Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Britain: బ్రిటన్‌లో ముదిరిన భారత్‌ వ్యతిరేకత

Britain: బ్రిటన్‌లో ముదిరిన భారత్‌ వ్యతిరేకత

ఇటీవల కొంత కాలంలో బ్రిటన్‌లో భారత్‌ పట్ల, హిందువుల పట్ల పెరుగుతున్న వ్యతిరేకత, భారత సంతతికి చెందినవారిపై దాడులు, చెలరేగుతున్న హింసా విధ్వంసకాండలు, లండన్‌లోని భారతీయ దౌత్య కార్యాలయంపై దాడి వంటి పరిణామాలను చూసే వారికి భారత్‌ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కామన్వెల్త్‌ నుంచి బయటపడడం మంచిదనే అభిప్రాయం కలుగుతోంది. భారత వ్యతిరేక శక్తులను నియంత్రించడంలో బ్రిటిష్‌ పాలకుల వైఫల్యం రానురానూ ఆ దేశంలో భీభత్సాలను సృష్టిస్తోంది. కామన్వెల్త్‌తో తన సంబంధాలను భారత్‌ ఇక పునస్సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైనట్టుగా కనిపిస్తోంది. ప్రత్యేకంగా హిందువులను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడాన్ని బట్టి, ఇదంతా విచ్ఛిన్న శక్తుల అరాచకాలు, అకృత్యాలని అర్థం చేసుకోవచ్చు. నిజానికి చాలాకాలంగా హిందువులను స్థానికులు వేధించడం జరుగుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా అటువంటివి అడ్డూ ఆపూ లేకుండా సాగిపోతూనే ఉన్నాయి. చివరికి ఈ మధ్య భారత దౌత్యకార్యాలయం మీద కూడా అరాచక శక్తులు దాడిచేయడాన్ని బట్టి దీన్ని దేశ సార్వభౌమత్వం మీద జరిగిన దాడిగా గుర్తించవలసి వస్తోంది.
భారతీయుల మీద, ముఖ్యంగా హిందువుల మీద దాడులు జరుగుతున్నా బ్రిటిష్‌ ప్రభుత్వం మౌన ప్రేక్షకురాలిగా ఉండిపోతోందని, ఆ దేశంలో భారతీయ వ్యతిరేక శక్తులు అరాచకాలు సృష్టిస్తున్నా అక్కడి ప్రభుత్వంలో వాటిని నియంత్రించలేకపోతోందని అక్కడి భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం బ్రిటిష్‌ ప్రభుత్వానికి అనేక పర్యాయాలు ఫిర్యాదులు చేసింది కానీ, ఆ ప్రభుత్వం సరైన రీతిలో, ఆశించిన స్థాయిలో స్పందించడం లేదు. భారతీయుల మీద ఇదే విధంగా దాడులు కొనసాగితే కామన్వెల్త్‌లో కొనసాగే విషయాన్ని పునస్సమీక్షించాల్సి వస్తుందనే సంకేతాలను కూడా భారత్‌ పంపించింది. నిజానికి, బ్రిటన్‌తోనే కాక, ఇతర కామన్వెల్త్‌ దేశాలతో సైతం భారతదేశం చాలా ఏళ్లుగా సత్సంబంధాలు కలిగి ఉంది. కానీ, బ్రిటిష్‌ ప్రభుత్వ వైఖరిలో వచ్చిన మార్పు భారత్‌ను పునరాలోచింపజేస్తోంది.
ఇటీవల కొద్ది సంవత్సరాలుగా బ్రిటన్‌ భారత వ్యతిరేక శక్తులకు, ముఖ్యంగా ఖలిస్తానీ తీవ్రవాదులకు ఆశ్రయం ఇస్తోంది. ఈ ఖలిస్తానీ, ఇతర తీవ్రవాద శక్తులు భారతీయులపై దాడులు చేస్తున్నా, భారత వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్నా బ్రిటిష్‌ ప్రభుత్వం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది. ముస్లిం ఉగ్రవాదుల కార్యకలాపాలకు కూడా బ్రిటన్‌ ఒక ప్రధాన స్థావరంగా మారుతోంది. బ్రిటిష్‌ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఈ తీవ్రవాద శక్తులను ప్రోత్సహిస్తోందనే వార్తలు కూడా వినవస్తున్నాయి. గత ఏడాది కొన్ని ముస్లిం వర్గాలు లీసెస్టర్‌లో హిందువులపై దాడి చేసి, లూటీలు, గృహదహనాలు వంటి హింసా విధ్వంస కాండలకు పాల్పడ్డారు. బ్రిటిష్‌ పోలీసులు ఈ వర్గాల మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. హిందువులపై దాడులు చేస్తూ హింసకు పాల్పడుతున్న ముస్లిం వర్గాల నాయకులను లీసెస్టర్‌ మేయర్‌ స్వయంగా కలుసుకున్నట్టు కూడా తెలిసింది. ఆయన వారిని కలుసుకున్న తర్వాత హింసాకాండ మరింతగా పెరిగింది. హిందువుల ఆస్తులపై, వ్యాపారాలపై ముస్లిం ఉగ్రవాద వర్గాల దాడులు మరీ శ్రుతిమించిపోయాయి.
వాస్తవానికి, బ్రిటన్‌ భారత్‌కు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, భారత్‌ వ్యతిరేక శక్తులకు ఆశ్రయం ఇచ్చినా కామన్వెల్త్‌ నుంచి తప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్రిటన్‌ కామన్వెల్త్‌ ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందనే విషయం తేలికగా అర్థమైపోతూనే ఉంది. భారతీయులపై ముఖ్యంగా హిందువులపై భారత్‌ వ్యతిరేక శక్తులు దాడులు జరపడానికి బ్రిటన్‌ ప్రభుత్వమే అవకాశం ఇస్తున్నట్టు కూడా రూఢి అవడంతో ఇప్పుడు భారత్‌పై కామన్వెల్త్‌ నుంచి తప్పుకోవాల్సిందిగా ఒత్తిడి వస్తోంది. భారత్‌ కామన్వెల్త్‌లో కొనసాగుతున్నంత కాలం భారత్‌ ఆ దేశానికి లోబడి ఉంటోందనే భావనే తరచూ వ్యక్తమవుతూ ఉంటుంది. బ్రిటిష్‌ సామ్రాజ్యం నుంచి స్వాతంత్య్రం పొందిన దేశాల కూటమే కామన్వెల్త్‌. ఈ కామన్వెల్త్‌లో కొనసాగడం వల్ల భారత్‌ ఇంత వరకూ ఎటువంటి ప్రయోజనమూ పొందలేదన్నది వాస్తవం. భారత్‌లో అస్థిరత సృష్టించడానికి తీవ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు బ్రిటన్‌ వారికి పరోక్షంగా మద్దతునివ్వడాన్ని బట్టి ఆ దేశానికి కూడా భారత్‌లో అస్థిరత్వం సృష్టించే ఉద్దేశం ఉన్నట్టు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కామన్వెల్త్‌ అనేది ఒక ప్రతీకాత్మక కూటమి మాత్రమే. దేశ భద్రత దృష్ట్యా భారత్‌ ఈ కూటమి నుంచి ఎంత త్వరగా నిష్క్రమిస్తే అంత మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News