Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్BRICS summit Greese: గ్రీస్ దేశంతో వ్యూహాత్మక బంధం

BRICS summit Greese: గ్రీస్ దేశంతో వ్యూహాత్మక బంధం

ఇతర దేశాలతో పోల్చితే గ్రీస్ తో మనకు ఇప్పటివరకు పెద్ద సంబంధాలు లేవు

బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్న తర్వాత గ్రీస్ దేశం వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలో వ్యూహాత్మక బంధాన్ని మరింత పటిష్టం చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు. 1983 తర్వాత భారత ప్రధాని ఈ దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. భారతదేశ ప్రధాని గ్రీస్ దేశాన్ని సందర్శించి నాలుగు దశాబ్దాలు గడిచినప్పటికీ ఈ దేశంతో సంబంధాలు చెక్కుచెదర లేదని, అవి పటిష్టంగానే కొనసాగుతున్నాయని మోదీ ఆ తర్వాత ఒక సంయుక్త ప్రకటనలో వ్యాఖ్యానించారు. నిజానికి, ఏ దేశంతోనైనా ఉన్నత స్థాయి సంపర్కం లేనప్పుడు ఎటువంటి పటిష్టమైన బంధమైనా బలహీనపడే అవకాశం ఉంది. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, స్పెయిన్, సైప్రస్, ఇటలీ వంటి ఐరోపా దేశాలతో భారత్ కు ఉన్న స్నేహ సంబంధాలు గ్రీస్ దేశంతో లేని మాట నిజం. ఇందులో సందేహమేమీ లేదు.

- Advertisement -

గత వారం గ్రీస్ ప్రధాని కైరియాకోస్ మిత్సోతాకిస్ తో సుదీర్ఘ సంభాషణలు జరిపిన ప్రధాని ఈ రెండు దేశాల సంబంధాలను పటిష్టమైన స్థాయికి తీసుకు వెళ్లగలిగారు. గత జూన్ నెలలో మిత్సోతాకిస్ మళ్లీ గ్రీస్ ప్రధానిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు నాయకుల మధ్య దౌత్యపరంగా సంపర్కం ఏర్పడింది. ఈ రెండు దేశాల మధ్యా వ్యూహాత్మక బంధం ఏర్పడాలనే విషయంలో ఈ ఇద్దరు ప్రధానుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. అంతేకాక, ఈ రెండు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల మధ్య తరచూ సంప్రదింపులు జరిగే విధంగా ఒక వ్యవస్థను నెలకొల్పాలని కూడా వీరు నిర్ణయించారు. భారత, ఐరోపా దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందం కింద ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరాలని, చదువులు, ఉద్యోగాల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి, పరస్పర సంబంధాలు చోటు చేసుకోవాలని వీరు భావించారు.

నిజానికి ఈ రెండు దేశాల సంబంధ బాంధవ్యాలు క్రీస్తుపూర్వం 326లో అలెగ్జాండర్ దండయాత్ర చేసినప్పుడే ప్రారంభమయ్యాయి. అయితే, కార్మికుల వలసలు, వాణిజ్య సంబంధాలు ఏర్పడడం వంటివి కూడా జరగాల్సి ఉంది. ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడనిదే ఇటువంటివి జరిగే అవకాశం లేదు. ఐరోపా దేశాలకు ఆర్థికంగా ఒక గేట్ వేగా ఉండాలని గ్రీస్ ప్రయత్నిస్తుండడం, ఒక ప్రపంచ స్థాయి ఉత్పత్తి కేంద్రంగా ఎదగాలని భారత్ తపిస్తూ ఉండడం వంటి కారణాల వల్ల ఈ రెండు దేశాల సంబంధాలు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ప్రధానంగా కనిపిస్తున్నాయని ప్రధాని మోదీ ఆ దేశంలోని ప్రముఖ దినపత్రిక ‘కతిమెరిని’కి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పారు. ఒకప్పుడు వలస రాజ్యపు దోపిడీకి గురైన ఈ రెండు దేశాల తమ కళాఖండాల పునరుద్ధరణకు కూడా ప్రయత్నించబోతున్నాయి. తమ చారిత్రాత్మక ఆస్తులను బ్రిటన్ తమకు తిరిగి ఇవ్వడానికి ఈ రెండు దేశాలు యునెస్కో ద్వారా ప్రయత్నించాలని కూడా
భావిస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య పటిష్టమైన సంబంధ బాంధవ్యాలు ఏర్పడడం వల్ల భౌగోళికంగా,
రాజ కీయంగా కూడా ప్రయోజనాలు ఉన్నాయి. చైనాతో రుణ సంబంధమైన బాధలు పడుతుండడంతో పాటు, ఆర్థికంగా ఒక దారుణ సంక్షోభంలో కూడా చిక్కుకుని ఉన్న గ్రీస్ దేశాన్ని ఆదుకోవడానికి భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది.
భవిష్యత్తులో గ్రీస్ చైనా మీద ఆధారపడకుండా భారత్ మీద ఆధారపడే అవకాశం ఉంది. టర్కీని హద్దుల్లో ఉంచడానికి గ్రీస్ ప్రస్తుతం ఇజ్రాయెల్, సైప్రస్ లను కూడా ఆశ్రయిస్తోంది. కాశ్మీర్, పాకిస్థాన్, చమురు దేశాల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుంటున్న టర్కీకి ముకుతాడు వేయడానికి భారత్ కూడా కొంత కాలంగా ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ చట్టాలకు తగ్గట్టుగా తమ సాగర సంబంధాలను మెరుగుపరచుకోవడానికి కూడా ఈ రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. తూర్పు మధ్యధరా సముద్ర ప్రాంతంలోనూ, ఇండో-పసిఫిక్ సముద్ర ప్రాంతంలోనూ తమకు ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నందువల్ల తమ రెండు దేశాలు కలిసి పని చేయాలని ఇవి నిర్ణయించుకున్నాయి. ఈసారి తమ మధ్య నాలుగు దశాబ్దాల విరామం రాకుండా, తాము తరచూ కలుసుకుంటూ ఉండాలని, తమ సంబంధ బాంధవ్యాలను ఒక కొత్త ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లాలని ఇవి కృతనిశ్చయంతో ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News