నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో రైల్వే, సమాచార, ప్రసారాలు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 54 ఏళ్ల అశ్వినీ వైష్ణవ్ దేశంలోని లక్షలాది మంది యువతీ యువకుల భవిష్యత్తులను తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. ఒక సాధారణ టెక్నోక్రాట్ గా వృత్తి జీవితం ప్రారంభించిన వైష్ణవ్ ఇన్ని శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించే స్థితికి చేరుకోవడం నిజంగా ఒక పెద్ద విశేషమే. చాలా కాలంపాటు బ్యురోక్రాట్ గా పనిచేసిన అశ్వినీ వైష్ణవ్ రాజకీయాల్లోనూ, పాలనా వ్యవహారాల్లోనూ గత పది పదిహేనేళ్లుగా అసమానమైన ప్రతిభ కనబరుస్తూ వచ్చారు. ఒడిశా నుంచి రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వైష్ణవ్ 2019 నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ముచ్చటగా మూడవసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం మరోసారి వైష్ణవ్ ను రైల్వే శాఖకు, ఐ.టీకి మంత్రిగా నియమించడం ఆశ్చర్యం కలిగించే విషయం. సాధారణంగా రైల్వే మంత్రిత్వ శాఖను మిత్రపక్షానికి లేదా భాగస్వామ్య పక్షానికి ఇవ్వడం ఆనవాయితీ. అయితే, మోదీకి వైష్ణవ్ ప్రాధాన్యం తెలుసు. బీజేపీ ప్రతినిధిగా ఆయన వరుసగా రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నిక కావడం సహజమైన విషయమే కానీ, మిత్రపక్షమైన బిజూ జనతాదళ్ మద్దతుతో రెండు సార్లు ఎన్నిక కావడం మాత్రం విశేషమే. ప్రస్తుతం ఈ పార్టీని బీజేపీ ఓడించి అధికారంలోకి రావడం జరిగింది. ఆయనను మోదీ, హోం మంత్రి అమిత్ షాలు ఎంపిక చేసి, 2019లో, ఆ తర్వాత 2024లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను ఒప్పించి రాజ్యసభ సభ్యత్వానికి ఎంపిక చేయడం జరిగింది. ఆయన ఒడిశా కేడర్‌కు చెందిన ఐ.ఎ.ఎస్ అధికారి. ఒడిశా రాష్ట్రాన్ని అనేక ఆర్థిక, సామాజిక సమస్యల నుంచి గట్టెక్కించిన వ్యక్తి వైష్ణవ్.
యువతకు ప్రాధాన్యం
ఆ తర్వాత ఆయన వాజ్ పేయీ ప్రభుత్వంలో ప్రధాని కార్యాలయంలో పనిచేయడం జరిగింది. ప్రస్తుతం మోదీ వికసిత్ భారత్ పేరుతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ఉద్దేశంలో ఉన్నందు వల్ల ఆయన దృష్టి వైష్ణవ్ మీద పడింది. ఐ.టి, రైల్వే శాఖల ద్వారా వికసిక్ భారత్ మరింతగా నెరవేరే అవకాశం ఉంటుందని గుర్తించిన మోదీ ఈ రెండు శాఖలను ఒకే వ్యక్తికి అప్పగించడం జరిగింది. ఇక ఆయనకు సమాచార, ప్రసార శాఖల బాధ్యతలు కూడా అప్పగించినందువల్ల మోదీ లక్ష్యాలను, ఉద్దేశాలను విజయవంతంగా ఆయన ప్రజల ముందుంచే అవకాశం ఏర్పడింది. ఇది వరకటి మంత్రి వర్గంలోనే రైల్వే మంత్రిగా పనిచేసిన అశ్వినీ వైష్ణవ్ దేశంలో వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం జరిగింది. సుమారు 250 జిల్లాలను కవర్ చేస్తూ ఆయన 85 వందే భారత్ రైళ్లను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇవి దేశ ముఖ చిత్రాన్ని చాలావరకు మార్చేశాయనడంలో సందేహం లేదు. ఇదివరకు స్తబ్ధతగా, మందకొడిగా ఉన్న రైల్వేల ప్రగతి ఆయన ఆధ్వర్యంలో వేగం పుంజుకుంది. దేశవ్యాప్తంగా సుమారు 100 రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం జరిగింది. దేశంలోని మొత్తం 7,400 రైల్వే స్టేషన్లలో 1,300 స్టేషన్లను పూర్తిగా ఆధునీకరించడం జరిగింది. దేశంలో మరో 553 రైల్వే స్టేషన్లను మరింతగా అభివృద్ధి చేయడానికి ఆయన గత ఫిబ్రవరి 26న ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టారు.
వైష్ణవ్ పథకాల విషయంలో లోపాలేవీ కనిపించకపోవడంతో ప్రతిపక్షాలు సహజంగానే ప్రయాణికుల భద్రత గురించి విమర్శించడం జరుగుతోంది. సంస్థాగతంగా రైల్వేలో ఎన్నో లోపాలున్నట్టు కూడా అది విమర్శిస్తోంది. రైల్వే భద్రతా విభాగంలో సుమారు 1.75 లక్షల ఖాళీలు భర్తీ కాకుండా పడి ఉన్నాయి. వైష్ణవ్ ఇప్పుడు వీటిని భర్తీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. రైల్వేలో భద్రతా నిపుణుల కొరత వల్లే ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయనే అభిప్రాయం ఉంది. ఈ మధ్య ఒడిశాలోని బాలాసోర్ లో మూడు రైళ్ల మధ్య ప్రమాదం జరిగి 261 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన రైల్వేలలోని భద్రతా రాహిత్యానికి అద్దం పడుతోంది. విచిత్రమేమిటంటే, బాలాసోర్ జిల్లాలో వైష్ణవ్ చాలా కాలం పాటు కలెక్టర్ గా పనిచేశారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలన్నది వైష్ణవ్ ప్రధమ ప్రాధాన్యంగా పెట్టుకున్నారు.
ఆధునిక రైల్వే వ్యవస్థ
టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించి రైల్వేలను అత్యంత ఆధునికం చేయాలని కంకణం కట్టుకున్న మోదీ ఈ మేరకు వైష్ణవ్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మోదీ కలలుగంటున్న ఆధునిక పాలనలో వైష్ణవ్ ఒక ప్రధాన ఆలంబన. రైల్వేలను ఆధునీకరించడానికి రాజకీయ నాయ కులు కాక, బ్యురాక్రాట్లయితే బాగా ఉపయోగపడతారని కూడా మోదీ భావించారు. ఒడిశాలో 1996లో సంభవించిన తుఫాను నష్టాన్ని తగ్గించడంలో, ప్రజల ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషించిన వైష్ణవ్‌ను వాజ్ పేయీ ప్రధానమంత్రి కార్యాలయంలో చేర్చిన వ్యక్తి ప్రధాని సంయుక్త కార్యదర్శి అశోక్ సైకియా. అప్పుడు ఆయన మొదటిసారిగా వాజ్ పేయీ దృష్టిలో పడడం జరిగింది. ఆ తర్వాత ఆయన వాజ్ పేయీకి వ్యక్తిగత కార్యదర్శిగా మారారు. ఇక్కడ ఉన్నప్పుడే వైష్ణవ్ కు మోదీతో పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని, జి.ఇ కార్పొరేషన్‌లో సి.ఇ.ఓగా చేరారు. ఐ.ఐ.టి, ఆ తర్వాత ఎం.బి.ఏ చేసిన వైష్ణవ్ సీమెన్స్‌లో కూడా పనిచేశారు. ఆయన స్వయంగా ఇనుము, ఉక్కు, ఊచలకు సంబంధించిన సంస్థలను కూడా నెలకొల్పారు. కేవలం భాగస్వామ్య ఒప్పందాల కోసం ఆ తర్వాత ఆయన తన వ్యాపారాలను గుజరాత్ కు మార్చి, అహ్మదాబాద్ లో 2018లో ఒక ఇంటిని కూడా కొనుగోలు చేశారు. గుజరాత్ వచ్చేసిన ఆరు నెలలకే ఆయనకు మోదీ నుంచి ఆహ్వానం అందింది. ఇక ఐ.టి మంత్రిగా ఆయన కొన్ని లక్ష్యాలను ఏర్పరచు కున్నారు. దేశంలోని వివిధ ఐ.టి సంస్థలను ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో పాటు కొత్త ఉద్యోగాల సృష్టిని ఆయన ప్రోత్సహించదలచుకున్నారు. విద్యావంతులైన యువతీ యువకులను దృష్టిలో పెట్టుకుని ఆయన ఐ.టి సంస్థల విస్తరణకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించబోతున్నారు. ఆయన ఆర్.ఎస్.ఎస్ కు సంబంధించిన వ్యక్తి కానప్పటికీ, ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితుడిగా కొత్త పథకాలతో ముందుకు వెడుతున్నారు. ముఖ్యంగా తన వంతుగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కంకణం కట్టుకున్నారు. ఆయన విజయాలు, సాఫల్యాల మీద దేశ భవిష్యత్తే కాకుండా 2029 ఎన్నికల ఫలితాలు కూడా ఆధారపడి ఉన్నాయి.
- కె.వి. రవీందర్