Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Can Russia-Ukraine war be stopped?: ఉక్రెయిన్‌ యుద్ధం సమాప్తం అవుతుందా?

Can Russia-Ukraine war be stopped?: ఉక్రెయిన్‌ యుద్ధం సమాప్తం అవుతుందా?

రష్యాలో పర్యటించిన ఆరు వారాల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల క్రితం ఉక్రెయిన్‌ వెళ్లడం సహజంగానే అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి భారతదేశం సమతూకంతో వ్యవహరిస్తోందని ప్రపంచానికి చాటి చెప్పడానికే మోదీ ఈ రెండు దేశాల్లో పర్యటించినట్టు అంతర్జాతీయ సంబంధాల విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మోదీ గత శుక్రవారం (ఆగస్టు 23) కీవ్‌ వెళ్లి, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమీర్‌ జెలెన్స్కీతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతో పాటు, ఉక్రెయిన్‌తో సంబంధాల మెరుగుదలపై కూడా ఈ రెండు దేశాల నాయకులు చర్చించారు. రష్యా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ పై దాడి చేసిన తర్వాత భారతదేశం ఈ రెండు దేశాలకూ సమాన దూరం పాటిస్తూ వస్తోంది. యుద్ధానికి సంబంధించి ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడు, ఏ తీర్మానాన్ని ప్రతిపాదించినా భారతదేశం గైర్హాజర్‌ అవడం జరిగింది. రష్యాను విమర్శించే తీర్మానాల విషయంలో కూడా అంటీ ముట్టనట్టు వ్యవహరించింది. పాశ్చాత్య దేశాల ఆంక్ష లను కూడా భారత్‌ పట్టించుకోలేదు. ముఖ్యంగా రష్యా నుంచి చమురు దిగుమతులు, ఆయుధాల సరఫరాలకు సంబంధించిన చెల్లింపుల విషయంలో భారత్‌ పాశ్చాత్య దేశాల హెచ్చరికలు, బెదరింపులను లెక్క చేయలేదు.
జి-20 సదస్సులో తమకు కూడా స్థానం కల్పించాల్సిందిగా గత ఏడాది ఉక్రెయిన్‌ చేసిన అభ్యర్థ నను భారత్‌ తోసిపుచ్చింది. ఈ ఏడాది జూన్‌లో స్విట్జర్లాండులో జరిగిన శాంతి సదస్సుకు ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గాన్ని పంపించడానికి కూడా భారత్‌ విముఖత వ్యక్తం చేసింది. శాంతి పేరుతో భారత్‌ రష్యా వ్యవహారాలను ఖండించకపోవడం ఉక్రెయిన్‌ కు ఆగ్రహం కలిగిస్తోంది. యుద్ధం విషయంలో భారత్‌ తమ దేశం వైపు మొగ్గు చూపాలని కూడా ఉక్రెయిన్‌ ఆశించింది. పుండు మీద కారం చల్లినట్టు, మోదీ ఇటీవల రష్యాలో పర్యటించడం ఉక్రెయిన్‌ ఆగ్రహాన్ని మరింతగా పెంచింది. 1991లో ఉక్రెయిన్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశ ప్రధాని ఉక్రెయిన్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి. చాలా ఏళ్ల తర్వాత, యుద్ధ సమయంలో మోదీ ఉక్రెయిన్‌ను సందర్శిస్తున్నందు వల్ల ఈ యుద్ధం విషయంలో భారత్‌ విధానం మారడానికి అవకాశం ఉందా అన్నది అంతర్జాతీయంగా ఆసక్తి కలిగిస్తోంది. ఉక్రెయిన్‌ పర్యటన సందర్భంగా ఈ ఇద్దరు నాయకులు యుద్ధం గురించి చర్చించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన పిల్లల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్థూపం దగ్గర నివాళులర్పించారు. యుద్ధం ప్రారంభం అయిన తర్వాత కీవ్‌ను సందర్శించిన ఏ దేశాధినేత అయినా అక్కడి క్షతగాత్ర సైనికులను, పౌరులను పలకరించడం, పరామర్శించడం జరిగేది. అయితే, మోదీ అటువంటిదేమీ చేయలేదు. మోదీ పర్యటన సందర్భంగా ఉభయ దేశాల మధ్య వ్యవసాయం, సంస్కృతి, వైద్య ఉత్పత్తులు, సామాజిక అభివృద్ధి పథకాలకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. అయితే, ఉక్రెయిన్‌ కోరినప్పటికీ ఉభయ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, టెలికామ్‌, వైద్య సంబంధమైన ప్రాథమిక సదుపాయాలు, నిర్మాణ పరికరాలు వంటి అంశాల్లో మాత్రం చర్చలు, ఒప్పందాలేవీ జరగలేదు.
ఈ ఘర్షణను పరిష్కరించడానికి భారతదేశం మరింత పెద్ద పాత్రను పోషిస్తుందా అన్నది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. నవంబర్‌ లో మరో శిఖరాగ్ర సమావేశం జరగాలన్న జెలెన్‌ స్కీ అభ్యర్థ నకు కూడా జవాబు లభించలేదు. రష్యా, ఉక్రెయిన్‌ ల మధ్య శాంతి స్థాపన కోసం ఈ రెండు దేశాలను సందర్శించిన వారిలో టర్కీ, ఇండొనీషియా, దక్షిణాఫ్రికా, హంగరీ నాయకులు కూడా ఉన్నారు. అయితే, ఇందులో కీలక పాత్ర పోషించింది మాత్రం మోదీనే. అయితే, దక్షిణ ప్రపంచ నాయకుడుగా ఆయన తప్పనిసరిగా మరింత పెద్ద పాత్ర పోషించడం అనివార్యమవుతోంది. ఈ యుద్ధం ప్రభావం ఐరోపా దేశాల మీదా, పేద, వర్ధమాన దేశాల మీదా పడకుండా నివారించడం, నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడకుండా చూడడం వంటి బాధ్యతలు భారత్‌ మీద పడుతు న్నాయి. అయితే, భారతదేశం ఇంత వరకూ కీలక పాత్ర పోషించిన దాఖలాలు కనిపించలేదు. ఉభయ దేశాల మధ్య శాంతి స్థాపన కోసం ఎక్కువగా పరోక్షంగానే కృషి చేస్తూ వస్తోంది. ఉభయ దేశాలు ప్రత్యక్ష చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని, యుద్దం ద్వారా సాధించేది ఏమీ లేదని అనేక పర్యాయాలు ప్రకటనలు జారీ చేయడం కూడా జరిగింది. భారత ప్రభుత్వం యుద్ధ విరమణ విషయంలో ఈ రెండు దేశాల మధ్య మరింతగా మధ్యవర్తిత్వం నెరపడం, మరింత క్రియాశీలంగా వ్యవహరించడం చాలా అవసరం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News