బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పుణ్యమా అంటూ ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన హల్‌చల్ చేస్తోంది. కులగణన విషయమై కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేతులెత్తేసిన సమయంలో కులాలవారీగా లెక్కలు తీసి అందరితో శెహభాష్ అనిపించుకున్నారు నితీశ్ కుమార్. కులగణనకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. వెంటనే కులగణన చేపట్టాలని కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాహుల్ గాంధీ ఆదేశాలిచ్చారు. రాహుల్ గాంధీ అంతటితో ఆగలేదు. పుట్టుకతో ఓబీసీ అయిన ప్రధాని నరేంద్ర మోడీ కులగణనకు ఎందుకు ఆసక్తి చూపడంలేదని రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నిస్తున్నారు.
కులగణన….ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఇదే హాట్‌టాపిక్. దాదాపు మూడేళ్ల నుంచి దేశ రాజకీయాల్లో కులగణన అంశం అప్పుడప్పుడూ ప్రస్తావనకు వస్తోంది. యూపీఏ రెండో టర్మ్‌లో కూడా కులగణన డిమాండ్ ప్రస్తావనకు వచ్చింది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఈ డిమాండ్‌ను బలపరచింది. అయితే 2014లో కేంద్రంలో బీజేపీ అధికారానికి వచ్చింది. అధికారానికి వచ్చిన తరువాత కులగణనకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎటువంటి చొరవ చూపలేదు. చుట్టూ ఉన్న సమాజాన్ని మత ప్రాతిపదికన విడగొట్టడానికి ఆసక్తి చూపించే భారతీయ జనతా పార్టీ మొత్తం జనాభాలో వెనుకబడిన తరగతులకు చెందిన వారు ఎంతమంది ఉన్నారనే కచ్చితమైన వివరాలు సేకరించే ప్రక్రియ పట్ల నిర్లక్ష్యం వహించింది. పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ కులగణనపై కుండబద్దలు కొట్టారు. ‘విధాన పరంగా ఎస్సీ, ఎస్టీలు మినహా కుల ఆధారిత జనాభా లెక్కలు ఇప్పటికైతే సేకరించరాదని కేంద్రం నిర్ణయం తీసుకొన్నదని ఒక సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇలా చాలా వ్యూహాత్మకంగా జనాభాలో బీసీల లెక్కలు తీయకుండా తప్పించుకోవడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నించింది. జేజేలు అందుకున్న నితీశ్ కుమార్ ! సబ్ కా సాథ్..సబ్ కా వికాస్ అంటూ గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేతులెత్తేసిన కుల గణన సర్వే చేపట్టడానికి నితీశ్ కుమార్ నాయకత్వంలోని బీహార్ ప్రభుత్వం ముందుకొచ్చింది. మొత్తం బీహార్ జనాభాలో వెనుకబడిన తరగతుల లెక్కలను విజయవంతంగా రెండు విడతల్లో బీహార్ ప్రభుత్వం సేకరించింది. దీంతో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దేశవ్యాప్తంగా జేజేలు అందుకున్నారు. అందరితో శెహభాష్ అనిపించుకుంటున్నారు. వెనుకబడిన తరగతుల పట్ల నితీశ్ తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. యావత్ భారతదేశానికి బీహార్‌ను ఒక రోల్ మోడల్‌గా ఆయన తీర్చిదిద్దారు. బీహార్ సర్కార్ కులగణనకు కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. తమ తమ రాష్ట్రాల్లో వెనుకబడిన తరగతులకు చెందినవారి లెక్కలు సేకరించడానికి చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు సూచించారు రాహుల్ గాంధీ. భారతదేశ జనాభాలో వెనుకబడిన తరగతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే జనాభా లెక్కలు అయితే అందుబాటులోకి వస్తున్నాయి కానీ వెనుకబడిన తరగతులవారు ఇంత శాతం ఉన్నారంటూ కచ్చితమైన లెక్కలు లేవు. బీసీ జనాభాకు చెందిన లెక్కల వివరాలు స్పష్టంగా లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. వెనుకబడిన తరగతుల లెక్కలు సమగ్రంగా లేకపోవడంతో రిజర్వేషన్లను ఏ మేరకు నిర్ణయించాలనే అంశంపై బీసీ కమిషన్లు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వెనుకబడిన తరగతులకు ప్రయోజనాలు కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. జనాభా గణనలో కులాలవారీగా లెక్కలు తీయాలన్న డిమాండ్ ఊపందుకుంది. వాస్తవానికి 1931 తర్వాత ఎస్సీ, ఎస్టీ మినహా కులాలవారీగా జనగణన చేపట్టనే లేదు. ఏదిఏమైనా వెనుకబడిన తరగతుల జనాభాపై ఇప్పటివరకు అంచనాలే తప్ప ఒక స్పష్టత అంటూ లేదు. దీంతో మొత్తం జనాభాలో ఓబీసీల శాతం ఎంత అనేది ఒక అంచనాగానే మిగిలిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఓబీసీలకు మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. వెనుకబడిన తరగతుల పట్ల భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. – ఎస్. అబ్దుల్ ఖాలిక్,
సీనియర్ జర్నలిస్ట్,
63001 74320