Monday, July 1, 2024
Homeఓపన్ పేజ్Can Rahul fit to be opposition leader?: ప్రతిపక్ష నేతగా రాణించగలరా?

Can Rahul fit to be opposition leader?: ప్రతిపక్ష నేతగా రాణించగలరా?

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ 18వ లోక్‌ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక కావడం ఆయన బాధ్యతలను మరింత పెంచింది. ఆయనకు, ఆయన పార్టీకి ఇది ఒక సదవకాశం. ఆయన ఈ సవాలును ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటే ఆయనకు అంత మంచిది. తన రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన రాజ్యాంగ బద్ధమైన పదవిని నిర్వహించడం ఇదే మొదటిసారి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి ఈ పదవి లభించడం కూడా ఇదే మొదటిసారి. ఆయనది రాజకీయ కుటుంబం అయినందువల్ల, కొన్ని ప్రత్యేకతలు సంక్రమించినందువల్ల నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకోవడం వేరు. ప్రస్తుత రాజకీయాల్లో ఆయన తన నాయకత్వ లక్షణాలను అనేక విధాలుగా నిరూపించుకోవాల్సి ఉంది. ఒక రాజకీయ కుటుంబానికి, వారసత్వ పాలనకు భిన్నంగా ఆయన ఈ దశాబ్ద కాలంలో తన నాయకత్వ లక్షణాలకు మరింతగా పదును పెట్టుకోవాల్సింది.
పైగా, బాధ్యతల నుంచి దూరంగా వెళ్లడమనేది ఆయనకు సహజ లక్షణంగా కనిపిస్తోంది. ఇది అనేక సందర్భాలలో బయటపడింది. రానురాను రాజకీయాలు కఠినంగా మారుతూ, తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకు వస్తున్న సమయంలో, ముఖ్యంగా ప్రజలు గమ నించడమనేది ఎక్కువైన సమయంలో ఆయన బాధ్యతలను మరింతగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు ఇప్పటికే ఒక శ్రద్ధాసక్తులు లేని రాజకీయ నాయకుడిగా పేరుంది. ఆయన ఏనాడూ ఒక సమర్థవంతమైన రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకోలేదు. పార్లమెంట్‌ సభ్యుడిగా కూడా ఆయన సరైన గుర్తింపు తెచ్చుకోలేదు. వీటన్నిటినీ నిరూపించు కోవడానికి ఆయనకు ప్రతిపక్ష నేతగా ఒక అవకాశం ఏర్పడింది. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బుధవారం పార్లమెంటులో చేసిన ప్రసంగం, భారతదేశ స్వరం పార్లమెంటులో వినిపించాలన్న ప్రకటన ఆయనలోని మార్పునకు అద్దం పడుతోంది. ప్రతిపక్ష నాయకులుగా సి.ఎం. స్టీఫెన్‌, అటల్‌ బిహారి వాజ్‌ పేయీ, సుష్మా స్వరాజ్‌ వంటి వారు సృష్టించిన మైలు రాళ్లను ఆయన అధిగమించాల్సి ఉంది.
భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష నాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది. గత అయిదేళ్లుగా ప్రతిపక్షాల పాత్ర పార్లమెంటులో అత్యంత అధ్వాన స్థితిలో ఉంది. 2019 తర్వాత పాలక పక్షంతో సమానంగా ప్రతిపక్షాలకు సంఖ్యాబలం పెరిగిన నేపథ్యంలో ప్రతిపక్షాలు కీలక పాత్ర పోషించడానికి అవకాశం ఏర్పడింది. ప్రభుత్వం తమ విధానాలు, నిర్ణయాల విషయంలో జవాబు దారీతనంతో వ్యవహరించడానికి వీలుగా ఆయన పార్ల మెంటరీ పద్ధతులు, సంప్రదాయాలను క్షుణ్ణంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి పక్ష నాయకుడుగా ఆయన అనేక పార్లమెంటరీ కమిటీల్లో సభ్యత్వం కలిగి ఉండడానికి, చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, ఎలక్షన్‌ కమిషనర్లు, సి.బి.ఐ డైరెక్టర్‌, విజిలెన్స్‌ కమిషనర్‌ వంటి కీలక రాజ్యాంగ పదవులను ఎంపిక చేయడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి పదవుల విషయంలో ఆయన విలువైన సూచనలు చేయడానికి అవకాశం ఉండడంతో పాటు ప్రజా భిప్రాయాన్ని ప్రతిబింబించడానికి కూడా అవకాశం ఉంటుంది.
కాంగ్రెస్‌ పార్టీలో నాయకత్వ లోపం వల్ల, ప్రతిపక్షాలు కకావికలం అయినందువల్ల గత పదేళ్లుగా పాలక పక్షం మాటకే విలువ ఉంటూ వస్తోంది. ప్రతిపక్షాలు కూడా అనేక సంద ర్భాలలో తమ బాధ్యతలను మరవడం కూడా జరిగింది. ఒకే దేశం- ఒకే ఎన్నికలు, నియో జకవర్గాల పునర్వ్యవస్థీకరణ వంటి వివాదాస్పద అంశాలపై కాంగ్రెస్‌ పార్టీ తన అభిప్రా యాలను మరింత దృఢంగా వ్యక్తం చేయడానికి ఇప్పుడిక అవకాశం లభించింది. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్‌ గాంధీ చర్చలను సరైన పంథాలో నడిపించాల్సి ఉంటుంది. అనేక విషయాల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు రావాల్సి ఉంటుంది. అరుపులు, కేకలు, గందరగోళాలు వగైరాల కంటే నియమ నిబంధనలకు విలువనివ్వడం వల్ల ప్రతిపక్షాల స్వరం పార్లమెంటులోనే కాకుండా దేశానికి కూడా వినిపించడం జరుగుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News