Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Canada Sikhs: కెనడా సిక్కుల తీరుపై ఆగ్రహం

Canada Sikhs: కెనడా సిక్కుల తీరుపై ఆగ్రహం

కెనడాలో ఉన్నసుమారు 8 లక్షల మంది సిక్కులను ఎన్నికల్లో తమకు అనుకూలంగా చేసుకునే ఉద్దేశం కూడా ఉండే అవకాశం ఉంది

మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని ఒక గొప్ప విశేషంగా చూపిస్తూ కెనడాలోని బ్రాంప్టన్‌లో ఒక ప్రదర్శన నిర్వహించడం సహజంగానే భారత్‌లో రాజకీయ వర్గాలకు ఆగ్రహావేశాలు తెప్పించింది. 1984లో జరిగిన బ్లూస్టార్‌ ఆపరేషన్‌కు నిరసనగా ఖలిస్థాన్‌ పేరుతో ఇక్కడి సిక్కు వర్గాలు ఈ ప్రదర్శనను నిర్వహించడం జరిగింది.ఈ హత్యను ఒక ప్రతీకార చర్యగా అభివర్ణిస్తూ ఈ ప్రదర్శన వెనుకే ఒక పోస్టర్‌ను కూడా ఏర్పాటు చేశారు. భారత్‌లోని రాజకీయ నాయకులు కెనడాను క్షమాపణలు కోరడంతో పాటు, ఈ రకమైన వేర్పాటువాద ధోరణులను ప్రోత్సహించడం సమంజసం కాదని పేర్కొన్నారు. దీని వెనుక విస్తృతమైన వ్యూహమే ఉందని, ఈ వేర్పాటువాద శక్తులను స్వేచ్ఛగా వదిలేయడం వల్ల భారత, కెనడా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడమే కాకుండా, కెనడాకు కూడా భవిష్యత్తులో ముప్పు ఏర్పడుతుందని విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఈ సందర్భంగా హెచ్చరించారు. కెనడా ప్రభుత్వం ఇటువంటి కార్యకలాపాలను చూసీచూడనట్టు వదిలేయడం వెనుక ఓటు బ్యాంక్‌ రాజకీయాలు కూడా ఉండి ఉండవచ్చని, కెనడాలో ఉన్నసుమారు 8 లక్షల మంది సిక్కులను ఎన్నికల్లో తమకు అనుకూలంగా చేసుకునే ఉద్దేశం కూడా ఉండే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
కెనడాలో హింసను ప్రేరేపించడాన్ని కూడా ఒక విధమైన నిరసనగా భావించడం జరుగుతోంది. 1985లో కనిష్క విమానాన్ని కెనడాలోని తీవ్రవాదులు కూల్చడం కూడా ఇటువంటి వైఖరికి నిదర్శనమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కెనడాలో ఈ విధంగా వేర్పాటువాద శక్తులను కొమ్ముకాయడం అనేది చాలా కాలంగా జరుగుతూ వస్తోంది. అక్కడి హిందువులకు వ్యతిరేకంగా అనేక పర్యాయాలు విధ్వంసకాండలు చోటు చేసుకున్నాయి. భారత వ్యతిరేక, మోదీ వ్యతిరేక బొమ్మలను దగ్ధం చేయడం, ప్రదర్శనలు నిర్వహించడం వంటివి కూడా జరిగాయి. అంతేకాదు, అక్కడి హిందూ దేవాలయాల మీద దాడులు కూడా జరిగాయి. ఇక 2020 వ్యవసాయ బిల్లులను తీసుకు వచ్చి మోదీ ప్రభుత్వం పంజాబ్‌ రైతులతో దారుణంగా వ్యవహరించిందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో వ్యాఖ్యలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.ట్రూడో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అనేక నెలల పాటు భారత, కెనడా సంబంధాలు స్తంభించిపోయాయి.
ఇటీవలి పరిణామాలు కూడా ఈ రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ద్వైపాక్షిక సంబంధాలు సజావుగా కొనసాగాలన్న పక్షంలో ఇరు దేశాల నాయకుల మధ్య తప్పనిసరిగా చర్చలు, దౌత్య సంబంధమైన ప్రయత్నాలు జరగాల్సి ఉంది. ఆ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్‌స్వాతంత్య్రం ఉంటే ఉండవచ్చు. వాటిని రక్షించాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వానికి ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే, ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని కీర్తిస్తూ బహిరంగ ప్రదర్శనలు నిర్వహించడం వేర్పాటువాదులను, ఉగ్రవాదులను ప్రోత్సహించడం కిందకే వస్తుంది. ఇది భారత్‌కు మనస్తాపం కలిగించే విషయం. ఇటువంటి సంఘటనలనుఖండించడంతో పాటు భారత్‌ ఈ తరహా దేశాలకు ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు సంబంధించిన సమాచారాన్ని ఆ దేశాలకు అందజేయడం, ఇటువంటి వర్గాల దేశద్రోహ కార్యకలాపాలను వాటికి సాక్ష్యాధారాలతో సహా తెలియజేయడం చాలా మంచిది.
ఇటువంటి కార్యకలాపాలు ఒక్క కెనడాలోనే కాదు, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, అమెరికా దేశాలలో సైతం చోటు చేసుకుంటున్నాయి. ఉగ్రవాద ధోరణులు, భారత్‌ వ్యతిరేక ధోరణులకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఈ దేశాలకు అందిస్తూనే, దౌత్యపరంగా కూడా ఈ దేశాల నాయకులతో సరైన రీతిలో వ్యవహరిస్తూ, ఇటువంటి ధోరణులను ఖండించాల్సిన అగత్యాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌లో జరిగే జి-20 శిఖరాగ్ర సమావేశాలను పురస్కరించుకుని ఈ దేశాల నాయకులతో సుదీర్ఘమైన చర్చలు జరపడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఈ రకమైన ఉగ్రవాద వర్గాల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి భారత్‌ కూడా తనదైన మార్గంలో ఎదురు దాడి సాగించడం వల్ల ఉపయోగం ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News