Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Bypolls: ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు  

Bypolls: ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు  

స్థానిక అంశాల ఆధారంగానే తాజా బైపోల్స్ ఫలితాలు

దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో రాజకీయంగా మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఏడు స్థానాలలో మూడు స్థానాలను బీజేపీ గెలుచుకోగా, నాలుగు స్థానాలలో ప్రతిపక్షాలు విజయం సాధించాయి. వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల పరి స్థితులు, ప్రాధాన్యాలు ఉన్నందువల్ల ఈ ఫలితాల నుంచి జాతీయ ప్రాధాన్యాలను ఎంచుకోవలసిన అవసరం ఉండదు. వీటి ప్రభావం జాతీయాంశాలపై పడే అవకాశం కూడా ఉండదు. ఎక్కువగా స్థానిక సమస్యల మీదే జయాపజయాలు చోటు చేసుకున్నాయి.

- Advertisement -

ఉత్తర ప్రదేశ్ లోని ఘోసి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి దారాసింగ్ చౌహాన్ ఇక్కడి సమాజ్ వాది పార్టీ అభ్యర్థి చేతిలో ఓడి పోయారు. ఇటీవలి వరకూ సమాజ్ వాది పార్టీలో ఉన్న చౌహాన్ఇటీవలే బీజేపీలోకి ఫిరాయించి టికెట్ సంపాదించుకున్నారు. కాగా, సమాజ్ వాది పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్, సి.పి.ఎం, సి.పి.ఐ (ఎం.ఎల్-లిబరేషన్) పార్టీలు మద్దతు ఇచ్చాయి. అంటే,ఇండియా కూటమి ఈ అభ్యర్థికి మద్దతునివ్వడం జరిగిందన్న మాట. నిజానికి, 2024 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి ఉత్తర ప్రదేశ్ ఒక కీలక రాష్ట్రం. ఈ ఘోసి నియోజకవర్గంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఉత్తర ప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి తీవ్రంగా ప్రచారం చేసినందువల్ల ఈ నియోజకవర్గం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.  బీజేపీ, దాని మిత్రపక్షాలు ఇక్కడ తమ అభ్యర్థిని గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేశాయి కానీ, ఓటర్లు సమాజ్ వాదీ పార్టీ వైపే మొగ్గు చూపారు.

కాగా, బీజేపీ ఉత్తరాఖండ్ లో ఒక స్థానం గెలుచుకుంది. కానీ, పశ్చిమ బెంగాల్ లో పాలక తృణమూల్ కాంగ్రెస్ చేతిలో కూడా ఒక సీటు పోగొట్టుకుంది. ఇక జార్ఖండ్ లోని దుమ్రిలో కూడా పాలక జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. పశ్చిమ బెంగాల్ లోని ధూప్గురిలో ఇండియా కూటమిలోని పార్టీల మధ్యే పోటీ నెలకొంది. కేరళ లోని పుదుపల్లి నియోజకవర్గంలో కూడా ఇండియా కూటమిలోని పార్టీల మధ్య పోటీ ఏర్పడింది. దూప్గురిలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మీద కాంగ్రెస్, సి.పి.ఎం పార్టీలు కలిసికట్టుగా పోటీ చేశాయి.

కేరళలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఊమెన్ చాందీ మరణం వల్ల ఏర్పడిన ఖాళీకి జరిగిన ఉపఎన్నికల్లో సి.పి.ఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఊమెన్ చాందీ కుమారుడు చాందీ ఊమెన్ ఇక్కడ ఘన విజయం సాధించడం జరిగింది. ఈ పుదుపల్లిలో జరిగిన ఉప ఎన్నికను ముఖ్యమంతి పినరాయి విజయన్ ప్రభుత్వానికి అగ్నిపరీక్షగా ప్రచారం జరిగింది. కాగా, త్రిపురలోని బోక్సానగర్ లో సి.పి.ఎం పార్టీకి, బీజేపీకి మధ్య జరిగిన పోటీలో చివరికి బీజేపీ విజయం సాధించడం జరిగింది. 1988 తర్వాత ఈ స్థానంలో సి.పి.ఎం ఏనాడూ ఓటమిపాలు కాలేదు. ఇదే రాష్ట్రంలో ధన్ పూర్ స్థానంలో బీజేపీ ఘన విజయం సాధించింది.

ఈ జయాపజాలన్నీ స్థానిక అంశాల ఆధారంగానే చోటు చేసుకున్నాయనడంలో సందేహం లేదు. ఈ రాష్ట్రాలలో రాజకీయ గాలులు ఎటువైపు వీస్తున్నాయన్నది మాత్రం కొద్దిగా విదితమవుతోంది.  

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News