబడులు సాధించింది. గత ఏడాది రూ.40,232 కోట్ల పెట్టుబడులే సాధించగా.. ఈసారి దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా సాధించడం విశేషం.
వేదికగా దావోసే ఎందుకు ?
ఇంతకుముందు కూడా రేవంత్ రెడ్డి బృందం దావోస్ వెళ్లింది. అయితే, అప్పట్లో రేవంత్‌రెడ్డికి ఆంగ్ల పరిజ్ఞానం కొంత తక్కువ కావడంతో కాస్త ఇబ్బంది పడ్డారు. అక్కడ వివిధ సంస్థల ప్రతినిధులతో మాట్లాడేటప్పుడు ఆయన తడబడడంతో అందరూ ఆయనను ట్రోల్ చేశారు. ఈసారి మాత్రం రేవంత్ తన బలహీనతనే బలంగా మార్చుకున్నారు. తమ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ లాంటి వాళ్లను వెంటబెట్టుకుని వెళ్లారు. ముందుగా చేయాల్సిన లాబీయింగ్ లాంటి అంశాలు తాను చూసుకున్నారు. అక్కడ మాట్లాడాల్సి వచ్చినప్పుడు తన సైన్యాన్ని రంగంలోకి దించారు. అక్కడ కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లు వాళ్లతో పాటు ఇతర అధికారులు ఇతర దేశాల ప్రతినిధులతో మాట్లాడే పని చూసుకున్నారు. చాలావరకు ప్రభుత్వ ప్రతినిధిగా శ్రీధర్ బాబు వ్యవహరించారు. రేవంత్ అక్కడే ఉండి, తాను చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పి ఊరుకున్నారు. అయినా కూడా సైలెంట్‌గా భారీ పెట్టుబడులు సాధించారు. అక్కడకు వెళ్లి కూడా స్కైరూట్ ఏరోస్పేస్, మేఘా ఇంజినీరింగ్, సిఫీ టెక్నాలజీస్, అగిలిటీ ఆగ్రో టెక్నాలజీస్, రాంకీ గ్రూప్ వారి డ్రైపోర్ట్, మిత్రా ఎనర్జీ, సన్ పెట్రో కెమికల్స్, జేఎస్‌డబ్ల్యు లాంటి సంస్థలతో కూడా పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. నిజానికి వీటిలో చాలా సంస్థలతో హైదరాబాద్‌లోని తన కార్యాలయంలోనో, లేదా ఏ నోవోటెల్ హోటల్లోనో కూర్చుని కూడా ఒప్పందాలు చేసుకోవచ్చు. కానీ, దావోస్ వేదికనే ఇందుకు ఎందుకు ఎంచుకున్నారు? తన బ్రాండ్ ప్రమోట్ చేసుకోవడం ఎలాగన్నది రేవంత్ రెడ్డికి బాగా తెలుసు.
అనుభవం లేకపోవచ్చు గానీ, అవగాహన మాత్రం కావల్సినంత ఉంది. తన సౌండ్ గట్టిగా వినపడాలంటే.. దావోస్‌లో వచ్చే పెట్టుబడుల మొత్తం పెద్దగా ఉండాలని ముందుగానే రేవంత్ అనుకున్నారు. అందుకే ఇక్కడినుంచి కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలను దావోస్ తీసుకెళ్లారు. వారితో అక్కడే ఒప్పందాలు చేసుకుని, పెట్టుబడుల మొత్తాన్ని లక్షా డెబ్బై తొమ్మిది వేల కోట్లకు చేర్చా రు. దాదాపు 1.80 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి రావడం అంటే చిన్న విషయం కాదు.
విపక్షాల నోళ్లు మూపించేలా
దీనివల్ల రేవంత్ రెడ్డికి బహుముఖ ప్రయోజనాలు నెరవేరుతా యి. ఒకటి సొంత రాష్ట్రంలో ప్రతిపక్షాల నోళ్లు మూతపడతాయి. స్కైరూట్, మేఘా లాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నప్పుడు కొందరు బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేయడానికి ప్రయత్నించారు. ఇంతోటిదానికి అక్కడివరకు వెళ్లడం ఎందుకన్నారు. కానీ, చివరకు అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థలు కూడా తెలంగాణలో మరింతగా విస్తరిస్తామని చెప్పడం, ఆ పెట్టుబడులు మొత్తం కలిపి రూ. 1.79 లక్షల కోట్లకు చేరడంతో ఒక్కసారిగా వాళ్ల నోళ్లన్నీ మూతపడ్డాయి. ఇక విమర్శించడానికి ఎలాంటి అవకాశం లేకపోవడంతో మాట్లాడ కుండా గమ్మున ఉండిపోయారు.
గోతికాడ నక్కలకు
అదే సమయంలో సొంత పార్టీలో కూడా చాపకింద నీరులా వ్యాపిస్తుందనుకున్న అసమ్మతి కూడా ఎక్కడిదక్కడే ఆగిపోయింది. ఇంతకాలం రేవంత్ రెడ్డి సమర్ధత గురించి అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఆ స్థానాన్ని తాము అంది పుచ్చుకోవాలని కొంతమంది నాయకులు గోతికాడ నక్కల్లా కాసుకుని కూర్చున్నారు. వాళ్లంతా కూడా ఇప్పుడు మారు మాట్లాడేందుకు అవకాశం లేకపోయింది. దాంతో ఇప్పుడు ఏ నిర్ణయమైనా గుండెధైర్యంతో, గట్టిగా తీసుకునేందుకు రేవంత్‌కు మంచి అవకాశం లభించింది. నిజానికి హైడ్రా ఏర్పాటు చేయడం, అక్రమ నిర్మాణాలను కూలగొట్టించడం లాంటి చర్యలు చేపట్టినప్పుడు ప్రతిపక్షాల కంటే సొంత పక్షం నుంచే రేవంత్‌కు గట్టి వ్యతిరేకత ఎదురైంది. ఏకంగా అధిష్ఠానం వరకు కూడా ఈ వివాదాన్ని తీసుకెళ్లారు. ఇప్పుడు ఇక ఒక్క హైడ్రా మాత్రమే కాదు.. ఎలాంటి చర్యల విషయంలోనైనా రేవంత్ రెడ్డి దుమ్ము దులిపేస్తారనడంలో సందేహం లేదు.
చంద్రబాబు బృందం ఏం సాధించిందంటే
నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం ఏం సాధించిందంటే మాత్రం.. ఒక్కటంటే ఒక్క అంకె కూడా చెప్పలేకపోయారు!! ఇది చాలా అంటే చాలా విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే, ఒకవైపు పొరుగునున్న తెలంగాణ రాష్ట్రం భారీ స్థాయి పెట్టుబడులు మూటగట్టుకుని వస్తే, ఆంధ్రప్రదేశ్ మాత్రం కేవలం కొన్ని సన్మానాలు, సత్కారాలు చేసి, వారి నుంచి తప్పకుండా చూద్దాం అన్న మాట మాత్రమే తీసుకుని వచ్చింది. బిల్ గేట్స్ కూడా చంద్రబాబు అంటే ఉన్న అభిమానంతో కొంత సమయం ఇచ్చి మాట్లాడారు తప్ప, ఆంధ్రప్రదేశ్‌లో ఇంత పెట్టుబడి పెడతాం అన్న మాట ఆయన నోటి నుంచి వచ్చినట్లు కనిపించలేదు. ఎందుకంటే.. గతంలో చంద్రబాబు 1995లో ఒకసారి బిల్ గేట్స్‌ను కలిశారు. ఆ ఫలితం ఎలా ఉందన్నది మన కళ్లెదుటే హైదరాబాద్ రూపంలో కనిపిస్తోంది. కానీ ఈసారి అదే బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబును, ఐటీ మంత్రి లోకేష్‌ను, అధికారులను కలిసి మాట్లాడారు గానీ… తమ పెట్టుబడులు పెడతామని గానీ, ఫలానా నగరంలో తమ ఫౌండేషన్ తరఫున కార్యకలాపాలు నిర్వహిస్తామని గానీ ఎక్కడా చెప్పలేదు. అలాగే, టాటా గ్రూపు చంద్రశేఖరన్ కూడా చంద్రబాబు బృందంతో సమావేశమయ్యారు. వీళ్లిద్దరే కాదు.. పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా చంద్రబాబు, లోకేష్ తదితరులతో మాట్లాడారు. అంతవరకు బాగానే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే.. నాలుగైదు రోజుల పాటు చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కాలికి బలపం కట్టుకుని తిరిగినట్లు దావోస్ నగరంలోని ప్రపంచ ఆర్థిక సదస్సులో అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను హైడ్రోజన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీలకు కేంద్రంగా మారుస్తున్నామని చెప్పారు. డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామని, గూగుల్ క్లౌడ్ విస్తరిస్తామని… పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులు ఇస్తామని అన్నీ చెప్పుకొచ్చారు. స్విస్‌మెన్, ఓర్లికాన్, ఆంగ్స్ ఫిస్టర్, స్విస్ టెక్స్టైల్స్ తదితర సంస్థల యాజమాన్య ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. కానీ.. వాళ్లలో చాలామంది తప్పకుండా చూద్దాం, చేద్దాం అన్న మాటలు చెప్పారు తప్ప, ఇన్ని వేల కోట్లు.. లేదా కనీసం ఇన్ని వందల కోట్ల పెట్టుబడులు కచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో పెడతామన్న హామీ మాత్రం ఇవ్వలేదు.
ఎందుకిలా జరుగుతోంది?
అసలు చంద్రబాబు అండ్ కో వెళ్లారంటేనే అదో వైబ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీని అందిపుచ్చుకున్న మొదటి ముఖ్యమంత్రిగా ఆయనకు దేశ విదేశాల్లో ఎంతో పేరుంది. ఎక్కడికి వెళ్లినా ల్యాప్‌టాప్ ముందు వేసుకుని పవర్ పాయింట్ ప్రజంటేషన్ల ద్వారా రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరంగా చెప్పి, వారి నుంచి పెట్టుబడులకు సంబంధించిన హామీలు తీసుకుని, మళ్లీ వాటిని గ్రౌండ్ చేయించడంతో ఆయనకు అపారమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. తెలుగుతో పాటు ఇంగ్లీషులో కూడా అనర్గళంగా మాట్లా డుతూ, భావితరం టెక్నాలజీని ఇప్పుడే అందిపుచ్చుకుని మరీ ఆయన అనేకమంది దిగ్గజాలతో మాట్లాడేవారు. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడగలుగుతున్నారు. తన వేలికి పెట్టుకునే స్మార్ట్ రింగ్ దగ్గర నుంచి అన్నీ ఆయన టెక్సేవీగానే కనిపిస్తారు. ఆయన ముందు యువకులు కూడా దిగదుడుపే. రోజుకు 20 గంటలు కూడా కష్టపడగల సామర్థ్యం 74 ఏళ్ల చంద్రబాబులో మెండుగా ఉంది. అయినా కూడా ఈసారి మాత్రం పెట్టుబడులకు సంబంధించిన హామీలు ఏమీ సాధించలేక, కేవలం బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేసుకున్నామని మాత్రం చెప్పుకొంటున్నారు. అదే ఒకటో రెండో లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తే అందుకు సంబంధించి మీడియాలో ప్రచారం అలా ఇలా ఉండేది కాదు. చాలా భారీగానే కనిపించేది. చివరకు చంద్రబాబుకు అత్యంత అను కూలంగా ఉండే రెండు అతిపెద్ద మీడియా సంస్థలు కూడా ఇదీ బ్రాండ్ ఏపీ అని మాత్రమే చెప్పుకొచ్చాయి. అంటే, పెట్టుబడి ఇంత మొత్తం అని చెప్పగలిగే పరిస్థితి లేదని అవి కూడా పరోక్షంగా ఒప్పుకొన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో సాధించిన చంద్రబాబు.. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఈసారి ఎందుకు ఏమీ చేయలేకపోయారు? తమకు రాజధాని నగరం ఇదీ అని చెప్పుకోలేకపోవడం అందుకు ప్రధాన కారణం అయ్యిందా? అమరావతిని రాజధానిగా చెబుతున్నప్పటికీ, ఇప్పటివరకు అక్కడ రాజధాని స్థాయి నిర్మాణాలు ఏవీ పూర్తికాలేదు. నిజానికి గతంలో అంటే 2014-–19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నీ కేవలం తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేశారు. మరికొన్నింటిని ప్రారంభించి వదిలేశారు. జగన్ మూడు రాజధానుల మంత్రం జపిస్తూ అమరావతిని నిర్లక్ష్యం చేయడంతో అవన్నీ అలాగే శిథిల భవనాల్లా ఉండిపోయాయి. చివరకు ఐకానిక్ టవర్లు అంటూ మొదలుపెట్టిన ప్రాంతంలో ఒక్కోటీ ఆరేడు కిలోల బరువుండే చేపలు కూడా పట్టుకున్నారన్న వార్తలు ఇటీవల వినవచ్చాయి. రాజధాని నగరం అలా ఉంటే, ఇక తాము ఎక్కడ పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలు, దిగ్గజ సంస్థల అధినేతలు అనుకున్నారా?
ఆయన తర్వాత ఎవరు?
బ్లూమ్ బర్గ్ టీవీ, ఇండియా టుడే లాంటి జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు దావోస్‌లో చివరిరోజు ఒక మీడియా సమావేశం నిర్వహించినప్పుడు అక్కడ వచ్చిన ప్రధానమైన ప్రశ్నల్లో ఒకటి.. చంద్రబాబు తర్వాత వారసుడు ఎవరు? లోకేష్ మీ వారసుడేనా.. వారసుడే అయితే పార్టీ పగ్గాలు ఎప్పుడు అప్పగిస్తారని అడగ్గా.. ఆయన సూటిగా చెప్పలేదు. గతంలో తానన్న మాటలనే మళ్లీ చెప్పుకొచ్చారు. ‘వ్యాపారం, సినిమాలు, రాజకీయం, కుటుంబం.. ఏ రంగంలోనైనా వారసత్వం అనేది మిథ్య. ఒక తరం వ్యాపార రంగంలో రాణించి బాగా సంపాదిస్తే తర్వాతి తరం దానిని పోగొట్టవచ్చు. మన దేశంలో ఒకప్పుడు బలమైన పార్టీలుగా ఉన్నవి తర్వాత కనుమరుగైపోయాయి. వారసత్వం ఒక్కటే అన్నింటినీ నిలబెట్టలేదు. దానివల్ల కొన్ని మెరుగైన అవకాశాలు వస్తాయి. వాటినెలా అందిపుచ్చుకుంటారన్నది ముఖ్యం. నేనెప్పుడూ జీవనోపాధి కోసం రాజకీయాలపై ఆధారపడలేదు. 33ఏళ్ల కిందట కుటుంబ వ్యాపారం ప్రారంభించాను. నా కుటుంబసభ్యులు దానిని నిర్వహిస్తూ వచ్చారు. అదే వ్యాపారంలో కొనసాగితే లోకేష్‌కు చాలా తేలిగ్గా ఉండేది. కానీ ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారు. అందులో ఆయనకు సంతృప్తి లభిస్తోంది. ఇందులో వారసత్వం ఏమీ లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేతప్ప, తన తర్వాత పార్టీని నడిపించే శక్తి సామర్థ్యాలు లోకేష్‌లో ఉన్నాయని గానీ, లేవని గానీ స్పష్టం చేయలేదు. ప్రతిభ, పనితీరుతోనే లోకేష్ వారసుడిగా ఎదగాలి తప్ప తన కుమారుడు అన్న ఒకే ఒక్క కారణంతో వారసుడు కాలేడన్న అభిప్రాయం చంద్రబాబు మాటల్లో ధ్వనించింది. నిజానికి ఇప్పటికే చంద్రబాబుకు 74 ఏళ్లు దాటిపోయాయి. వచ్చే ఎన్నికల నాటికి ఆయన 80 ఏళ్లకు సమీపంలో ఉంటారు. శారీరకంగా, మానసికంగా ఇంతే దృఢంగా ఉండగలరా, లేదా అనే అనుమానాలు సహజంగానే అందరికీ వస్తాయి. ఒకవేళ చంద్రబాబు తర్వాత వచ్చేవాళ్లు ఆయన విధానాలను అమలుచేయకపోతే ఏంటన్న వాదన కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే, చంద్రబాబు తర్వాత వచ్చిన జగన్.. అంబానీ, అదానీ లాంటి కొంతమంది బడా పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేశారు. కొన్ని పెట్టుబడులు కూడా సాధించారు. అయినా ఆయనపై మాత్రం పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను బెదిరించి తరిమేశారన్న చెడ్డపేరు వచ్చింది. అమరరాజా బ్యాటరీస్ కర్మాగారంలో కాలుష్య ప్రమాణాలు పాటించడం లేదని వారికి నోటీసులు ఇవ్వడంతో ఆ సంస్థ ఏపీని వదిలిపెట్టి తెలంగాణకు వెళ్లిపోతామని ప్రకటించడమే అందుకు ప్రధాన కారణం. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అలాంటి పెడపోకడలు లేకపోలేవు. కూటమిలోని ప్రధాన పార్టీలలో ఒకటైన బీజేపీకి చెందిన ఒక సీనియర్ ప్రజాప్రతినిధి తమ ప్రాంతంలో పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారని, అసలు ఇక్కడ పరిశ్రమలు ఎలా నడిపిస్తారో చూస్తానంటూ హెచ్చరించారని కూడా ఆమధ్య వార్తలు వచ్చాయి. ఇసుక, మద్యం విషయాల్లోనూ ఎమ్మెల్యేలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సామంత రాజులు పాలిస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన రాయబార కార్యాలయాలు ఎప్పటికప్పుడు తమ తమ పరిధిలో ఏం జరుగుతోందన్న విషయాలను తెలియజేస్తూనే ఉంటారు. అవన్నీ అక్కడి పారిశ్రామికవేత్తలకు కూడా అందుతాయి. బహుశా ఈసారి పెట్టుబడులు రాకపోవడానికి ఉన్న ప్రధాన కారణాల్లో అది కూడా ఒకటి అవ్వచ్చనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.
భవిష్యత్తులోనూ సేమ్ సీన్
ఇప్పటికైనా చంద్రబాబు కాస్త గట్టిగా వ్యవహరించి, తన మంత్రివర్గంలో ఉన్నవారు, ఎమ్మెల్యేలు.. అందరిమీదా దృష్టి సారించాలి. ముందు ఇల్లు చక్కబెట్టుకుని, తర్వాత రచ్చకెక్కాలి. లేకపోతే ఇలాంటి పరాభవాలు భవిష్యత్తులో కూడా తప్పకపోవచ్చు. కేవలం సంక్షేమాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే సరిపోదు. రాష్ట్రం అభివృద్ధి పథంలో కూడా పయనించాలి. అప్పుడే ఉద్యోగాల సృష్టి, సంపద సృష్టి జరుగుతాయి. పీ4 అంటూ కొత్త మంత్రం జపిస్తున్న చంద్రబాబు.. నిజంగా ప్రజల భాగస్వామ్యం కూడా సంపాదించాలంటే, వారికంటూ ఒక భరోసా కల్పించాలి. ఒకవేళ నిజంగానే మాతృభూమి మీద మమకారంతో ఎవరైనా ఎన్నారైలు పెట్టుబుడులు పెట్టాలనుకున్నా, అందుకు తగిన వాతావరణం నిజంగానే రాష్ట్రంలో ఉందన్న గట్టి నమ్మకం వారికి అందించాలి. అది లేనంతవరకు ఎంత బ్రాండ్ ప్రమోషన్ చేసుకున్నా.. అది కేవలం ప్రచారానికే పరిమితం అవుతుంది తప్ప క్షేత్రస్థాయిలో పెట్టుబడుల రూపంలోను, చివరకు సంపద రూపంలోకి మారే అవకాశాలు దాదాపు మృగ్యమే.
అంతర్జాతీయ విమానాశ్రయం ఏదీ?
రాష్ట్రంలో ఒక్కటి కూడా అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పుకోదగ్గ స్థాయిలోనివి లేవు. రాష్ట్రంలో పేరుకు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం లాంటి చోట్ల ఎప్పటినుంచో విమానాశ్రయాలు ఉన్నాయి గానీ, వాటి స్థాయి ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయవాడకు సమీపంలో ఉన్న గన్నవరంలో ఉన్నది పేరుకు అంతర్జాతీయ విమానాశ్రయమే గానీ, ఇప్పటివరకు దాని రన్‌వేను కూడా విస్తరించిన పాపాన పోలేదు. అక్కడ ఇంకా చాలా సదుపాయాలు కల్పించాలి, కాస్త పెద్ద విమానాశ్రయం ఉండాలి, ఏరోబ్రిడ్జిలు అవసరం. అర్ధరాత్రి కూడా విమానాలు ల్యాండింగ్, చేయగల సామర్థ్యం ఉండాలి. ఇవన్నీ లేకుండానే అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టేసినంత మాత్రాన సరిపోదు. విశాఖపట్నం సమీపంలోని భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిస్థాయిలో సిద్ధం అయ్యి, దాని సేవలు అందుబాటులోకి వచ్చేసరికి ఎంతలేదన్నా ఇంకో రెండు మూడేళ్లు పడుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే తిరుపతి, పుట్టపర్తి లాంటి ప్రాంతాలకు సమీపంలో ఒక మంచి అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాల్సిన అవసరం ఎప్పటి నుంచో ఉన్నా, పాలకులు ఇన్నాళ్లుగా దాన్ని పట్టించుకోలేదు. రేణిగుంటలో ఉన్న చిన్నపాటి విమానాశ్రయానికి కేవలం దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచే విమానాలు నడుస్తాయి. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఏపీకి రావాలంటే వాళ్లు ఏ హైదరాబాద్‌లోనో దిగి, అక్కడినుంచి రెండు మూడు గంటల తర్వాత మరో విమానంలో వచ్చే పరిస్థితి ఉండకూడదు. నేరుగా ఆంధ్ర ప్రదేశ్ నడిబొడ్డున ఉన్న అత్యాధునిక అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగేలా పరిస్థితులు ఉండాలి. అలా లేకపో వడం కూడా ఆంధ్రప్రదేశ్ వెనకబాటుకు కొంతవరకు కారణం అయ్యిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
వాటీజ్ చంద్రబాబు?
చంద్రబాబు నాయుడు అంటే కేవలం ఒక ముఖ్యమంత్రి మాత్రమే కాదు.. ఆయన ఓ సీఈవో! ఇలాంటి అభిప్రాయాలు గతంలో చాలానే ఉండేవి. దానికి తగ్గట్లే ఆయన ఎక్కడికి వెళ్లినా, ఎవరిని కలిసినా అద్భుతమైన ఫలితాలు వచ్చిపడేవి. పెట్టుబడులు వరదలా వెల్లువెత్తేవి. కియా లాంటి కార్ల కంపెనీ వచ్చి ఎక్కడో అనంతపురం జిల్లాలో భారీ పెట్టుబడులతో ఏకంగా ఒక కార్ల తయారీ కర్మాగారాన్నే ఏర్పాటు చేసిందంటే, అది చంద్రబాబు చాణక్యం వల్ల మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదొక్కటే కాదు.. ఇంకా అనేక సంస్థలు ఆయన హయాంలో క్యూ కట్టాయి. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అయితే మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, విప్రో, టీసీఎస్, కాగ్నిజెంట్.. ఇలా లెక్కలేనన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు చంద్రబాబు వల్లనే హైదరాబాద్‌కు వచ్చాయని చెప్పడానికి అనుమానం అక్కర్లేదు. పూర్తిగా రాళ్ల గుట్టలతో నిండి ఉన్న కొండాపూర్, మాదాపూర్ లాంటి ప్రాంతాలను మరో అమెరికాలా తయారు చేసింది అచ్చంగా చంద్రబాబే. మొన్నీమధ్యే అమెరికా నుంచి మా మిత్రుడి కుటుంబం వచ్చింది. వాళ్లు ఐటీసీ కోహినూర్ హోటల్లో దిగారు. వాళ్ల పిల్లలు పెద్దయిన తర్వాత అక్కడినుంచి ఇక్కడకు రావడం ఇదే మొదటిసారి. రాత్రిపూట హోటల్ కిటికీ లోంచి బయటకు చూస్తున్నప్పుడు వాళ్లు.. డాడ్, మనం ఉన్నది ఇండియాలోనే అంటావా, అమెరికాలో ఉన్నామా? అసలు వాటీజ్ ద బ్యూటీ ఆఫ్ ద సిటీ, వావ్.. ఎక్కడ చూసినా హైరైజ్ టవర్లు, రాత్రి కూడా కార్ల హెడ్ లైట్ల వెలుగులు, బోలెడన్ని ఫ్లై ఓవర్లు… అంటూ తెగ ఆశ్చర్యపోయారు. అప్పుడు నా మిత్రుడు ఆనంద్ నాతో అన్న మాట ఇదే.. చంద్రబాబు అన్న ఒక్క వ్యక్తి లేకపోయి ఉంటే, సైబరాబాద్ అనే కొత్త సిటీ అసలు వచ్చేది కాదు కదా!
ప్రచార ‘స్వేచ్ఛ’
గతంతో పోల్చితే రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులలో గణనీయమైన పెరుగుదల ఉంది. కానీ ఈ అంశానికి సంబంధించి రేవంత్‌కు గానీ కాంగ్రెస్ సర్కారుకు గానీ రావాల్సినంత ప్రచారం రాలేదు. మీడియాలో సీఎంఓ నుంచి వచ్చిన ప్రెస్ నోట్లను యథాతథంగా వాడేసి మమ అనిపించారు. ఇదే విజయం ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ సాధించి ఉంటే ఆ మీడియా సంస్థల రాతలు మరో లెవల్లో ఉండేవి. గతంలోనూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ కోసం పనిచేసే మీడియా చేసిన హంగామా ఇంతా అంతా కాదు. ఆయా సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నదీ ఒక వైపు వివరిస్తూనే , వాటి నేపథ్యం.. పుట్టుపూర్వోత్తరాలు.. అవి పెట్టే పెట్టుబడులు.. వాటి ప్రభావాలు.. బౌగోళిక అభివృద్ధి, సామాజిక మార్పులు, ఆర్థిక వెసులుబాటులు, ఉపాధి అవకాశాలు వంటి అంశాలతో ఎప్పటికప్పుడు ప్రత్యేక కథనాలు వండి వార్చేవారు. ఇలా అరచేతిలోనే బాహుబలి సినిమా చూపించేసేవారు. దీంతో ఆయా నాయకులకు పార్టీకి రావాల్సినంత పొలిటికల్ మైలేజీ వచ్చి పడేది. ఇలా రేవంత్‌కు గానీ కాంగ్రెస్ సర్కారుకు గానీ ఆ విధమైన కవరేజీ ఏ మీడియా సంస్థల నుంచి రాలేదనే చెప్పాలి. ఈ విషయంలో రేవంత్ అండ్ కో ఆలస్యంగా మేల్కున్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో తన కోసం ప్రత్యేక మీడియా ఉండాలనే భావన గట్టిగానే నాటుకున్నట్టు సమాచారం. ఈ పరంపరలోనే కోల్డ్ స్టోరేజీలో ఉన్న ‘స్వేచ్ఛ’కు ప్రాణం పోస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే తెలంగాణ వంటి చైతన్యవంతమైన ప్రాంతంలో ఒక మీడియా ఆయుధం పట్టుకుని తిరిగితే సరిపోదన్నది కాంగ్రెస్ పెద్దల మాట. ఇందువల్లనే సామర్థ్యం ఉన్నప్పటికీ ఇంత వరకూ సౌత్ ఇండియాలో కాంగ్రెస్ తన సొంత మీడియా సంస్థలను స్థాపించలేదు. ఆయా సంస్థలతో అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ తమ పబ్బం గడుపుకుంటూ వచ్చారు. కానీ ఈ దఫా వారి ఆలోచనల్లోనూ మార్పులు వస్తున్నట్టు ప్రచారం ఉంది. ఏడాది కాలంలో చేపట్టిన ప్రజాపాలన విషయంలోనూ సర్కారుకు సీఎంకు మీడియాలో పెద్దగా మైలేజీ రాలేదు. ఈ విషయాలను రేవంత్ అండ్ కో సమీక్షించుకుని తగువిధంగా భవిష్యత్ ప్రచార ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మీడియా వారి కోసం ఏమి చేస్తున్నది. ఏమేరకు కవరేజి ఇస్తున్నది. జల్లెడ పట్టి మరీ పరీక్షించు కోవాల్సిన తక్షణ అవసరం ఉంది. లేని పక్షంలో చేసిన గొప్ప సేవలు . చేపట్టిన సంస్కరణలు, కాలంగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. సో తస్మాత్ జాగ్రత్త సీఎం సాబ్..!
‘సమయం’ కాలం బై సమయమంత్రి చంద్రశేఖర్ శర్మ
98858 09432