శనివారం కేంద్ర కేబినెట్ సమావేశంలో మహిళా బిల్లు వీగిపోవడం.. తదుపరి కార్యాచరణపై ప్రముఖంగా చర్చించినట్లు తెలుస్తున్నది. మోడీ అండ్ టీమ్ సాధారణంగా ఓ పట్టాన ఓటమిని అంగీకరించరు. వాళ్ల నైజమేంటో 2014 నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఏది చేసినా పక్కాప్లానింగ్, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. శుక్రవారం లోక్‌సభలో జరిగిన భంగపాటును కేబినెట్ ఒకింత సీరియస్‌గానే తీసుకుందని సమాచారం. మహిళలకు అవకాశం కల్పిద్దామంటే కాంగ్రెస్ అండ్ కో అడ్డుకున్నదనే ప్రచారం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓ పద్ధతిగా చేయాలని వీరు నిర్ణయించినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే.. బిల్లు వీగిపోవడానికి తగ్గిన సంఖ్యపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి మరోసారి ఈ బిల్లులను ప్రవేశపెట్టే యోచన ఒకటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది. శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి మోడీ చేసిన ప్రసంగంలోనూ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయని అన్నారు. అలాగే మహిళా రిజర్వేషన్‌లకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇలా చెప్పడం ద్వారా కేంద్ర భవిష్యత్ కార్యాచరణను చెప్పకనే చెప్పారు మోడీ.
చట్టసభల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు, ఆ హక్కును వారికి చట్టబద్ధంగా దఖలు పరిచేందుకు ఉద్దేశించిన మహిళా బిల్లును ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటి మీద నిలిచాయి. ఆ బిల్లు ఆమోదానికి లోక్‌సభ సభ్యుల్లో మూడింట రెండొంతుల మెజారిటీ రావాలి. సభలో ఓటింగ్ జరిగిన సమయంలో మొత్తం సభ్యులు 528 మంది ఉండగా.. వారిలో మూడింట రెండొంతులు అంటే.. 352 మంది అనుకూలంగా ఓటు వేసి ఉంటే బిల్లు ఆమోదం పొందేది. కానీ, బిల్లును ప్రవేశపెడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని నిలువరించాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలన్నీ ఒక్కటిగా నిలిచాయి. అధికారపక్ష కూటమి, వారికి మద్దతు పలికిన మరికొంతమందితో కలిసి 298 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే.. 230 మంది వ్యతిరేకంగా వేశారు. ఫలితంగా మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లు కాస్తా వీగిపోయింది. దీనికి రకరకాల పార్టీలు పలు రకాల భాష్యాలు చెప్పుకుంటూ వచ్చాయి. నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి ఒక సాకుగా మాత్రమే మహిళా రిజర్వేషన్ల బిల్లును ఎన్డీయే ముందుకు తీసుకొచ్చిందని, అందుకే ఆ పాచికకు తాము చెక్ పెట్టామని కనీసం పార్లమెంటులో ప్రాతినిధ్యం కూడా లేని కొన్ని పార్టీలు చెప్పుకొస్తున్నాయి. రాజ్యాంగం మీద జరగబోయిన దాడిని తాము తిప్పికొట్టామని ప్రతిపక్షానికి చెందిన ప్రధాన నాయకుడు రాహుల్‌గాంధీ అంటున్నారు. దేశ ఎన్నికల చిత్రాన్ని మార్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్ని ఈ బిల్లు తీసుకొచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి అత్యంత సమర్థంగా ఈ బిల్లును ఓడించాయి. అంతర్గత విభేదాలున్నా పార్టీలన్నీ కలిసికట్టుగా ఉండడం వల్లే మోడీకి మొదటి ఓటమి ఎదురయింది.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే కేవలం ఓట్ల పోటీ కాదు. అది ఆలోచనల పోరు, నాయకత్వ పరీక్ష, భవిష్యత్తు దిశను నిర్ణయించే యుద్ధం. ఈ యుద్ధంలో గెలవాలంటే కేవలం ప్రజల మద్దతు ఒక్కటి మాత్రమే ఉంటే ఏ మాత్రం సరిపోదు. వ్యూహం, సమన్వయం, ఐక్యత కీలకం. భారత రాజకీయాల్లో గత రెండు మూడు సార్వత్రిక ఎన్నికల అనుభవం చూస్తే ఒక విషయం స్పష్టమవుతున్నది. ప్రతిపక్షాలు ఒక వేదికపై నిలబడే సమయంలో ఐక్యతను ప్రదర్శించినా, అసలు ఎన్నికలకు వచ్చే సరికి ఆవిరవుతున్నది. ప్రతిపక్షాల మధ్య చాలా కాలం నుంచి కొనసాగుతున్న ఈ అనైక్యతే ఎన్డీయే కూటమికి వరుస విజయాలను అందించింది.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ, బీఎస్పీ, సమాజ్‌వాదీ… ఇలా ఎన్డీయేతర పార్టీలన్నీ వేర్వేరుగానే పోటీ చేస్తున్నాయి. దీంతో చావుదెబ్బ తింటున్నాయి. బలంగా ఉన్నచోట ప్రాంతీయ పార్టీలు గెలుస్తున్నాయి గానీ, జాతీయ స్థాయిలో మాత్రం కలిసి పోటీ చేయడంలో విఫలమవుతున్నాయి. 2014 -2024 వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను ఒకేతాటిపైకి తేవడంలో ప్రతిపక్షాలు సఫలం కాకపోవడం వల్లే బీజేపీ కూటమి అధికారంలోకి రాగలిగింది.
నిజానికి ప్రతిపక్షాలు కూడా అసలు తమ లక్ష్యం ఏమిటనే విషయంలో ఒక స్పష్టతకు రావాల్సి ఉంది. మహిళా బిల్లును ఓడించడం లాంటి లక్ష్యాలు పెట్టుకుంటే.. మహిళా లోకం మొత్తం ఆ పార్టీలకు వ్యతిరేకంగా నిలిచే అవకాశముంది. దీనివల్ల ఇప్పటి వరకు వచ్చిన కొద్దిపాటి ఓట్లుకూడా వాళ్లకు రాకుండా పోయేందుకు అవకాశం ఉంటుంది. ప్రియాంకా గాంధీ లాంటి నాయకులు సభలో ఉండి కూడా మహిళా బిల్లును ఓడించడం అంటే.. రేపు ప్రజల్లో ప్రచారానికి వెళ్లినప్పుడు ఏం సమాధానం చెబుతారు? మల్లికార్జున ఖర్గే లాంటి సీనియర్ నాయకులు తాము మహిళా బిల్లుకు అనుకూలంగానే ఉంటామని, అయితే నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మాత్రం కచ్చితంగా వ్యతిరేకిస్తామని ముందు చెప్పారు.
నియోజకవర్గాల పునర్విభజన అనే తేనెతుట్టెను కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కదిలించింది. ఒకప్పటితో పోలిస్తే జనాభా గణనీయంగా పెరిగిందని, అందువల్ల వాళ్లందరికీ తగినంత ప్రాతినిధ్యం ఉండాలంటే తప్పనిసరిగా ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరగాలని ఈ ఆలోచన మొదలైంది. పార్లమెంటులో ప్రవేశపెట్టిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, డీలిమిటేషన్ బిల్లు 2026 చుట్టూ జరుగుతున్న చర్చ కేవలం సీట్ల పెంపు గురించి మాత్రమే కాదు, అది భారత సమాఖ్య స్ఫూర్తికే సవాలుగా నిలిచింది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన మొదలుపెడతామన్నదే మొత్తం వివాదానికి కేంద్రమైంది. దేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోతోందంటూ కుటుంబ నియంత్రణను గట్టిగా పాటించినవి దక్షిణాది రాష్ట్రాలే. దానివల్ల దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక లాంటి చోట్ల జనాభా గణనీయంగా తగ్గింది. అయితే, ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ లాంటి చోట్ల మాత్రం అసలు దీన్ని పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. దాంతో అక్కడ జనాభా చాలా ఎక్కువగా ఉండడంతో పాటు.. ఇప్పటికే ఆయా రాష్ట్రాలన్నింటిలో ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య ఎక్కువగానే ఉంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా చెప్పిన లెక్క ప్రకారం చూసుకున్నా ప్రతి రాష్ట్రంలోనూ 50% వరకు లోక్‌సభ స్థానాలు పెరుగుతాయి. అంటే, ఉత్తరప్రదేశ్‌లో అవి 128 అవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో 38, తెలంగాణలో 26 అవుతాయి. కానీ.. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా లాంటి కొన్ని రాష్ట్రాల్లో కలిపి 392 సీట్లు ఉంటాయి. అంటే… ఈ ఆరు రాష్ట్రాలలో ఉన్న మొత్తం సీట్లు కాకుండా మరో 17 సీట్లు వస్తే చాలు.. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడున్న లోక్‌సభను చూసుకుంటే.. బీజేపీకి సొంతంగా తగినంత మెజారిటీ రాకపోవడంతో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు వచ్చిన ఎంపీ స్థానాలపై ఆధారపడింది. అందుకే ఆంధ్రప్రదేశ్‌కు ఇతోధికంగా సాయపడుతోంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులకు చాలావరకు చకచకా అనుమతులు ఇవ్వడం, కొంతవరకు ఆర్థిక సాయం కూడా అందించడం, అంతర్జాతీయ సంస్థల నుంచి తక్కువ వడ్డీలకు రుణాలు అందేలా చూడడం.. ఇలా అనేక రకాలుగా సాయపడుతోంది. క్వాంటమ్ హబ్‌ను అమరావతిలో ఏర్పాటుచేస్తామన్నప్పుడు కూడా మారు మాట్లాడకుండా ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సహకరించారు. ఇదంతా ఎందుకు అంటే.. ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన ఎంపీల బలం కేంద్ర ప్రభుత్వ మనుగడకు అవసరం కాబట్టి. అదే ఇంతకుముందు కూడా ఒకసారి ఎన్డీయే కూటమిలో టీడీపీ భాగస్వామిగా ఉంది. అప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండు చేసి, అది ఇవ్వబోమనడంతో కేంద్రం నుంచి బయటకు వచ్చేస్తామని చెప్పినా ఏమీ పట్టించుకోలేదు. అందుకే అప్పట్లో ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీ విడిపోయింది. అప్పుడు బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉండడం వల్లే అలా చేసిందన్న విషయం అందరికీ తెలిసిందే.
సహజంగానే బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలకు దక్షిణాదిలో కంటే ఉత్తరాదిలో బలం కొంత ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడంతో.. దక్షిణాది రాష్ట్రాలపై వాళ్లు చిన్నచూపు చూసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నది నిర్వివాదాంశం. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి.
అభివృద్ధికి లభిస్తున్న ‘శిక్ష’ ఏమిటి?
దక్షిణాది రాష్ట్రాలు గత ఐదు దశాబ్దాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు జనాభా నియంత్రణను అత్యంత సమర్థవంతంగా అమలు చేశాయి. విద్య, వైద్యం, మహిళా సాధికారత రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించాయి. కేంద్రం తీసుకువస్తున్న జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చూస్తుంటే, ఈ బాధ్యతాయుత ప్రవర్తనకు దక్షిణాదికి శిక్ష విధిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు కేటాయిస్తే, ఆ రాష్ట్రాలకు ఎంపీల సంఖ్య భారీగా పెరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గుతుంది. ఈ లెక్కన చూసుకున్నప్పుడు దక్షిణ భారతదేశంతో అసలు సంబంధం లేకుండానే కేవలం ఉత్తరాదిలో ఉన్న సీట్లు పక్కాగా వస్తే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లాంటివాటికి ఉంటుంది. అప్పుడు ఇక దక్షిణాది రాష్ట్రాల అవసరాలను ఏమాత్రం పట్టించుకుంటాయన్నదే అతిపెద్ద ప్రశ్నగా మిగిలింది.
‘మౌనం’ వెనుక ఉన్న ముప్పు
ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ సైతం ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేసే కుట్ర జరుగుతోందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ముఖ్యంగా ఈ చరిత్రాత్మక సందర్భంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అందునా ఎన్డీయే భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు మౌనాన్ని ఆయన ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ పుట్టుకే కేంద్ర పెత్తనానికి వ్యతిరేకంగా, రాష్ట్రాల హక్కుల కోసం ఎన్టీ రామారావు పోరాటం ద్వారా జరిగింది. కేంద్ర-రాష్ట్ర సంబంధాలను పునర్నిర్మించాలని డిమాండ్ చేసిన చరిత్ర టీడీపీది. అటువంటి పార్టీ ఇప్పుడు ఎన్డీయే కూటమిలో ఉన్నంత మాత్రాన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మౌనంగా ఉండటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు..‘ అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?’ అని గట్టిగా ప్రశ్నించారు. ఇప్పుడు జాతీయస్థాయిలో కీలక పాత్ర పోషించగలిగే స్థితిలో ఉన్న చంద్రబాబు మౌనంగా ఉండిపోతే ఆయనను చరిత్ర క్షమించదని, ఆయన మౌనం దక్షిణాదికి పెద్ద అన్యాయం చేస్తుందని హెచ్చరించారు.
కూటమిలో ఉన్నంత మాత్రాన అన్ని అంశాల్లో బీజేపీతో ఏకీభవించాల్సిన అవసరం లేదని, ఏఐఏడీఎంకే లాంటి మిత్రపక్షాలే ఈ విషయంలో తమ ఎజెండా వేరని స్పష్టం చేస్తున్నప్పుడు టీడీపీ ఎందుకు వెనుకాడుతోందని నాగేశ్వర్ ప్రశ్నించారు.
ఆర్థిక అసమానతలు.. సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లాంటి నాయకులు కూడా ఈ అన్యాయాన్ని ఎత్తిచూపుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడీపీలో 31 శాతం వాటాను అందిస్తున్నాయి. తెలంగాణ లాంటి రాష్ట్రం దేశ జనాభాలో కేవలం 2.8 శాతమే ఉన్నప్పటికీ, దేశ జీడీపీకి 5.2 శాతం పైగా సహకరిస్తోంది. కేంద్రానికి బిహార్ ఒక రూపాయి పన్ను కడితే తిరిగి ఆరు రూపాయలు పొందుతోందని, కానీ తెలంగాణ 42 పైసలు, తమిళనాడు కేవలం 16 పైసలు మాత్రమే పొందుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాదిస్తున్నారు. ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం కూడా తగ్గిపోతే, దక్షిణాది రాష్ట్రాలు కేవలం ఉత్తరాదికి కాలనీలుగా మారిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. రేవంత్‌రెడ్డి సూచిస్తున్నట్లుగా.. 40% జనాభా, 40% జీఎస్ఓపీ, 20% సమాఖ్యవ్యవస్థ సమతౌల్యం ఆధారంగా నియోజకవర్గాలు కేటాయించాలని, ముస్లింలు, ఓబీసీలను విస్మరించడం దేశానికి మంచిది కాదని ఆయన అన్నారు.
భారీ ఉద్యమాలు..
ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇదే మొండివైఖరితో కొనసాగితే మాత్రం దక్షిణాదిలో భారీ ఉద్యమాలు వచ్చే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇప్పటికే గతంలో హిందీకి వ్యతిరేకంగా మొదలైన ద్రవిడ ఉద్యమాన్ని గుర్తుచేశారు. రాజ్యాంగం 1950లో అమలులోకి వచ్చింది. అప్పుడు హిందీ, ఇంగ్లిష్ రెండు భాషలూ ఉపయోగించాలంటూ 15 ఏళ్ల కాలాన్ని పరివర్తన కాలంగా పేర్కొన్నారు. అది ముగిసిన తర్వాత.. అంటే 1965 జనవరి 26 నుంచి హిందీని ఏకైక అధికార భాషగా మార్చాలని తలపెట్టారు. పోస్టాఫీసులో మనియార్డర్ పంపాలన్నా, రైల్వేస్టేషన్‌లో టికెట్ బుక్ చేసుకోవాలన్నా ఆ ఫారంలు అన్నీ కేవలం హిందీలో మాత్రమే ఉండేవి. దక్షిణాదిలో చాలామందికి హిందీ రాదు, నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. తమ స్థానిక భాషతో పాటు ఇంగ్లిషు కూడా ముందునుంచి నేర్చుకున్నారు. అలాంటిది ఆ రెండూ కాదని, ఎక్కడో ఉత్తరాదిలో మాట్లాడే హిందీభాషను తమపై రుద్దడం ఏంటంటూ తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసనలు, అల్లర్లు, విద్యార్థుల ఆత్మహత్యలు జరిగాయి. ఫలితంగా 1967 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో సొంతంగా అధికారంలోకి రాలేకపోయింది. ఈ ఉద్యమాన్ని గుర్తుచేసిన స్టాలిన్… ఇప్పుడు కూడా అలాంటి ఉద్యమమే వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
అయితే… ఇప్పుడు బీరాలు పలుకుతున్న నాయకులందరూ ఇప్పుడు గానీ, మరెప్పుడైనా గానీ చాలావరకు కాగితం పులుల్లానే ఉండిపోయే పరిస్థితి కనిపిస్తోంది తప్ప, క్షేత్రస్థాయిలోకి దిగి పోరాటం చేసేలా లేరు. ఎందుకంటే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద ఓటుకు నోటు కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. స్టాలిన్ మీద లెక్కలేనన్ని కేసులు ఉన్నాయి. జగన్ ఏమైనా పోరాడతారేమో అనుకుంటే ఆయన మీద అక్రమాస్తుల కేసులు, సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మీద శబరిమల బంగారం, ఇంకా విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ తదితర ఆరోపణలు పెండింగ్‌లోనే ఉన్నాయి. అంటే.. వీళ్లందరి జుట్టు కూడా సీబీఐ, ఈడీ లాంటి సంస్థల చేతుల్లోనే ఉంది. పరోక్షంగా వాటిని ఆడిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రుల్లో ఎవరైనా తోక గట్టిగా ఆడిస్తున్నట్లు అనిపించిన వెంటనే వాళ్ల మీద పెండింగులో ఉన్న కేసులను తవ్వి తీసి వాళ్ల రాజకీయ భవిష్యత్తుకు దాదాపుగా దారులన్నీ మూసుకుపోయినట్లుగా చేయగల సామర్థ్యం నరేంద్రమోదీ – అమిత్ షా ఇద్దరికీ ఉంది. అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి ఏంటో ఇప్పటికే చూశాం. ఆయన పార్టీ మీద వచ్చిన ఆరోపణల కారణంగా ప్రజలే ఆయన్ని తిరస్కరించే పరిస్థితిని తీసుకొచ్చారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రులు ఎవరూ కూడా నియోజకవర్గాల పునర్విభజన విషయంలో గట్టిగా పోరాటం చేయగలిగే పరిస్థితి కనిపించడం లేదు. ఎవరికి వారు కొన్నాళ్లు టీవీ ఛానళ్ల ముందు, పత్రికలలో మాత్రమే ఏదో ఒకటి అనకపోతే బాగోదు కాబట్టి అన్నట్లు మాట్లాడి ఊరుకుంటారు తప్ప.. ఆ ప్రక్రియను అడ్డుకునేందుకు వీసమెత్తు ప్రయత్నం కూడా చేసే ఆలోచనలో ఉన్నట్లు కనిపించడం లేదు. దక్షిణాది ప్రజల ప్రయోజనాల కోసం గళమెత్తి మాట్లాడడానికి ఎన్టీ రామారావు లాంటి నాయకులు ఎవరూ ఇప్పుడు లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ వరుసపెట్టి ముఖ్యమంత్రులను మారుస్తుండడం, వాళ్లతో చెప్పులు మోయించడం లాంటి ఘటనలను ఆయన చూసి భరించలేక తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో పార్టీ పెట్టి అఖండ విజయం సాధించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జోరు ఉన్నప్పుడు కూడా ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయాలు సాధించింది. అలాంటి ముఖ్యమంత్రులు ఇప్పుడు లేరు. దానికి తోడు కేంద్రంలో వరుసగా మూడు సార్లు ప్రధానమంత్రి పదవి చేపట్టినా కూడా తన మీద ఒక్క అవినీతి మరక సైతం పడనివ్వకుండా నరేంద్రమోడీ పరిపాలిస్తుండడంతో ఆయనను వ్యతిరేకించడానికి అలాంటి అవకాశం వీళ్లెవరికీ దక్కడం లేదు. ఈసారి కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటే ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లునూ మోడీ మరోసారి లోక్‌సభలో ప్రవేశపెట్టి త్వరలో విజయం సాధించినా ఆశ్చర్యం లేదు.
దక్షిణ దేశం ఏర్పాటుకు డిమాండ్
నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతులను పాటించాలి. ఉత్తరాది ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఇలా పునర్విభజన చేస్తామంటే.. దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కలిసి ప్రత్యేక దేశంగా ఏర్పడతామని డిమాండ్ చేసే ప్రమాదం సైతం లేకపోలేదు. స్వాతంత్య్రానికి ముందు ఇలాగే మన దేశం ముక్కలు ముక్కలుగా ఉండేది. దానికి కారణం అప్పటి పాలకులే. దానివల్ల మనం చాలా నష్టపోయాం. కానీ ఇప్పుడు కేంద్రానికి పన్నుల రూపంలో చాలా పెద్దమొత్తం అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు.. రాజకీయంగా నష్టపోతాయంటే మాత్రం ప్రత్యేక దక్షిణాది దేశం ఏర్పాటు డిమాండు తెరమీదకు వచ్చే అవకాశం లేకపోలేదు. దీనికి ప్రజలనుంచే మరో నాయకుడు కూడా తప్పకుండా పుట్టుకొస్తాడు. అంతవరకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే..

