Saturday, September 28, 2024
Homeఓపన్ పేజ్Can Atishi beat the challenges?: అసాధ్యాలను ఆతిషి సాధ్యం చేయగలరా?

Can Atishi beat the challenges?: అసాధ్యాలను ఆతిషి సాధ్యం చేయగలరా?

ఇది రాజకీయ రామాయణం..

ఢిల్లీ గద్దె మీద ఆతిషి మార్లేనా కూర్చోవడం నిజమే కానీ, పాలన సాగించేది మాత్రం ఆమె కాదు. దేశ రాజధానిలో బహిరంగంగా జరుగుతున్న ఈ తెర వెనుక బాగోతాన్ని సాగిస్తున్నది ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌. ఆతిషి ప్రతీకాత్మకంగా తన పక్కన ఒక ఖాళీ కుర్చీని కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికైనా ఆ కుర్చీ తన గురువు కేజ్రీవాల్‌కేనని, తాను తాత్కాలిక, ఆపద్ధర్మ ముఖ్యమంత్రినేనని చెప్పడం ఆమె ఉద్దేశం. ఢిల్లీ శాసనసభకు మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నందువల్ల ఆతిషి కొద్ది కాలం మాత్రమే పదవిలో ఉంటారనడంలో సందేహం లేదు. “నేనిప్పుడు రామాయణ కాలంలో భరతుడు పోషించిన పాత్రను పోషిస్తున్నాను. శ్రీరాముడు వనవాసానికి వెళ్లినప్పుడు ఆయన తమ్ముడు భరతుడు ఆయన పాదుకలను సింహాసనం మీద ఉంచి పాలన సాగించినట్టే నేను కూడా పరోక్ష పాలన సాగించబోతున్నాను. భరతుడి స్ఫూర్తితో నేను మరో నాలుగు నెలలు ఈ గద్దె మీద ఉంటాను” అని ఆమె తేల్చి చెప్పారు.
హిందుత్వకు వీలైనంత దూరంగా ఉండే ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈ పదవి మార్పును రామాయణ గాథతో పోల్చి చెప్పడం కాస్తంత ఆశ్చర్యకరమైన విషయమే అయినప్పటికీ, ఆతిషీని భరతుడితోనూ, కేజ్రీవాల్‌ ను రాముడితోనూ పోల్చడం మాత్రం కొరుకుడు పడని విషయమే. నిజానికి ఇదంతా ఒక రాజకీయ వ్యూహమని, భజన పరత్వానికి పరాకాష్ఠ అని అందరికీ తెలుసు. ఈ రామ, భరతుల పోలిక ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదు. దక్షిణాదిలో కూడా ఇటువంటి వ్యవహారం ఒకటి గతంలో జరిగింది. తమిళనాడులో అన్నా డి.ఎం.కెకు చెందిన ఓ. పన్నీర్‌ సెల్వం 2001లో ఇదే విధంగా తన పక్కన ముఖ్యమంత్రి కుర్చీని ఖాళీగా ఉంచుకుని, ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరిగింది. అన్నా డి.ఎం.కె అధినేత జె. జయలలిత ప్రభుత్వ సంబంధమైన పదవీ బాధ్యతలను నిర్వహించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆమెకు బదులుగా ఆమె వీర విధేయుడు పన్నీర్‌ సెల్వం ఈ విధంగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. అప్పట్లో ఆయన కూడా తనను తాను భరతుడితోనూ, జయలలితను శ్రీరాముడితోనూ పోల్చుకోవడం జరిగింది. 2001 సెప్టెంబర్‌ నుంచి 2002 మార్చి వరకు ఆ పదవిని నిర్వహించిన పన్నీర్‌ సెల్వం ముఖ్యమంత్రి కుర్చీలో జయలలిత ఫోటోను పెట్టి తాను వేరే కుర్చీలో కూర్చుని ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
కేజ్రీవాల్‌ రూటే వేరు!
రాముడికి భరతుడి మాదిరిగానే కేజ్రీవాల్‌ కు తాను వీర విధేయురాలినని ఆతిషి ఆ విధంగా పోలిక తీసుకు వచ్చారు. ఇందులో మరో పోలిక కూడా కనిపిస్తోంది. జయలలిత, కేజ్రీవాల్‌ లు అవినీతి ఆరోపణల కారణంగా పదవికి దూరం కావలసి వచ్చింది. ఆ కారణం వల్లే పన్నీర్‌ సెల్వం, ఆతిషీలు పదవిని చేపట్టడం జరిగింది. శ్రీరాముడు అవినీతి కారణాల వల్ల అడవుల పాలు కాలేదు. పైగా శ్రీరాముడు తెరవెనుక పాలన జరపలేదు. భరతుడు పూర్తి స్థాయిలో రాజుగా వ్యవహరించాడు. అప్పుడు జయలలిత, ఇప్పుడు కేజ్రీవాల్‌ కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే తమ పదవులను వదిలిపెట్టి తమ పదవులను పదవిలో కూర్చోబెట్టడం జరిగింది. మద్యం కేసులో తాను, తమ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా జైలు పాలయినందు వల్ల, ఈ కేసు ప్రభావం తమ ఆప్‌ ప్రభుత్వంపై పడకూడదని, ఈ కేసుకు ఢిల్లీ ప్రభుత్వం వీలైనంత దూరంగా ఉండడం మంచిదని కేజ్రీవాల్‌ భావించారు.
హర్యానా ఎన్నికల ప్రచారం పాల్గొన్న కేజ్రీవాల్‌ తానొక నిష్కల్మష, నిష్కళంగా ప్రజా నాయకుడినని చెప్పుకునే ప్రయత్నం చేశారు. తాను చేయని నేరానికి తాను తన పదవిని త్యాగం చేసినట్టు ఆయన చెప్పుకున్నారు.
ఆయన అవినీతి కేసుకు, ఢిల్లీ ప్రభుత్వానికి దూరం జరిగినప్పటికీ, ఆతిషి పక్కనున్న ఖాళీ కుర్చీని చూసిన ప్రతిసారీ కేజ్రీవాల్‌, ఆయన అవినీతి గుర్తుకు రాకుండా ఉంటాయా? ఆయన ఈ కుర్చీలో ఎందుకు కూర్చోవడం లేదనే ప్రశ్ర ఉత్పన్నం కాదా? ఆయన మీద అవినీతి ఆరోపణలెన్నో ఉన్నందువల్ల ఆయన ఇక ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే అవకాశమే లేదని బీజేపీ అప్పుడే ప్రచారం ప్రారంభించింది. ‘మరో 14 ఏళ్లపాటు కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అవకాశం లేదని ఆతిషి చెప్పకనే చెబుతున్నారు. శ్రీరాముడు 14 ఏళ్ల తర్వాత గానీ తిరిగి అధికారం చేపట్టలేదు. శ్రీరాముడి పేరుతో భరతుడు పధ్నాలుగేళ్లు పరిపాలన సాగించాడు” అని బీజేపీ సీనియర్‌ నాయకుడు షానవాజ్‌ హుసేన్‌ వ్యాఖ్యానించారు. “ఇదంతా ఎన్నికల స్టంట్‌. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నంత మాత్రాన ఆతిషి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు” అని పశ్చిమ ఢిల్లీ నుంచి లోక్‌ సభకు ఎన్నికైన బీజేపీ నాయకుడు కమల్జీత్‌ షెహ్రావత్‌ ఎద్దేవా చేశారు. అయితే, ఆతిషి మాత్రం ఢిల్లీ ముఖ్యమంత్రిగా తన ప్రాధాన్యాలను వివరించారు.
ఆతిషి మీద పెనుభారం
‘ఢిల్లీ ముఖ్యమంత్రిగా తిరిగి కేజ్రీవాల్‌ ను తీసుకు రావడానికి రానున్న కొద్ది నెలల్లో అహర్నిశలూ కృషి చేస్తాను’ అని ఆమె తన పదవీ బాధ్యతలు స్వీకరించగానే ప్రకటించారు. ఇక్కడో ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ నాలుగు నెలల కాలంలో ఆమె ఢిల్లీ ప్రజల కోసం పాటుబడతారా లేక కేజ్రీవాల్‌ కోసమే కృషి చేస్తారా? వాస్తవానికి ఢిల్లీ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి ఆమె ఈ నాలుగైదు నెలల కాలంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంది. ఆమెకు ఒక్క నిమిషం కూడా విశ్రాంతి లభించకపోవచ్చు. వాస్త వానికి ఢిల్లీలో ప్రభుత్వాన్ని, పాలనా వ్యవహారాలను అజమాయిషీ చేయడమంటే అది కత్తి మీద సాములాంటిదే అవుతుంది. ఇక్కడ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కు రాజ్యాంగరీత్యా అనేక అధికారాలు సంక్రమించాయి. అధికార వ్యవస్థ మీద ప్రభుత్వానికి ఉన్న అదుపు, అజమాయిషీలు అంతంత మాత్రమే. ఢిల్లీలో ఈ ప్రతిపక్ష ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కేంద్ర ప్రభుత్వంతో వివాదాలకు, విభేదాలకు దిగడం జరుగుతున్నందువల్ల కేంద్రం నుంచి చేయూత లభించే అవకాశం ఉండదు. కేజ్రీవాల్‌ జైలులో ఉన్న కారణంగా రాష్ట్రంలో పాలనా వ్యవహారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆతిషి వీటిని పట్టాల మీదకు ఎక్కించాల్సి ఉంటుంది.
కేవలం నాలుగు నెలల కాలంలో ఆమె అనేక వ్యవహారాలను చక్కబెట్టాల్సి ఉంటుంది. దరిమిలా, అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పార్టీ నాయకులు, మంత్రివర్గ సహచరులు, ప్రభుత్వాధికారుల నమ్మకాన్ని చూరగొనాల్సి ఉంటుంది. పార్టీ రాజకీయ, ఎన్నికల ఆశయాలను నెరవేర్చడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుంది. తెర వెనుక నుంచి కేజ్రీవాల్‌ పాలనా వ్యవహారాలను నడిపించే అవకాశం ఉన్నప్పటికీ, దేశ రాజధాని ఢిల్లీలో కార్యాచరణ ముఖ్యమంత్రి అవసరమే ఉంది కానీ, కుర్చీ నాయకుడి అవసరం లేదు.

  • జి. రాజశుక
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News