Homeఎడిటోరియల్ / బహుళనాన్నా.. వినబడుతుందా?

నాన్నా.. వినబడుతుందా?

నాన్నా…!
నువ్వు తాగి పడిపోయావని అందరు అంటున్నారు
అమ్మ మాత్రం నువ్వు పడుకున్నావు అంటుంది
ఏది నిజం నాన్న?

పొద్దున నేను స్కూల్‌కి పోయేటప్పుడు దుకాణం కాడ నాకు లేస్ ప్యాకెట్‌ ఇప్పిచ్చి పోయినవు. సాయంత్రం కూడా నువ్వు వస్తావు అని  చూసిన.. లేస్ ప్యాకెట్‌ కోసం మాత్రం కాదు నాన్నా.

- Advertisement -

అప్పటికి నేను అమ్మకు చెప్పిన ‘నాన్న రాడేమో అమ్మ.. పనికి పోయిండు కదా! ఎంత టైం పడతాదో’ అని.. అమ్మ ఇనలే.. నువ్వు సాయంత్రం వస్తావని చెప్పింది. నీ మీద నమ్మకం అనుకుంట.. అమ్మ నమ్మిన దాన్ని నేను నమ్మకుండా ఉంటానా నాన్న?

నాన్నా, నువ్వు పొద్దంతా పనిజేసి అలసిపోతావు అంట కదా! అమ్మ చెప్పింది. నీ అలసటను దూరం చేసే మందు ఏదో ఇంట్లో తాగొచ్చు కదా నాన్న? ఎందుకు బయట తాగి అందరి కళ్లల్లో పడతావు చెప్పు? మమ్మల్ని కొట్టినా నువ్వే, పెట్టినా నువ్వే, మరి ఎందుకు నాన్న మన మధ్య ఈ మందు మందం దూరం?
మాకు నువ్వు ఏమి తక్కువ చెయ్యలే, నువ్వు తినకున్నా మాకు పెట్టినావ్‌, కానీ మాకు తాపకుండా తాగినవ్‌! అంటే నీకు తెలుసు కదా నాన్న మందు చెడ్డదని? ఒక్కసారి చూసుకో నాన్న.. తండ్రికి బుద్ది చెప్పేంత పెద్దవాళ్ళం మేము కాకూడదు అని అనుకుంటున్నాం! మేము ఎప్పుడు నీ నీడలోనే ఉండాలె. నువ్వే మమల్ని తిట్టాలే, నువ్వే మమ్మల్ని కొట్టాలె. అందరం కలిసి ఒక్కరోజైనా కూర్చొని తినాలే, మాటవరసకైనా కొన్ని మాట్లాడుకో వాలె, నువ్వు సక్కంగా ఇంటికి వస్తేనే కదా నాన్న ఇవి అన్ని జరిగేవి.

పొద్దున్న ఇంటి ముందుకు అరెక్‌మాల్‌ బండి వచ్చింది. అమ్మ లేకుండే, పనికి పోయింది కదా. ఇంట్ల ఉన్న చిన్న ఫోన్‌ నుంచి అ మ్మకు ఫోన్‌ చేసిన. అమ్మ రుబ్బర్‌ బ్యాండ్‌లు కొంట అని, బట్టల సెల్ఫ్‍ల పేపర్‌ కింద వందనోటు ఉంది తీసుకో, చిల్లర మల్ల అక్కడ నే పెట్టు అన్నది. ఉరికిపోయి పేపర్‌ ఎత్తి చూసిన, అక్కడ వందనో టు లేదు, అదికూడా తీసుకపోయినవా నాన్న? నీ చేతి సిగరెట్టు వాసన పేపర్‌కు అంటుకుంది. ఇంకా ఆ వాసనా పోలె నాన్న.
నీకు చెప్పలే గాని.. నాన్న నువ్వు తాగకపోతే నిజంగా దేవునివి.. మంచోనివి.. తాగినా మంచోనివే, కానీ నాన్న. ‘నీకు  ఏమన్నా ఐతే నువ్వు ఒడ్డుకు పడతావేమో.. కాని మేము రోడ్డున పడతాము నాన్న’…. నాన్న! వొద్దు.. నువ్వు ఏ పని చెయ్యకు. ఇంట్లో ఉండు చాలు. మాకు పెద్ద దిక్కుగా.. నిన్ను కాపాడు కుంటాం.. ఎందుకంటే మీరు ఎవరు అంటే పలానా కూతురు, పలానా భార్య అని చెప్పుకునే ఆధారానివి నువ్వు..

ఒక్కరోజు నువ్వు టైంకి ఇంటికి వస్తే చూడాలని ఉంది నాన్న, నువ్వు మంచిగా కూ సోని అమ్మతోని మా ట్లాడుకుంట తింటుం టే సుడాలని ఉంది. స దుకున్నావా బిడ్డ, హోం వర్క్‍ రాసుకున్నావా అని నన్ను అడిగితే వినాలని ఉంది. నా స్కూల్‌ అంగి చినిగిపోతే అమ్మ కుట్లు ఏసింది. నీకు చెప్పిందా?
నాన్న నువ్వు ఏమి చేసినా చేయకున్నా మా ధైర్యానివి.. మా కుటుంబం అనే గోడకి మొదటి ఇటుకవి నువ్వు, ఆ ఒక్క ఇటుక జరిగిపోతే ఆ గోడ కూలిపోతుంది.. అందుకే నాన్న కొంచం జాగ్ర త్త ‘నువ్వు అంటే నువ్వు కాదు.. నీతో పాటు మేము.’ నువ్వు నిల బడితే మేము నిలబడతాం, నువ్వు పడిపోయినరోజు మేము పడిపోతాం…

‘నాన్న! నువ్వు నాకు తిననీకే ఏమి తేకున్నా నేను అడగను, కానీ నువ్వు తాగినంక మిగిలిన ఆ చుడువా, పల్లీలు మాత్రం ఇంటిదాకా మోస్కరాకు. ఆ దరిద్రాన్ని ఇంట్లకు తీస్కరాకు.. సరేనా నాన్న..
వాసు వలభోజు
9848753500

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News