కులాల ప్రాతిపదికన జనాభా గణాంకాలు సేకరించాలంటూ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుండడంతో ఈ అంశంమీద దేశంలో దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తం అవుతున్నట్టు కనిపిస్తోంది. కులాల జనాభా వివరాల సేకరణకు సంబంధించి దేశంలో రాజకీయంగా వ్యతిరేకత లేదనే భావించవచ్చు. ఉత్తర భారతదేశంలో రిజర్వేషన్లకు కట్టుబడిన సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్ వంటి పార్టీలు కుల జనాభా గురించి గట్టిగా పట్టుబడుతున్నాయి. అగ్ర కులాలలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు కూడా రిజర్వేషన్లు వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తుండడంతో ఈ పార్టీలు ఆందోళన చెంది, కుల జనాభా వివరాల సేకరణకు డిమాండ్ చేస్తున్నాయి. నిజానికి అగ్రవర్ణాల వారిలో కొన్ని వర్గాలకు ఆదాయం ప్రాతిపదికన రిజర్వేషన్లను విస్తరింపజేయాలన్న అభిప్రాయానికి కాంగ్రెస్ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. అది తన పార్టీ పునాదుల్ని విస్తరింపజేసుకోవడానికి ఇటువంటి ఆలోచన చేసోందని అర్థం చేసుకోవచ్చు.
ఇక 1931 జనాభా లెక్కల ఆధారంగా 1980లో రూపొందించిన మండల్ కమిషన్ నివేదిక వెనుకబడిన వర్గాలను గుర్తించడానికి ఇప్పటికీ ఒక ప్రధాన ఆధారంగానే ఉంటూ వస్తోంది.దేశంలో వెనుకబడిన వర్గాల స్థితిగతులు, ఇతర వెనుకబడిన వర్గాల స్థితిగతులు, ఏ వర్గం పరిస్థితి ఏ స్థాయిలో ఉంది, రిజర్వేషన్ల వల్ల ఒనగూడిన లాభాలేమిటి, రిజర్వేషన్‌కోటాను పెంచాలంటూ కొన్ని వర్గాల నుంచి వస్తున్నడిమాండ్ల మాటేమిటి వగైరాలను పరిశీలించడానికి, వాటి పట్ల అవగాహన పెంచుకోవడానికి ఈ జనాభా లెక్కల సేకరణ తప్పనిసరి అవుతోంది. ఇటువంటి గణాంకాలు అనేక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలవిషయంలో కూడా ప్రభుత్వాలకు అవసరం. అంతేకాక, సమగ్రంగా జనాభా లెక్కలు సేకరించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ లెక్కలను అతి జాగ్రత్తగా రూపొందించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే, కులాల పరంగా జనాభా లెక్కలు సేకరించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. 2011 నాటి ఆర్థిక, సామాజిక జనాభా లెక్కల సేకరణలో అనేక లోపాలు చోటు చేసుకోవడం, చివరికి ఆ జనాభా గణాంకాలకు విలువ లేకుండా పోవడంగుర్తుండే ఉంటుంది.
దేశంలో సుమారు 46 లక్షల కులాలు, కుల శాఖలు, ఉపకులాలు, వంశాలు, వర్గాలు ఉన్నాయి.వాటి వివరాలను సేకరించాలన్న పక్షంలో వాటి గురించిన అవగాహన ఉండాలి. వాటి వివరాలను ఏ విధంగా సేకరించాలో తెలిసి ఉండాలి. వీటన్నటికీ సంబంధించి ఒక లోపరహితమైన ప్రక్రియను రూపొందించి అమలు చేయాలి. సెన్సస్ కమిషనర్లను, రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయాన్ని సరిగ్గా, సజావుగా ఉపయోగించుకోకుండా కులాల ప్రాతిపదికన జనాభా వివరాలను సేకరించడం జరిగే పని కాదు. ఒక్క చిన్న పొరపాటు జరిగినా మొత్తం ప్రక్రియ సమస్యాత్మకంగా మారుతుంది. జనాభా లెక్కల సేకరణలో అనేక వర్గాలు, వంశాలు తమ కులాల గురించి కాకుండా ఇంటిపేర్ల గురించి ఎక్కువగా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇంటి పేర్లను బట్టి ఆ వర్గాలను వెనుకబడిన తరగతులుగా గుర్తించాలా లేక షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించాలా లేక షెడ్యూల్డ్ తరగతులుగా గుర్తించాలా అన్నది అవగాహన చేసుకోవడం సాధారణ విషయం కాదు.
నిజానికి, 2021 లో జరగాల్సిన జనాభా వివరాల సేకరణను ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోంది. అంతేకాదు, కులపరంగా వివరాలు సేకరించడానికి కూడా ప్రభుత్వం సందేహిస్తున్నట్టు కనిపిస్తోంది. అందువల్ల ఈ కుల జనాభా వివరాల సేకరణ పటిష్ఠంగా, సమర్థవంతంగా జరుగుతుందాఅన్నది మొదటినుంచి ప్రశ్నార్థకంగానే ఉంటూ వస్తోంది. కుల రహిత సమాజాన్ని తీర్చిదిద్దాలన్న రాజ్యాంగ ఆశయానికి ఇది విరుద్ధం అవుతుందనే అభిప్రాయం ప్రభుత్వంలో నెలకొని ఉంది. సమాజంలో కుల ప్రాధాన్యం యథావిధిగా కొనసాగుతున్న మాట నిజమే. పైగా రాజకీయంగా కూడా ఈ ప్రక్రియ వివిధ పార్టీలకు ఎంతో బలం చేకూరుస్తుంది. అయితే, కుల జనాభాను సేకరించడం అన్నది రాజకీయంగా కరెక్టే కావచ్చు కానీ, నైతికంగామాత్రం సమంజసమైన వ్యవహారం కాదని భావించాలి. దేశంలో కులరహిత సమాజం ఏర్పడాలన్న పక్షంలో, ఆర్థిక అసమానతలు తొలగిపోవాల్సి ఉంటుంది. రిజర్వేషన్ల కారణంగా దేశంలోని అన్ని వర్గాలు ఏక తాటి మీదకు రాగలిగితేనే కుల రహిత సమాజం ఏర్పడడానికి మార్గం సుగమమవుతుంది.