Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Budget sessions: నీరుకారిన బడ్జెట్‌ సమావేశాలు

Budget sessions: నీరుకారిన బడ్జెట్‌ సమావేశాలు

గత గురువారంతో ముగిసిన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు అనేక విషయాల్లో రికార్డులు సృస్టించింది. దేశ చరిత్రలో ఇంతకంటే తక్కువ కాలంలో ముగిసిన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు లేవనే చెప్పవచ్చు. అంతేకాదు, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత అనుత్పాదక సమావేశాలు ముందెన్నడూ జరగలేదు. ఆర్థిక రంగంలోని అన్ని విభాగాలకు, దేశంలోని ప్రతి పౌరుడికీ వర్తించే అత్యంత ముఖ్యమైన వార్షిక బడ్జెట్‌ ఎటువంటి చర్చా లేకుండా ఆమోదం పొందింది. సాధారణంగా పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రతిపాదనల మీద సుదీర్ఘంగా, లోతుగా చర్చలు జరుగుతాయి. వాదోపవాదాలు చోటు చేసుకుంటాయి. ఏకాభిప్రాయం గనుక సాధ్యమైతే మార్పులు, చేర్పులు కూడా చోటు చేసుకుంటాయి. అయితే, ఈసారి బడ్జెట్‌ సమావేశాల్లో అటువంటిదేమీ జరగలేదు.
పాలక, ప్రతిపక్షాల మధ్య కనీవినీ ఎరుగని రీతిలో వైషమ్యాలు తలెత్తాయి. కత్తులు దూసుకున్నాయి.ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు, వైవిధ్యాలు, అభిప్రాయ భేదాలు ఉండడం సహజమే. ఒక్కోసారి అవి తారస్థాయికి కూడా చేరుకుంటుంటాయి. బహిష్కరణలు, వాకౌట్లు జరగడం కూడా సహజమే. సభలలో ఆటంకాలు, అడ్డంకులు కూడా చోటు చేసుకుంటుంటాయి. కానీ, సర్దుబాట్లు కూడా జరుగుతుంటాయి. అయితే, ఈసారి అటువంటివేమీ కనిపించలేదు. ప్రతిపక్షాలు కూడా మొండికెత్తాయి. ఎక్కడా పట్టు విడుపులకు అవకాశం లేకుండాపోయింది. అదానీ-హిండన్‌బర్గ్‌ కు సంబంధించిన వ్యవహారాలపై చర్చ జరపాల్సిందేనంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రతిపక్ష నాయకులను వేధించడానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని, దీని మీద కూడా చర్చ జరగాలని అవి వాదించాయి. అదానీ వ్యవహారంలో నిజానిజాలను నిగ్గు తేల్చడానికి జాయింట్‌ పార్లమెంటరీ కమిటీని నియమించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి.
ప్రతిపక్షాల ఒత్తిడికి, డిమాండ్లకు పాలక పక్షం ఏమాత్రం తలవంచలేదు. ప్రతిపక్షాల డిమాండ్లన్నిటినీ ప్రభుత్వం నిర్దంద్వంగా తిరస్కరించింది. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీనివేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. పైగా ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి కూడా దిగింది. భారతదేశంలో ప్రజాస్వామ్యం సన్నగిలుతోందని, ఈ పరిస్థితిని నివారించడానికి ఇతర దేశాలు సహాయం చేయాలంటూ కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ బ్రిటన్‌లో విజ్ఞప్తి చేసినందుకు వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ పాలక పక్షం పట్టుబట్టింది. తాను అటువంటి ప్రకటనలేవీ చేయలేదని స్పష్టం చేసిన రాహుల్‌ గాంధీ, దానిపై వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. రాహుల్‌ను లోక్‌సభ నుంచి బహిష్కరించాలంటూ ఒక పాలక బీజేపీ పక్ష సభ్యుడు స్పీకర్‌కు లేఖ రాయడం జరిగింది. రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. దీనిపై ప్రతిపక్షం గందరగోళ పరిస్థితి సృష్టించడంతో పార్లమెంట్‌ సమావేశాలు స్తంభించిపోయాయి.
ఒక అసాధారణ విషయమేమిటంటే, రాహుల్‌ గాంధీ నుంచి క్షమాపణ కోరుతూ పాలక పక్షం కూడా సభను స్తంభింపజేసింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు పక్షాలు తమ తీరును మార్చుకుని ఉంటే బాగుండేది. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా జరగడానికి పాలక పక్షం కూడా సహకరించాల్సి ఉంటుంది. బడ్జెట్‌ సమావేశాలు ఎటూ జరగలేదు కనుక బీజీపీ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతిపక్షాలతో చర్చించి, పరిస్థితిని చక్కదిద్దడం మంచిది. సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ పని చేస్తే మరింత బాగుండేది. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగడానికి ప్రతిపక్షాలు కూడాతమ వంతు బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రజల సమస్యలకు సంబంధించిన అంశాలపై చర్చించడం అన్నిటికన్నా ముఖ్యమనే ప్రాథమిక విషయాన్ని అర్థం చేసుకోవాలి. భారతీయ ఆర్థిక వ్యవస్థలో లొసుగులు, లోపాలు చాలా ఎక్కువంటూ హిండన్‌బర్గ్‌ తన నివేదికలో పేర్కొనడాన్ని ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంది. ఇవే కాదు. పార్లమెంట్‌ ఇంకా అనేక ప్రజా ప్రయోజనాలపై చర్చించాల్సిన అవసరం ఉంది. పాలక, ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో కాకపోయినా, విడిగానైనా సమావేశమై తమ భిన్నాభిప్రాయాలను పరిష్కరించుకోవడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News